వివేక్ రామస్వామి: అమెరికా అధ్యక్ష పదవికి బరిలో దిగనున్న ఈ భారతీయ-అమెరికన్ ఎవరు?

వివేక్ రామస్వామి

ఫొటో సోర్స్, VIVEK2024.COM

ఫొటో క్యాప్షన్, వివేక్ రామస్వామి

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడతామని ప్రకటించిన ముగ్గురు రిపబ్లికన్లలో ఇద్దరు భారతీయ మూలాలకు చెందినవారు. నిక్కీ హేలీ కొంత పరిచయమైన పేరే. కానీ, వివేక్ రామస్వామి గురించి చాలా తక్కువమందికి తెలుసు.

వివేక్ ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించడంతో ప్రపంచం కళ్లన్నీ ఆయన వైపు తిరిగాయి. ఈ పోటీలో ఆయనకున్న అవకాశాలేంటి? అమెరికా సమజంలో వివేక్ మార్పు తీసుకురాగలరా?

ఈ అంశాలను కాలిఫోర్నియా జర్నలిస్ట్ సవితా పటేల్ విశ్లేషించారు .

వివేక్ రామస్వామి ఎవరు?

పారిశ్రామికవేత్త, 'Woke, Inc.' పుస్తక రచయిత వివేక రామస్వామి వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు ఫిబ్రవరి 21న ప్రకటించారు.

ఫాక్స్ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తన రాజకీయ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇది తన రాజకీయ రంగప్రవేశమే కాకుండా అమెరికన్లకు "కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం" అని ఆయన అన్నారు.

"ప్రజలను ఐక్యపరిచే ఉన్నతమైన అంశం లేనప్పుడు వైవిధ్యం అర్థరహితమని" ఆయన అన్నారు.

37 ఏళ్ల వివేక్ ఒహియాలో జన్మించారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. బయోటెక్నాలజీ వ్యవస్థాపకుడిగా కోట్లు సంపాదించారు. తరువాత, ఒక ఆస్తి నిర్వహణ సంస్థను స్థాపించారు.

కార్పొరేట్ ప్రపంచంలో జాత్యహంకారం, వాతావరణ మార్పులపై "సూడో ఉదారవాద" భావనలతో విసుగు వస్తోందని వివేక్ చాలాకాలంగా గొంతెత్తి చెబుతున్నారు. ఈ ధోరణి వ్యాపారాన్ని, దేశాన్ని దెబ్బతీస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా, ఈఎస్‌జీ (పర్యావరణ, సామాజిక, కార్పొరేట్ గవర్నెన్స్ ) విధానాన్ని వివేక్ వ్యతిరేకించారు. ఒక కంపెనీ సమాజంపై, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్నదనే దానికి ఈఎస్‌జీ ఒక సూచిక.

అంతే కాకుండా, ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని, అమెరికా అర్థికంగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని వివేక్ అభిప్రాయపడ్డారు.

వివేక్ అభిప్రాయాలను కొందరు రిపబ్లికన్లు మెచ్చుకున్నారు. 2022 మధ్యంతర ఎన్నికల్లో న్యూ హాంప్‌షైర్ నుంచి సెనేట్‌కు పోటీ చేసిన రిపబ్లికన్ విక్రం శరమణి, వివేక్ అభిప్రాయాలతో ఏకీభవించారు.

వివేక్ అభిప్రాయాలు "ఆకట్టుకునేలా, స్పష్టంగా, ఆలోచనాత్మకంగా ఉన్నాయని" అన్నారు.

అమెరికాను ఐక్యం చేయాలన్నదే తమ ఉద్దేశమని, విడగొట్టే ఆలోచనలు చేయట్లేదని విక్రం అన్నారు.

"అమెరికాలో గుర్తింపు రాజకీయాలు వేళ్లూనుకున్నాయి. ఇవి ప్రజలను ఐక్యం చేయడానికి బదులు విభజనలు సృష్టిస్తున్నాయి. మనకున్న ఉమ్మడి అంశాల పైనే దేశ నిర్మాణం జరగాలి" అన్నారు విక్రం.

వివేక్ రామస్వామి

ఫొటో సోర్స్, RAMASWAMY CAMPAIGN

ఫొటో క్యాప్షన్, వివేక్ రామస్వామి

కాగా, మరికొందరు భారతీయ అమెరికన్లు ముఖ్యంగా డెమోక్రాట్లు వివేక్ రాజకీయ అభిప్రాయలతో విభేదిస్తున్నారు. ఆయన ప్రచారంలో లోతు లేదని భావిస్తున్నారు.

ఆసియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) విక్టరీ ఫండ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ శేఖర్ నరసింహన్ మాట్లాడుతూ, భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు రాజకీయాల్లోకి రావడం సంతోషకరమే కానీ, వివేక్ రామస్వామి ఆలోచనలలో తనకు నమ్మకం లేదని అన్నారు. శేఖర్ డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇస్తారు.

"ఆయన ఒక వ్యాపారవేత్త, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ, ఆయన ఇస్తున్న హామీలేమిటి? వృద్ధులకు వైద్య సంరక్షణ గురించి పట్టించుకున్నారా? మౌలిక సదుపాయాలపై ఆయన ప్రణాళిక ఏమిటి? స్థిరమైన వైఖరి కనిపించలేదు. ఆయన విధానాలేమిటో స్పష్టంగా చెప్పలేదు" అన్నారు శేఖర్.

