పాకిస్తాన్‌లో మాజీ జిహాదీ కమాండర్ల వరుస హత్యలు... భారత్ నిఘా సంస్థల పనే అంటూ ఆరోపణలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అబ్దుల్ సయ్యద్
- హోదా, రిసెర్చర్, బీబీసీ కోసం
తేదీ: 2023 ఫిబ్రవరి 26, స్థలం: కరాచీ, గులిస్తాన్ జోహార్, సంఘటన: 55 ఏళ్ల ఖలీద్ రజా హత్య, నిందితుడు: మోటర్‌సైకిల్‌పై వచ్చిన అజ్ఞాత వ్యక్తి
తేదీ: 2023 ఫిబ్రవరి 20, స్థలం: రావల్పిండి, సంఘటన: 60 ఏళ్ల బషీర్ అహ్మద్ హత్య, నిందితుడు: మోటర్‌సైకిల్‌పై వచ్చిన అజ్ఞాత వ్యక్తి.
తేదీ: 2022 మార్చి, స్థానం: కరాచీ, అఖ్తర్ కాలనీ, సంఘటన: మిస్త్రీ జాహిద్ ఇబ్రహీం హత్య, నిందితుడు: మోటర్‌సైకిల్‌పై వచ్చిన అజ్ఞాత వ్యక్తి.
ఈ మూడు ఘటనల్లో స్థలం వేరు, కానీ ఘటన జరిగిన విధానం మాత్రం ఒక్కటే. టార్గెట్ కిల్లింగ్.. గుర్తు తెలియని వ్యక్తులు తమ లక్ష్యాన్ని సూటిగా గురిపెట్టి చంపడం.
పాకిస్తాన్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. కానీ, చనిపోయిన వ్యక్తుల గతాన్ని పరిశీలిస్తే, ఇలా ఎందుకు జరుగుతోందన్న విషయంలో క్లూ దొరకవచ్చు.
ఖలీద్ రజా, బషీర్ అహ్మద్, మిస్త్రీ జాహిద్... ముగ్గురూ జిహాదీ గుంపులతో సంబంధం ఉన్నవారే. భారత పరిపాలనలో ఉన్న కశ్మీర్‌లో ఈ జిహాదీ గుంపులు క్రియాశీలకంగా ఉన్నాయి.
ఇంటి ముందే రజాను కాల్చి చంపారు?
కరాచీలోని గులిస్తాన్ జౌహర్‌లో 2023 ఫిబ్రవరి 26, ఆదివారం నాడు 55 ఏళ్ల మాజీ కశ్మీరీ జిహాదీ కమాండర్ సయ్యద్ ఖలీద్ రజాను గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంటి ముందే హతమార్చారు.
సయ్యద్ ఖలీద్ రజా 90వ దశకంలో భారత పాలనలోని కశ్మీర్‌లో భారత సైనికులకు వ్యతిరేకంగా పనిచేసిన 'అల్ బదర్' ముజాహిదీన్ సంస్థలో ప్రముఖ నాయకుడిగా ఉండేవారు.
కానీ, 9/11 తరువాత కశ్మీరీ జిహాదిస్టిలపై పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు బిగించడం, పలు ఆంక్షలను విధించడంతో రజా సాయుధ జీవితానికి దూరమై, విద్యారంగంలోకి ప్రవేశించారు.
ప్రభుత్వ వ్యతిరేక వేర్పాటువాద సంస్థ 'సింధు దేశ్ ఆర్మీ' రజా హత్యకు బాధ్యత వహించింది.
అయితే, కశ్మీరీ జిహాదీ సంస్థలకు చెందిన టాప్ కమాండర్లు గుర్తు తెలియని దుండగుల చేతిలో హతమారడం ఇది మొదటిసారి కాదు. గతంలో పలువురు ఇదే విధంగా హత్యకు గురయ్యారు.
ఫిబ్రవరి చివరి వారంలో రజా హత్య రెండవ ఘటన. ఒక ఏడాది కాలంలో అయిదవది. ఈ దాడుల్లో రజా సహా ముగ్గురు ప్రముఖ కమాండర్లు చనిపోయారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
సయ్యద్ ఖలీద్ రజా ఎవరు?
కరాచీలోని జమాత్-ఎ-ఇస్లామీ నాయకుడు ఇంజనీర్ నైమూర్ రెహమాన్.. రజా మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, తామిద్దరం జమాత్-ఎ-ఇస్లామీ విద్యార్థి సంస్థ జమియాత్-ఏ-తల్బాలో సహచరులమని తెలిపారు.
