భారతీయులు కొందరు ఎన్నో కష్టాలు పడుతూ అక్రమంగా అమెరికాకు ఎందుకు వలసపోతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్నార్డ్ డెబుష్మాన్ జూనియర్
- హోదా, బీబీసీ న్యూస్
జష్ణ్ ప్రీత్ సింగ్ స్వలింగ సంపర్కులు కావడంతో పంజాబ్ లో ఉన్న సంప్రదాయ వాతావరణంలో బతకడం చాలా కష్టంగా మారింది.
34 ఏళ్ల సింగ్ జలంధర్‌లో ఉన్నప్పుడు ప్రతి రోజు వివక్షకు గురవుతూ ఉండేవారు. పొరుగువారు ఆయనపై చేయి చేసుకుంటూ ఉండేవారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆయనకు మద్దతు దొరకలేదు. కానీ, గత ఏడాది ఆయనతో ఒక దారుణమైన సంఘటన జరిగింది.
సింగ్‌ను 15 - 20 మంది కలిపి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. "నన్ను నేను కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగు పెట్టాను. కానీ, వాళ్ళు నన్ను గాయపరిచారు" అని చెప్పారు.
ఈ దాడిలో సింగ్ చేతిని కోల్పోయారు. ఆయన బొటన వేలికి గాయమైంది. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయిన తర్వాత ఆయన తుర్కియే, ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించి అమెరికాలోని కాలిఫోర్నియా చేరుకున్నారు.
ఆయన సుమారు 12,800 కిలోమీటర్లు ప్రయాణించి మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టారు.
ఇలా చేసినవారు ఈయనొక్కరే కాదు. భారత్ నుంచి కొన్నేళ్లుగా అమెరికాకు వలస వెళుతున్నవారు ఉన్నారు. ఇలా వెళుతున్న వారి సంఖ్య స్థిరంగా ఉంది.
ప్రతీ నెల కొన్ని డజన్ల నుంచి వందల మంది అమెరికాకు వలస వెళుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇందుకు కారణాలేంటి?
ఈ ఏడాది భారత్ నుంచి వలస వెళ్లేవారి సంఖ్య పెరిగింది. అక్టోబరు 2021 నుంచి సెప్టెంబరు 2022 వరకు మెక్సికో సరిహద్దు దగ్గర 16,290 మంది భారతీయులను అమెరికన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
2018లో అమెరికాలో అడుగు పెట్టేందుకు 8,997 మంది ప్రయత్నించినట్లు అధికారికంగా నమోదైంది.
భారతీయులు అమెరికాకు వలస వచ్చేందుకు చాలా కారణాలున్నాయని నిపుణులు అంటారు. భారతదేశంలో పెరుగుతున్న వివక్ష, మహమ్మారి తర్వాత సడలించిన నిబంధనలు వలస వచ్చేవారి సంఖ్య పెరగడానికి ఒక కారణం. అమెరికన్ ప్రభుత్వం శరణార్థులను దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి కల్పిస్తోందని భావిస్తారు. అక్రమ రవాణా నెట్‌వర్క్‌లు కూడా తమ కార్యకలాపాలను మహమ్మారి తర్వాత తిరిగి మొదలుపెట్టడం మరొక కారణం.
కొంత మంది అక్రమ వలసదారులు ఆర్ధిక కారణాలతో అమెరికా వస్తారని, మరి కొందరు దేశంలో అణచివేత ఎక్కువవడంతో వలస వస్తారని టెక్సస్, కాలిఫోర్నియాలో భారతీయుల తరుపున పోరాడిన దీపక్ ఆహ్లువాలియా అభిప్రాయపడ్డారు.
దేశంలో అణచివేతకు గురవుతున్న వారిలో ముస్లింలు, క్రైస్తవులు, హిందూ మతంలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు, స్వలింగ సంపర్కులు ఎక్కువగా ఉన్నారు. వీరి పై హింస చోటు చేసుకునే ముప్పు ఎక్కువగా పొంచి ఉంది. ఇందులో కొంత మంది పంజాబ్‌లో వేర్పాటువాద ఉద్యమంతో సంబంధం ఉన్నవారు లేదా 2020లో జరిగిన నిరసనలకు భయపడినవారు ఉన్నారు.
