ఉత్తరప్రదేశ్: బుల్డోజర్‌తో ఇంటిని కూల్చేందుకు ప్రయత్నం... మంటల్లో కాలిపోయిన తల్లి, కూతురు... అసలు ఏం జరిగింది

కాన్పుర్

ఫొటో సోర్స్, NEETU SINGH

ఫొటో క్యాప్షన్, తల్లితో శాలినీ
    • రచయిత, నీతూ సింగ్
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో మడౌలీ అనే గ్రామం ఉంది.

ఇక్కడ ఒక ఇంట్లో పెద్దకుమారుడి పెళ్లి రోజు కావడంతో ప్రత్యేక పూజలు చేసేందుకు అతడి సోదరి, తల్లి పనుల్లో తలమునకలై ఉన్నారు. అయితే, ఊహించనిరీతిలో తల్లీకూతురు అదే రోజు మరణించారు.

బుల్డోజర్‌తో అక్రమ నిర్మాణం కూల్చేవేసే సమయంలో తల్లీకూతురు తమకు తాము నిప్పు పెట్టుకున్నారని పోలీసులు అధికారులు చెబుతున్నారు. అయితే పోలీసులు, అధికారులే ఆ ఇంటికి నిప్పు పెట్టారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

శవపరీక్షల అనంతరం ఫిబ్రవరి 14న మడౌలీ గ్రామానికి తల్లి, కుమార్తెల మృతదేహాలను తీసుకొచ్చారు. రాత్రిమొత్తం ఇక్కడ కుటుంబ సభ్యుల ఏడుపులు వినిపించాయి.

కాన్పుర్

ఫొటో సోర్స్, NEETU SINGH

ఫిబ్రవరి 13న అసలేం జరిగింది?

కాన్పుర్ జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలోని మడౌలీ గ్రామంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు సోమవారం (ఫిబ్రవరి 13న) మధ్యాహ్నం మూడు గంటలకు అధికారులు, పోలీసులు చేరుకున్నారు. వీరు కృష్ణ గోపాల్ దీక్షిత్ ఇంటిని కూలగొట్టేందుకు ప్రయత్నించారు.

అయితే, కృష్ణ గోపాల్ దీక్షిత్ కుటుంబం తీవ్రంగా దాన్ని వ్యతిరేకించింది. ఈ వివాదం ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఇప్పుడు కూల్చేయడానికి వీల్లేదని వారు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అయితే, రెండు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది.

ఈ వివాదం ఏ స్థాయికి వెళ్లిందంటే ఇంట్లో మంటల్లో కాలిపోతున్న తల్లి, కూమార్తెల అరుపులు కూడా బయట ఎవరికీ వినిపించలేదు. కొన్ని నిమిషాల్లోనే వారిద్దరూ మంటల్లో తీవ్రగాయాలై మరణించారు.

ఇక్కడ జరిగిన పరిణామాలపై జనవరి 14న ఎస్‌డీఎంకు స్థానిక అధికారి అశోక్ చౌహాన్ లేఖ రాశారు.

కాన్పుర్‌లోని సర్వే నంబరు 1642లో 0.657 ఎకరాల భూమి గ్రామ సభకు సంబంధించిన ఆస్తి అని, అయితే, దీన్ని కృష్ణ గోపాల్ దీక్షిత్ ఆక్రమించాలని చూశారని, అందుకే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించామని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. కృష్ణ గోపాల్ కుమారుడు శివమ్‌తో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్‌ కూడా ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను శాంతిపచేసే ప్రయత్నం చేశారు.

‘‘ఇలా జరగడం శోచనీయం. ఘటన గురించి తెలిసిన వెంటనే, పరిస్థితులను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే సెక్షన్ 302 కింద ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదుచేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’అని బ్రిజేశ్ పాఠక్ హామీ ఇచ్చారు.

కాన్పుర్

ఫొటో సోర్స్, NEETU SINGH

పరిస్థితి ఎలా ఉంది?

ఘటనా స్థలంలో కాలి బూడిదైన వస్తువులతోపాటు గ్యాస్ సిలెండర్, కొన్ని పాత్రలు కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న చెట్టుకు రెండు ఆవులు, రెండు దూడలు కట్టేసి ఉన్నాయి. పక్కనే పూజ చేసేందుకు తెచ్చిన ఒక విగ్రహం కనిపిస్తోంది. శివమ్ పెళ్లి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ కీర్తనలు ఏర్పాటుచేయాలని భావించారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఇంట్లో శివమ్‌కు పెళ్లి జరిగింది.

