గుండె పోటు రాకుండా ఉండాలంటే రోజుకు ఎన్ని నిమిషాలు నడవాలి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫిలిపా రాక్స్‌బీ
- హోదా, హెల్త్ రిపోర్టర్
ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అందుకోవడానికి మీరు రన్నర్ కానీ, క్రీడాకారులు కానీ కానవసరం లేదు.
రోజుకు కొంత సమయం నడకకు కేటాయిస్తే చాలని బ్రిటన్‌లోని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది.
ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 11 నిమిషాలు నడిస్తే ప్రతి 10 అకాల మరణాలలో ఒకటి నివారించొచ్చని ఈ అధ్యయనం చెప్తోంది.
వారానికి కనీసం 150 నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేయాలన్న ఆరోగ్య సిఫార్సులను చాలామంది అనుసరించడం లేదు.
అయితే, పూర్తిగా ఎక్సర్‌సైజ్ చేయకపోవడం కంటే ఎంతోకొంత చేయడమనేది నయమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.
వారానికి 150 నుంచి 300 నిమిషాల సాధారణ శారీరక శ్రమ కానీ.. 75 నుంచి 150 నిమిషాల విపరీతమైన యాక్టివిటీ కానీ ఉంటే గుండె కొట్టుకునే రేటు పెరుగుతుందని ఎన్‌హెచ్ఎస్ చెప్తోంది.
ఎక్సర్‌సైజ్, ఆరోగ్యానికి ఉన్న సంబంధంపై గతంలో వచ్చిన కొన్ని వందల అధ్యయనాలను ఈ పరిశోధక బృందం పరిశీలించింది. అధ్యయనాలు, వైద్యులు సూచించిన కంటే సగం శారీరక శ్రమ చేసినా కూడా ప్రతి 20 కార్డియోవేస్కులర్ డిసీజెస్ కేసులలో ఒకటి.. అలాగే ప్రతి 30 క్యాన్సర్ కేసులలో ఒకటి నివారించే అవకాశం ఉంటుందని తేల్చింది.
వారానికి 75 నిమిషాలు అంటే రోజుకు 11 నిమిషాలు వేగంగా నడవడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, హైకింగ్, సైక్లింగ్, టెన్నిస్ ఆడడం వంటివి చేయడం వల్ల ఫలితం ఉంటుందని సూచించింది.
‘చలనంలో ఉండాలి. అప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకోవచ్చు. అలా అని ఊపిరి అందడం లేదని అనుకోవద్దు’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ సొరేన్ బ్రేజ్ చెప్పారు.
రోజుకు 11 నిమిషాల పాటు యాక్టివిటీ ఉంటే హృద్రోగాలను 17 శాతం, క్యాన్సర్‌ను 7 శాతం నివారించవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.
ప్రతి రోజూ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు, అధిక రక్తపోటు తగ్గుతుంది. శరీర దారుఢ్యం పెరగడంతో పాటు నిద్ర, గుండె ఆరోగ్యం దీర్ఘకాలంలో మెరుగుపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
నిత్యం ఎక్సర్‌సైజ్ చేయడమనేది కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా తలలో, మెడ, గ్యాస్ట్రిక్, లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ల నివారణలో ఎక్సర్‌సైజ్ కీలకమని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఎన్‌హెచ్ఎస్ సూచించిన మేర అందరూ ఎక్సర్‌సైజ్ చేయడంలేదు. వారానికి 150 నిమిషాల ఎక్సర్‌సైజ్ చేయలేకపోతున్నామని ప్రతి ముగ్గురిలో ఇద్దరు చెప్తున్నారు. ఇక వారానికి 300 నిమిషాల కంటే ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేసేవారు సగటున 10 మందిలో ఒక్కరు కూడా ఉండడం లేదు.
గతంలో వచ్చిన ఇలాంటి వందల అధ్యయనాలను మథించి చేసిన విశ్లేషణ ఒకటి ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసన్’లో ప్రచురితమైంది. గతంలోని ఈ అధ్యయనాలలో పాలుపంచుకున్న అందరూ వారానికి 150 నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ చేసినట్లయితే ప్రతి ఆరు మరణాల్లో ఒకటి నివారించడమయ్యేదని పేర్కొంది.
కొన్ని అలవాట్లు మార్చుకోవడం అవసరమని అధ్యయనకర్తలు అభిప్రాయపడుతున్నారు.
దుకాణాలకు వెళ్లేటప్పుడు కారులో వెళ్లకుండా నడిచో, సైకిలుపైనో వెళ్లాలని.. అలాగే పిల్లలతో ఆడడం వల్ల కూడా కొంత ఎక్సర్‌సైజ్ అవుతుందని సూచిస్తున్నారు.
కండరాలను దృఢం చేసే ఎక్సర్‌సైజ్‌లు వారానికి రెండు సార్లయినా చేయాలని ఎన్‌హెచ్ఎస్ సూచిస్తోంది.
యోగా, బరువులు ఎత్తడం, గార్డెనింగ్‌లో బరువైన పనులు చేయడం మంచిదని సూచిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