రజా కరాచీలోని బిహారీ కమ్యూనిటీకి చెందినవారని సీనియర్ జర్నలిస్ట్ ఫైజుల్లా ఖాన్ చెప్పారు. 90వ దశకం ప్రారంభంలో అఫ్గానిస్తాన్‌లో అల్ బదర్ సంస్థలో శిక్షణ పొందిన తరువాత భారత పాలనలో ఉన్న కశ్మీర్‌కు వచ్చి భారత సైనికులకు వ్యతిరేకంగా పావులు కదిపారు. 1993లో పాకిస్తాన్ వెళ్లిపోయిన తరువాత అదే సంస్థలో ఉన్నత పదవికి ఎగబాకారని ఫైజుల్లా ఖాన్ వివరించారు.
అల్ బదర్ ముజాహిదీన్ గుంపు జమాత్-ఎ-ఇస్లామీకి అనుబంధ సాయుధ విభాగంగా ఉండేది. 80ల ప్రారంభం నుంచి అఫ్గానిస్తాన్‌లో, భారత పాలనలోని కశ్మీర్‌లో చురుకుగా ఉండేది. కానీ, 90ల చివర్లో అంతర్గత విభేదాల కారణంగా జమాత్-ఎ-ఇస్లామీ నుంచి దూరం జరిగింది.
సయ్యద్ సలాహుద్దీన్ నేతృత్వంలోని హిజ్బుల్ ముజాహిదీన్‌లో అల్ బదర్ విలీనం కావాలని జమాత్-ఎ-ఇస్లామీ కోరింది. అందుకు అల్ బదర్ సహకరించకపోవడంతో పొరపొచ్చాలు వచ్చి రెండు సంస్థలూ విడిపోయాయి.
తరువాత సయ్యద్ ఖలీద్ రజా కరాచీ వెళ్లిపోయారు. ఆ డివిజన్‌లోని అల్ బదర్‌కు అధిపతిగా నియమితులయ్యారు. అప్పటికి రజా ఆ అసంస్థలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగారు.
9/11 తరువాత, మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్‌లో జిహాదీ సంస్థలను నిషేధించినప్పుడు వందలాది మందిని అరెస్టు చేశారు.
వారిలో రజా ఒకరు. కొన్నేళ్ల జైలు జీవితం తరువాత తీవ్రవాదానికి స్వస్థి చెప్పి విద్యారంగంలోకి అడుగుపెట్టారు.

ఫొటో సోర్స్, AFP
బషీర్ అహ్మద్ హత్య
అంతకుముందు ఫిబ్రవరి 20న, కశ్మీరీ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలంను రావల్పిండిలో హత్యచేశారు. సాయంత్రం ప్రార్థనల తరువాత ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి పిస్టల్‌తో కాల్చి చంపారు.
60 ఏళ్ల బషీర్ అహ్మద్ భారత పాలనలోని కశ్మీర్‌లో శ్రీనగర్ జిల్లాలోని కుప్వారా ప్రాంతానికి చెందినవారని జర్నలిస్ట్ జలాలుద్దీన్ మొఘల్ తెలిపారు. 80ల చివరి నుంచి అతిపెద్ద జిహాదిస్ట్ సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌లో సభ్యుడిగా ఉన్నారు.
90ల ప్రారంభంలో పాకిస్తాన్ వెళ్లిపోయారు. హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలో ప్రముఖ పదవులు నిర్వహించారు. ఆ సంస్థలో కీలకమైన కమాండర్‌గా ఎదిగారు.

భారత్‌పై పాకిస్తాన్ ఆరోపణలు
గత ఏడాది మార్చిలో కరాచీలోని అక్తర్ కాలనీలో జిహాదీ సంస్థ జైష్-ఎ-మహమ్మద్‌కు చెందిన మిస్త్రీ జాహిద్ ఇబ్రహీం హత్యకు గురయ్యారు. ఇద్దరు సాయుధులు బైక్‌పై వచ్చి ఒక ఫర్నీచర్ దుకాణంలో ఆయనను కాల్చి చంపారు.
జాహిద్ 1999 డిసెంబర్‌లో నేపాల్ నుంచి వస్తున్న భారత విమానాన్ని హైజాక్ చేసి కాబూల్‌కు తరలించిన ఘటనలో భాగం పంచుకున్నారు. తరువాత, అనేక సంవత్సరాలు భారత జైల్లో ఊచలు లెక్కబెట్టారు.