సాయంత్రం ఇక్కడ కొందరు పోలీస్ కానిస్టేబుల్స్, కొందరు మీడియా ప్రతినిధులు కనిపించారు. రాత్రి అయ్యేసరికి ఇక్కడకు వచ్చే వాహనాల సంఖ్య కూడా నెమ్మదిగా తగ్గింది.

ఇక్కడకు దాదాపు ఒక కి.మీ. దూరంలోని బాధిత కుటుంబానికి పక్కా ఇల్లు ఉంది. అక్కడే ఆ కుటుంబ సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో ఎక్కువగా పశువులను కట్టేసేందుకు ఉపయోగిస్తుంటారు.

కాన్పుర్

ఫొటో సోర్స్, NEETU SINGH

ఫొటో క్యాప్షన్, లఖన్‌లాల్ కుశ్వాహా

పోలీసులు ఏం అంటున్నారు?

ఈ ఘటనపై కాన్పుర్ ఎస్పీ బాల్ గంగాధర్ తిలక్ సంతోష్ మూర్తి బీబీసీతో మాట్లాడారు. ‘‘అసలు వారిద్దరూ ఎలా చనిపోయారనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది. కేసు విచారణలో ఉంది. వెంటనే స్పందించుంటే పరిస్థితులు ఇంతవరకు వచ్చేండేవి కాదు’’ అని అన్నారు.

మొత్తంగా ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్‌లో పేర్లు నమోదుచేశారు. జేసీబీ డ్రైవర్‌తోపాటు అకౌంటెంట్‌ను కూడా అరెస్టు చేశారు.

అసలు ఎవరి ఆదేశాలపై ఈ ఇంటిని కూలగొట్టేందుకు వెళ్లారు?

ఈ ప్రశ్నపై ఎస్పీ మాట్లాడుతూ... ‘‘ఆ విషయం గురించి నాకు తెలియదు. నిజానికి నెల రోజుల క్రితమే ఆ ఇంట్లో ఒక గదిని కూలదోశారు. అప్పుడే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని వారికి సూచించాం. నేను ఇక్కడకు నెల రోజుల క్రితమే బదిలీపై వచ్చాను. ఈ కేసు గురించి నాకు పెద్దగా సమాచారం లేదు’’ అని ఆయన చెప్పారు.

మరోవైపు జిల్లా మేజిస్ట్రేట్ నేహా జైన్ మాట్లాడుతూ.. ‘‘బాధిత కుటుంబానికి నేను సంఘీభావం తెలియజేస్తున్నాను. అయితే, గ్రామసభ స్థలాన్ని కొందరు ఆక్రమించిన మాట వాస్తవమే. దీనిపై మాకు ఫిర్యాదులు అందాయి. దీంతో నెల రోజుల క్రితమే చర్యలు మొదలుపెట్టారు’’ అని జైన్ చెప్పారు.

కాన్పుర్

ఫొటో సోర్స్, NEETU SINGH

గ్రామస్థులు ఏం చెబుతున్నారు?

ఘటనపై ఒక గ్రామస్థుడు బీబీసీతో మాట్లాడారు. ‘‘తల్లి, కుమార్తె వారికి వారే నిప్పు పెట్టుకున్నారని పోలీసులు, అధికారులు చెప్పినదే నిజమని అనుకుందాం. మరి ఎందుకు అసలు వారిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఇల్లును కూలగొడుతున్న సమయంలోనే ఆ ప్రమాదం జరిగింది. అక్కడ అంతమంది అధికారులున్నా ఎందుకు ఏమీ చేయలేదు? ఇవి హత్యలు.. వీటిని కప్పి పుచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు.

మరోవైపు అక్కడకు వచ్చిన అధికారుల్లో కొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వారిపై జిల్లా పరిపాలనా విభాగం చర్యలు కూడా తీసుకుందని వారు ఆరోపించారు.

ఘటన జరిగిన ప్రాంతంలో బాధితుల ఇంటి పరిసరాల్లో ఒక గుడిసెను గత డిసెంబరులోనే నిర్మించినట్లు స్థానికులు బీబీసీకి తెలిపారు. అక్కడ 20కిపైగా మేకలను కట్టేవారని వివరించారు.

గడ్డి, ప్లాస్టిక్ షీట్లతో చేసిన ఈ గుడిసెలోనే 50ఏళ్ల కృష్ణ గోపాల్ దీక్షిత్, ఆయన 30 ఏళ్ల కుమారుడు రాత్రిపూట పడుకునేవారు. తల్లి, కుమార్తెలు గ్రామంలోని తమ ఇంట్లో వంటచేసి రోజూ ఉదయం, సాయంత్రం ఇక్కడకు తీసుకొచ్చేవారు.

కాన్పుర్

ఫొటో సోర్స్, NEETU SINGH

బాధిత కుటుంబం ఏం చెబుతోంది?

