భారత్ పెద్దరికానికి అడ్డంకి రష్యాయేనా?

రష్యా, చైనా విదేశాంగ మంత్రులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రజినీశ్ కుమార్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

జీ20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు గత గురువారం దిల్లీలో సమావేశమయ్యారు.

సభ్య దేశాల ప్రతినిధులందరి ఏకాభిప్రాయంతో సంయుక్త ప్రకటన జారీ చేసి ముగియాల్సిన ఈ సమావేశం యుక్రెయిన్ యుద్ధం కారణంగా సమ్మతి సాధించలేక, సంయుక్త ప్రకటన లేకుండానే ముగిసింది.

భారతదేశం అధ్యక్షతన జరగనున్న జీ20 సమావేశాలకు సన్నాహకంగా సాగుతున్న సమావేశాలలో మంత్రుల స్థాయిలో జరిగిన భేటీల్లో ఇది రెండోది. ఇంతకుముందు ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది.

ఈ రెండు సమావేశాలలోనూ రష్యా, చైనాలను సంయుక్త ప్రకటనపై ఒప్పించలేకపోయారు. విదేశీ వ్యవహారాల మంత్రుల స్థాయి సమావేశంలో రూపొందించిన సంయుక్త ప్రకటనలో రెండు పేరాలపై రష్యా, చైనాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. దీంతో ఈ సమావేశంలోనూ ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు.

రష్యా, చైనాలు అభ్యంతరం వ్యక్తంచేసిన పేరాలలో యుక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన అంశాలున్నాయి.

అయితే, గత ఏడాది ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై చేసిన ప్రకటనలోనూ ఇదే విషయం ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

బాలి డిక్లరేషన్‌లోని అంశాలే ఈ ప్రకటనలోనూ ఉన్నప్పటికీ రష్యా, చైనాలు దాన్ని అంగీకరించలేని బాగ్చి అన్నారు.

భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అమెరికా, చైనా, రష్యా విదేశీ వ్యవహారాల మంత్రులతో సమావేశం కావడంతో సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయం వస్తుందనుకున్నారు. కానీ.. రష్యా, చైనా మంత్రుల నుంచి సమ్మతి లభించలేదు.

యుక్రెయిన్ యుద్ధం కారణంగా జీ20 ఐక్యతను కాపాడుకోవడానికి పోరాడాల్సి వస్తోందని జైశంకర్ కూడా అన్నారు.

2023 జీ20 సదస్సుకు అధ్యక్షత వహించడం గ్లోబల్ లీడర్‌గా, వర్ధమాన శక్తిగా ఎదగడానికి గల అవకాశంగా భారత్ భావిస్తోంది.

యుక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలు, రష్యా మధ్య వారధిగా పనిచేయాలని.. తద్వారా గ్లోబల్ సౌత్ దేశాలకు గొంతుకగా మారాలని భారత్ ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోని పేద, వర్ధమాన దేశాలను గ్లోబల్ సౌత్‌గా పరిగణిస్తారు.

అమెరికా విదేశాంగ మంత్రితో జైశంకర్ సమావేశం

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ గురువారం ఈ సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంలో మాట్లాడుతూ..

‘'ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, అంటువ్యాధులు, ఉగ్రవాదం, యుద్ధం విషయంలో ప్రపంచ వ్యవస్థ విఫలమవడం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇలాంటి వైఫల్యాలను ఎదుర్కొంటున్నాయని మనం అంగీకరించాలి, యక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల మధ్య భేదాభిప్రాయాలు పెరిగాయి. కానీ, జీ20 సమావేశాలకు వచ్చే మంత్రులు ఆ విభేదాలను వీడి కలిసి పనిచేయాలి’’ అన్నారు.

ప్రపంచ వేదికలపై గ్లోబల్ సౌత్‌కు గొంతుకవ్వాలని భారత్ ప్రయత్నిస్తోందని నిపుణులు చెప్తున్నారు.

