అమృత్‌పాల్ సింగ్: ‘నేను భారతీయుడిని కాదు, సిక్కులు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు ’ – సిక్కు నాయకుడు సృష్టించిన 10 వివాదాలు

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజ్‌వీర్ కౌర్ గిల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘ఖలిస్తాన్’ పేరిట ప్రత్యేక దేశాన్ని ఏర్పాటుచేయాలని తరచూ డిమాండ్ చేసే ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధ్యక్షుడు అమృత్‌పాల్ సింగ్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.

‘‘నేను భారతీయుడిని కాదు. పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన నేనేమీ భారతీయుడిని అయిపోను. అది కేవలం ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అంతే’’అని తాజాగా ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఫిబ్రవరి 23న అమృత్‌పాల్, అతడి సోదరులు కలిసి అంజలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఆరుగురు పోలీసులు గాయపడినట్లు పంజాబ్ పోలీసు విభాగం వెల్లడించింది.

దాడి కేసులో అరెస్టయిన ‘‘వారిస్‌ పంజాబ్ దే’’ సంస్థకు చెందిన, తమ అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని అమృత్‌పాల్ సింగ్ బృందం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించింది.

ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణపై విమపక్షాలు ప్రశ్నలు సంధించాయి.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

అమృత్‌పాల్ సింగ్ ఎవరు?

తనను తాను సిక్కుల మత గురువుగా అమృత్‌పాల్ చెప్పుకుంటారు. రైతుల నిరసనల సమయంలో ఎర్రకోట వద్ద హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న దీప్ సిద్ధూతో కలిసి ‘వారిస్ పంజాబ్ దే’ను ఆయన ఏర్పాటుచేశారు. అయితే, ఫిబ్రవరి 2022లో ఒక రోడ్డు ప్రమాదంలో సిద్ధూ మరణించారు. సెప్టెంబరు 2022లో ఈ సంస్థకు తానే నాయకుడినని అమృత్‌పాల్ ప్రకటించుకున్నారు.

అమృత్‌సర్‌లోని జల్లూపుర్ ఖేడాలో అమృత్‌పాల్ బాల్యం గడిచింది. ఆ తర్వాత ఆయన దుబాయ్‌కు వెళ్లారు. ఫిబ్రవరి 2023లోనే ఆయన పెళ్లి కూడా చేసుకున్నారు.

ఇటీవల కాలంలో పంజాబ్‌లో ఆయన చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

సిక్కుల నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు భక్తులకు సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని గురుద్వారాలపై అమృత్‌పాల్ అనుచరులు గతంలో దాడులు కూడా చేశారు.

జలంధర్‌లోని మోడల్ టౌన్ గురుద్వారాలోని కుర్చీలు, సోఫాలను కూడా వీరు ధ్వంసం చేశారు. భక్తులు నేలపై కూర్చొనే ప్రార్థనలు చేయాలని చెబుతూ వారు ఇక్కడ దాడి చేశారు.

అమృత్‌పాల్ గతంలోచేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ఇప్పుడు చూద్దాం.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

1. ‘‘నేను భారతీయుడిని కాదు’’

తనను తాను భారతీయుడిగా భావించుకోనని తాజాగా అమృత్‌పాల్ వ్యాఖ్యానించారు.

అంజాలా పోలీస్ స్టేషన్ ముట్టడి అనంతరం జాతీయ మీడియా సంస్థలకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. న్యూస్ 18 పంజాబ్‌తో ఆయన మాట్లాడుతూ, ‘‘నేను పంజాబీని. నాది సిక్కు మతం. నాకు వేరే ఏ గుర్తింపూ అవసరం లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘భారతీయుడు అనే గుర్తింపు ఉండకూడదని నేను చెప్పడం లేదు. కానీ, నాకు అది అసవరం లేదు. పాస్‌పోర్టు అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అంతే. మహాత్మా గాంధీకి కూడా బ్రిటిష్ ఇండియన్ పాస్‌పోర్టు ఉండేది. మరి ఆయన బ్రిటిష్ పౌరుడు అయిపోతారా?’’అని ఆయన ప్రశ్నించారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

2. ‘‘సిక్కుల కోసం ఖలిస్తాన్..’’

