రోహింజ్యా ముస్లింలతో ఈ పడవలు సముద్రం మధ్యలో ఎలా మాయం అవుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ న్యూస్
అంతా చీకటి, విపరీతమైన చలి, చుట్టూ ఎవరూ కనిపించడం లేదు.
మియన్మార్‌లోని రఖాయిన్ స్టేట్‌కు బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ నగరానికి మధ్యనుండే నది వైపుగా 24 ఏళ్ల ఫజల్ అహ్మద్ (పేరు మార్చాం) చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు.
బంగ్లాదేశ్‌లోని రోహింజ్యా శిబిరాల్లో దాదాపు పదేళ్లు ఆయన గడిపారు. అక్రమంగా దేశాలు దాటించే ముఠాలకు డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ఆయన సిద్ధమయ్యారు.
‘‘ఇలా ప్రమాదకర మార్గాల్లో వెళ్లి మధ్యలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని నాకు తెలుసు. అయితే, చాలామంది ఇలానే మలేసియాకు కూడా వెళ్లారు. ఇక్కడ జీవితం భరించలేకపోతున్నాను’’అని అహ్మద్ బీబీసీతో చెప్పారు.
2022లో ఇలా ప్రమాదకరంగా వెళ్లేందుకు ప్రయత్నించిన 348 మంది సముద్ర జలాల్లో మరణించారు లేదా కనిపించకుండాపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ వెల్లడించింది. 2014 తర్వాత ఇంత ఎక్కువ మంది మరణించిన ఏడాది ఇదే.
అయితే, ఇంత ప్రమాదకరంగా శరణార్థులు ఎందుకు వెళ్తున్నారు?

ఫొటో సోర్స్, Sharifa Khatun
నిరాశతో...
అహ్మద్‌కు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వీరి తల్లిదండ్రులు చనిపోయారు. ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అహ్మద్. తన తోబుట్టువుల జీవితాలైనా బాగుపడాలని అహ్మద్ కోరుకుంటున్నారు.
‘‘బంగ్లాదేశ్‌లో మా జీవితాలకు భరోసా లేదు. మాకు ఉపాధి అవకాశాలు కూడా లేవు’’అని ఆయన చెప్పారు.
మలేసియాకు వెళ్లిన తర్వాత తన జీవితం మారుతుందని అహ్మద్ భావిస్తున్నారు.
దశాబ్దాల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోహింజ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు వలసవెళ్తున్నారు. వీరిని మళ్లీ వెనక్కి తీసుకునేందుకు వీరి సొంత రాష్ట్రమైన మియన్మార్ తిరస్కరిస్తోంది.
2017లో రఖాయిన్ స్టేట్‌లో మియన్మార్ సైన్యం ఒక భారీ సైనిక చర్య మొదలుపెట్టింది. దీన్ని ‘‘ఊచకోత’’గా ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో దాదాపు పది లక్షల మంది రోహింజ్యా ముస్లింలు జీవిస్తున్నారు.
అయితే, ఈ సైనిక చర్యకు ముందే అహ్మద్ కుటుంబం బంగ్లాదేశ్‌కు వలస వచ్చేసింది. ‘‘మమ్మల్ని మియన్మార్ వెనక్కి తీసుకుంటుందనే ఆశ మాలో చచ్చిపోయింది’’అని ఆయన చెప్పారు.
4,400 డాలర్లు (రూ.3.64 లక్షలు) ఇస్తే, ఇక్కడి నుంచి మలేసియా తీసుకెళ్తానని అహ్మద్‌కు ఒక ఏజెంట్ చెప్పారు. దీని కోసం ఇప్పటికే తొలి విడతగా 950 డాలర్లు (రూ.78 వేలు) చెల్లించారు. మిగతా డబ్బులను అక్కడికి చేరుకున్నాక ఇస్తారని ఆయన చెప్పారు.
ఆ డబ్బుల కోసం అహ్మద్ చెల్లెళ్లు ఇంటి పనులు చేస్తున్నారు. తమ బంగారు నగలు కూడా అమ్మేసి కొంత డబ్బును వీరు పోగుచేశారు.