అయితే, యుక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత ప్రపంచ దేశాలు నిలువునా చీలిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో భారత్ గ్లోబల్‌ సౌత్‌కు గొంతు కాగలదా? చాలామంది అనుకుంటున్నట్లు పశ్చిమ దేశాలకు, రష్యా మధ్య భారత్ మధ్యవర్తిత్వం వహించగలదా?

గ్లోబల్ పాలసీ థింక్ టాంక్ రెడ్ కార్పొరేషన్‌లో ఇండోపసిఫిక్ దేశాల విశ్లేషకుడు డెరెక్ గ్రాస్‌మన్ దీనిపై స్పందిస్తూ.. ''రష్యా, పశ్చిమ దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి భారత్‌కు అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను' అని రాసుకొచ్చారు.

చారిత్రకంగా చూస్తే భారత్ ఏ అంతర్జాతీయ కూటమిలోనూ లేదు. అలీన విధానాలకు సంబంధించి భారత్‌కు విశ్వసనీయత ఉంది. ఈ కారణంగా భారత్ మధ్యవర్తిత్వం వహించగలదని భావిస్తున్నారు.

దిల్లీ వేదికగా జరిగిన తాజా సమావేశంలో రష్యా, అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రులు భేటీ అయ్యారు.

2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత అమెరికా, రష్యాల విదేశీ వ్యవహారాల మంత్రులు సమావేశం కావడం ఇదే తొలిసారి.

ఈ సమావేశం గురించి రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి ప్రతినిధి మరియా జఖరోవా అమెరికా న్యూస్ నెట్‌వర్క్ సీఎన్ఎన్‌కి ధ్రువీకరించారు. ఇద్దరు మంత్రుల మధ్య భేటీ 10 నిమిషాల పాటు సాగినా వారిమధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

యుక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ వైఖరి బ్యాలన్స్‌గా ఉంది. అయితే, ఈ యుద్ధం విషయంలో భారత్ స్పష్టమైన వైఖరి తీసుకోవాలన్న ఒత్తిడి తీవ్రంగా ఉంది.

గత ఏడాది రష్యా అధ్యక్షుడిని మోదీ ఉజ్బెకిస్తాన్‌లో కలిసినప్పుడు 'ఇది యుద్ధాలు చేసే కాలం కాదు' అని చెప్పగా పాశ్చాత్య దేశాల నేతలు దాన్ని ప్రస్తావిస్తున్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

సంయుక్త ప్రకటన లేకపోవడం మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యమా?

భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ దీనిపై స్పందిస్తూ.. ‘‘సంయుక్త ప్రకటన లేకపోవడమనేది భారత్ దౌత్య వైఫల్యంగా నేను భావించడం లేదు. నిజానికి జీ20 సదస్సు రాజకీయాలపై చర్చించే వేదిక కాదు. కానీ, భారత్ రెండు పక్షాలను అంటిపెట్టుకుని ఉంటుంది’’ అని రాశారు.

వివిధ దేశాలలో భారత్ దౌత్యవేత్తగా పనిచేసిన సురేంద్ర కుమార్ దీనిపై స్పందిస్తూ అమెరికా, రష్యా, చైనాలు ఒకే చాప్టర్‌లో ఉండడం సాధ్యం కాదన్నారు. అలాగే... యుద్ధం ముగించేలా రష్యాను ఒప్పించడం కానీ... రష్యా వైఖరిని సమర్థించాలని అమెరికాను ఒప్పించడం కానీ సాధ్యం కాదని ఆయన అన్నారు.

మార్చి 1, 2 తేదీల్లో జరిగిన జీ20 విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశానికి 40 దేశాల ప్రతినిధులు వచ్చారు. ఇప్పటివరకు జరిగిన జీ20 విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశాల్లో ఇదే అతి పెద్దదని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా అన్నారు.