సిక్కుల కోసం ఖలిస్తాన్ ఏర్పాటుచేయాలని తాజాగా ఫిబ్రవరి 24న అమృత్‌పాల్ డిమాండ్ చేశారు.

ఈ అంశంపై చర్చించేందుకు జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, ప్రపంచ మేధావులు రావాలని ఆయన ఆహ్వానించారు.

‘‘ఖలిస్తాన్ కోసం మేం చేస్తున్న పోరాటం చెడ్డదిగా చూడకూడదు. మేధో కోణంలో దీన్ని చూడాల్సి ఉంటుంది’’అని ఆయన చెప్పారు.

‘‘జియోపాలిటిక్స్‌లో దీని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా సిక్కులకు ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి? లాంటి అంశాలపై మనం చర్చించాలి’’అని ఆయన అన్నారు.

ఖలిస్తాన్ డిమాండ్ గురించి మాట్లాడుతూ.. ‘‘దీని వెనుక ఏదో ఒక వ్యక్తి ఉన్నారని అనుకోకూడదు. సిద్ధాంతాలకు వ్యక్తులు ముఖాలు లాంటివారు. సిద్ధాంతాలకు చావు అంటూ ఉండదు. మీరు ఆ వర్గం మొత్తాన్నీ చంపేయొచ్చు. కానీ, ఖాల్సా పాలన కలను ఎప్పటికీ తుంచేయలేరు. దీన్ని సిక్కు గురువులు మనకు ఇచ్చారు. దీని కోసం మనం దిల్లీని అడగాల్సిన పనిలేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

3. ‘‘సిక్కులు బానిసలు’’

సిక్కులు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారని కూడా అమృత్‌పాల్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘సిక్కులు మొదట బ్రిటిష్ సామ్రాజ్యానికి, ఇప్పుడు హిందువులకు బానిసలుగా ఉన్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘సిక్కులు తమ వస్త్రధారణ నిబంధనలను పక్కన పెట్టేశారు. సిక్కు గురువులు సూచించిన సంప్రదాయాలను పక్కన పెట్టేశారు. ఇప్పుడు కొత్తతరం సిక్కులను గుర్తుపట్టడం చాలా కష్టమవుతోంది’’అని ఆయన అన్నారు.

‘‘సిక్కు వ్యతిరేకులకు ప్రభుత్వం ఆహారం, భద్రత కల్పించి జైళ్లలో పోషిస్తోంది. కానీ, సిక్కు ఖైదీలను చాలా దారుణంగా చూస్తున్నారు. కనీసం తల్లి అంత్యక్రియలకు కూడా హాజరయ్యేందుకు వారిని అనుమతించడం లేదు’’అని ఆయన బీబీసీ పంజాబీతో అన్నారు.

‘‘నేను హిందువులు లేదా క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వంతో చేతులు కలిపి మమ్మల్ని బానిసలుగా మారుస్తున్న వారినే నేను వ్యతిరేకిస్తున్నాను’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

4. ‘‘అది ఊచకోత.. ’’

సిక్కుల ఊచకోత గురించి అమృత్‌పాల్ ఎక్కువగా మాట్లాడుతుంటారు.

మోగాలో 29 సెప్టెంబరు 2022లో ‘‘వారిస్ పంజాబ్ దే’’ సంస్థకు అధిపతిగా అమృత్‌పాల్ మారారు. ఆ రోజు సిక్కులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

‘‘సిక్కు గురువులు మనకు ప్రసాదించిన గుర్తింపు నుంచి సిక్కు ప్రజలు దూరం జరుగుతున్నారు. ఇది బానిసత్వానికి ప్రధాన సంకేతం’’అని ఆయన అన్నారు.

