అస్సాం: బాల్య వివాహాల పేరుతో వందలాది మంది భర్తల అరెస్ట్.. రోడ్డున పడుతున్న భార్యాపిల్లలు

బాల్య వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అస్సాంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళలు
    • రచయిత, జోయా మాటీన్
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

మోమినా ఖాతున్ తాను శాపగ్రస్తురాలనని నమ్ముతోంది.

ఎందుకంటే, ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్న వందలాది మంది మహిళలలో తాను కూడా ఒకతి. బాల్య వివాహాలను అరికట్టే పేరుతో వారి భర్తలను అరెస్ట్ చేయడంతో వారి జీవితాలు ప్రస్తుతం దిగుతోచని పరిస్థితుల్లో పడిపోయాయి.

చట్టవిరుద్ధమైన ఈ విధానానికి అడ్డుకట్ట వేయాలనుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, తమ భర్తలు జైలు పాలు కావడంతో తామంతా నిరాశ్రయులుగా మారిపోయినట్టు ఖాతున్, ఇతర మహిళలు చెబుతున్నారు.

త్వరలోనే బిడ్డను కనబోతున్న ఖాతున్, జీవితాన్ని సాగించడం అంత తేలికైన విషయం కాదు. అనుకున్న దానికన్నా మెరుగ్గా ఆమె జీవితం సాగుతుందనుకున్న సమయంలో అంతా తలకిందులైంది.

ఖాతున్‌కి ఎనిమిదేళ్లున్నప్పుడే తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల తర్వాత తన తల్లి కూడా ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ఒక చిన్న గ్రామంలో తన అత్తయ్య దగ్గర పెరిగారు ఖాతున్.

''జీవితం చాలా కష్టంగా ఉండేది. వారి కుటుంబానికి నన్ను ఒక భారంగా భావించే వారు'' అని ఖాతున్ చెప్పారు.

గత ఏడాదినే అంటే తనకు 17 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేయాలని అత్తయ్య కుటుంబం నిర్ణయించింది. ఆ సమయంలో తనకు చాలా భయం వేసింది.

''మనం పెళ్లి చేసుకునే వ్యక్తిపైనే మన జీవితం ఎలా ఉండబోతుందో ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నాకు చెడ్డ వ్యక్తి భర్తగా వస్తే నా జీవితం ఏమవుతుందోనని చాలా భయపడేదాన్ని. కానీ నన్ను పెళ్లి చేసుకున్న యాకుబ్ అలీ ఒక రైతు. ఆయన స్వచ్ఛమైన ప్రేమతో, అనురాగంతో నా ఒంటరితనాన్ని నా నుంచి దూరం చేసి, నా జీవితాన్ని మార్చారు'' అని ఖాతున్ చెప్పారు.

''మాకు పెద్దగా ఏమీ లేదు. మేము పేదవాళ్లం. కానీ, ప్రశాంతంగా బతికేవాళ్లం'' అని అన్నారు.

కానీ, ఆ సంతోషం కూడా స్వల్పకాలం మాత్రమే.

ఫిబ్రవరి 4న అలీని తన ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. మైనర్ అయిన ఖాతున్‌ను పెళ్లి చేసుకున్నందుకు అతనిపై కేసు దాఖలు చేశారు.

ఇప్పుడు 22 ఏళ్ల యాకుబ్ అలీ జైలులోనే ఉన్నారు. ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అయిన ఖాతున్, అరెస్ట్ అయినప్పటి నుంచి తన భర్తను కలుసుకోలేకపోతున్నారు.

''నేను ఎక్కడికి వెళ్లాలి? నాకెవరూ లేరు. నేను, నా బిడ్డ ఆకలితోనో, ఒంటరితనంతోనే చనిపోతాం'' అని ఖాతున్ ఆవేదన వ్యక్తం చేశారు.

