మనీష్ సిసోడియా: అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఒకనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయా మథీన్, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
దిల్లీ ప్రభుత్వంలో అనేక శాఖలకు మంత్రిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా మంగళవారం రాత్రి ఆ పదవులన్నిటికీ రాజీనామా చేశారు.
అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఆయన తనపై అభియోగాలన్నీ అవాస్తవాలని తేలేవరకు పదవులకు దూరంగా ఉంటానని ఆ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
దేశంలోని హైప్రొఫైల్ నాయకుల్లో ఒకరైన మనీష్ సిసోడియా దశాబ్ద కాలం కిందట రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి ధీటైన విపక్షంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో ఆయన నంబర్-2గా కొనసాగుతున్నారు.
దిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఇతర రాష్ట్రాలకూ విస్తరించడంలో సిసోడియా కీలకంగా వ్యవహరించారు. గత ఏడాది ఆ పార్టీ పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో దిల్లీ మద్యం అమ్మకాల విధానంలో అవినీతి ఆరోపణలతో ఆదివారం సిసోడియాను అరెస్ట్ చేయడం రాజకీయ తుపానుకు కారణం కావడంలో ఆశ్చర్యమేమీ లేదు.
మద్యం కుంభకోణంలో సిసోడియాను అరెస్ట్ చేయడంతో ఆయన విశ్వసనీయతను విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాల నుంచి పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి అనేది అత్యంత సున్నితమైన అంశం. కానీ 51 ఏళ్ల సిసోడియా అదే అవినీతి ఆరోపణలతో అరెస్టయ్యారు.
అయితే, సిసోడియా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తున్నారు. సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు.
బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటోందన్నది సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ. కానీ, బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మనీష్ సిసోడియా అత్యంత నమ్మకమైన నాయకుడు.
ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యా శాఖ మంత్రిగా ఆయన దిల్లీలో స్కూళ్లను సమూలంగా మార్చిన వ్యక్తిగా పేరుపొందారు.

ఫొటో సోర్స్, Getty Images
తొలినాళ్లలో..
ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపుర్‌లో జన్మించిన మనీష్ సిసోడియా హిందీ సాహిత్యం చదువుకున్నారు. అనంతరం జర్నలిజంలో డిప్లమో చేశారు.
అనంతరం జీన్యూస్, ఆల్ ఇండియా రేడియో వంటి సంస్థలలో రిపోర్టర్‌గా, న్యూస్ యాంకర్‌గా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఆయన అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి రాజకీయ ఉద్యమాలలోకి వచ్చారు. వారిద్దరూ కలిసి సమాచార హక్కు చట్టం కోసం ఉద్యమించారు.
ఆ తరువాత అన్నా హజారే నేతృత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొని దేశం దృష్టిని ఆకర్షించారు. 2011లో ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమాలు దేశాన్ని ఊపేశాయి. ఫలితంగా 2014లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం కోల్పోయింది.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ ప్రవేశం
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా 2012లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. హక్కుల ఉద్యమాలలో పాల్గొన్నవారు, విద్యావేత్తలు, జర్నలిస్ట్‌లు వంటివారు ఈ పార్టీలో ఎక్కువగా ఉన్నారు అప్పట్లో. ఎక్కువగా ఉదారవాదులు, వామపక్షానికి చెందినవారితో ఆ పార్టీ ఏర్పడింది.
వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా తాము వచ్చామంటూ వారంతా చెప్పుకొన్నారు.
పార్టీ ఏర్పడిన కొద్దికాలానికే 2013లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించింది ఆప్. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వంలో మనీష్ సిసోడియాకు విద్య, పబ్లిక్ వర్క్స్, పట్టణాభివృద్ధి సహా వివిధ శాఖలు కేటాయించారు. అనంతరం ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆర్థిక మంత్రి పదవి కూడా ఇచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దిల్లీలోని స్కూళ్లలో గదుల నిర్మాణం, వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. దిల్లీలో ఆప్ ప్రభుత్వం ఇలాంటివి వెయ్యికి పైగా స్కూళ్లు నడుపుతోంది.
