బడి మానిపించేందుకు 650 మంది అమ్మాయిలకు కలుషిత ఆహారం-బీబీసీ పరిశీలనలో వెల్లడి

ఫొటో సోర్స్, IRNA
ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనారోగ్యానికి గురైన ఇరాన్ బాలికల తిండిని ‘కావాలనే’ కలుషితం చేసినట్లు బీబీసీ గుర్తించింది.
బాలికలు బడి మానేసేలా చేసేందుకు ఇలా చేసినట్లు బీబీసీ పరిశీలనలో బయటపడింది. కావాలనే ఆ పని చేసినట్లు ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి బీబీసీ వద్ద అంగీకరించారు.
ఇరాన్‌లో మత సంప్రదాయాలను ఎక్కువగా పాటించే ఖోమ్ నగరం ఇందుకు ప్రధాన కేంద్రంగా మారింది. మరో ఏడు నగరాల్లోనూ బాలికలకు ఫుడ్ పాయిజన్ అయిన కేసులు రిపోర్ట్ అయ్యాయి.
ఆ ఘటన మీద అధికారులు విచారణ ప్రారంభిచారని, ‘కావాలనే’ ఆహారాన్ని కలుషితం చేసి ఉండొచ్చని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.
తమకు పెట్టే తిండి పుల్లటి వాసన వస్తోందని, చేపలు కుళ్లిపోయాయని గత మూడు నెలలుగా విద్యార్థులు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు.
ఫిబ్రవరి 26న నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ... ‘‘కొందరు అన్ని రకాల పాఠశాలలు మూసివేయాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి అమ్మాయిల స్కూళ్లను మూసివేయాలని భావిస్తున్నారు’’ అని ఇరాన్ డిప్యూటీ ఆరోగ్యశాఖ మంత్రి యూనస్ పనాహీ అన్నారు.
తిండిని కలుషితం చేయడానికి ‘వాడిన రసాయనాలు అందరికీ అందుబాటులో ఉండేవే’ అని పనాహీ తెలిపారు. బాలికల ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏమీ లేదని వెల్లడించారు.
అయితే తాను చెప్పిన మాటలు వివాదంగా మారడంతో ‘నా మాటలను వక్రీకరించారు’ అని యూనస్ పనాహీ ఆ తరువాత అన్నారు.

ఫొటో సోర్స్, IRNA
తల్లిదండ్రుల నిరసన
2022 నవంబరు 30న ఖోమ్‌లోని నూర్ టెక్నికల్ స్కూల్‌లో 18 మంది బాలికలను తొలిసారి ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత ఖోమ్ ప్రావిన్స్‌లోని పదికి పైగా బాలికల పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్‌తో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఆ తరువాత ఆ సంఖ్య 650కి పెరిగింది.
ఫిబ్రవరి మధ్యలో సుమారు 100 మంది ఈ ఘటనకు సంబంధించి ఖోమ్ గవర్నర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.
‘‘మా పిల్లల బాధ్యత మీదే. నాకు ఇద్దరు కూతుళ్లు... నేను చేయగలిగిందిల్లా వాళ్లను స్కూలుకు పంపకుండా ఉండటమే...’’ అని ఒక తండ్రి కోపంగా అరుస్తూ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘‘ఇదొక యుద్ధం... మేం ఇంటి దగ్గరే ఉండాలని ఖోమ్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో అలా చేస్తున్నారు. అమ్మాయిలు ఇంటి దగ్గరే ఉండాలని వారు కోరుకుంటున్నారు ’’ అని ఒక మహిళ అన్నారు.
ఫుడ్ పాయిజన్ తరువాత కొన్ని వారాల పాటు తమ పిల్లల అనారోగ్యంతోనే ఉన్నారని కొందరు తల్లిదండ్రులు తెలిపారు.
ఒక టీనేజీ అమ్మాయి ఆసుపత్రి బెడ్ మీద ఉన్న మరొక వీడియో కూడా కనిపించింది. ఆ అమ్మాయి పక్కనే తల్లి కూడా కూర్చొని ఉంది.
