దర్శన్ సోలంకి: ఐఐటీ బాంబేలో దళిత విద్యార్థి ఆత్మహత్యపై మధ్యంతర నివేదికలో ఏముంది?

ఫొటో సోర్స్, DARSHAN SOLANKI
- రచయిత, దీపాలి జగ్తాప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐఐటీ బాంబేలో మొదటి సంవత్సరం దళిత విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్యపై విచారణ కమిటీ మాధ్యమిక నివేదికను సమర్పించింది.
'పేలవమైన అకడమిక్ పెర్ఫార్మెన్స్' దర్శన్ ఆత్మహత్యకు ఒక కారణం కావచ్చని విచారణ కమిటీ తన నివేదికలో పేర్కొంది.
కుల వివక్షకు సంబంధించి ప్రత్యక్షంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది.
అయితే, కుల వివక్ష కారణంగానే అహ్మదాబాద్‌కు చెందిన దర్శన్ సోలంకి బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
దర్శన్ సోలంకి ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి. ఫిబ్రవరి 12న దర్శన్ తన హాస్టల్ బ్లాక్‌లోని ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యకు ఒకరోజు ముందు సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి.
దర్శన్ మరణించిన మరుసటి రోజు, ఐఐటీ బాంబే దర్యాప్తు కోసం 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఏ పరిస్థితుల్లో దర్శన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడో దర్యాప్తు చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు.
మార్చి 2న కమిటీ ఎనిమిది పేజీల దర్యాప్తు నివేదికను సమర్పించింది. ఒక కాపీని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపారు.
విచారణ కమిటీ క్యాంపస్‌లో 79 మందిని ప్రశ్నించింది. దీని ఆధారంగానే పై నివేదికను రూపొందించారు.
ఈ 79 మందిలో 11 మంది వింగ్-మేట్స్, ఏడుగురు టీచింగ్ స్టాఫ్, తొమ్మిది మంది టీచర్లు, ఇద్దరు మెంటార్లు, 11 మంది కుటుంబ సన్నిహితులు, 13 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.

నివేదికలో ఏముంది?
"వివిధ సబ్జెక్ట్ పరీక్షలలో దర్శన్ సోలంకి కి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ముఖ్యంగా సెమిస్టర్ ద్వితీయార్థంలో. పేలవమైన మార్కులు దర్శన్‌పై ప్రభావం చూపి ఉండవచ్చు. ఐఐటీ బాంబే వదిలేసి సొంతూరికి వెళ్లిపోతానని, అక్కడ కాలేజీలో చేరుతానని దర్శన్ తరచు స్నేహితులకు చెప్పేవాడు" అని నివేదికలో పేర్కొన్నారు.
దర్శన్ సోదరి మాత్రమే క్యాంపస్‌లో కుల వివక్ష గురించి మాట్లాడారని, అది తప్ప వేరే ఆధారాలు దొరకలేదని తెలిపారు.
దర్శన్ తండ్రి రమేష్‌భాయ్ నివేదికను చూశారు. అందులో ప్రస్తావించిన అంశాలను తిరస్కరించారు.
"ఈ నివేదికతో నేను ఏకీభవించను. ఐఐటీ యంత్రాంగం ఆలోచన మొదటి రోజు నుంచి ఇలాగే ఉంది. వాళ్లు ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీని నేను అంగీకరించను. అందులో బయటి నుంచి ఒక్క వ్యక్తి కూడా లేడు. నా కొడుకు ఒకే ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. ఆ కారణానికే ఆత్మహత్య చేసుకోడు" అని రమేష్‌భాయ్ సోలంకి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికతో అన్నారు.

నివేదికపై తలెత్తుతున్న ప్రశ్నలు
ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ కూడా కమిటీలో బయటి వ్యక్తులు లేకపోవడాన్ని ప్రశ్నించారు. ధీరజ్ రిజర్వేషన్ కేటగిరీలో చేరే విద్యార్ధుల కోసం పని చేస్తారు.
"ఐఐటీ బాంబే ఏర్పాటుచేసిన 12 మంది సభ్యుల విచారణ కమిటీలో సభ్యులంతా క్యాంపస్‌కు చెందినవారే. వీరిలో ఏడుగురు ప్రొఫెసర్లు. వాళ్లు ఎలా రిపోర్ట్ ఇస్తారని ఊహించామో అలాగే ఉంది ఆ రిపోర్ట్. అన్ని ఆరోపణలనూ ఒకే వ్యక్తిపై మోపారు" అని ధీరజ్ ఇండియన్ ఎక్స్‌పెక్స్ పత్రికతో అన్నారు.
ఐఐటీ క్యాంపస్‌లో కొందరు కుల వివక్ష గురించి తనతో మాట్లాడారని దర్శన్ సోదరి చెబుతున్నారు. కానీ, రిపోర్టులో ఆ సోదరి తప్ప వేరెవ్వరూ ఈ అంశాన్ని ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్, అంబేద్కరైట్ స్టూడెంట్స్ కలెక్టివ్ కూడా క్యాంపస్‌లో కుల వివక్షు ఉందని చెబుతున్నారు.
కానీ, దర్శన్ వీళ్లెవరినీ ఎప్పుడూ కలవలేదని, కన్న తండ్రి, చిన్నాన్నలతో కూడా ఆ అబ్బాయి ఎప్పుడూ కుల వివక్ష గురించి మాట్లాడలేదని నివేదికలో పేర్కొన్నారు.
ఐఐటీ విచారణ కమిటీ దర్శన్ సోదరి జాహ్నవి, తండ్రి రమేష్‌భాయ్‌తో కూడా మాట్లాడింది. తన కొడుకు భయపడి కుల వివక్ష గురించి తమతో మాట్లాడి ఉండకపోవచ్చని రమేష్‌భాయ్ అన్నారు.
"కుల వివక్ష గురించి నాకు చెప్తే, ఆ కాలేజీ మాన్పించేసి వేరే కాలేజీలో చేరుస్తామని భయపడి ఉండవచ్చు" అన్నారు రమేష్‌భాయ్.

