'పుతిన్ యుక్రెయిన్ ఏమీ చేయలేకపోయారు... కానీ, రష్యాను మాత్రం నాశనం చేశారు'

రష్యా రిపోర్టర్

ఫొటో సోర్స్, ILYA BARABANOV/BBC

యుక్రెయిన్‌పై రష్యా దాడికి ఫిబ్రవరి 24కు సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా మాట్లాడిన బీబీసీ రష్యన్ రిపోర్టర్ ఇలియా బరబనోవ్, తనలాంటి లక్షలాది మంది రష్యన్ జీవితాలను ఈ సంక్షోభం తలకిందులు చేసిందన్నారు. ఈ యుద్ధం ముందు, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన మాటల్లోనే..

2022 ప్రారంభమంతా దేశం అశాంతితో నిండిపోయింది. కానీ, యుద్ధానికి సంబంధించిన పుకార్లతో నాకసలు సంబంధం లేకుండా పోయింది.

ఎందుకంటే, యెవ్జెనీ ప్రిగోజిన్‌కు చెందిన వాగ్నర్ గ్రూప్‌కు చెందిన ఇద్దరు కిరాయి వ్యక్తులు నాపై పరువు నష్టం దావా వేశారు. నేను, నా భార్య ఇద్దరం రష్యా విడిచిపెట్టి వెళ్లాలా? అనే విషయంపై చర్చించుకుంటున్నాం. మా ముందు ఎలాంటి భవిష్యత్ ఉందో తెలియడం లేదు.

2019-20 మధ్య కాలంలో లిబియాలో రష్యన్ కిరాయి సైనికులపై నేను, బీబీసీ అరబిక్‌కు చెందిన నా సహోద్యోగి నాదర్ ఇబ్రహ్మిం కలిసి చేసిన ఇన్వెస్టిగేషన్‌కు ప్రతిఫలంగా మాపై ఈ కేసు నమోదైంది.

ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న ప్రభుత్వంతో పోరాడటం, జనరల్ ఖలీఫా హఫ్తార్‌కు మద్దతు ఇవ్వడమే కాకుండా, పౌరులపై వారు యుద్ధ నేరాలకు పాల్పడ్డారని సాక్ష్యాధారాలతో సహా చూపించడంతో మాపై ఈ కుట్ర జరిగింది.

ఇది టెలివిజన్‌లో బ్రాడ్‌కాస్ట్ అయి, సాక్ష్యాధారాలతో ఆర్టికల్ ప్రచురితమైన తర్వాత, ఈ ఇద్దరు కిరాయి సైనికులు తమల్ని, బీబీసీని మాస్కో కోర్టుకి లాగారు.

2022 జనవరిలో ఈ కేసు నడుస్తోన్న సమయంలో, ఇది మరింత ముందుకు సాగుతుందని నేను చాలా ఆందోళనకు గురయ్యాను. నిపుణులైన న్యాయవాదుల సాయం తీసుకున్నప్పటికీ, నా పరువును, స్వేచ్ఛను నేను కాపాడుకోలేనేమో అనిపించింది.

ఆరు నెలల తర్వాత, వాగ్నర్ గ్రూప్‌లో తాను భాగం కాదని చెప్పుకుంటూ వస్తోన్న ఆ ఇద్దరిలో ఒకరు యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో మరణించారు. దీంతో మరో వ్యక్తి మాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసులో ఓడిపోయారు.

అయినప్పటికీ నేను రష్యా విడిచి బయటికి వచ్చాను. దీనికీ పలు కారణాలున్నాయి.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైన్యం మోహరింపు పెరుగుతుందని రిపోర్టులు వచ్చాయి. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతుందని పుకార్లు వచ్చాయి. పెరుగుతోన్న ఘర్షణ పరిస్థితులను నివేదించేందుకు నేను కియోవ్ చేరుకున్నాను.

కానీ, నిజంగా యుద్ధం జరుగుతుందా అన్నది నేను నమ్మలేకపోయాను.

రష్యా రిపోర్టర్

ఫొటో సోర్స్, ILYA BARABONOV/BBC

యుక్రెయిన్‌పై దాడి ప్రారంభం

రష్యా సరిహద్దుకి సమీపంలో ఉన్న ఖర్కీవ్ ప్రాంతంలోని వోవ్‌చాన్స్క్ ప్రాంతానికి నేను, మరో బీబీసీ రిపోర్టర్ స్లావా ఖోమెంకో ఫిబ్రవరి 14న వెళ్లాం.

ఆ తర్వాత పది రోజులకి ఆ నగరమంతటిన్నీ రష్యా తన స్వాధీనంలోకి తీసుకుంది. కానీ, ఆ సమయంలో అక్కడి స్థానిక నివాసితులు అలా జరుగుతుందని ఊహించలేదు.

ఆ సమయంలో నేను, స్లావా కలిసి అక్కడి పరిస్థితులపై రిపోర్టు చేయడానికి వెళ్లినప్పుడు, వారందరూ రెండో ప్రపంచ యుద్ధం గురించే మాట్లాడారు. జర్మన్ల చేతిలోనే తాము నిలదొక్కుకున్నామని అన్నారు.

కియోవ్‌కి తిరిగి వెళ్లే సమయంలో మేము పెరెమోహ నగర ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి, అక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాం. ఆ నగరం యుక్రెయిన్ విక్టరీకి సంకేతంగా ఉంది.

ఫిబ్రవరి 24న నేను కియోవ్‌లోని నా హోటల్ రూమ్‌లో నిద్రపోతున్నప్పుడు, ‘‘సర్, మనం బాంబు దాడులకు గురవుతున్నాం’’ అని అరుస్తూ ఒక సిబ్బంది మా గది తలుపు కొడుతుండటంతో ఉలిక్కిపడి లేచాం.

అప్పటికే యుద్ధం ప్రారంభమైంది.

ఆ తర్వాత నేను హోటల్ బాంబ్ షెల్టర్‌కి వెళ్లాను. స్పానిష్ పర్యాటక దంపతుల పిల్లల్ని చూసినప్పుడు, వారు దీన్ని ఒక వినోదభరితమైన సాహసంగా చూస్తున్నారు.

బయట వినిపిస్తోన్న ఎయిర్ రైడ్ సెరైన్ల మోత ఎందుకు వస్తుందో తెలియడం లేదు. ఎందుకు బయటికి వెళ్లడం లేదో వారికి తెలియట్లేదు.

కియోవ్‌లో నేను, నా స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లోనే చాలా రోజులు గడిపాను. అక్కడే చాలా మంది జర్నలిస్టులం కలిసేవాళ్లం. యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని ఒకరికొకరం షేర్ చేసుకుంటూ, మాట్లాడుకునే వాళ్లం.

కియోవ్‌లో చాలా ప్రాంతాలు బాంబు దాండులకు ధ్వంసమయ్యాయి. కానీ, మా అపార్ట్‌మెంట్‌కి మాత్రం ఏం కాలేదు.

నా స్నేహితుడి ఫ్లాట్‌కి ఉత్తర ముఖంగా ఒక బాల్కనీ ఉంది. దాని నుంచి చూస్తే, బుచా, హోస్టోమెల్, ఇర్పిన్ పట్టణాలు కనిపించేవి. బయట రష్యన్ గన్‌ల శబ్దాలను మేము వినేవాళ్లం. రష్యన్ సైన్యం ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని మాకు అర్థమైంది.

ఆరు వారాల తర్వాత, రష్యన్ దళాలు ఆ నగరాలు, పట్టణాల నుంచి వెనుతిరిగాయి. ఇలా రష్యా ఆ ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం కాస్త ఊరటగా అనిపించింది.