ఎలా గల్లంతవుతున్నారు?
ప్రమాదకరమైన ఈ సముద్రాన్ని దాటేందుకు గత ఏడాది మొత్తంగా 3,500 రోహింజ్యా శరణార్థులు ప్రయత్నించారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) చెబుతోంది. 2021లో ఈ సంఖ్య 700గా మాత్రమే ఉంది.
కొన్ని శరణార్థుల పడవలు అసలు ఎలాంటి జాడ లేకుండానే మునిగిపోతుంటాయి. 2022 డిసెంబరు 2న కాక్స్ బజార్ నుంచి ఇలానే 180 మందితో వెళ్లిన పడవ అండమాన్ సముద్రంలో ముగినిపోయినట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ వెల్లడించింది.
రోహింజ్యాలు ప్రస్తుతం ఏ దేశానికీ చెందినవారు కాకపోవడంతోపాటు నేరస్థుల ముఠాల సాయంతో ఇక్కడి నుంచి వారు వెళ్లడంతో కనిపించకుండాపోయిన వారిని వెతికేందుకు వారి కుటుంబాలు ఏమీ చేయలేకపోతున్నాయి.
33 ఏళ్ల షరీఫా ఖాతూన్ వితంతువు. 2016 నుంచి ఆమె శరణార్థుల శిబిరంలో జీవిస్తున్నారు. ఆమె కుటుంబంలోని నలుగురు సభ్యులు ఇలానే వెళ్లి కనిపించకుండాపోయారు.
‘‘మా అక్క ముగ్గురు పిల్లలతో ఒక పడవలో ఇలానే వెళ్లారు. కానీ వారు ఏమయ్యారో తెలియదు’’అని ఆమె చెప్పారు. షరీఫా బావ 2013లోనే ఇలాంటి బోటులో వెళ్లి మలేసియాకు చేరుకోగలిగారు.
2016లో మియన్మార్‌లో ఊచకోత నుంచి తప్పించుకునేందుకు షరీఫా అక్క తన పిల్లలతోపాటు బంగ్లాదేశ్‌కు వచ్చారు. ఆ తర్వాత తన భర్త దగ్గరకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నాలు చేశారు. కానీ, ఏవీ ఫలించలేదు.
‘‘అయితే, కొన్ని నేరస్థుల ముఠాలు ఆమెలో ఆశ కల్పించాయి. దీంతో ఆమె 2500 డాలర్లు (రూ.2.07 లక్షలు) తొలి విడతగా చెల్లించారు. మలేసియా చేరుకున్నాక మిగతా డబ్బులు ఇస్తారని చెప్పారు. గత ఏడాది నవంబరు 22న ఆమె ఇక్కడి నుంచి బయల్దేరారు. రఖాయిన్ స్టేట్ తీరంలోని రథెడాంగ్‌కు వెళ్లిన తర్వాత ఆమె ఫోన్ చేశారు. అదే ఆమెతో మాట్లాడటం చివరిసారి’’అని షరీఫా చెప్పారు.
‘‘వెళ్లొద్దని పదేపదే చెప్పాను. కానీ, అక్రమ రవాణా ముఠాలు ఆమెను మాయ మాటలతో మోసంచేశాయి’’అని షరీఫా వివరించారు.