‘‘గుర్తింపు, సంస్కృతి, వస్త్రధారణ, భాష లాంటి విషయాల్లో ఒక వర్గం ఆత్మన్యూనతా భావానికి గురైనప్పుడు ఊచకోత మొదలవుతుంది’’అని ఊచకోత అంటే ఏమిటో ఆయన వివరించారు.

‘‘ఊచకోత అంటే ఒక వర్గాన్ని సామూహికంగా హత్య చేయడం మాత్రమే కాదు. వారి మతం, సంస్కృతీ సంప్రదాయాల నుంచి వేరు చేయడం కూడా ఊచకోతే’’అని ఆయన అన్నారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

5. ఇతర మతాలపై...

సిక్కుల వస్త్రధారణ, సంస్కృతి గురించి మాట్లాడుతూ, ఇతర మతాల నుంచి చుట్టుముడుతున్న ముప్పుల గురించి కూడా ఆయన చెప్పారు.

‘‘పంజాబ్‌లోని కొందరు క్రైస్తవ మతాధికారులు ఆమోదనీయంకానీ రీతిలో ప్రవర్తిస్తున్నారు. గ్రామాల్లో వారు సాధారణ ప్రజల భావోద్వేగాలతో ఆటలు ఆడుకుంటున్నారు’’అని అమృత్‌పాల్ అన్నారు.

కొందరు పేద సిక్కులను గ్రామాల్లో మతాలు మార్చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆ క్రైస్తవ మతాధికారుల చర్యలను కట్టడి చేయాల్సిన అవసరముందని అన్నారు.

మరోవైపు హిందూమతంతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజల నుంచి కూడా పంజాబ్‌పై ఒత్తిడి పెరుగుతోందని, దీన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని ఆయన చెబుతున్నారు.

‘‘సిక్కులు తమ మనుగడను కాపాడుకోలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజల ప్రభావానికి వీరు లోనవుతున్నారు. అలానే వీరు వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల ప్రభావానికి లోను అవుతున్నారు’’అని ఆయన వివరించారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, ANI

6. సిక్కుల్లో కుల వ్యవస్థపై ఏమన్నారు?

కులం పేరుతో సిక్కుల్లో వివక్ష ఉంటోందనేది నిజమేనని అమృత్‌పాల్ అన్నారు. మొత్తంగా సమానత్వ భావనను సిక్కుల్లో ప్రోత్సహించాల్సిన అవసరముందని ఆయన చెప్పారు.

ఆనంద్‌పుర్ సాహిబ్‌లో ఒక సభలో మాట్లాడుతూ.. ‘‘సిక్కుల్లో సమానత్వం ఉందనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కానీ, చాలా ప్రాంతాల్లో సిక్కుల్లో కుల వివక్ష కనిపిస్తోంది. దీన్ని మనం ముందుగా తొలగించాలి. దీని కోసం పంజాబ్ ప్రజలతంతా కలిసి పనిచేయాలి’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకూ దాంపత్య సుఖం.. కొత్త పథకం ప్రారంభించిన జైళ్ల శాఖ

7. పంజాబ్‌లో భూములు కొనుగోలుపై..

పంజాబ్‌లో భూములను ఇతర రాష్ట్రాల ప్రజలు కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించాల్సిన అవసరముందని అమృత్‌పాల్ వ్యాఖ్యానించారు.

దీని కోసం ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

పంజాబ్‌లో భూములను పంజాబీలు మాత్రమే కొనుగోలు చేయాలని, హిమాచల్‌లోనూ ఇలాంటి చట్టం అవసరముందని ఆయన చెప్పారు.

మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలతో పంజాబ్ సంస్కృతి ప్రభావితం అవుతోందని కూడా ఆయన అన్నారు.

