మ‌హిళా సైంటిస్టులకు నెల‌కు రూ.55 వేలు ఇచ్చే ప‌థ‌కం గురించి తెలుసా?

యువశాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎ. కిశోర్‌బాబు
    • హోదా, బీబీసీ కోసం...

శాస్త్ర‌వేత్త జీవిత‌మంటే పూల‌బాట కాదు.

త‌మ మెద‌ళ్ల‌లో మొలిచిన వినూత్న ఆలోచ‌న‌లకు ప‌దునుపెట్టి ప్ర‌పంచానికి గొప్ప ఆవిష్క‌ర‌ణ‌లు అందించేంత వ‌ర‌కు ఒక శాస్త్ర‌వేత్త ప‌డే క‌ష్టాలు లోకానికి పెద్ద‌గా తెలియవు.

శాస్త్ర‌వేత్త‌లు త‌మ ప్ర‌యోగాలు కొన‌సాగించాలంటే ఆషామాషీ కాదు. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకోవాలి.

మ‌హిళా శాస్త్ర‌వేత్త‌లైతే ప‌రిస్థితి మ‌రింత క‌ష్ట‌త‌రంగా ఉంటుంది. పురుషాధిక్య ప్ర‌పంచంలో మ‌హిళా శాస్త్ర‌వేత్త‌లు ఎక్క‌డో ఒక్క‌చోట వివ‌క్ష‌కు గుర‌వుతుంటారు.

మంచి చ‌దువు చ‌దివి, తాము గొప్ప ప‌రిశోధ‌న‌లు చేసి కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు అందించాల‌నే త‌పన ఉన్న మహిళలకు మ‌న స‌మాజంలో త‌గిన తోడ్పాటు క‌ర‌వ‌వుతోంది.

ఇలాంటి ప్ర‌తిభావంతులైన మ‌హిళా శాస్త్ర‌వేత్త‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప‌థ‌కం అమ‌లు చేస్తోంది.

ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకున్న మ‌హిళా శాస్త్ర‌వేత్త‌కు మూడు సంవ‌త్స‌రాల పాటు ప్ర‌తీనెలా రూ.50 వేల గౌర‌వ వేత‌నం, హెచ్‌.ఆర్‌.ఏ లాంటి స‌దుపాయాలు క‌ల్పించ‌డ‌మే కాకుండా వారి ప్రాజెక్టు వ్య‌యం కోసం రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక సహాయం అందజేస్తుంది.

కేంద్ర శాస్త్ర‌, సాంకేతిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అమ‌లవుతున్న ఈ ప‌థ‌క‌మే వుమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (WISE-KIRAN).

ఈ ప‌థ‌కం ఏంటి? ఈ ప‌థ‌కానికి ఎంపికవ్వాలంటే ఏం చేయాలి? నిబంధ‌న‌లేంటి? అర్హ‌త‌లేమిటీ? ద‌ర‌ఖాస్తు చేసుకునే విధాన‌మెలా? త‌దిత‌ర వివ‌రాల‌ను పూర్తిగా తెలుసుకుందాం.

యువశాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, https://dst.gov.in/

ఏమిటీ WISE-KIRAN?

శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించి వారి ఆవిష్క‌ర‌ణ‌ల‌కు, ప్ర‌యోగాల‌కు ఊత‌మివ్వాల‌నే ఆశయంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌క‌మే ‘‘వుమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (WISE-KIRAN)’’.

పోస్టు గ్రాడ్యుయేట్ చ‌దివిన మ‌హిళ‌లు, ఆపైన వారు బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో ఫెలోషిప్ చేయ‌డానికి, సొంతంగా ప‌రిశోధ‌న‌లు- ప్ర‌యోగాలు చేయ‌ద‌ల‌చుకున్న మ‌హిళ‌ల‌కు, పీహెచ్‌డీ చేయాల‌నుకున్న మహిళలకు రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు కావాల్సిన త‌గు ఆర్థిక ప్రోత్సాహం అందించే ప‌థ‌క‌మే ఇది.

ఇందులో మూడు ర‌కాల ఫెలోషిప్‌లను అందజేస్తున్నారు.

  • వైస్: పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (WISE-PDF)
  • డబ్ల్యూఓఎస్- ఎ ప్రాజెక్ట్ (WOS-A project)
  • డబ్ల్యూఓఎస్-బి ప్రాజెక్ట్ (WOS-B project

ఈ మూడు ప‌థ‌కాల్లో దేనికి అర్హుల‌మ‌నేది తెలుసుకుని మహిళలు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

యువశాస్త్రవేత్త

ఫొటో సోర్స్, https://dst.gov.in/

ఈ ప‌థ‌కాల‌కు వ‌యో ప‌రిమితి ఎంత‌?

