బీబీసీ ఇండియా: నిర్భయంగా వార్తలు అందించాలని సిబ్బందికి చెప్పిన డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ

ఫొటో సోర్స్, Reuters
నిర్భయంగా, నిష్పక్షపాతంగా రిపోర్టింగ్ చేసే పనిలో బీబీసీ వెనుకడుగు వేయదని ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ భారతదేశంలోని బీబీసీ సిబ్బందికి పంపించిన ఈమెయిల్‌లో అన్నారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఆయన ఈ మెయిల్ చేశారు.
ఆదాయపన్ను శాఖ ఇన్వెస్టిగేషన్‌కు బీబీసీ సహకరిస్తోంది. అయితే, ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ మీద బీబీసీ ఒక విమర్శనాత్మక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇది ‘దురుద్దేశంతో కూడిన ప్రచారం’ అని భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది. స్థానికంగా ఈ డాక్యుమెంటరీ ప్రసారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది.
ఈ నేపథ్యంలో టిమ్ డేవీ, “బీబీసీ తన సిబ్బంది సమర్థంగా, సురక్షితంగా తమ విధులు నిర్వర్తించేందుకు సహకరిస్తుంది” అని తన ఈమెయిల్లో పేర్కొన్నారు.
“స్వతంత్ర, నిష్పాక్షిక జర్నలిజం ద్వారా వాస్తవాలను తెలుసుకుని అందించడమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులు, పాఠకుల పట్ల మాకున్న బాధ్యత. అత్యుత్తమ సృజనాత్మక కథనాలను రూపొందించి ప్రజలకు అందించడం కూడా ఆ బాధ్యతలో భాగం. మా బాధ్యతల నుంచి మేం వెనక్కి తగ్గేది లేదు” అని డేవీ అన్నారు.

‘‘నేను స్పష్టంగా చెబుతున్నాను. బీబీసీకి ఎలాంటి అజెండా ఉండదు. ప్రజా ప్రయోజనాలే మమ్మల్ని నడిపిస్తాయి. ప్రజలకు నిష్పాక్షిక వార్తలు అందించడం, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు వారికి సమాచారాన్ని అందివ్వడమే ఆ ప్రయోజనం" అని డేవీ అన్నారు.
ఆదాయ పన్ను శాఖ అధికారులు సర్వే పేరుతో మూడు రోజులు బీబీసీ ఆఫీసుల్లోనే ఉన్నారు.
భారత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ‘‘అవకతవకలు గుర్తించాం. ఒక విదేశీ సంస్థకు భారతదేశంలో నిర్వహించే కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వెల్లడించకుండా, దానిపై పన్ను చెల్లింపులు జరపలేదని సూచించే సాక్ష్యాధారాలను సేకరించాం ’’ అని వెల్లడించింది.
అయితే, యూకేలోని ప్రతిపక్ష ఎంపీలు వీటిని బెదిరింపు దాడులుగా అభివర్ణించారు. ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
భారత ఆదాయ పన్ను విభాగం చేసిన ఆరోపణలపై బ్రిటన్ విదేశాంగ మంత్రి స్పందించలేదు. అయితే, ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?