బాల్య వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అస్సాంలో పోలీసు స్టేషన్ల వద్ద నేలపై పడుకుని భర్తలను విడిచిపెట్టాలని కోరుతున్న మహిళలు

అస్సాంలో బాల్య వివాహాల కేసుల పేరుతో తమ భర్తలను అరెస్ట్ చేయడంతో ఖాతున్‌తో పాటు వందలాది మంది మహిళలు దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటి వరకు 8,100 మందికి పైగా వ్యక్తులపై పోలీసులు ఫిర్యాదులు దాఖలు చేశారు. వారిలో పెళ్లి కొడుకుల తల్లిదండ్రులు, పెళ్లి తంతు నిర్వహించిన పూజారులు కూడా ఉన్నారు. అయితే, వీరిని పోలీసులు ఎలా గుర్తించారన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

దీనిపై బీబీసీ అధికారులను సంప్రదించింది. కానీ, గత వారం నుంచి కనీసం 2,500 మంది అరెస్ట్ అయ్యారు. పోలీసులు తీసుకున్న ఈ చర్య తమ జీవితాల్లో క్రూరమైన జోక్యమని మహిళలు ఆరోపిస్తున్నారు.

అరెస్ట్ అయిన వారు చాలా వరకు నిరక్షరాస్యులు, పేద వ్యక్తులే. వీరే తమ కుటుంబాలకు జీవనాధారం. వారిపైనే ఆధారపడి కుటుంబాలు జీవిస్తున్నాయి. పోలీసు స్టేషన్ బయట నేలపై కింద పడుకుని తమ భర్తలను విడుదల చేయాలని కోరుతున్న మహిళల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్యలో వయసున్న బాలికలను పెళ్లి చేసుకున్న అలీ లాంటి వ్యక్తులపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కేసు దాఖలు చేశారు. ఈ చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, జరిమానాలు విధిస్తారు.

14 ఏళ్ల లోపున్న బాలికలను పెళ్లి చేసుకుంటే మరింత కఠినతరమైన లైంగిక వేధింపుల నుంచి పిల్లల్ని కాపాడే చట్టం వర్తిస్తుంది. ఇది నాన్ బెయిలబుల్. జైలు శిక్ష ఏడేళ్ల నుంచి జీవితకాలం వరకూ ఉంటుంది.

వందలాది మంది హిందూ పురుషుల్ని అరెస్ట్ చేసినప్పటికీ, ఇతరులతో పోలిస్తే అస్సాంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే ఈ అరెస్ట్‌లు అత్యధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

బాల్య వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్ని జిల్లాల్లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళలు

భారత్‌లో ముస్లిం పర్సనల్ లా ప్రకారం, బాలికలు యవ్వనంలోకి రాగానే పెళ్లి చేసుకోవచ్చు. ఈ చట్టం బాల్య వివాహాల నిరోధక చట్టానికి విరుద్ధంగా ఉంది. బాల్య వివాహాల నిరోధక చట్టం కింద 18 లోపున్న బాలికలకు పెళ్లిళ్లు నిషేధం. దీనిపై సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

''మతాల పర్సనల్ చట్టాలన్నీ జనరల్ పర్సనల్ చట్టాలకు లోబడి ఉంటాయి'' అని విధి లీగల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ అర్ఘ్య సెంగుప్తా అన్నారు. అయితే, పరిస్థితి ఎంత అన్యాయంగా ఉందన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందన్నారు.

‘‘దశాబ్దాలుగా ముస్లిం పర్సనల్ లా ప్రకారం.. యవ్వనంలోకి వచ్చిన బాలికలు తమ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవచ్చు. అది వారి దృష్టిలో ఎన్నడూ తప్పు కాదు. అలా పెళ్లిళ్లు చేసుకున్నందుకు అకస్మాత్తుగా వారి భర్తలను జైల్లో తోయడం అన్యాయం కావచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం తమ ప్రభుత్వం బాల్య వివాహాలపై యుద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఏ ఒక్క కమ్యూనిటీని తాము లక్ష్యంగా చేసుకోవడం లేదన్నారు. కానీ, అట్టడుగు మైనార్టీలను ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్ట్‌లు చేసినట్టు విమర్శకులంటున్నారు.