త‌ప్ప‌నిస‌రిగా 27 సంవ‌త్స‌రాలు నిండిన మ‌హిళ‌లు మాత్ర‌మే ఈ ప‌థ‌కాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు. గ‌రిష్ట వ‌యోప‌రిమితి 60 సంవ‌త్స‌రాలు.

క‌నీస విద్యార్హ‌త?

కనీసం పోస్టు గ్రాడ్యుయేష‌న్ చదివి ఉండాలి.

ఏఏ రంగాల్లో ఫెలోషిప్ చేయొచ్చు?

  • ఫిజికల్ అండ్ మ్యాథమెటికల్ సైన్సెస్
  • కెమికల్ సైన్సెస్
  • లైఫ్ సైన్సెస్
  • ఎర్త్ అండ్ అట్మాస్పియర్ సైన్సెస్
  • ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

ప్రాజెక్టు ఫండింగ్ ఎంత ఇస్తారు?

మీ ప్రాజెక్టును బ‌ట్టి, ఉన్న మూడు విభాగాల్లో మీరు ఏ విభాగానికి అర్హుల‌వుతారో దాన్నిబ‌ట్టి ప్రాజెక్టుకు రూ.20 ల‌క్ష‌ల నుంచి రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఫండింగ్ చేస్తారు

ప్ర‌తీ నెలా స్టైఫండ్ ఇస్తారా?

ఈ ప‌థ‌కానికి ఎంపిక‌య్యే మ‌హిళా శాస్త్ర‌వేత్త‌ల‌కు ప్ర‌తీ నెలా వారి విభాగాన్ని బట్టి రూ.35,000 నుంచి రూ.55,000 వ‌ర‌కు ఉప‌కార వేత‌నం వ‌స్తుంది. దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాల‌జీ శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం హెఆర్ఏ కూడా ఇస్తారు.

యువశాస్త్రవేత్త

ఫొటో సోర్స్, Getty Images

వైస్- పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అంటే ఏంటి?

బేసిక్/అప్లైడ్ సైన్స్‌లో పీహెచ్‌డీ లేదా దానికి సమానమైనటువంటి డిగ్రీలు, ఎండీ, ఎంఎస్‌, ఎండీఎస్ లాంటి ప‌ట్టాలు క‌లిగిన మ‌హిళా శాస్త్ర‌వేత్త‌ల కొర‌కు ఈ ఫెలోషిప్ కార్య‌క్ర‌మాన్ని అమలు చేస్తున్నారు.

రెగ్యుల‌ర్ ఉద్యోగం చేస్తున్న మ‌హిళ‌లు ఈ ప‌థ‌కం వర్తించదు.

త‌మ పరిశోధన, అక‌డమిక్ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి తాత్కాలిక ఉద్యోగం చేసే మహిళా శాస్త్రవేత్తలు ఇందుకు అర్హులు.

అయితే, వారు WISE Post-Doctoral Fellowship కార్య‌క్ర‌మానికి ఎంపికైతే అప్ప‌టి వ‌ర‌కు వారు చేస్తున్న పాత ప్రాజెక్టును వ‌దిలేయాల్సి ఉంటుంది.

ఏదైనా ప్రాజెక్టులో రీసెర్చ్ స్టాఫ్, పోస్ట్ డాక్టోరల్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ వంటి బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న వారిని తాత్కాలిక ఉద్యోగులుగా ప‌రిగ‌ణిస్తారు.

ఆర్థిక స‌హ‌కారం ఏ విధంగా ఇస్తారు?

వైస్- పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కార్య‌క్ర‌మానికి ఎంపికైన మ‌హిళా శాస్త్రవేత్త‌కు ప్ర‌తీ నెలా రూ.55,000 గౌర‌వ వేత‌నం, హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.

మూడు సంంవ‌త్స‌రాల పాటు ఈ గౌర‌వ వేత‌నం అందజేస్తారు.

రీసెర్చ్ గ్రాంట్ కింద ఏటా రూ. 2 ల‌క్ష‌లు, ప‌రిశోధ‌న ప్రాజెక్టు సామాగ్రి కొనుగోలుకు మ‌రో రూ.3 ల‌క్ష‌లు ఇస్తారు.