జాహిద్‌ను ఎవరు హత్య చేశారు, ఎందుకు, ఎలా అన్న విషయాలపై సమాచారం లేదు.
అయితే, దీనికి ముందు మరో ముఖ్యమైన జిహాదీ సంస్థ కమాండర్‌ను చంపే ప్రయత్నం జరిగింది. ఆ సందర్భంలో పాకిస్తాన్ భారత్‌వైపు వేలు చూపించింది.
2021 జూన్‌లో లాహోర్‌లోని జోహార్ టౌన్‌లో జిహాదిస్ట్ సంస్థ లష్కర్-ఎ-తోయిబా, జమాత్-ఉద్-దవా సంస్థల అధ్యక్షుడు హఫీజ్ సయీద్ ఇంటి ముందు ఓ కారులో బాంబు పేలింది. కానీ, హఫీజ్ సయీద్, ఆయన కుటుంబం సురక్షితంగా బయటపడింది. మరో నలుగురు వ్యక్తులు మరణించారు.
ఈ దాడిలో భారత్ ప్రమేయం ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖార్ ఒక విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. అంతేకాకుండా, భారత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు 2013లో హఫీజ్ సయీద్ సన్నిహితుడు ఖలీద్ బషీర్‌ను లాహోర్ నుంచి అపహరించి, దారుణంగా హత్య చేశారు. రెండు రోజుల తరువాత ఆయన శవం లాహోర్ పక్కనే ఉన్న షేఖుపురలో దొరికింది.
ఆ సమయంలో కూడా భారత్ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయని లాహోర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మాజిద్ నిజామీ చెప్పారు.
"ఖలీద్ బషీర్ హత్యకు సంబంధించి ఏ సంస్థ కూడా బయటికొచ్చి బాధ్యత వహించలేదు. కానీ, భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హస్తం ఉందని పాకిస్తాన్ భద్రతా సంస్థల దర్యాప్తులో తేల్చారు.
ఈ ఘటనలో అరెస్టయిన ఇద్దరు నిందితులకు మరణశిక్ష విధించారు. ఒక గల్ఫ్ దేశానికి చెందిన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'రా' అధికారులు తమకు ఈ పని అప్పగించారని వారిద్దరూ భద్రతా సంస్థలకు చెప్పారు" అని మాజిద్ నిజామీ వివరించారు.
అయితే, జిహాదీ కమాండర్లను టార్గెట్ చేసిన కొన్ని ఘటనలు మీడియాలోకి రాలేదు.
గత ఏడాది పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్ కారును బాంబుతో పేల్చేందుకు ప్లాన్ చేశారు కానీ, ఆయన భద్రతా సిబ్బంది దాన్ని అడ్డుకుందని మజిద్ నిజామీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వీటి వెనుక ఎవరి హస్తం ఉంది?
రజా హత్యకు సింధు దేశ్ సంస్థ బాధ్యత వహించింది కానీ, కచ్చితమైన కారణాలు తెలుపలేదు.
సింధ్‌లోని మత తీవ్రవాదులు, వలసవాదులపై చర్యలు తీసుకునే భాగంలో రజాను హత్య చేసినట్టు మాత్రమే తెలిపారు.
అయితే, పై కారణంతో అనేకమంది ఆ పరిధిలోకి వస్తారు. కానీ, రజానే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నది ప్రశ్న?
ఇవన్నీ చూస్తే, పాకిస్తాన్‌లో హింసాత్మక కదలికలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో భారత్ పావులు కదుపుతోందనిపిస్తోంది. జిహాదిస్టులు భారత్ పాలనలోని కశ్మీర్‌లో మళ్లీ అడుగు పెట్టకుండా దారి మూసేయాలన్నది భారత్ లక్ష్యం కావచ్చు.
ఈ ఘటనలు జరిగిన వెంటనే భారత మీడియాలో సంబరాలు జరుపుకోవడం పైన చెప్పిన దానికి ఒక సూచన.
అయితే, వీటిపై భారత్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఇవి కూడా చదవండి:
- బైరి నరేశ్ మీద పోలీస్ జీపులో ఉండగానే దాడి... దీనిపై పోలీసులు బీబీసీతో ఏమన్నారు?
- ఆంధ్రప్రదేశ్-అమ్మఒడి: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై వివాదం ఏమిటి?
- బంగ్లాదేశ్ నుంచి ఈ 500 మంది భారత్‌కు ఎందుకు వచ్చారు? వాళ్లు ఏం కోరుతున్నారు?
- ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?














