బలగం రివ్యూ: ఇలాంటి కథతో సినిమా చేయాలనుకోవడం సాహసమే

ఫొటో సోర్స్, Dil Raju Productions/Facebook
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఓ కథ చెబుతూ, అందులో ఓ ప్రాంతం భాష, అక్కడి సంప్రదాయాల్ని భాగం చేయడం ఈమధ్య తరచూ కనిపిస్తున్న పోకడ.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత, తెలంగాణ యాస, సంస్కృతి నేపథ్యంగా సాగే కథలకు పెద్ద పీట వేస్తున్నారు. కొన్ని కొన్నిసార్లు కథ కంటే, వీటికే ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వడం కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకొన్న 'బలగం' అలాంటి ఓ ప్రయత్నమే.
ఓ మనిషి చావు చుట్టూ నడిచే కథ ఇది. చావు కంటే విషాదం మనిషి జీవితంలో ఉండదు. ఇంతటి విషాదాన్ని సినిమా మొత్తం చూపించడం కత్తిమీద సామే. కానీ, ఆ చావులోనే అన్ని రకాల భావోద్వేగాల్నీ మిళితం చేస్తే.. ఆ ప్రయాణం కూడా మనసుల్ని తట్టి లేపుతుంది. 'బలగం'లో అది కనిపించింది.

ఫొటో సోర్స్, Dil Raju Productions/Facebook
మరణంతో కథ మొదలు..
కథలోకి వెళ్తే.. తెలంగాణలోని అదో పల్లెటూరు. కొమరయ్య (సుధాకర్ రెడ్డి)కి తన ఊరంటే, పొలమంటే చాలా ఇష్టం. అందరితోనూ కలివిడిగా ఉంటాడు. దారిన పోయే ప్రతి ఒక్కరినీ పలకరిస్తే గానీ పొద్దుపోదు.
మనవడు సాయిలు(ప్రియదర్శి) పెళ్లి కుదురుతుంది. నిశ్చితార్థానికి అంతా సిద్ధమవుతుంది. సాయిలుకు ఊరంతా అప్పులే. కట్నం ద్వారా వచ్చే డబ్బులతో అప్పులు తీర్చుకొందామనుకొంటాడు. కానీ, సడన్‌గా కొమరయ్య చనిపోతాడు. దాంతో పెళ్లి ఆగిపోతుంది.
కొమరయ్య అంతిమ సంస్కారాలకు బంధుగణమంతా వస్తుంది. ఇంటి నుంచి గొడవ పడి, పాతికేళ్ల క్రితం వెళ్లిపోయిన కూతురు, అల్లుడు కూడా వస్తారు.
కొమరయ్య కొడుక్కీ, అల్లుడికీ క్షణం పడదు. చావు ఇంట్లోనే ఇగోలు మొదలవుతాయి. మరోవైపు సాయిలుది అప్పుల బాధ. వీటి మధ్య, కొమరయ్య పిండం ముట్టుకోవడానికి ఒక్క కాకీ వాలదు. అలా వాలకపోతే ఊరికి అరిష్టం పట్టుకొంటుందని పెద్దలు భావిస్తారు.
ఓ ఇంటి పెద్ద మరణం ఎన్ని రకాల గొడవలకు, మలుపులకూ కారణమైంది? చివరికి కొమరయ్య పిండాన్ని కాకి ముట్టిందా, లేదా? ఈ గొడవలు ఎలా సద్దుమణిగాయి? అనేది మిగిలిన కథ.
ఇలాంటి కథతో సినిమా చేయాలనుకోవడం సాహసమే. ఎందుకంటే చావనేది అతి పెద్ద విషాదం. వెండి తెరపై ఇలాంటి ఒక సన్నివేశం చూపించడమే కష్టం. జనాలు బోర్ ఫీలవుతారు. అలాంటిది చావు చుట్టూ కథ అల్లుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి.
ఈ విషయంలో దర్శకుడు వేణు (జబర్‌దస్త్ ఫేమ్)ని అభినందించాలి. జబర్‌దస్త్ నుంచి వచ్చిన నటుడు, దర్శకుడిగా మారాడంటే ఏదో వినోద ప్రధానమైన కథని ఎంచుకొంటాడని అనుకొంటాం.
కానీ, వేణు మాత్రం బలమైన ఎమోషన్ల చుట్టూ నడిచే కథని తీసుకొన్నాడు. ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కొమరయ్య మరణంతో సినిమా మొదలవుతుంది. ఓ శవం చుట్టూ ఎంత డ్రామా నడుస్తుందో, అంత డ్రామా తెరపై కనిపిస్తుంది.
అయితే, ఆ సన్నివేశాలను సహజత్వానికి అతి దగ్గరగా తీయాలన్న ప్రయత్నంలో, మరీ లాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఏడుపులు, పెడబొబ్బలు.. ఇవన్నీ కాస్త ఇబ్బందిగా తయారవుతాయి.
కానీ, ఆ ఇళ్లు, వాతావరణం చూస్తే సినిమాలా కాకుండా, మన చుట్టూ నడిచే కథేమో అనిపిస్తుంటుంది.

ఫొటో సోర్స్, Dil Raju Productions/Facebook
అనుబంధాలకు అద్దం పట్టిన కథ
తెలంగాణ సంస్కృతిలో చావును కూడా ఓ సెలబ్రేషన్‌గా చేసుకొంటారు. శవం ముందు జాగారం చేసే సమయంలో పాటలు పాడుకోవడం, పిట్ట ముట్టకపోతే, కుటుంబ ఘనతను, బాధ్యతలూ చెబుతూ, కాకిని ఆహ్వానించడం. ఇవన్నీ తెరపై కనిపిస్తాయి.
తెలంగాణ సంస్కృతిలో భాగమైన వాళ్లకు ఆ సన్నివేశాలన్నీ బాగా నచ్చే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో ఎమోషన్లు బలంగా పండాయి. ముఖ్యంగా చిన్నప్పుడు చెల్లెలు తప్పిపోతే, అన్నయ్యలు ఎంత గాబరా పడ్డారో చెప్పిన సీన్ కంటి తడి పెట్టిస్తుంది. దాన్ని తెరకెక్కించిన విధానం మనసుకు హత్తుకొంటుంది.
తాతయ్యని గుర్తు చేసుకొంటూ సాయిలు బాధ పడడం, తాను ఏం కోల్పోయాడో తెలుసుకొని రియలైజ్ అవ్వడం మరో మంచి సన్నివేశం.
పిట్ట ముట్టడం అంటే ఏమిటో, అసలు పిండం కాకే ఎందుకు తినాలో చెబుతూ వివరించే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అవన్నీ మనవైన సంప్రదాయాల్ని ఈ తరానికి పరిచయం చేస్తాయి.
ఈ కథలో స్టార్లు ఎవరూ లేరు. ప్రియదర్శి, వేణు లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే చాలామంది కొత్తవాళ్లే కనిపిస్తారు. అదీ ఓ రకంగా మంచిదే అయింది. ఎవరిపైన ఎలాంటి ఇమేజ్ లేకపోవడం వల్ల.. కేవలం ఆ పాత్రల్ని మాత్రమే చూసే అవకాశం దక్కింది.
కొమరయ్య పాత్ర కనిపించేది కాసేపు అయినా, సినిమా మొత్తానికి కేంద్ర బింద్రువు అయింది.
జయరాం, మురళీధర్ సహజంగా నటించారు. కథానాయికగా కనిపించిన కావ్య కల్యాణ్‌ది చిన్న పాత్రే. కానీ, తన నటన కూడా సహజంగా ఉంది.
ఇక ప్రియదర్శి నటనలో ఆకట్టుకొన్నాడు. మిగిలిన సన్నివేశాల్ని పక్కన పెడితే, తాతయ్యని తానెంత మిస్ అయ్యాడో చెప్పే సీన్‌లో తన నటన ఇంకాస్త నచ్చుతుంది.
అయితే ఈ పాత్ర ప్రేమ కథలో చివరి వరకూ జెన్యునిటీ ఉండదు. కేవలం అప్పులు తీర్చుకోవడానికి తాతయ్య చావునీ, తన పెళ్లినీ అడ్డు పెట్టుకొంటాడంతే. దాంతో, అక్కడక్కడ సాయిలు పాత్రతో డిస్ కనెక్ట్ అవుతుంటారు ప్రేక్షకులు.

ఫొటో సోర్స్, Dil Raju Productions/Facebook
కలసి ఉంటే కలదు సుఖం
భీమ్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. 'పొట్టి పిల్ల' పాట హుషారుగా ఉంది. 'ఊరూ పల్లెటూరూ' గీతం పల్లెల గొప్పదనం చాటుతుంది. ఒక్కసారి పల్లెకు పోయి రావాలి అనిపిస్తుంది.
సంభాషణలు సహజంగా ఉన్నాయి. ఎక్కడా మెలోడ్రామా, సినిమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ లేవు.
కుటుంబంలో వ్యక్తుల మధ్య లోపాలు, గొడవలు, ఈగోలు ఎన్నయినా ఉండొచ్చు. కానీ వాళ్లంతా కలిసి ఉండాలని కుటుంబ పెద్ద కోరుకుంటాడు.
కుటుంబమే తన బలం, బలగం అవుతుంది. ఇదే విషయాన్ని ఈ కథతో చెప్పే ప్రయత్నం చేశారు.
కథాపరంగా ఆహా.. ఓహో అనిపించే విషయం ఏమీ ఉండకపోవొచ్చు. కానీ.. ఈ కథని చెప్పడానికి తెలంగాణ యాసనీ, భాషనీ, సంస్కృతినీ ఓ వేదిక చేసుకోవడం 'బలగం' బలం.
ఇవి కూడా చదవండి:
- త్రిపురలో బీజేపీ లీడింగ్, నాగాలాండ్‌లో ఎన్డీపీపీ, మేఘాలయలో ఎన్పీపీ ఆధిక్యం
- టిక్ టాక్ మీద పశ్చిమ దేశాలకు ఎందుకంత కోపం?
- వివేక్ రామస్వామి: అమెరికా అధ్యక్ష పదవికి బరిలో దిగనున్న ఈ భారతీయ-అమెరికన్ ఎవరు?
- పేదల కోసం కరెంట్ లేకుండా నడిచే వాషింగ్ మెషీన్ తయారు చేశారు...
- మనీష్ సిసోడియా: అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఒకనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు














