రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజకీయ భవిష్యత్తును యుక్రెయిన్ యుద్ధమే నిర్ణయిస్తుందా?

ఫొటో సోర్స్, RUSSIAN GOVERNMENT
- రచయిత, స్టీవ్ రోజన్‌బర్గ్
- హోదా, రష్యా ఎడిటర్, మాస్కో
మూడేళ్ల కిందట రష్యా అధికారిక టీవీ చానల్‌లో నేను విన్న ఓ విషయంపై ఆలోచిస్తున్నాను.
వ్లాదిమిర్ పుతిన్ మరో 16 ఏళ్లపాటు అధికారంలో ఉండేందుకు వీలుగా రష్యా రాజ్యాంగానికి సవరణలు చేసి ప్రజల మద్దతు కోరిన సమయంలో నేను అది విన్నాను.
ఆ మార్పులకు ప్రజల్లో సానుకూలత కలిగించేలా న్యూస్ యాంకర్ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ‘తుపాను కమ్మిన సముద్రంలో ఎగసిపడుతున్న అలలను తట్టుకుని ఓడను స్థిరంగా నడుపుతున్న కెప్టెన్‌లా అశాంతి కారణంగా అల్లకల్లోలంగా మారిన ప్రపంచంలో రష్యాను కూడా పుతిన్ సుస్థిరంగా ముందుకు తీసుకెళ్తున్నారు’ అని ఆ న్యూస్ యాంకర్ చెప్పారు.
ఎడారిలోని ఒయాసిస్‌లా, కల్లోల కడలి ఒడ్డున ఉన్న సురక్షిత ఓడరేవులా రష్యా ఉందని చెప్పిన ఆ యాంకర్.. పుతిన్ లేకుంటే మన పరిస్థితి ఏమై ఉండేందని ప్రశ్నించారు.
అయితే...ఆ యాంకర్ మాటల్లోని ఓడ కెప్టెన్.. 2022 ఫిబ్రవరి 24న తానే సృష్టించుకున్న తుపానులోకి ప్రయాణం ప్రారంభించి ఓడను భారీ ఐస్‌బర్గ్ వైపు నడిపించారు.

ఫొటో సోర్స్, EPA
రష్యా దాడి కారణంగా యుక్రెయిన్‌లో వేల మంది ప్రాణాలు పోయాయి. ఎటు చూసినా విధ్వంసమే కనిపించింది. రష్యా వైపు కూడా పెద్ద ఎత్తున సైనిక నష్టం జరిగింది. వేల మంది రష్యా సైనికులు ఈ యుద్ధంలో మరణించారని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
లక్షల మంది రష్యన్లను సైన్యంలో చేర్చారు. హత్య కేసుల్లో శిక్షలు పడినవారు సహా వేలాది మంది ఖైదీలను యుక్రెయిన్‌తో యుద్ధానికి పంపించింది రష్యా.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆహార ధరలపై యుద్ధ ప్రభావం పడింది. యూరప్ సహా ప్రపంచదేశాల భద్రత విషయంలో ఆందోళనలు తలెత్తడానికీ ఈ యుద్ధం కారణమైంది.
ఇంతకీ రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం, ప్రాదేశిక విస్తరణ కోసమే ఇదంతా చేశారా?
‘2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. యుద్ధానికీ ఓ నేపథ్యమే’ అని రాజకీయ అధ్యయనకర్త ఎకథెరినీ షుల్మన్ అన్నారు.
‘తన ప్రత్యేక సైనిక ఆపరేషన్ మెరుపు వేగంతో ఉంటుందని రష్యా అంచనా వేసింది. కొన్ని వారాల్లోనే యుక్రెయిన్‌ను తన దారిలోకి తెచ్చుకోవచ్చని భావించింది. కానీ, యుక్రెయిన్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటన, ఆ దేశానికి యూరప్ దేశాల నుంచి అందే మద్దతును పుతిన్ తక్కువగా అంచనా వేశారు’ అని ఎకథెరీన్ అభిప్రాయపడ్డారు.
అయితే, యుక్రెయిన్‌పై దాడి చేయడం పొరపాటేనని ఇప్పటికీ పుతిన్ అంగీకరించలేకపోతున్నారు. యుద్ధం కొనసాగించాలని, ఉద్రిక్తతను మరింత పెంచాలనే ఇప్పటికీ పుతిన్ అనుకుంటున్నారు.
