పంజాబ్: పోలీస్ స్టేషన్‌ను వదిలివెళ్లిన అమృత్‌పాల్ సింగ్, అతని అనుచరులు

అంజాలా పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత

అమృత్‌సర్‌లోని అంజాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధ్యక్షుడు అమృత్‌పాల్ సింగ్, ఆయన మద్దతుదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అమృత్‌పాల్ సింగ్ వందలాది మంది మద్దతుదారులతో కలిసి అంజాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.

పోలీస్ స్టేషన్ ముట్టడించేందుకు వచ్చినవారిలో కొందరి చేతుల్లో కత్తులు, తుపాకులు ఉన్నాయి.

పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఈ సంస్థకు చెందిన మరో అయిదుగురిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని అమృత్‌పాల్, ఆయన మద్దతుదారులు కోరారు.

ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు, అమృత్‌పాల్ వర్గం మధ్య అనేక గంటల పాటు ఏర్పడిన ప్రతిష్టంభనకు చివరకు చర్చలతో ముగింపు పడింది.

అనంతరం అమృత్‌పాల్, ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్‌ను వీడి గురుద్వారా సాహిబ్‌కు వెళ్లారు.

అంజాలా పోలీస్ స్టేషన్ దగ్గర అమృత్‌పాల్ మద్దతుదారులు

‘అరెస్టయిన లవ్‌ప్రీత్ సింగ్‌ తూఫాన్‌కు సంబంధించి వీరంతా ఆధారాలు ఇచ్చారు. ఘటన సమయంలో ఆయన అక్కడ లేరని ఆధారాలు చూపారు. వాటి ఆధారంగా ఆయన్ను విడుదల చేస్తాం’ అని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ జస్కరణ్ సింగ్ చెప్పారు.

ఈ విషయం దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వేసినట్లు జస్కరణ్ సింగ్ చెప్పారు.

అమృత్‌సర్ ఎస్ఎస్‌పీ కూడా మీడియాతో మాట్లాడుతూ.. తూఫాన్ సింగ్‌ను విడుదల చేస్తామని చెప్పారు.

ఈ కేసును పోలీసులు క్లోజ్ చేస్తున్నారని అమృత్‌పాల్ సింగ్ కూడా చెప్పారు.

అకాలీదళ్(అమృత్‌సర్) నేత హర్పాల్ సింగ్ బ్లేయర్ మాట్లాడుతూ.. ‘గొడవలో లవ్‌ప్రీత్ లేరని అధికారులు అంగీకరించారు. కాబట్టి రేపు ఆయన్ను విడుదల చేస్తారు. కేసు కూడా ఎత్తివేస్తారు’ అన్నారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, ANI

ఫిబ్రవరి 23 ఉదయం జల్లూపూర్ ఖేడా గ్రామం నుంచి అమృత్‌పాల్, ఆయన మద్దతుదారులు కలిసి పాదయాత్రగా అంజాలా పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. దారిలో అనేక చోట్ల పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటుకుంటూ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మార్గమధ్యంలో అనేక చోట్ల పోలీసులు అమృత్‌పాల్ వర్గం మధ్య ఘర్షణ జరిగింది.

అమృత్‌పాల్ మీడియాతో మాట్లాడుతూ ‘రాజకీయ దురుద్దేశాలతో లవ్‌ప్రీత్‌పై కేసు పెట్టారు. గంటలో వారు కేసు ఎత్తివేయకపోతే ఏం జరుగుతుందో చూడండి. కేసు ఎత్తేయకపోతే ఏం జరిగినా దానికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అన్నారు.

లవ్‌ప్రీత్‌పై కేసు పెట్టిన వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని అమృత్‌పాల్ సింగ్ చెప్పారు.

మానసికంగా ఆరోగ్యంగా లేని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో ఆరుగురిని అరెస్ట్ చేస్తారా అని అమృత్‌పాల్ సింగ్ ఫిర్యాదు చేశారు.

దీప్ సిద్ధూ

ఫొటో సోర్స్, DEEP SIDHU

ఓ వ్యక్తిని కొందరు కొడుతున్న వీడియో ఫిబ్రవరి 15న వైరల్ అయింది. అనంతరం అమృత్‌పాల్ సింగ్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారంటూ సాలెంపూర్ గ్రామానికి చెందిన వరిందర్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

వరిందర్ ఫిర్యాదు మేరకు అంజాలా పోలీసులు అమృత్‌పాల్, ఆయన అనుచరులు దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని కేసు పెట్టారు.

అమృత్‌పాల్‌కు వ్యతిరేకంగా వరిందర్ సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చారని డీఎస్‌పీ సంజీవ్ కుమార్ చెప్పారు.

‘వారిస్ పంజాబ్ దే’ సంస్థను నటుడు, యాక్టివిస్ట్ అయిన సాందీప్ సింగ్ అలియాస్ దీప్ సిద్ధూ స్థాపించారు. 2022 ఫిబ్రవరి 15న సోనేపట్‌లో జరిగిన రోడ్ ప్రమాదంలో దీప్ సిద్ధూ మరణించారు.

కిసాన్ ఆందోళనలో భాగంగా 2021 జనవరి 26న జరిగిన హింసలో దీప్ సిద్ధూయే ప్రధాన నిందితుడు.

దీప్ సిద్ధూ మరణం తరువాత ఆ సంస్థ బాధ్యతలు అమృత్‌పాల్ చూస్తున్నారు.

లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్‌ను కనుక విడుదల చేయకపోతే ఫిబ్రవరి 23న అంజాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆయన్ను విడిపించుకుని వెళ్తామని ఫిబ్రవరి 22న అమృత్‌పాల్ హెచ్చరించారు.

జగ్తార్ సింగ్

ఖలిస్తాన్ మద్దతుదారైన అమృత్‌పాల్ తరచూ తన వ్యాఖ్యలతో వార్తలలో ఉంటారు. ఇటీవల కేంద్ర హోం మంత్రికి ఆయన చేసిన హెచ్చరికలతో మరోసారి వార్తలకెక్కారు.

ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేస్తామని హోంమంత్రి అంటున్నారని.. సిక్కులు సొంత పాలన, రాజ్యం కావాలని కోరుకుంటున్నారని, అది తప్పేమీ కాదని.. హిందూ రాష్ట్రం విషయంలో అమిత్ షా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని అమృత్‌పాల్ ప్రశ్నించారు. తామేమీ హిందూ రాజ్యానికి వ్యతిరేకం కాదని, అయితే, ఖలిస్తాన్ కోరుకుంటున్నామని ఆయన అన్నారు.

కాగా తాజా పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్ జగ్తార్ సింగ్ మాట్లాడుతూ.. భారతదేశం వెలుపల సిక్కులు ఖలిస్తాన్ గురించి మాట్లాడుతున్నారని, పంజాబ్‌లోని సిక్కులు పెద్దగా మాట్లాడడం లేదని.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని తాను అనుకోవడం లేదన్నారు.

‘అయితే, ఇప్పుడు కొత్తరకం వేర్పాటువాదం చూస్తున్నాం. దీన్ని గ్యాంగ్‌స్టర్ టెర్రరిజం అంటున్నాయి ఏజెన్సీలు, ఇది కొత్తరూపం, ఆందోళనకరం’ అన్నారు జగ్తార్ సింగ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)