ఒకప్పుటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి తరలి వచ్చిన కమ్యూనిటీ ఎంతో కాలంగా ఈ రాష్ట్రంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటోంది. వారి భాషాపరమైన గుర్తింపు, పౌరసత్వం రెండూ కూడా రాజకీయ కోరల్లో చిక్కుకున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వివాదాస్పదమైన పౌరసత్వ చట్టంతో పాటు పలు కీలకమైన విధానాలను తీసుకొచ్చింది. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టం బెంగాలీ మాట్లాడే ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని విమర్శకులన్నారు.

ఈ అరెస్ట్‌ల వల్ల చట్టవిరుద్ధంగా జరిగే పెళ్లిళ్లు ఇకపై బయటికి కనిపించకుండా జరుగుతాయని, అవి వెలుగులోకి రావడం కూడా కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు.

బాల్యవివాహాలు మత పరంగా కంటే సామాజిక ధోరణితోనే ఎక్కువగా జరుగుతాయని, పేదరికం, పితృస్వామ్య వ్యవస్థనే దీనికి ప్రధాన కారణమని ఆంస్టర్‌డామ్ వ్రిజే విశ్వవిద్యాలయం పరిశోధకులు, లెక్చరర్ డాక్టర్ అబ్దుల్ ఆజాద్ అన్నారు.

ఈ కమ్యూనిటీల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడం ద్వారానే ఈ విధానాన్ని పూర్తిగా అరికట్టవచ్చన్నారు. కేవలం ఒక్క కమ్యూనిటీని లక్ష్యంగా చేయడం ద్వారా కాదన్నారు.

బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకమైనప్పటికీ, పితృస్వామ్య వ్యవస్థలు, సరైన చదువులు లేకపోవడం, పేదరికం వల్ల భారత్‌లో చాలా ప్రాంతాల్లో ఇవి జరుగుతున్నాయి.

చాలా కొద్ది కేసులు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. అస్సాంలో 2021లో 155లో, 2020లో 138 బాల్య వివాహాల కేసులు నమోదైనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పింది.

అస్సాంలో చిన్న వయసులోనే గర్భధారణ రేటు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ సమస్యకు ముగింపు చెబుతానని హామీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇచ్చారు. ఆ వెంటనే జనవరి 23న బాల్య వివాహాలపై విరుచుకుపడుతూ చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

సీఎం అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది కుటుంబాలను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసింది.

బాల్య వివాహాలు
ఫొటో క్యాప్షన్, 2020లో కరోనా వల్ల భర్తను కోల్పోయిన కుల్సూమ్

అస్సాంలోని ధుబ్రి జిల్లాకు చెందిన నివాసి ఖైలిదుల్ రషీద్ ఈ చర్యలపై కన్నీటిపర్యంతమయ్యారు. తన 23 ఏళ్ల కూతురు కుల్సూమ్ ఖాన్ ఈ ఫిబ్రవరి 4న ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.

నలుగురు పిల్లల్లో పెద్దదైనా కుల్సూమ్‌కి 14 ఏళ్లున్నప్పుడే పెళ్లి చేశారు. 2020లో కరోనా కారణంతో తన భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలతో తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు కుల్సూమ్.

అంతా బాగుదనుకునే సరికి, గత వారం ఈ అరెస్ట్‌ల వార్త గురించి విని, కుల్సూమ్ చాలా ఆందోళన చెందారు. శుక్రవారం తన పెళ్లి పత్రాన్ని తన తండ్రిని అడిగారు. ''నీ భర్త చనిపోయారు. నీకేం సమస్య ఉండదు, ఆందోళన చెందవద్దని నేను చెప్పాను'' అని రషీద్ చెప్పారు.