అయితే, ఈ సమయంలో రెండు ప్రశ్నలు కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలైన ఏడాది తరువాత ప్రస్తుత పరిస్థితులను పుతిన్ ఎలా చూస్తున్నారు? యుక్రెయిన్‌లో ఆయన నెక్ట్స్ ఏం చేయబోతున్నారు?
గత కొద్దిరోజులలో పుతిన్ ఈ ప్రశ్నలకు సమాధానాలు అనిపించేలా కొన్ని ఆధారాలు అందించారు.

ఫొటో సోర్స్, Reuters
‘దేశ ప్రజలనుద్దేశించి పుతిన్ మాట్లాడినప్పుడు పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా తన ఉద్దేశాలను ఆయన స్పష్టంగా వ్యక్తంచేశారు. రష్యా తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. యుక్రెయిన్ యుద్ధానికి అమెరికా, పాశ్చాత్య దేశాలే కారణమన్న తన వాదనను ఆయన కొనసాగించారు. రష్యా, అమెరికా మధ్య అమలులో ఉన్న అణ్వాయుధ నియంత్రణ చిట్టచివరి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఆయన నిర్ణయించారు. ఇది యుద్ధాన్ని ఆపాలన్న ఆలోచన పుతిన్‌కు లేదన్న విషయం స్పష్టం చేస్తోంది’ అన్నారు ఎకథరీన్.
ఈ ప్రసంగం తరువాత రోజు మాస్కోలోని ఫుట్‌బాల్ స్టేడియంలో పుతిన్.. యుక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్న తన సైనికులతో వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ రష్యా చారిత్రక సరిహద్దుల్లో ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయని అన్నారు. రష్యా తరఫున పోరాడుతున్నవారిని యోధులుగా ఆయన కీర్తించారు.
ముగింపు: క్రెమ్లిన్ నుంచి యూ టర్న్‌లు ఆశించొద్దు. ఈ రష్యా అధ్యక్షుడు మడమ తిప్పడు.
‘ఎలాంటి ప్రతిఘటన లేకపోతే ఆయన ఎంత దూరమైనా వెళ్తారు’ అని పుతిన్‌ను ఉద్దేశించిన ఆయన మాజీ ఆర్థిక సలహాదారు ఆండ్రీ ఇల్లరియనోవ్ అన్నారు. సైనిక ప్రతిఘటన తప్ప వేరే ఏదీ పుతిన్‌ను ఆపలేదని అభిప్రాయపడ్డారు.
మరి, యుద్ధ ట్యాంకులపై చర్చ ఏమిటి? పుతిన్‌తో శాంతి చర్చలు సాధ్యమేనా?
‘ఎవరితోనైనా చర్చలకు కూర్చోవడం వరకు సాధ్యమే’ అన్న ఆండ్రీ.. పుతిన్‌తో కూర్చుని ఆయనతో ఒప్పందాలు చేసున్న చరిత్ర తమకు ఉందని చెప్పారు.
‘పుతిన్ అన్ని పత్రాలనూ ఉల్లంఘించారు. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఏర్పాటుపై ఒప్పందం... రష్యా, యుక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం,
‘పుతిన్ అన్ని పత్రాలను ఉల్లంఘించారు. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఏర్పాటుపై ఒప్పందం, రష్యా -యుక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం, రష్యా- యుక్రెయిన్‌ల మధ్య అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందం, యూఎన్ చార్టర్, 1975 నాటి హెల్సింకీ చట్టం, బుడాపెస్ట్ మెమోరాండం.. ఇలా చెప్పుకొంటూ పోతే ఆయన ఉల్లంఘించని ఒప్పందాలు లేవు’ అన్నారు ఎకథరీన్.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా అధికారులు పాశ్చాత్య దేశాలపై పగ తీర్చుకోవడానికి ఒప్పందాలను ఉల్లంఘించిన జాబితా పెద్దదే ఉంది. నాటో కూటమి తూర్పు వైపు విస్తరించరాదన్న 1990లలో పాశ్చాత్య దేశాలు చేసిన వాగ్దానానికి అవి కట్టుబడి లేవన్నది రష్యా ఆరోపణ.