గురుదాస్‌పుర్‌లోని సాహరీలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పంజాబ్‌లో పంజాబీయేతరులు భూములు కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించాల్సిన అవసరముంది. కేవలం సిక్కులకు మాత్రమే అవకాశం ఉండాలని మేం చెప్పడం లేదు. పంజాబీలకు మాత్రమే ఇది పరిమితం కావాలి’’అని ఆయన అన్నారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, JAGTAR SINGH/BBC

8. పంజాబీ నీటిపై...

రాష్ట్రంలోని జల వనరులపై పూర్తి హక్కులు రాష్ట్రానికే ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తమ రాష్ట్రానికి చెందిన జల వనరులను ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

‘‘మన జల వనరులను దోపిడీ చేస్తున్నారు. గంగా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. గంగతో పోలిస్తే, పంజాబ్‌లో ఉండే నీరు చాలా తక్కువ. అయినప్పటికీ ఇక్కడి నీటిలో సంగం హరియాణాకు వెళ్లిపోతోంది’’అని ఆయన అన్నారు.

ఇతర రాష్ట్రాలకు నీటిని వదిలేయడంతో పంజాబ్ బీడు భూమిగా మారిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, అంబులెన్స్ డ్రైవర్‌గా సేవలందిస్తున్న మంజీత్ కౌర్

9. హిందూ-సిక్కుల ఐకమత్యంపై..

హిందూ-సిక్కుల ఐకమత్యంపై మాట్లాడుతూ.. ‘‘ఇదివరకు ఖాల్సా రాజ్యంలో హిందువులు జీవించినప్పుడు, ఇప్పుడు ఎందుకు వీరు జీవించలేరు? మహారాజా రంజిత్ సింగ్ హయాంలోనూ ఇక్కడ దేవాలయాలు, మసీదులు నిర్మించారు. అప్పుడూ అందరూ కలిసే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అలా ఉండకూడదు?’’అని ఆయన ప్రశ్నించారు.

‘‘హిందువులు, సిక్కుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ముఖ్యంగా పంజాబీ హిందువులు, పంజాబీ సిక్కుల్లో అస్సలు లేవు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘పంజాబ్‌ అభివృద్ధి కోసం పనిచేసేవారు హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, పంజాబ్‌కు వ్యతిరేకంగా ఉంటే సిక్కులను కూడా సహించబోం’’అని ఆయన అన్నారు.

‘‘మహారాజా రంజిత్ సింగ్ పాలనపై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వచ్చేవి. మళ్లీ నేడు ఇలాంటి సిక్కు దేశాన్ని ఏర్పాటుచేయాలని కోరుతున్నప్పుడు.. ఎందుకు మమ్మల్ని జైలులో పెడుతున్నారు?’’అని ఆయన ప్రశ్నించారు.

‘‘మన గుర్తింపు నుంచి మనల్ని వేరుచేసే ప్రభుత్వానికి మీరు ఎందుకు తల వంచుతున్నారు?’’అని సిక్కు యువతకూ ఆయన ప్రశ్నలు సంధించారు. జుట్టు కత్తిరించుకుంటున్న సిక్కు యువత దిల్లీకి అనుకూలమైనవారని ఆయన వ్యాఖ్యానించారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN/BBC

10. పంజాబ్‌లో డ్రగ్స్ వాడకంపై...

ఖరార్ సభలో ఆయన, ‘‘కొందరు యువతీ యువకులు డ్రగ్స్ తీసుకుంటున్నారు. దాని నుంచి వారు బయటకు రావాలి" అని చెప్పారు.

‘‘ప్రభుత్వాల ప్రమేయంతోనే ఇక్కడ డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. నిజానికి దీనికి బీజాలను ప్రభుత్వమే నాటింది. మొదట్లో ఇక్కడ ఆల్కహాల్ వినియోగం విపరీతంగా పెంచారు. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడి యువత జీవితాలను నాశనం చేశారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

’’పంజాబ్‌లో గత నాలుగు ఎన్నికల్లో డ్రగ్స్‌పై పోరాటం పేరుతోనే రాజకీయ పార్టీలు గెలిచాయి. కానీ, గెలిచిన తర్వాత వారు ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారు?’’అని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)