ఈ సమాజాల్లో పరిస్థితి దారుణంగా మారుతోందని అంతర్జాతీయ సమాజం కూడా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కఠినమైన నిర్ణయం
దేశం వదిలి పెట్టి రావాలని తీసుకున్న నిర్ణయం అంత సులభమైనది కాదని సింగ్ అన్నారు. దేశంలో వేరే నగరానికి వెళ్లాలంటేనే భయంగా ఉండేదని చెప్పారు.
"దేశంలో స్వలింగ సంపర్కులకు అనుకూలమైన వాతావరణం లేదు. 2018లో స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని సుప్రీం కోర్టు ప్రకటించింది. కానీ, సమాజంలో మాత్రం దానిని చట్ట వ్యతిరేకంగానే చూస్తారు" అని అన్నారు.
ఆయన సోదరుడు ఒక ట్రావెల్ సంస్థ గురించి చెప్పారు. ఇదంతా క్లిష్టమైన, ఖరీదైన అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో భాగం. వాళ్ళు ఆయనను ముందు తుర్కియే తీసుకుని వెళ్లారు. అక్కడ కూడా జీవితం దుర్భరంగా తయారయింది. అక్కడి నుంచి ఆయన ఫ్రాన్స్ చేరుకున్నారు. కానీ, అక్కడ ఆయనకు పని దొరకలేదు. ఈ మొత్తం ప్రయాణానికి 6 నెలలు పట్టింది. కొన్ని రోజుల తర్వాత అమెరికా వెళుతున్న ఒక ట్రావెల్ ఏజెంట్ వారిని కలిశారు. ఆ గ్రూపులో చాలా మంది కుటుంబాలతో కలిసి వెళుతున్నట్లు సింగ్ చెప్పారు.
"ఆయన చాలా డబ్బు తీసుకున్నారు. ఫ్రాన్స్ నుంచి ఆయన కైన్కున్ తీసుకొచ్చి అక్కడి నుంచి మెక్సికోకు తీసుకొచ్చారు" అని సింగ్ చెప్పారు.
కష్టమైన ప్రయాణం
"జీవితం మెరుగుపడేందుకు అమెరికా ద్వారాలు తెరుస్తుందని సింగ్ లాంటి చాలా మంది భావిస్తారు" అని అహ్లు వాలియా చెప్పారు.
కానీ, ఇంత దూరం ప్రయాణించడం చాలా కష్టమైన పని. సాధారణంగా అమెరికా-మెక్సికో సరిహద్దు దాటేందుకు స్మగ్లింగ్ నెట్‌వర్క్ సహాయాన్ని తీసుకుంటారు.
ఈ ప్రయాణం భారతదేశం నుంచి దక్షిణ అమెరికా వైపు మొదలవుతుంది. వీరంతా చిన్న చిన్న సమూహాలుగా ప్రయాణం చేస్తారు. ఒకే భాష మాట్లాడేవారంతా ఒక గ్రూపులో ఉంటారు. దారంతా వారికి మార్గదర్శకత్వం వహించేందుకు ఒక వ్యక్తి ఉంటారు.
ఈ నెట్‌వర్క్ భారతదేశంలో ఉండే ట్రావెల్ ఏజెంట్లతో మొదలవుతుంది. ఇది చివరకు లాటిన్ అమెరికాలో ఉండే నేరస్థ ముఠాల చేతుల్లోకి చేరుతుంది.
అమెరికాలో స్థిరపడిన భారతీయులు తమ బంధువులను, స్నేహితులను ఇక్కడకు రమ్మని చెబుతూ ఉండటంతో కూడా వలస వచ్చేవారి సంఖ్య పెరుగుతోందని వాషింగ్టన్ మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్‌కు చెందిన జెసికా బోల్టర్ చెప్పారు.
"వలస వచ్చేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. స్వదేశం విడిచి పెట్టి రావాలని అనుకున్నప్పుడు వలస వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది" అని అన్నారు.
పంజాబ్ కు చెందిన 20 ఏళ్ల మన్ ప్రీత్ బీబీసీతో మాట్లాడారు. ఆమె అసలు పేరును మార్చాం. ఆమెకున్న రాజకీయ సిద్ధాంతాల వల్ల పాలక పార్టీని విమర్శించడంతో వేధింపులకు గురైనట్లు చెప్పారు. దీంతో, దేశం వదిలి పెట్టి వెళ్లాల్సి వచ్చినట్లు చెప్పారు.
"నేను ఈక్వడార్ నుంచి బస్సు తీసుకుని కొలొంబియా వెళ్లాను. అక్కడి నుంచి పనామా వెళ్లాను.
"అక్కడి నుంచి పడవ పై నికరాగ్వా వెళ్లాను. అక్కడి నుంచి గ్వాటెమాల మీదుగా మెక్సికో చేరుకున్నాను. అక్కడి నుంచి అమెరికాలో ప్రవేశించాను" అని చెప్పారు.
ఈ ప్రయాణంలో వీరికి ఒక స్మగ్లర్ మార్గదర్శకత్వం చేస్తూ ఉంటారు. కానీ, ఈ ప్రయాణంలో చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి.స్థానిక ముఠాలు, అవినీతిపరులైన అధికారులు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే అవకాశముంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. గాయాలు అవ్వొచ్చు. రోగాల బారిన పడొచ్చు.
2019లో ఆరేళ్ళ పంజాబీ అమ్మాయి అరిజోనా ఎడారిలో మరణించినప్పుడు ఈ ప్రయాణంలో పొంచి ఉన్న ముప్పులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం భారతదేశంలో కూడా వార్తాశీర్షికలను ఆక్రమించింది. అక్కడున్న 42 డిగ్రీల ఉష్ణోగ్రత తట్టుకోలేక ఆ చిన్నారి మరణించినట్లు తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
అనిశ్చితితో కూడిన కొత్త ప్రారంభం
అమెరికా చేరుకున్న తర్వాత, సింగ్ లాంటి వలసదారులు దేశంలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే, ఈ ప్రక్రియ ఒక ఇంటర్వ్యూ తో మొదలవుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఆయనను వేధింపులకు గురి చేయడం వల్ల దేశం వదిలిపెట్టాల్సి వచ్చిందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
"ఈ ఇంటర్వ్యూలో మొదటి దశను దాటడం చాలా ముఖ్యం. మీకు ఎటువంటి భయం లేదని అధికారి భావిస్తే, మీ కేసు ఎప్పటికీ ముందుకు కదలదు" అని అహ్లువాలియా అన్నారు.
"కానీ, మీ భయం సరైందే అని అధికారి నమ్మితే, దరఖాస్తు ఇమ్మిగ్రేషన్ అధికారి దగ్గరకు వెళుతుంది. ఇదంతా చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. దీనికి కొన్నేళ్లు కూడా పడుతుంది. ఇన్నాళ్లు ఎదురు చూసిన తర్వాత సానుకూల ఫలితం లభిస్తుందని చెప్పలేం" అని అన్నారు.
సింగ్ జూన్ చివరి నుంచి అమెరికాలో ఉన్నారు. ఆయన లాయర్ ఫీజు చెల్లించేందుకు డబ్బులు కూడబెడుతున్నారు.
ఆయన అమెరికాలో ఎక్కువ కాలం ఉంటారనే నమ్మకం లేదు. కానీ, ఆయనకున్న ఇతర అవకాశాల కంటే అమెరికాలో ఉండటమే ఉత్తమం అని భావిస్తున్నారు.
"నాకు ప్రాణ భయం ఉండేది. కానీ, అమెరికా వచ్చిన తర్వాత నాకెటువంటి భయం కలగలేదు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- కొల్హాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- హీరోయిన్, రొమాన్స్, సాంగ్స్ లేని చిరంజీవి సినిమా ఎలా ఉంది?
- పొన్నియన్ సెల్వన్ 1: మణిరత్నం కలల సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడానికి కారణాలేంటి?
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