శివమ్ భార్య 21 ఏళ్ల శాలినీ దీక్షిత్ ఆ ఇంటి పరిసరాల్లో నాలుగు నెలల పాపను ఎత్తుకుని కనిపించారు. ఆమె ఇంటికి పెద్ద కోడలు.

‘‘వారు మా ఇంటిని బుల్డోజర్లతో కూలగొట్టాలని భావిస్తే, మేమే సహకరించేవాళ్లం. అసలు మా అత్తయ్య, మరదలిని ఎందుకు మంటల్లో బూడిద చేశారు. అక్కడ చాలా మంది అధికారులు ఉన్నారు. కానీ, ఎవరూ వారిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. అసలు కాలిపోతున్నా పట్టించుకోకుండా బుల్డోజరుతో ఇల్లును కూలగొట్టేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వారు ఏం చేసినా చనిపోయినా మా అత్తయ్య, మరదలను వెనక్కి తీసుకురాలేరు’’ అని ఆమె అన్నారు.

‘‘ఘటన స్థలంలో చాలా మంది పోలీసులు ఉన్నారు. కానీ, ఏమీ చేయలేదు. ఇప్పుడు వారు ఇక్కడకు వచ్చి ఏం ప్రయోజనం?’’ అని ఆమె ప్రశ్నించారు.

గత నెలలో జరిగిన పరిణామాలపై శాలినీ మాట్లాడుతూ.. ‘‘నా నగలను అమ్మి ఇక్కడ డిసెంబరులో ఒక గదిని కట్టాం. కొన్ని మేకలను కూడా కొన్నాం. ఇప్పుడు ఆ గదిని వీరు కూలగొట్టేశారు. అసలు ముందుగా మాకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. ప్రమాదంలో మా అత్తయ్య, మరదలితోపాటు 22 మేకలు కూడా చనిపోయాయి’’ అని ఆమె చెప్పారు.

ప్రమాదంలో మరణించిన వారిలో ఒకరైన నెహాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇటీవల ఆమె డిగ్రీ పూర్తిచేశారు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఆమెకు పెళ్లి చేయాలని భావించారు.

నేహా అమ్మమ్మ 65 ఏళ్ల సరోజ్ దూబే మాట్లాడుతూ.. ‘‘అనవసరంగా నా కుమార్తెను, మనవరాలిని పొట్టనపెట్టుకున్నారు. పోలీసులు మమ్మల్ని కాపాడాలి. కానీ, వారే మా ఇంటిని కూలదోశారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

కాన్పుర్

ఫొటో సోర్స్, NEETU SINGH

నిందితులు ఎవరు?

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అశోక్ దీక్షిత్ పేరును చేర్చారు. బాధిత కుటుంబానికి ఎదురుగా రెండంతస్తుల ఇంటిలో ఆయన జీవిస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు సైన్యంలో పనిచేస్తున్నారు.

వివాదంపై కృష్ణ గోపాల్ దీక్షిత్ అక్క మంజు తివారీ మాట్లాడుతూ.. ‘‘అశోక్‌ కూడా మాకు బంధువే అవుతారు. మా ఇంట్లో ఆయన భోజనం కూడా చేసేవారు. కానీ, కొన్ని నెలల క్రితం భూవివాదం వచ్చింది. అప్పటి నుంచి మాట్లాడుకోవడం మానేశాం. ఆయనే మాపై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేశారు’’ అని ఆమె చెప్పారు.

అశోక్ దీక్షిత్ కుటుంబాన్ని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన ఇంటికి తాళం వేసి ఉంది. ఆ కుటుంబం ఎక్కడుందో తమకు తెలియదని గ్రామస్థులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ హిందువులకు భారత్ శుభవార్త

పోలీసులపైనే ఎక్కువ ఆగ్రహం

ప్రధాన నిందితుడు అశోక్ దీక్షిత్‌పై కంటే అకౌంటెంట్, పోలీసులపైనే బాధితులు, గ్రామస్థులు ఎక్కువ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

‘‘ఆ తల్లీకూతురు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 1.30కి భోజనం తీసుకెళ్లడం నేను చూశాను. 3.30కి ఈ ఘటన జరిగింది. ఇది చాలా బాధాకరమైన ఘటన. నిజంగా పంచాయతీ భూమిని వారు ఆక్రమించుంటే పిలిచి మాట్లాడితే సరిపోయేది’’ అని పరిసరాల్లో దుకాణం నడుపుతున్న లఖ్‌నలాల్ కుశ్వాహా చెప్పారు.

ఘటనపై గ్రామంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, అధికారుల ముందే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే తాము సాయం కోసం ఎవరిని ఆశ్రయించాలని వారు ప్రశ్నిస్తున్నారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)