కానీ, తన తల్లిదండ్రుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారని కుల్సూమ్ చాలా భయపడ్డారు. ఆత్మహత్య చేసుకున్నారు. ''మమ్మల్ని కాపాడేందుకు ఆమె జీవితాన్నే పణంగా పెట్టింది'' అని రషీద్ కన్నీరుమున్నీరయ్యారు.

అస్సాంలో బాల్య వివాహాలు చాలా వరకు అట్టడుగు వర్గాల్లోనే జరుగుతున్నాయని డాక్టర్ కలాం అన్నారు. ఇటీవల కాలంలో ఈ విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న శక్తివంతమైన సామాజిక ఉద్యమం ఒక రూపుదిద్దుకుంటోంది.

కానీ, ప్రస్తుతం చేపడుతున్న దుందుడుకు ధోరణి, ఈ ఉద్యమాన్ని బలహీనపరుస్తుందన్నారు. తమ సమాజం విడిపోయి, క్రూరమైన చర్యలకు మద్దతు మరింత పెరుగుతుందని డాక్టర్ కలాం అన్నారు.

ఎనిమిది మంది మహిళా ఆందోళనకారుల తరఫున ధుబ్రి జిల్లాకు చెందిన న్యాయవాది అబ్దుల్ జమన్ పోరాటం చేస్తున్నారు.

ముస్లింలు ఎక్కువగా ఉండే ధుబ్రి ప్రాంతంలో ఈ అరెస్ట్‌లు ఎక్కువగా నమోదయ్యాయి.

''బాల్య వివాహం ముస్లిం సమాజపు సమస్యగా చూసే ఒక సాధారణ ధోరణి ఉంది. కానీ, ధుబ్రిలో బాల్యవివాహాల రేటు అధికంగా ఉంది. ఎందుకంటే, అస్సాంలో పేదరికం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో చాలా మంది నిరక్షరాస్యులే. కేవలం ముస్లింలు ఇక్కడ నివసిస్తున్నారని కాదు'' అని జమన్ అన్నారు.

ప్రభుత్వం సామాజిక సమస్యను మతపరమైన దానిగా మారుస్తుందని ఆరోపించారు. దీని వల్ల మహిళల జీవితాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల జరిగిన అరెస్ట్‌లలో హిందూ, ముస్లిం పురుషులు ఉన్నప్పటికీ, బెయిల్ ఇవ్వడంలో మాత్రం ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారని జమన్ ఆరోపించారు.

''గిరిజన వర్గాలు ఎక్కువగా ఉండే మజులిలో ఒకే రోజులో 24 మందికి బెయిల్ వచ్చింది. అదే నేరంతో అరెస్ట్ అయిన ముస్లిం పురుషులు మాత్రం బెయిల్ పొందలేకపోతున్నారు'' అని ఆయన ఆరోపించారు.

మజులిలోని జిల్లా కోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్ల కాపీని బీబీసీ చూసింది. తగిన ఆధారాలు లేకుండానే అరెస్ట్‌లు చేసినట్టు ఆ కాపీలో ఉంది.

ఈ అరెస్ట్‌ల వల్ల ప్రభావితమైన మహిళలకు పరిహారంగా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. డబ్బు పరంగా ఆలోచించడం నిజంగా ఇది సున్నితత్వం లేని విషయంగా మారిందన్నారు.

‘‘భార్య, భర్త మధ్య గల భావోద్వేగ సంబంధం సంగతేంటి? దానికి ప్రభుత్వం ఎలా పరిహారం అందజేస్తుంది?’’ అని జమన్ ప్రశ్నించారు.

ఖాతున్ కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ‘‘మహిళల జీవితంలో ఈ బాధలు ఎప్పుడు తీరుతాయి?’’ అని ఆమె అన్నారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)