ఫొటో సోర్స్, Getty Images
నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే..
దర్శన్ సోదరి కుల వివక్ష గురించి ప్రస్తావించారు కానీ, ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని నివేదికలో తెలిపారు.
దర్శన్‌కు అతడి సోదరికి మధ్య జరిగిన ఒక సంభాషణను రిపోర్ట్‌లో ఉదహరించారు.
"కంప్యూటర్స్, తదితర సబ్జెక్టుల్లో దర్శన్‌కు ఉన్న జిజ్ఞాస చూసి ఇతర విద్యార్థులు వెటకారంగా నవ్వేవారు."
నివేదికలో చెప్పిన ఇతర విషయాలు ఇలా ఉన్నాయి.
"దర్శన్‌కు చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. ఎక్కువగా హాస్టల్ గదిలో ఉండటానికే ఇష్టపడేవాడు. పాఠాలు అర్థం చేసుకోవడంలో దర్శన్ చాలా ఇబ్బంది పడేవాడని ఒక స్నేహితుడు చెప్పాడు. దర్శన్ పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. గణితం సబ్జెక్టును హిందీలో వివరించమని కోరాడు.
దర్శన్ కుల వివక్షపై ఫిర్యాదు చేసేందుకు ఎస్సీఎస్టీ సెల్ లేదా స్టూడెంట్ వెల్‌నెస్ సెంటర్‌ను ఆశ్రయించలేదు. ఐఐటీ బాంబే మెయిల్‌లో కూడా దీనికి సంబంధించిన ఫిర్యాదు లేదు. దర్శన్ ఇంట్రావర్ట్‌గా ఉండేవాడు.
బహుశా దర్శన్ మొదట్లో దూరం దూరంగా ఉండి ఉండవచ్చు. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. జీ-ర్యాంక్‌లో తేడా, కంప్యూటర్ పరిజ్ఞానం, భాష సరిగ్గా రాకపోవడం మొదలైనవి ఉండవచ్చు. ఆ అబ్బాయి ఒంటరిగా ఉండడానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు.
ఫిబ్రవరి 12 మధ్యాహ్నం దర్శన్ తన హాస్టల్ వింగ్-మేట్స్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లాలనుకున్నాడు. దర్శన్ తండ్రి అతడి అకౌంట్‌లో కొంత డబ్బు కూడా వేశారు.
పై నుంచి దూకే ముందు తన కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడాడో కమిటీకి తెలీదు. కాల్ డీటైల్స్, ఫోన్, ల్యాప్‌టాప్.. వీటిపై ఫోర్సెనిక్ పరీక్ష జరపాల్సి ఉంది. ఆ తరువాతే తుది నివేదిక వస్తుంది" అని నివేదికలో తెలిపారు.
ఆత్మహత్య ఆలోచనలు లేదా కుల వివక్ష మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ కింది సమాచారం మీకు సహాయపడుతుంది.
మానసిక సమస్యలను చికిత్స ద్వారా అధిగమించవచ్చు. అందుకోసం కోసం సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవాలి.
ఈ కింది హెల్ప్‌లైన్‌లను కూడా సంప్రదించవచ్చు.
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ - 1800-599-0019 (13 భాషల్లో అందుబాటులో ఉంది)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ - 9868396824, 9868396841, 011-22574820
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ - 080-26995000
విద్యాసాగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్ - 011 2980 2980
ఇవి కూడా చదవండి:
- ఖుష్బూ: ‘మా నాన్న లైంగికంగా వేధించాడని చెబితే... నేను ఆయన పరువు తీశానని విమర్శిస్తున్నారు’
- మహిళా సైంటిస్టులకు నెలకు రూ.55 వేలు ఇచ్చే పథకం గురించి తెలుసా?
- న్యూజీలాండ్‌కు తలనొప్పిగా మారిన 'పిల్లి', ఇంతకూ ఏం చేసింది?
- భారత్ పెద్దరికానికి అడ్డంకి రష్యాయేనా?
- కైలాస: నిత్యానంద మాదిరిగా మీకంటూ సొంత ‘దేశం’ ఉండాలంటే ఏం చేయాలి?