‘‘నేనొక తల్లిని. నా బిడ్డ ఆసుపత్రిలో బెడ్ మీద ఉంది. తను చాలా బలహీనంగా ఉంది. గిచ్చినా కూడా తను కదలడం లేదు. దయచేసి, మీ పిల్లలను బడికి పంపొద్దు’’ అని ఆ తల్లి చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, EPA
మతత్వవాదులు చేశారా?
ఇస్లాం మత సంప్రదాయాలకు ఖోమ్ నగరం ప్రధాన కేంద్రంగా ఉంది. షియా వర్గానికి చెందిన మతనాయకులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఇస్లామిక్ దేశమైన ఇరాన్‌కు వీరు వెన్నెముకగా ఉన్నారు.
2022 సెప్టెంబరులో పోలీసు కస్టడీలో మాషా అమీని చనిపోయిన తరువాత చెలరేగిన ‘హిజాబ్ వ్యతిరేక’ ఉద్యమం, ఈ మతనాయకుల ఆధిపత్యాన్ని సవాలు చేసింది.
దేశవ్యాప్తంగా చెలరేగిన ఈ ఉద్యమంలో టీనేజీ యువతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
హిజాబ్‌ను తీసేసిన పాఠశాల బాలికల ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఇలా ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు ‘ప్రతీకారంగా’ పాఠశాల బాలికలను టార్గెట్ చేసుకున్నారని కొందరు ఇరాన్ ప్రజలు భావిస్తున్నారు.
అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్లు, నైజీరియాలోని ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ బొకో హరాం వంటి వారి నుంచి ఇరాన్‌లోని మతత్వవాదులు స్ఫూర్తి పొందుతున్నారని, అందువల్లే ఇలాంటి దాడులు చేస్తున్నారనే అనుమానాలున్నాయి.
తద్వారా తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపడానికి భయపడేలా చేస్తున్నారని చెబుతున్నారు.
‘బొకో హరాం ఇరాన్‌కు వచ్చిందా?’ అంటూ ఇరాన్ మాజీ ఉపాధ్యక్షుడు మొహ్మద్ అలీ అబ్తాతీ ప్రశ్నించారు.
హిజాబ్ వంటి వాటి రూపంలో మహిళల మీద ఇరాన్ ఆంక్షలు విధిస్తూ వస్తోంది. వాటిని విమర్శించడాన్ని ఆ దేశం వ్యతిరేకిస్తోంది.
పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోతే కాలేజీ చదువు అనేది అమ్మాయిలకు కలగానే మిగిలిపోతుంది.
తనకు రెండు సార్లు ఫుడ్ పాయిజన్ అయిందని ఖోమ్ గవర్నర్‌తో జరిగిన సమావేశం సందర్భంగా ఒక బాలిక తెలిపింది.
‘‘విచారించామని, అంతా బాగానే ఉందని వారు(అధికారులు) చెబుతున్నారు. కానీ స్కూలు దగ్గర మా నాన్న వారిని ప్రశ్నించినప్పుడు...వారం రోజులుగా సీసీటీవీ పని చేయడం లేదని, కాబట్టి విచారణ సాధ్యం కాదని వారు చెప్పారు. అందుకు క్షమాపణలు కూడా తెలిపారు’’ అని ఆ సమావేశంలో బాలిక తెలిపింది.
‘‘రెండోసారి ఆదివారం నాకు ఫుడ్ పాయిజన్ అయింది. నా గుండెలో సమస్య ఉందని, అందువల్లే నేను ఆసుపత్రిలో చేరానని స్కూలు ప్రిన్సిపాల్ తెలిపారు. కానీ నా గుండెకు ఎటువంటి ఇబ్బందీ లేదు’’ అని ఆ బాలిక వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- YSR Law Nestham: కొత్త వకీలుకు నెలకు రూ. 5000 పింఛను ఇస్తున్నారు తెలుసా?
- ‘నవీన్‌ను చంపేసి, తల నరికి, గుండెను బయటకు తీశాను...’ పోలీసుల రిమాండ్ రిపోర్టులో హరిహరకృష్ణ నేరాంగీకారం
- పాకిస్తాన్: లచ్చీ హిందువులకు కొత్త ఇమేజ్ తెస్తున్న వీకే డ్యాన్స్ గ్రూప్
- ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