ఫొటో సోర్స్, Mohammed Aziz
అక్రమ రవాణా..
కాక్స్ బజార్‌లోని కుతుపాలాంగ్ శిబిరంలో షరీఫా లాంటి చాలా మంది ఉన్నారు. తమ కుటుంబ సభ్యులు ఏమయ్యారో కూడా వీరికి తెలియదు.
‘‘మానవుల అక్రమ రవాణా ఇక్కడ రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి ఎలా అడ్డుకట్ట వేస్తారో తెలియడం లేదు’’అని కాక్స్ బజార్‌లోని రోహింజ్యా హక్కుల కార్యకర్త మహమ్మద్ అజీజ్ చెప్పారు.
‘‘జనవరి రెండో వారం తర్వాత మూడు పడవలు ఇక్కడి నుంచి మలేసియాకు బయలుదేరాయి. జనవరి 16న ఒకటి, 20న మరొకటి, 27న ఇంకొకటి వెళ్లాయి’’అని ఆయన తెలిపారు.
మొత్తంగా ఈ పడవల్లో 350 మంది శరణార్థులు వెళ్లినట్లు ఆయన తెలిపారు.
బంగ్లాదేశ్‌లోని తంకాఫ్ నుంచి 200 మందితో ఒక పడవ ఫిబ్రవరి 17న కూడా వెళ్లినట్లు రోహింజ్యా శిబిరాల్లోని వర్గాలు వెల్లడించాయి.
‘‘రోహింజ్యాలు శరణార్థులు కాబట్టి, ఇక్కడ పనిచేసేందుకు వారికి అనుమతులు ఉండవు. వీరిలో చాలా మందికి విదేశాల్లోనీ వీరి కుటుంబ సభ్యులు డబ్బులు పంపిస్తుంటారు’’అని అజీజ్ తెలిపారు.
‘‘ఇక్కడి నుంచి అక్రమ మార్గాల్లో వెళ్తున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉన్నారు. కొందరు తమతో పిల్లలను కూడా తీసుకెళ్తున్నారు’’అని ఆయన తెలిపారు.
శరణార్థులను అక్రమంగా తీసుకెళ్లే ముఠాలు ఎక్కువగా చేపల పట్టే పడవలను ఎంచుకుంటున్నాయి. వీటిలో ఎక్కువ మంది ప్రయాణించకూడదు. ఎక్కువ దూరానికీ ఇవి పనికిరావు.
‘‘ఒకసారి మలేసియా వెళ్లిన తర్వాత అక్కడి నుంచి అమెరికా, కెనడా, యూరప్ వెళ్లొచ్చని శరణార్థులకు ఏజెంట్లు మోసం చేస్తున్నారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు’’అని అజీజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గల్లంతు
మరోవైపు బంగ్లాదేశ్‌లో జీవిస్తున్న రోహింజ్యాల పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది.
‘‘ఈ శిబిరాలు ఎప్పటికీ ఇళ్లు కాలేవు. ఇక్కడి ప్రజల్లో నిరాశలో కూరుకుపోవడంతో ఇలాంటి ప్రమాదకర మార్గాలను ఎంచుకుంటున్నారు’’అని కాక్స్ బజార్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థను కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ మిజానుర్ రెహమాన్ చెప్పారు.
‘‘గత ఏడాది మేం 12 అక్రమ రవాణా కేసులు నమోదుచేశాం. కొన్ని బోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిని అరెస్టు కూడా చేశారు’’అని రెహమాన్ వివరించారు.
అక్రమ మార్గాల్లో ప్రజలను తరలించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ అధికారులు, ఐక్యరాజ్యసమితి కూడా హెచ్చరిస్తోంది. అయితే, ఇక్కడ చాలా ప్రయాణాలు రహస్యంగా జరుగుతున్నాయి. వీరిపై నిఘా పెట్టడం కష్టం అవుతోందని ఐరాస చెబుతోంది.
‘‘సముద్ర మార్గాల్లో వెళ్లే ప్రజలపై నిఘా పెట్టే అవకాశం యూఎన్‌హెచ్ఆర్‌సీకి లేదు. మాకు ఏదైనా శరణార్థుల పడవ కనిపిస్తే, మేం ఐరాస లేదా ఇతర సంస్థలకు సమాచారం ఇస్తున్నాం’’అని యూఎన్‌హెచ్‌సీఆర్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ రెజీనా డీ లా పోర్టిలా చెప్పారు.
అయితే, కొన్నిసార్లు సముద్ర జలాల్లో ఎవరైనా అత్యవసర సాయం కోసం సమాచారం పంపిస్తే ఐరాస నేరుగా కూడా సాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. గత డిసెంబరులో ఇలానే వంద మంది రోహింజ్యా శరణార్థులతో వెళ్తున్న పడవను సురక్షితంగా ఐరాస బలగాలు శ్రీలంక తీరానికి చేర్చాయి.

ఆశలు..
నేడు షరీఫాది ఏం చేయాలో తెలియని పరిస్థితి. వితంతువుగా ముగ్గురు పిల్లలతో ఆమె దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.
మరోవైపు సముద్రం మధ్యలో గల్లంతైన తన అక్కను వెతికి పెట్టడంలో ఎవరు సాయం చేస్తారో ఆమెకు అర్థం కావడం లేదు.
‘‘నాకు చాలా బాధనిపిస్తోంది. అసలు వారు ఏమయ్యారో తెలియడం లేదు. డిసెంబరు 14న చివరిసారిగా నేను వారితో మాట్లాడాను’’అని షరీఫా చెప్పారు.
‘‘ఏదో ఒక రోజు వారు మళ్లీ కనిపిస్తారని ఆశతో జీవిస్తున్నాను’’అని ఆమె చెప్పారు.

భావోద్వేగంతో వీడ్కోలు..
మాతో మాట్లాడిన తర్వాత, అక్రమ రవాణా ముఠా నుంచి ఫజల్ అహ్మద్‌కు ఫోన్ వచ్చింది. వెంటనే చెప్పులను ఒక చేతితో పట్టుకొని, సంచి భుజానికి వేసుకొని అలల వైపుగా ఆయన వెళ్లారు. వెళ్లేటప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు.
‘‘మా చెల్లెళ్లు, తమ్ముళ్లు వెళ్లొద్దని చెప్పారు. కానీ, ఇక్కడ నాకు ఏ పనీ దొరకడం లేదు. నేను వెళ్లాలి’’అని మాతో ఆయన చెప్పారు. ఆయనకు చదవడం, రాయడం రావు. దీంతో అక్కడ కూలి పని చేసుకుని డబ్బులు సంపాదిస్తానని అన్నారు.
‘‘నేను నా తోబుట్టువులకు దారి చూపించాలి. వారు చదువుకోవాలి, దానికి డబ్బులు కావాలి’’అని ఆయన చెప్పారు. ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ ప్రయాణం చేయాలని ఆయనకు తెలుసు.
నీటిలో ముందుముందుకు వెళ్లినప్పుడు చీకట్లో ఆయన ముందు ఒక పడవ కనిపించింది. ఇదే తమ జీవితాలను బాగు చేస్తుందని ఆయన చెబుతూ వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి:
- ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















