త్రిపురలో బీజేపీ లీడింగ్, నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ, మేఘాలయలో ఎన్‌పీపీ ఆధిక్యం

ఫొటో సోర్స్, Getty Images
నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మేఘాలయలో సంగ్మా హవా కొనసాగుతోంది.
మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం, త్రిపురలో బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయిదు స్థానాలు గెలుచుకుంది.
నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ 25 స్థానాల్లో ముందంజలో ఉంది. ఒక స్థానాన్ని గెలుచుకుంది.
మేఘాలయలో ఎన్‌పీపీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయిదు స్థానాలను గెలుచుకుంది.
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలలో గత నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది.
ఎక్కడ ఏ ప్రభుత్వం?
మేఘాలయలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది.
నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, బీజేపీ పొత్తు ప్రభుత్వంలో ఉంది.
త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
త్రిపుర
త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మాణిక్ సాహా త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఇక్కడ కౌంటింగ్ ప్రారంభమైంది.
బీజేపీ 28 స్థానాల్లో ముందంజలో ఉంది. అయిదు స్థానాలు గెలుచుకుంది.
సీపీఐ(ఎం) 11 స్థానాల్లో ముందంజలో ఉంది.
తిప్ర మోతా పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. నాలుగు స్థానాలను గెలుచుకుంది.
కాంగ్రెస్ మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
నాగాలాండ్
నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) ప్రభుత్వంలో ఉంది. నీఫియు రియో ప్రస్తుతం నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఇక్కడ ఎన్‌డీపీపీ 25 స్థానాల్లో ముందంజలో ఉంది. ఒక స్థానాన్ని గెలుచుకుంది.
బీజేపీ 13 స్థానాల్లో ముందంజలో ఉంది. రెండు స్థానాలు గెలిచింది.
కాంగ్రెస్ ఆరు స్థానాల్లో, లోక్ జనశక్తి పార్టీ (రామ విలాస్) మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
మేఘాలయ
మేఘాలయ ప్రస్తుత ముఖ్యమంత్రి నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి చెందిన కాన్రాడ్ సంగ్మా.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈసారి పోటీ చేసింది.
గారా నేషనల్ కౌన్సిల్ (జీఎన్‌సీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌సీపీ), యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) లాంటి స్థానిక పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి దిగాయి.
ఇక్కడ కౌంటింగ్ కొనసాగుతోంది.
ఎన్‌పీపీ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. అయిదు స్థానాలను గెలుచుకుంది .
యూడీపీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది. రెండు స్థానాల్లో గెలిచింది.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చేరో నాలుగు స్థానాల్లో ముందుండగా, బీజేపీ మూడు స్థానాల్లో ముందుంది.

ఫొటో సోర్స్, DILIP SHARMA/ BBC
ఎన్నికల వాగ్దానాలు
ఎన్నికలకు ముందు త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో హోం మంత్రి అమిత్ షా ప్రచారాలు నిర్వహించారు.
త్రిపురలో ఒక సభలో ప్రసంగిస్తూ 2024 జనవరి 1న అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని తెరవనున్నట్టు తెలిపారు.
దీన్ని బట్టి 'ఆలయాలు, జాతీయవాదమే' బీజేపీ ఎన్నికల ప్రచార వ్యూహమని నిపుణులు భావించారు.
త్రిపురలో మళ్లీ ప్రభుత్వంలోకి వస్తే, గిరిజన ప్రాంతాలకు శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాల్లో స్వయంప్రతిపత్తి కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
కాగా, బీజేపీ మతరాజకీయాలు చేస్తోందని త్రిపురలో వామపక్ష పార్టీ ఆరోపించింది.
మరోవైపు, కాంగ్రెస్ ఉపాధి, విద్యుత్, పాత పెన్షన్ స్కీమ్ వంటి అంశాలతో ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నించింది.
మేఘాలయలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నిరుద్యోగం, అవినీతి రహితంగా మారుస్తామని హామీ ఇచ్చింది.
నాగాలాండ్‌లో 36 స్థానాల్లో పురుషుల కన్నా స్త్రీల జనాభా ఎక్కువ. అందుకే అన్ని పార్టీలు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే పథకాల హామీలు ఇచ్చాయి.
బీజేపీ 'ఎంపవర్ నాగాలాండ్' నినాదంతో ముందుకొస్తే, కాంగ్రెస్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, వృద్ధాప్య పింఛను నెలకు రూ. 3,000 ఇస్తామని హామీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో మాజీ జిహాదీ కమాండర్ల వరుస హత్యలు... భారత్ నిఘా సంస్థల పనే అంటూ ఆరోపణలు
- మనీష్ సిసోడియా: అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఒకనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు
- ఆంధ్రప్రదేశ్: ‘కులం వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని పెద్దలు... ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు’
- స్వర భాస్కర్-ఫర్హాద్ అహ్మద్: హిందూ, ముస్లిం ప్రేమికులు పెళ్లి చేసుకోవాలంటే ఎలా... స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏం చెబుతోంది?
- బడి మానిపించేందుకు 650 మంది అమ్మాయిలకు కలుషిత ఆహారం-బీబీసీ పరిశీలనలో వెల్లడి