వివేక్ ప్రచారం "వాస్తవదూరమని, ఆచరణశూన్యమని" అన్నారు.

"తనకు వారసత్వ సంపద, సామాజిక పెట్టుబడి ఉందన్న విషయాన్ని వివేక్ గ్రహించారా? పూర్తిగా అంగీకరించారా? లేక అదేమంత ముఖ్యం కాదనుకుంటున్నారా? అంటూ శేఖర్ ప్రశ్నించారు.

నిక్కీ హేలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిక్కీ హేలీ

మరోవైపు, రిపబ్లిక్ పార్టీకి మద్దతిచ్చే చాలామంది భారతీయ అమెరికన్లు వివేక రామస్వామి పేరే ఎప్పుడూ వినలేదని అంటున్నారు.

"నేనెప్పుడూ ఆయన్ను కలవలేదు. ఆయనకు చాలా డబ్బు ఉందని, బాగా మాట్లాడతారని తెలిసింది. నేను ఆయనకు మద్దతిస్తాను. కానీ, గెలిచే అవకాశాలు తక్కువే" అన్నారు డాక్టర్ సంపత్ శివాంగి. రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా, నిధుల సేకరణకర్తగా భారతీయ అమెరికన్లకు సంపత్ సుపరిచితులే.

"వివేక చాలా ముందుగానే ఎన్నికలలో పోటీచేసున్నట్టు ప్రకటించడం మంచిదే. లేకపోతే ఆయన గురించి ఎవరికీ తెలీదు. అధ్యక్ష పదవికి పోటీ చేసే ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. కానీ, ఆయనకు ఒక కచ్చితమైన వ్యూహం ఉండాలి. ప్రత్యేకంగా, భారతీయ అమెరికన్ల కోసం విధానాలు ఉండాలి" అని హోటల్ వ్యాపారి డానీ గైక్వాడ్ అన్నారు. జార్జ్ డబ్ల్యూ బుష్ కాలం నుంచి రిపబ్లికన్ అభ్యర్థులందరికీ నిధులు సేకరించడంలో సహాయపడిన వ్యక్తి గైక్వాడ్.

ఫ్లోరిడా నుంచే గవర్నర్ రాన్ డిసాంటిస్‌, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా అధ్యక్ష పదవికి పోటీచేస్తారని, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయన్నది ఇప్పుడే చెప్పలేమని గైక్వాడ్ అన్నారు.

రిపబ్లికన్లలో ట్రంప్, డిసాంటిస్‌, హేలీ మధ్య రేసు ఉంటుందని భారతీయ అమెరికన్లలో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు అంచనా వేస్తున్నారు.

అయితే, ముందస్తు పొత్తులకు వెళ్లకుండా ఇంకొంతకాలం వేచి చూడవచ్చు. ప్రత్యేకించి, ట్రంప్‌పై చట్టపరమైన ఆరోపణల చుట్టూ ఇంకా అనిశ్చితి నెలకున్న స్థితిలో ఉన్నందున.

ట్రంప్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తే, నిక్కీ హేలీకి సపోర్ట్ చేస్తానని సంపత్ శివాంగి అన్నారు. నిక్కీ దూకుడు ప్రచార శైలి తనకు నచ్చించని చెప్పారు.

"ట్రంప్‌కు 40 శాతం రేటింగ్ ఉంది. నిక్కీకి అంత రేటింగ్ లేదు. కానీ, ఆమెకు మేం మద్దతిస్తాం. ఆమె భారతీయ అమెరికన్ కావడం ప్రధాన కారణం" అన్నారు సంపత్.

 డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనాల్డ్ ట్రంప్

భారతీయ అమెరికన్లలో రాజకీయ భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ భారతీయ మూలాలకు చెందినవారు చురుకుగా అమెరికా రాజకీయాల్లోకి రావడం పట్ల సంతోషంగా ఉన్నారు.

ముఖ్యంగా గత మూడు ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగింది. ఈ ఎన్నికల్లో ఈ సంఖ్య ఇంకా పెరగడం, భారతీయ అమెరికన్లు తమంతట తాము ముందుకు రావడం పట్ల గర్విస్తున్నారు.

"ఇది చాలా మంచి విషయం.. భారతీయ అమెరికన్లు ముందుకొస్తున్నారు" అని గైక్వాడ్ అన్నారు.

ఈ ఎన్నికల్లో కొత్తగా మరికొంతమంది భారతీయ అమెరికన్లు ఎన్నికల బరిలోకి దిగడం భవిష్యత్తులో మరింతమందిని ప్రోత్సహిస్తుందని, స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు ఉత్సాహాన్నిస్తుందని అన్నారు.

డెమోక్రాట్లు కూడా ఇందుకు అంగీకరిస్తున్నారు.

"గెలిచినవాళ్లల్లో రామస్వామి, ఖన్నా, కృష్ణమూర్తి లాంటి పేర్లను మా పిల్లలు చూస్తే, అంతకన్నా కావాల్సింది ఏముంది" అన్నారు డెమోక్రాట్ శేఖర్.

ఇవి కూడా చదవండి: