యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా వ్యూహాలు మారుస్తోందా... బెలూన్లతో యుక్రెయిన్ సైన్యాన్ని తికమకపెడుతోందా

యుక్రెయిన్‌పైకి వచ్చిన బెలూన్

ఫొటో సోర్స్, TELEGRAM

    • రచయిత, పౌల్ కిర్బీ, క్రిష్ పార్‌ట్రిడ్జ్
    • హోదా, బీబీసీ న్యూస్

యుక్రెయిన్ రాజధాని కీయెవ్ మీదకు గురువారం 36 క్రూయిజ్ క్షిపణులను రష్యా ప్రయోగించినట్లు ఆ దేశానికి చెందిన సైన్యం తెలిపింది.

అంతకు ముందు రోజే ఆరు రిఫ్లెక్టింగ్ బలూన్స్‌ను గుర్తించినట్లు యుక్రెయిన్ సైన్యం వెల్లడించింది.

భూ ఉపరితలం, సముద్రం పైనుంచి ప్రయోగించిన ఈ క్షిపణుల దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు.

కీయెవ్ మీదకు వచ్చిన ఆ బెలూన్లను చూస్తే తన యుద్ధ వ్యూహాలను రష్యా మారుస్తున్నట్లుగా కనిపిస్తోందని యుక్రెయిన్ అంటోంది.

తమ భూభాగంపైకి వచ్చిన చాలా వరకు బెలూన్లను తాము కూల్చేశామని యుక్రెయిన్ సైన్యం తెలిపింది.

అధునాతన డిజైన్, రాడార్‌ రిఫ్లెక్టింగ్, వజ్రం ఆకారంలో ఉండే బెలూన్లు కీయెవ్ మీదకు ఒక లైన్‌గా వచ్చినట్టు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోలను చూస్తే తెలుస్తుంది.

ఇటీవల కాలంలో నిప్రోపెట్రోస్క్‌లోని తూర్పు ప్రాంతంలో రిఫ్లెక్టర్లతో ఉన్న ఈ బెలూన్లను గుర్తించినట్టు యుక్రెయిన్ తెలిపింది.

రాడార్ రిఫ్లెక్టర్లను, గూఢచర్య పరికరాలను ఈ బెలూన్లు పట్టుకుని వచ్చుంటాయని ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి యురి ఐహ్నాత్ చెప్పారు. ఈ బెలూన్లు తమ రక్షణ స్థావరాలను గుర్తించి, ధ్వంసం చేసేందుకు ప్రయోగించారని అన్నారు.

ఈ రకమైన బెలూన్లు ఇటీవల అమెరికా, యుక్రెయిన్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ వారం ప్రారంభంలో సుమారు 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక బెలూన్‌ను గుర్తించడంతో రొమానియా తన యుద్ధ విమానాలను వెంటనే రంగంలోకి దించింది. అనుమానాస్పద వస్తువు కనిపించడంతో మాల్దోవా కూడా తన ఎయిర్‌ స్పేస్‌ను మూసివేసింది.

యుక్రెయిన్‌ మీద రష్యా యుద్ధానికి దిగి ఇప్పటికి ఏడాది అవుతోన్న సందర్భంగా రష్యా తన క్రూయిజ్ క్షిపణులకు, ఇరానియన్ డ్రోన్లను రంగంలోకి దించుతోంది.

ఈ బెలూన్లు రాడార్ సిస్టమ్‌లను తికమక పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉండి, ఖరీదైన క్షిపణులను(సామ్‌లను) ప్రయోగించేలా యుక్రెయిన్ మిలిటరీని తప్పుదోవ పట్టిస్తాయి.

బెలూన్ల పరిణామం, వేగం గురించి తెలిపిన ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి, యుక్రెనియన్ రాడార్ ఆ వస్తువులను సరిగ్గా గుర్తించి, తమ క్షిపణులు దుర్వినియోగం కాకుండా బుల్లెట్ల ద్వారా రెండుసార్లు వాటిని కింద పడేసినట్టు తెలిపారు.

ఈ బెలూన్లు శత్రువులకు వల వేసే లాగా పనిచేస్తున్నాయి. రష్యన్ విమానాలను, భూఉపరితలం నుంచి రాడార్లను వాడుతూ ఉపయోగించే క్షిపణులను గుర్తించేందుకు యుక్రెయిన్ నిత్యం తన ఆకాశాన్ని తనిఖీ చేస్తూ ఉంది. ఈ సమయంలోనే వీటిని గుర్తించింది.

యుక్రెయిన్‌పైకి వచ్చిన బెలూన్

ఫొటో సోర్స్, UKRAINIAN MILITARY

సైన్యాన్ని బెలూన్లు తప్పుదారి పట్టించి తద్వారా... రష్యా ఫైటర్లు, బాంబర్లు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్ల ఎలాంటి ఆటంకం లేకుండా యుక్రెయిన్‌ మీద దాడి చేసేందుకు వీలు కల్పిస్తాయని చెబుతున్నారు.

దాడుల నుంచి కెర్చ్ వంతెనను కాపాడుకునేందుకు రష్యా ఇదే రకమైన వ్యూహాన్ని అనుసరించిందని రష్యా మిలిటరీ నిపుణుడు అడ్రెయి క్లించ్‌సెవిచ్ చెప్పారు.

రక్షణ దళాలను తికమక పెట్టేందుకు గత యుద్ధాలలో కూడా అధునాతన పరికరాలను వాడారు.

1982లో బెకా వ్యాలీలో సిరియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ వీటిని వాడింది. 1991లో గల్ఫ్ యుద్ధం సందర్భంగా ఇరాక్‌లో అమెరికా చేపట్టిన ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్‌ ప్రారంభంలో అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ అధునాతన పరికరాలను ఉపయోగించింది. నాసామ్స్, ఐరిస్-టీ, పాట్రియట్ వంటి అధునాతన సామ్ సిస్టమ్‌లను యుక్రెయిన్‌కి పంపింది.

ఈ బెలూన్లను నిఘా కోసం పంపి ఉంటారని, వీటిపై లోతైన విచారణ చేపట్టాల్సి ఉందని యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి చెప్పారు.

వీడియో క్యాప్షన్, పేలుడు తర్వాత రాత్రంతా ఉండి బాధితులకు వైద్యం అందించిన డాక్టర్ సారా
బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)