రష్యా అధ్యక్ష పదవిని చేపట్టిన తొలినాళ్లలో పుతిన్ నాటోను ముప్పుగా చూడలేదు. నాటోలో చేరడానికి యుక్రెయిన్ ఆసక్తి చూపడంపై 2002లో స్పందించిన పుతిన్.. అప్పుడేమీ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. మాస్కో, కీయెవ్ మధ్య సంబంధాలు దెబ్బతినరాదన్న ఉద్దేశంతో ఆయన ‘యుక్రెయిన్ ఒక సార్వభౌమ దేశం, దాని సొంత భద్రతను నిర్ణయించుకునే హక్కు దానికి ఉంది’ అని అప్పట్లో ఆయన అన్నారు.
2023 నాటికి పుతిన్‌లో పూర్తిగా మార్పు వచ్చింది. ‘పాశ్చాత్య దేశాలన్నిటిపై మొత్తంగా ఆగ్రహంగా ఉన్న ఆయన తనను తాను ‘ముట్టడిలో ఉన్న’ రష్యా కోటకు ఏకైక నాయకుడిగా తీర్చిదిద్దుకున్నారు. ఆయన ప్రసంగాలను చూస్తే రష్యా ఒకప్పటి పాలకులైన పీటర్ ద గ్రేట్, కేథరిన్ ద గ్రేట్ వంటివారి ప్రస్తావనలుంటాయి. రష్యా సామ్రాజ్యాన్ని ఏదో ఒక రకంగా పూర్వ రూపంలోకి తేవడానికే తాను ఉన్నట్లు ఆయన భావిస్తుంటారు’ అన్నారు ఎకథరీన్.
కానీ, దీనికి మూల్యం ఏమిటి? రష్యాకు స్థిరత్వం తెచ్చిన నేతగా ఒకప్పుడు పుతిన్ ఖ్యాతి పొందారు. కానీ, ఇప్పుడు పెరుగుతున్న సైనిక మరణాలు, సైనిక సమీకరణ, ఆర్థిక ఆంక్షల నడుమ ఇప్పుడు రష్యా స్థిరత్వాన్ని కోల్పోయింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లక్షల మంది రష్యన్లు దేశం విడిచివెళ్లారు. వారిలో చాలామంది యువకులు, నైపుణ్యాలు ఉణ్నవారు, విద్యావంతులు. యుద్ధం కారణంగా జరిగిన ఈ మేథో వలస ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది.
యుద్ధం కారణంగా సాయుధ గ్రూపుల ప్రాబల్యం పెరిగిపోయింది. వార్నర్ గ్రూప్ వంటి ప్రైవేట్ మిలటరీ కంపెనీలు సహా అనేక రీజనల్ బెటాలియన్‌లు ఆయుధాలతో తిరుగుతున్నాయి.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, వార్నర్ గ్రూప్ మధ్య వివాదం అక్కడి అంతర్గత పోరుకు ఉదాహరణ. అస్థిరత, ప్రైవేట్ సైన్యాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.

వచ్చే దశాబ్దం పాటు రష్యాను అంతర్యుద్ధం ఇబ్బందిపెట్టొచ్చని మాస్కోకు చెందిన పత్రిక నెజావిసిమయ గెజిటా యజమాని కాంటాస్టెంటిన్ రెమ్చుకోవ్ అన్నారు. ఈ పరిస్థితుల్లో సంపదను మళ్లీ పంచిపెట్టే అవకాశాలున్నాయని చాలా గ్రూపులు భావిస్తున్నాయన్నారాయన.
‘పుతిన్ తరువాత సరైన నేత అధికారంలోకి వస్తే అంతర్యుద్ధాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. రష్యా ఉన్నత వర్గాలపై ఆధిపత్యం ఉన్న నేత, ప్రస్తుత పరిస్థితులను వాడుకోవాలని కాచుక్కూచున్న గ్రూపుల ఆటలు సాగనివ్వని నేత అధికారంలోకి వస్తే ఫలితం ఉంటుంది’ అన్నారాయన.
మరోవైపు రష్యా పార్లమెంటు దిగువ సభలో స్పీకర్ మాట్లాడుతూ.. ‘పుతిన్ ఉన్నంత కాలం రష్యా ఉంటుంది’ అన్నారు.
ఇది పూర్తిగా విధేయుల మాటే కానీ వాస్తవం కాదు. రష్యా మనుగడ సాగిస్తుంది.. శతాబ్దాలుగా రష్యా మనుగడ సాగిస్తోంది. అయితే, ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధ ఫలితాలపైనే పుతిన్ భవిత ఆధారపడి ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