కాగా గత ఏడాది ఇండోనేసియాలోని బాలిలో జరిగిన జీ20 సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోనూ యుక్రెయిన్ అంశం ఉంది.. దానిపై అప్పట్లో రష్యా, చైనాలు అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

కానీ, భారత్‌కు వచ్చేసరికి అదే అంశంపై రెండు దేశాలూ అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. బాలి స్టేట్‌మెంట్‌లో భారత్ కీలక పాత్ర పోషించింది. కానీ, ఇప్పుడు అదే రష్యా, చైనాలు భారత్‌లో బాలి ప్రకటనను అంగీకరించడం లేదు.

దీనిపై సురేంద్ర కుమార్ విశ్లేషిస్తూ... బాలి నుంచి భారత్‌కు వచ్చే మధ్యలో పరిస్థితులు మారిపోయాయని అన్నారు. '’అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫిబ్రవరి 20న ఆకస్మికంగా యుక్రెయిన్ వెళ్లారు. ఆయన అక్కడికి వెళ్లడాన్ని రష్యా తప్పు పట్టింది. బాలి సమావేశం నాటికి బైడెన్ యుక్రెయిన్ వెళ్లలేదు. అప్పటికి ఇప్పటికీ అదే తేడా’’ అన్నారు సురేంద్ర కుమార్.

g20

ఫొటో సోర్స్, Getty Images

గ్లోబల్ సౌత్‌కు భారత్ గొంతు కాగలదా?

జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ, జైశంకర్ ఇద్దరూ గ్లోబల్ సౌత్ గురించి మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 12, 13 తేదీలలో భారత్ 'వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ సమ్మిట్' నిర్వహించింది. ఈ సదస్సుకు భారత్ నుంచి 120 దేశాలకు ఆహ్వానాలు అందాయి.

వర్చువల్‌గా జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె సహా చాలా దేశాల నేతలు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు చైనాను ఆహ్వానించకపోవడంపై అప్పట్లో చైనాలో కథనాలు వెలువడ్డాయి. చైనాతో పాటు పాకిస్తాన్, జీ20 సభ్య దేశం బ్రెజిల్‌కూ ఆహ్వానం అందలేదు.

వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నట్లు సందేశం ఇవ్వడానికే చైనాను ఆహ్వానించలేదని చైనా మీడియాలో కథనాలు వచ్చాయి.

జీ20 అధ్యక్షత భారత్‌కు వచ్చిన తరువాత జనవరి 7న భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. 'వర్ధమాన దేశాలు చమురు, ఆహార పదార్థాలు, ఎరువుల ధరలతో ఇబ్బంది పడుతున్నాయి. వర్ధమాన దేశాలపై పెరుగుతున్న అప్పుల భారం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో గ్లోబల్ సౌత్‌కు గొంతుగా ఉండడం భారత్ కర్తవ్యం' అన్నారు.

మరోవైపు జీ20కి భారత్ కంటే ముందు అధ్యక్షత వహించిన ఇండోనేసియా గ్లోబల్ సౌత్ దేశం.. భారత్ తరువాత 2024, 2025లో అధ్యక్షత వహించనున్న బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు కూడా గ్లోబల్ సౌత్ దేశాలే.

కాగా జీ20 వంటి కీలక బృందానికి భారత్ అధ్యక్షత వహిస్తున్నప్పటికీ ఇతర ముఖ్యమైన సంస్థలలో భారత్‌కు నిర్ణయాత్మక అధికారం లేదు. ఐరాస భద్రత మండలి, అంతర్జాతీయ ద్రవ్య నిధిలో స్థానం లేదు.

కాగా ఇప్పుడు జీ20లో ఏకాభిప్రాయ సాధన అనేది భారత్‌కు పెద్ద సవాలుగా మారింది. జీ20లో భారత్ విజయం రష్యా, చైనాలపై ఆధారపడి ఉంది. చైనాతో భారత్‌కు సరైన సంబంధాలు లేకపోవడం... యుక్రెయిన్ యుద్ధం తరువాత రష్యా, చైనాల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అంటున్నారు. మరి, ఈ పరిస్థితిని భారత్‌ ఎలా ఎదుర్కొంటుందన్నది ప్రశ్నగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)