మీరు చేయ‌బోయే ప్రాజెక్టుకు ప్ర‌తిపాద‌న‌లు బ‌ట్టి ప్రాజెక్టుకు గ‌రిష్టంగా రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఫండింగ్ చేస్తారు.

యువశాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, Getty Images

ద‌ర‌ఖాస్తు ఎలా, చివరి తేదీ ఎప్పుడు?

వైస్- పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కార్య‌క్ర‌మానికి సంవ‌త్స‌రంలో ఎప్పుడైనా స‌రే మీరు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తులు, మీ ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న‌ల‌న్నీ కూడా ఆన్‌లైన్‌లోనే స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

https://online-wosa.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

యువశాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, Getty Images

వుమెన్ సైంటిస్ట్ స్కీమ్-ఎ (WOS-A) అంటే ఏంటి?

ఇది ప్రొఫెషనల్ కోర్సుల్లో పీజీ (ఎంఫిల్, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం.వీఎస్సీలేదా తత్సమానమైన డిగ్రీలు)లు చేసిన లేదా బేసిక్/అప్లైడ్ సైన్సెస్/ఎంబీబీఎస్/బీటెక్ వంటి వాటి తర్వాత ఎంఎస్సీ చేసిన మహిళా అభ్యర్థుల కొరకు దీన్ని ప్రవేశపెట్టారు.

ఈ కార్య‌క్ర‌మానికి ఎంపికైన అభ్య‌ర్థికి ప్ర‌తీనెలా రూ.40,000 గౌర‌వ వేత‌నం, హెచ్ఆర్ఏ ఇస్తారు.

రీసెర్చ్ గ్రాంట్ కింద ఏటా రూ.2 ల‌క్ష‌లు, ప‌రిశోధ‌న ప్రాజెక్టు సామాగ్రి కొనుగోలుకు మ‌రో రూ.3 ల‌క్ష‌లు ఇస్తారు.

మీరు చేయ‌బోయే ప్రాజెక్టుకు ప్ర‌తిపాద‌న‌లు బ‌ట్టి ప్రాజెక్టుకు గ‌రిష్టంగా రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఫండింగ్ చేస్తారు.

బేసిక్/అప్లైడ్ సైన్సెస్/ఎంబీబీఎస్/బీటెక్ వంటి వాటి తర్వాత ఎంఎస్సీ చేసిన వారికి నెల‌కు రూ.31వేల ఉప‌కార వేత‌నం ఇస్తారు. వారి ప్రాజెక్టుకు గ‌రిష్టంగా రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఫండింగ్ చేస్తారు.

 యువశాస్త్రవేత్త

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంద్రయాన్ నమూనాను చూస్తున్న విద్యార్ధిని

ఉమెన్ సైంటిస్ట్స్ స్కీమ్-బి (WOS-B) అంటే ఏంటి?

ఇందులో అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ప్ర‌తీనెలా రూ.25.000 నుంచి గ‌రిష్టంగా రూ.35,000 వ‌ర‌కు ఉప‌కార వేత‌నం ఇస్తారు.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

ముందుగా https://online-wosa.gov.in/ వెబ్‌సైటులోకి వెళ్లి మీ ఈ-మెయిల్ ఐడీతో న‌మోదు చేసుకోవాలి.

ఆ వెంట‌నే మీ మెయిల్‌కు మీ యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది.

దాని ఆధారంగా ఆన్‌లైన్‌లో మీ ప్రాజెక్టు రిపోర్టులు, ద‌ర‌ఖాస్తు త‌దిత‌రాల‌న్నీ పొందుప‌ర‌చాలి.

మీ ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న‌ల‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీలోని ప్యాన‌లిస్టులు ఎంపిక చేస్తారు.

ఎంపిక చేసిన త‌రువాత మూడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఆ మ‌హిళా శాస్త్రవేత్త‌కు ఈ ఫండింగ్ వ‌స్తుంది.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి స‌హాయం కావాలంటే ఎవ‌రిని సంప్ర‌దించాలి?

ఈ-మెయిల్‌: [email protected]

ఫోన్ నెంబ‌రు: 011-26590675

సందేహాలు నివృత్తి చేయ‌డానికి ఎవ‌ర్ని సంప్ర‌దించాలి?

ఈ-మెయిల్‌: [email protected]

ఫోన్ నెంబ‌రు : 011-26590273

వీడియో క్యాప్షన్, వేసవికి ముందు విరగకాసే పూలతో సహజ సిద్ధమైన రంగులు తయారు చేస్తారు అదిలాబాద్‌లోని గిరిజనులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)