స్కూళ్ల విషయంలో సిసోడియా నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం చేసిన పనికి ప్రశంసలు దక్కాయి. అంతర్జాతీయంగానూ గుర్తింపు దక్కింది. సిసోడియాకూ పేరొచ్చింది.
అంతేకాదు... స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారు మనీష్ సిసోడియా.
విద్య, వైద్య సేవలు మెరుగుపర్చడమనేది ఆప్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెంచిందని నిపుణులు చెప్తారు.

ఫొటో సోర్స్, Getty Images
వివాదస్పద నేతా?
ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షేమ తరహా పాలనపై దిల్లీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నుంచి విమర్శలున్నాయి. తప్పుడు హామీలు, ఉచిత పథకాలతో కేజ్రీవాల్, ఆయన పార్టీ నాయకులు ప్రజలను మోసగిస్తున్నారని బీజేపీ నేతలు తరచూ ఆరోపిస్తుంటారు.
రాజకీయ పార్టీగా తక్కువ వయసే ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి గట్టి ప్రత్యర్థిగా ఎదిగింది. అనేక రాష్ట్రాలలో పార్టీని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. 2022 డిసెంబరులో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి 5 సీట్లు గెలిచింది.
దిల్లీ స్కూళ్లను ప్రక్షాళన చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ కృషిని ప్రస్తుతిస్తూ న్యూయార్క్ టైమ్స్‌లో గత ఏడాది కథనం ప్రచురితం కాగా బీజేపీ నాయకులు దాన్ని విమర్శించారు.
అదంతా పెయిడ్ న్యూస్ అంటూ బీజేపీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ, న్యూయార్క్ టైమ్స్ పత్రిక రెండూ బీజేపీ ఆరోపణలను ఖండించాయి.
మద్యం అమ్మకాల విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు చేసిన సమయంలోనే న్యూయార్క్ టైమ్స్‌లో ఈ కథనం ప్రచురితమైంది.
2021లో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మద్యం విధానంతో దిల్లీ అంతటా ప్రైవేటు వ్యాపారులకే మద్యం విక్రయాలు అప్పగించారు. అంతకుముందు ప్రైవేట్, ప్రభుత్వ విక్రయాలుండేవి.
విక్రయాలన్నీ ప్రైవేటుకే అప్పగించే ఈ కొత్త విధానం వల్ల బ్లాక్ మార్కెట్ తగ్గుతుందని, ఆదాయం పెరుగుతుందని ఆప్ చెప్తోంది.
ప్రైవేట్ మద్యం వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా మనీష్ సిసోడియా వ్యవహరించారంటూ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆరోపించారు. ఆప్, సిసోడియా ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ గత ఏడాది జులైలో ఆ మద్యం విధానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
2022 ఆగస్ట్‌లో అధికారులు సిసోడియాపై దర్యాప్తు ప్రారంభించారు. విచారణ సమయంలో సిసోడియా తప్పించుకునేలా సమాధానాలిచ్చారని, విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ చేశామని సీబీఐ అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
సిసోడియా తప్పు చేయలేదని, చెత్త రాజకీయాలతో సిసోడియాను అరెస్ట్ చేశారని ఆప్ చెప్తోంది. కానీ, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ దీనిపై స్పందిస్తూ ఆప్ ఆరోపణలను కొట్టిపారేశారు. సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తుందన్నారు.
చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు మనోజ్ తివారీ.
సిసోడియా అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్ నిరసన తెలుపుతోంది. ఇతర కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలూ సిసోడియా అరెస్ట్‌ను తప్పుపట్టారు. తమను విమర్శించేవారిపై బీజేపీ కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.
2022లో ఆప్ ప్రభుత్వంలోని మరో మంత్రి సత్యేంద్ర జైన్‌ను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. సత్యేంద్ర జైన్ కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు.
కాగా సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా ఇద్దరూ మంగళవారం తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














