ఇండియా జీ20: విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం మీద యుక్రెయిన్ యుద్ధ ప్రభావం..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వికాస్ పాండే, లీలా నాథూ
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
యుక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధం వల్ల కలుగుతున్న ఉద్రిక్తతలు దిల్లీలో జరిగిన జీ20 చర్చలలో కనిపించాయి.
యుక్రెయిన్, రష్యా విషయంలో తమతమ అభిప్రాయాలను పక్కనపెట్టి ఈ చర్చలలో పాలుపంచుకోవాలని జీ20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులకు భారత ప్రధాని విజ్ఞప్తి చేసినప్పటికీ స్పష్టమైన విభజన కనిపించింది.
అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ ‘రష్యా అన్యాయంగా చేస్తున్న యుద్ధం’ వల్ల ఈ సమావేశం దెబ్బతింది అన్నారు. మరోవైపు రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ యుక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతి ఒప్పందాలను పశ్చిమ దేశాలు సమాధి చేశాయని ఆరోపించారు.
అంతకుముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్ధమాన దేశాలనుద్దేశించి మాట్లాడారు.
ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో 85 శాతం వాటా జీ20 కూటమి దేశాలదే. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు ఈ జీ20 దేశాలలోనే ఉంది. ప్రపంచంలోని 19 సంపన్న దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్‌కూ ఈ కూటమిలో సభ్యత్వం ఉంది.
ఈ జీ20 ఇంటర్‌గవర్నమెంటల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అమెరికా, రష్యా, చైనా విదేశీ వ్యవహారాల మంత్రులు బ్లింకెన్, లావ్రోవ్, క్విన్ గాంగ్ సహా ఇతర సభ్య దేశాల విదేశాంగ మంత్రులు దిల్లీ వచ్చారు.
భారత్‌కు చెందిన మాజీ దౌత్యవేత్త ఒకరు బీబీసీతో మాట్లాడుతూ యుద్ధం విషయంలో మంత్రులు తమ విభేదాలు పక్కనపెట్టేలా భారత్ ఏదైనా చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
‘ప్రపంచంలో విభజన అనేది చాలా తీవ్రంగా ఉన్న వేళ ఇక్కడ సమావేశమవుతున్నాం’ అన్న మోదీ ప్రతినిధులంతా ఉమ్మడి ప్రయోజనాలపై దృష్టి సారించాలని కోరారు.
ఏళ్లుగా సాగిస్తున్న పురోగతి తరువాత ఇప్పుడు మళ్లీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల వైపు తిరగాల్సిన ప్రమాదం ఉంది. అనేక వర్ధమాన దేశాలు ఆహార, ఇంధన భద్రత కోసం అప్పులతో పోరాడుతున్నాయి’ అన్నారు మోదీ.
‘సంపన్న దేశాల కారణంగా ఏర్పడిన భూతాప ప్రభావానికి అలాంటి వర్థమాన దేశాలు లోనవుతున్నాయి. అందుకే గ్లోబల్ సౌత్ దేశాల(లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఓసియేనియా) స్వరం వినిపించేందుకు జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ ప్రయత్నిస్తుంది’ అన్నారు మోదీ.
మోదీ ఈ సమావేశంలో ఇంగ్లిష్‌లో మాట్లాడారు. తన సందేశాన్ని అందరూ స్వీకరించాలని ఆయన ఎంతో బలంగా అనుకుంటున్నారనడానికి ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఉదాహరణ. యుక్రెయిన్ గురించి మోదీ నేరుగా ప్రస్తావించనప్పటికీ జియోపొలిటికల్ టెన్షన్స్ ప్రభావం ఈ చర్చలపై ఉంటుందని మాత్రం అంగీకరించారు.
‘వన్ ఎర్త్, ఒన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ అనేది జీ20కి భారత్ నినాదం. ఇది అందరూ మనసులో పెట్టుకుని అందరినీ ఏకం చేసే అంశాలపై దృష్టి పెట్టాలని మోదీ ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులను కోరారు.
గురువారం నాటి సమావేశాల షెడ్యూల్‌లో ఆహార భద్రత, సహకార అభివృద్ధి, ఉగ్రవాదం, మానవతా సాయం వంటి అంశాలున్నాయి. జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ప్రాధాన్యాలను ఇవి సూచిస్తున్నాయి.