రష్యన్ దళాలు అక్కడ చేసిన విధ్వంసం గురించి ప్రపంచమంతా తెలుసుకోవడం ప్రారంభించింది.

ఆ సమయంలో రష్యన్ అథారిటీలు మాత్రం తమ పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఇదొక పశ్చిమ దేశాల సెక్యూరిటీ సర్వీసుల తప్పుడు కథనాలుగా పేర్కొన్నాయి.

రష్యా రిపోర్టర్

ఫొటో సోర్స్, ILYA BARABONOV/BBC

మాస్కోకి తిరిగి వెళ్లలేను

ఫిబ్రవరి 28 చివరిలో నేను యుక్రెయిన్ నుంచి నీస్టర్ నది దాటి మాల్దోవాకి వెళ్లాను. తిరిగి మాస్కోకి వెళ్లడం అసాధ్యమని నాకు అప్పటికే అనిపించింది. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని రిపోర్టు చేసిన తర్వాత, మళ్లీ అక్కడికి వెళ్లడం కష్టమే.

మాల్దోవా అంతటా యుక్రెయిన్‌ శరణార్థులే ఉన్నారు. అక్కడ స్థానిక ప్రజలు మా ముందుకు వచ్చి మాట్లాడేందుకు భయపడ్డారు.

ఒకవేళ పుతిన్ యుద్ధ సైన్యం ఒడెస్సాకి వస్తే, మా చిన్న దేశం తేలిగ్గా రష్యన్ చేతిలోకి వెళ్లిపోతుందని వారు భావించారు.

ఆ సమయంలో, మాస్కోను ఎదురించి యుక్రెయిన్ నిలబడగలుగుతుందా అన్న దానిపై స్పష్టత లేదు.

మాల్దోవా నుంచి రోమానియాకు నేను రైలులో వెళ్లాను. ఆ రైళ్లంతా పూర్తిగా శరణార్థులతోనే నిండి ఉంది. నాలుగేళ్ల చిన్నారి నన్నేమి అడిగిందంటే..‘‘మనం త్వరలోనే ఇంటికి వెళ్తాం కదా?’’ అని అడిగింది. ఆ పాప అడిగిన ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు.

1917లో బోల్షివిక్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, చాలా మంది ప్రజలు రష్యాను విడిచిపెట్టి వెళ్లారు.

వందేళ్ల క్రితం, అరిస్టోక్రాట్స్, వైట్ గార్డు అధికారులు ఆ దేశం విడిచిపెట్టి వెళ్లారు. ప్రస్తుతం కంప్యూటర్ సైంటిస్టులు, డాక్టర్లు, జర్నలిస్టులు ఆ దేశం విడిచిపెట్టారు.

దాడి ప్రారంభమైన తర్వాత, స్వతంత్ర జర్నలిజాన్ని నిషేధిస్తూ రష్యా చట్టాలను తీసుకొచ్చింది.

ఈ యుద్ధం ప్రారంభమైన ఏడాది తర్వాత మాత్రం ఒకటర్థమైంది, యుక్రెయిన్‌ను నాశనం చేయాలనే వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన లక్ష్యంలో ఆయన విఫలమయ్యారు.

ఆయన సాధించినదేమిటంటే.. రష్యా మధ్య తరగతి ప్రజల, మేధావుల, సాంస్కృతిక నిపుణుల నాశనాన్ని పుతిన్ పొందారు.

యుద్ధానికి ముందున్న మాస్కోకు మేము వెళ్లలేం.

కానీ, పుతిన్‌కి ముందున్న రష్యాను మేము ఇష్టపడుతున్నాం. యుక్రెయిన్ యుద్ధం తర్వాత మారియపోల్, క్రిమియాలను చూసేందుకు వెళ్లినప్పుడు, వాటిని ఇక రష్యా తన నియంత్రణలోకి తీసుకోలేదని అర్థమైంది.

ఇవి కూడా చదవండి: