బీబీసీ ట్యాక్స్ ‘సర్వే’ మీద భారత్‌తో మాట్లాడిన బ్రిటన్ విదేశాంగ మంత్రి

బ్రిటన్ విదేశాంగమంత్రితో ఎస్ జై శంకర్

ఫొటో సోర్స్, @DrSJaishankar

బీబీసీ కార్యాలయాల్లో ఇటీవల ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన ‘సర్వే’ మీద భారతదేశ ప్రభుత్వంతో బ్రిటన్ మాట్లాడినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

బుధవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆ విషయాన్ని విదేశాంగమంత్రి జై శంకర్ వద్ద బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ ప్రస్తావించినట్లు ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారని రాయిటర్స్ పేర్కొంది.

జేమ్స్ క్లెవర్లీ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు.

రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు వంటి అంశాల మీద ఇద్దరు చర్చించినట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.

భారత్, బ్రిటన్ మధ్య ‘యంగ్ ప్రొఫెషనల్స్ స్కీం’ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏడాదికి మూడు వేల మంది బ్రిటిష్, మూడు వేల మంది భారతీయులకు అవకాశం కల్పిస్తారు. రెండేళ్ల వరకు బ్రిటన్, భారత్‌లో నివసించే హక్కు, పని చేసే హక్కును కల్పిస్తారు.

ఫిబ్రవరి 14వ తేదీన ఐటీ విభాగం బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ‘సర్వే’ చేపట్టింది. మూడు రోజుల పాటు సాగిన ఈ ‘సర్వే’ 16వ తేదీన రాత్రి ముగిసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ డాక్యుమెంటరీ తరువాత...

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాత్మకంగా ఉన్న ఒక డాక్యుమెంటరీని బీబీసీ బ్రిటన్‌లో ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత బీబీసీకి చెందిన దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఈ 'సర్వే' జరిగింది.

నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన మత ఘర్షణలపై ఆ డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది.

బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' కేవలం బ్రిటన్‌లో మాత్రమే ప్రసారం అయినప్పటికీ, ఆ డాక్యుమెంటరీ ''వలసవాద మనస్తత్వం''తో కూడిన ''శత్రుపూరిత దుష్ప్రచారం, భారత వ్యతిరేక చెత్త'' అని భారత ప్రభుత్వం అభివర్ణించింది. ఈ డాక్యుమెంటరీని ప్రజలు ఆన్‌లైన్‌లో షేర్ చేయకుండా అడ్డుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నించింది.

తనపై వచ్చిన ఆరోపణలను మోదీ మొదటి నుంచి తిరస్కరిస్తూ వచ్చారు. ఆయన మీద న్యాయ విచారణకు తగినన్ని ఆధారాలు లేవని 2013లో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పేర్కొంది.

బీబీసీ కార్యాలయం వద్ద పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

ఆ డాక్యుమెంటరీపై స్పందన తెలియజేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని సంప్రదించామని, కానీ ప్రభుత్వం స్పందించటానికి తిరస్కరించిందని బీబీసీ గత నెలలో చెప్పింది.

ఆ డాక్యుమెంటరీ కోసం ''లోతైన పరిశోధన చేశాం. విస్తృతమైన గళాలు, ప్రత్యక్ష సాక్షులు, నిపుణులను కలిశాం. బీజేపీకి చెందిన వ్యక్తులు సహా అనేక అభిప్రాయాలను పొందుపరిచాం'' అని బీబీసీ వివరించింది.

గత నెలలో ఈ డాక్యుమెంటరీని వీక్షించటానికి గుమిగూడిన విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

దేశవ్యాప్తంగా ఆ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలు జరిగాయి.

గతంలోనూ..

భారతదేశంలో ప్రభుత్వాన్ని విమర్శించే సంస్థలను లక్ష్యం చేసుకోవటం అసాధారణమేమీ కాదు.

2020 సంవత్సరంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. మానవ హక్కుల సంస్థలపై ప్రభుత్వం ''కక్ష సాధింపు''కు పాల్పడుతోందని ఆ సంస్థ ఆరోపించింది.

గత ఏడాది ఆక్స్‌ఫామ్ సహా పలు ఇతర ప్రభుత్వేతర సంస్థల్లో కూడా సోదాలు జరిగాయి.