భిన్నాభిప్రాయాలు ఎక్కువగా ఉండే అంశాలలో మధ్యవర్తిత్వం వహించాలని, రాజకీయంగా పెద్దగా వివాదం కాని అంశాలపై ఏకాభిప్రాయం విషయంలో పురోగతి సాధించాలని భారత్ ఆశిస్తోంది. అయితే, ఈ సమావేశాల తరువాత మీడియా సమావేశాలు ఏర్పాటుచేయాలని రష్యా, అమెరికాలు భావిస్తున్నాయి. యుక్రెయిన్ విషయంలో విభేదాల ముద్ర శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది.
గతవారం బెంగళూరులో నిర్వహించిన సమావేశం ముగింపు ప్రకటనపై జీ20 ఆర్థిక మంత్రులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో సమావేశాల సారాంశాన్ని విడుదల చేసే బాధ్యత అధ్యక్ష స్థానంలోని భారత్‌కే వదిలపెట్టారు. ఇప్పుడు విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశంలోనూ ఇలాంటి అడ్డంకులు ఎదురయ్యే సూచనలున్నాయి.
వర్ధమాన ప్రపంచానికి సాయపడేలా, వర్ధమాన దేశాల ప్రపంచ ఆశయాలకు శక్తినిచ్చేలాంటి ఒప్పందాలను అందించాలని భారత్ కోరుకుంటోందని గురువారం ఈ సమావేశాల ప్రారంభ సమయంలో మోదీ తన ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు.
యుక్రెయిన్, రష్యా యుద్ధం రెండో ఏడాది కొనసాగుతున్న ఈ సమయంలో తన అలీన విధానాన్ని బ్యాలన్స్ చేసుకోవడం భారత్‌కు అత్యంత సున్నితమైన వ్యవహారమని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters

భారత్ తనకు అతి పెద్ద ఆయుధ సరఫరా దేశమైన రష్యాను ఈ యుద్ధం విషయంలో విమర్శించకుండా ఒత్తిళ్లను దాటుకుని తన వ్యూహాన్ని కొనసాగించింది.
గత వారం ఐరాస సర్వసభ్య సమావేశంలో జరిగిన ఓటింగ్ సహా యుక్రెయిన్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా ఐరాస తీర్మానాలన్నిటికీ భారత్ దూరంగా ఉంటూ వస్తోంది.
రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతులు పెంచుకోవాలన్న తన నిర్ణయాన్నీ భారత్ సమర్థించుకుంటోంది.
అయితే, యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాలు, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం ఇవ్వడం వంటి విషయాలను భారత్ మాట్లాడింది.
ఇంతకుముందు షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సందర్భంగా మోదీ చేసిన ప్రకటనలో రష్యాపై పరోక్షంగా విమర్శలు చేసినట్లు పరిగణించారు. ఆ సమ్మిట్‌లో మోదీ ‘ఇది యుద్ధాలు చేసే యుగం కాదు’ అని అన్నారు. మోదీ ఈ మాట అన్నప్పుడు పుతిన్ అక్కడే ఉన్నారు.
తాజాగా దిల్లీ సమావేశంపై ఈ యుద్ధ ప్రభావం పడకుండా మోదీ, ఆయన బృందం ప్రయత్నాలు చేసినప్పటికీ సమావేశం ప్రారంభం కావడానికి ముందే కొందరు జీ20 సభ్య దేశాల ప్రతినిధులు తమ వ్యాఖ్యల్లో యుక్రెయిన్ అంశాన్ని ప్రస్తావించారు.
‘ఈ యుద్ధాన్ని ఖండించాలి’ అని యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రత విధానాల ప్రతినిధి జోసెఫ్ బోరెల్ అన్నారని రాయిటర్స్ వార్తాఏజెన్సీ వెల్లడించింది.
భారత్ తన దౌత్య సామర్థ్యంతో ఈ యుద్ధం ముగించాల్సిన అవసరాన్ని రష్యాకు అర్థమయ్యేలా చేయాలని ఆశిస్తున్నాను అని బోరెల్ అన్నారు.
మరోవైపు చైనా, అమెరికా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించడం కూడా ఈ సమావేశాలలో ఏకాభిప్రాయ సాధనకు భారత్ చేసే ప్రయత్నాలకు కఠిన పరీక్షగా మారుతాయని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














