అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: అయిదు రాష్ట్రాలలో గెలిచేదెవరు

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఇంటరాక్టివ్‌ను చూడ్డానికి జావా స్క్రిప్ట్‌తో ఆధునిక వెబ్ బ్రౌజర్, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో రాబోతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీ వరకు సాగిన పోలింగ్‌కు సంబంధించిన ఫలితాలను ఎన్నికల సంఘం కాసేపట్లో వెల్లడించబోతోంది.

దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌ (403) తో పాటు పంజాబ్(117) ఉత్తరాఖండ్ (70), మణిపూర్ (60), గోవా(40) రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. 5 రాష్ట్రాలలో కలిపి 690 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలను బీబీసీ తెలుగు ఎప్పటికప్పుడు లైవ్ కవరేజ్ ద్వారా మీకు అందిస్తుంది.

ప్రధానమంత్రి మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర్‌ ప్రదేశ్: అధికార పార్టీకి అగ్నిపరీక్ష

ఈ ఎన్నికలు యావత్తు బీజేపీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీలు అన్న రీతిలో సాగాయి. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పాలనకు, అలాగే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు లిట్మస్ టెస్టుగా మారాయి.

కులం, మతం కేంద్రంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలు సాగాయాని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ఒక పార్టీ లేదా కూటమి అధికారం సాధించాలంటే 202 స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.

యోగి ఆదిత్యనాథ్, ప్రియాంకా గాంధీ, అఖిలేశ్ యాదవ్, మాయావతిలు తమ తమ పార్టీలకు ప్రధానమైన ఫేస్‌లుగా ఉధృతంగా ప్రచారం చేశారు. యూపీలో వరుసగా అయిదేళ్లు పూర్తి పదవీ కాలం అధికారంలో కొనసాగిన తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ చరిత్రకెక్కారు.

యోగి పాలనలో ఠాకూర్ల ఆధిపత్యం, దౌర్జన్యాలు సాగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించగా, అఖిలేశ్‌ యాదవ్‌ ఐదేళ్ల ఎస్పీ పాలనలో యాదవులు, ముస్లింలలోని సంఘ వ్యతిరేక శక్తుల దౌర్జన్యాలను తాము అదుపులోకి తెచ్చామని బీజేపీ ప్రచారం చేసింది.

కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంకా వాధ్రా, రాహుల్‌గాంధీలు విస్తృతంగా ప్రచారం చేశారు. ముస్లింలు, బీసీలు, అగ్రవర్ణాల వారిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగింది. యోగి పాలనలతో దళితులకు, మైనారిటీలకు రక్షణ లేదని ప్రియాంకా వాధ్రా పదే పదే ఆరోపించారు.

ఇటు దళితులు, బీసీలు, బ్రాహ్మణులను ఆకట్టుకునేలా బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రచారం సాగించగా, తన సంప్రదాయ మద్ధతుదారులైన యాదవులతోపాటు జాట్లు, ముస్లింలు, ఇతర బీసీల వర్గాల వారిని ఆకట్టుకునేలా సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ప్రచారం సాగించారు.

ప్రధానమంత్రి పార్లమెంటు నియోజకవర్గం (వారణాసి) కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉండటంతో యూపీలో విజయం సాధించడం బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. అధిక సంఖ్యాకులైన హిందువుల ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టి బీజేపీ ప్రచారం నిర్వహించింది.

కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటారో నిర్దేశించే రాష్ట్రం కావడం, 2024లో సాధారణ ఎన్నికలు ఉండటంతో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి యూపీ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సీఏఏ, రైతు చట్టాలు, పెట్రోలు ధరలు, నిరుద్యోగం, మైనారిటీలపై దాడులు లాంటి అంశాలు బీజేపీ ఓటింగ్ పై నెగెటివ్ ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. అయితే, హిందూ ఓట్ల పోలరైజేషన్ విషయంలో బీజేపీ చాలా వరకు విజయం సాధించిందని, ప్రభుత్వ వ్యతిరేకత అంశాన్ని ఇది మరుగుపరచ వచ్చని కూడా అంటున్నారు.

పంజాబ్ ఎన్నికలు

పంజాబ్‌లో బహుముఖ పోరు

పంజాబ్ ఎన్నికలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఈసారి కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య ప్రధానమైన పోరు సాగింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతుల ఆందోళనలు బీజేపీకి పడే ఓట్లపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు.

117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో విజేతగా నిలవాలంటే పార్టీ లేదా కూటమి 59 సీట్లు సాధించాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషాల్లో ముఖ్యమంత్రిని మార్చడం, పదవి కోల్పోయిన కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో చేతులు కలపడంతో అది కాంగ్రెస్ ఓట్లపై ప్రభావ చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే, రాష్ట్రంలో 32 శాతం షెడ్యూల్డ్ కులాల ఓట్లు ఉండటం, ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రజలకు అందుబాటులో ఉండరన్న ఆరోపణలతో ఆయనను పదవి నుంచి తప్పించింది కాంగ్రెస్.

ఆయన స్థానంలో ఎస్సీ సామాజిక వర్గ నేత చరణ్‌ జిత్ సింగ్ చన్నీకి బాధ్యతలు అప్పగించింది. చన్నీకి కామన్ మ్యాన్ అన్న పేరు ఉంది. ఈ రెండు అంశాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూకు, ముఖ్యమంత్రి కి కొనసాగుతున్న విభేదాలు పార్టీ భవితవ్యాన్ని అయోయమంలోకి నెడుతున్నాయి.

వీడియో క్యాప్షన్, ప్రధాని భద్రతే ప్రశ్నార్థకమైతే

పంజాబ్‌లో ఐదేళ్లకోసారి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మార్చుకున్న పార్టీ అకాలీ దళ్. 2007 నుంచి 2017 వరకు ఆ పార్టీ వరుసగా 10 ఏళ్లు పాలించింది. అయితే, ఈసారి అనేక పార్టీలు బరిలోకి దిగడంతో ఆ పార్టీకి ఈసారి అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రైతుల ఉద్యమం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల ప్రాముఖ్యతను ముందే గుర్తించిన ఆ పార్టీ అందరికంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించింది. బీఎస్పీతో పొత్తు కుదుర్చుకుంది.

ఇక 2017లో పంజాబ్‌లో తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అప్పట్లో 20 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అండర్ కరెంట్ కొనసాగింది. మార్పు కోరుకున్న ప్రజలకు ఆమ్‌ఆద్మీ ప్రత్యామ్నాయంగా మారిందని చెబుతారు.

ప్రస్తుతం దిల్లీలో అధికారంలో ఉన్న ఆ పార్టీ , విద్య, ఆరోగ్య వ్యవస్థలలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. దిల్లీ మోడల్‌ను పంజాబ్‌లో కూడా అమలు చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది.

మహిళలకు నెలకు రూ.1000 ఇస్తామని చెప్పడం, విద్యుత్ హామీలు ఆ పార్టీకి పాజిటివ్‌గా మారినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించి ఆ పార్టీ ప్రచారం నిర్వహించింది.

ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో బీజేపీ నాలుగు రాష్ట్రాలను పాలిస్తోంది. పంజాబ్ ఒక్కటే బీజేపీయేతర రాష్ట్రం. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.

ప్రధానమంత్రి మోదీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాధ్రా, యోగి ఆదిత్యానాథ్, అఖిలేశ్ యాదవ్, కెప్టెన్ అమరీందర్ సింగ్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్, చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, కేజ్రీవాల్, మాయావతి తదితర కీలక నేతలకు ఈ ఎన్నికల ఫలితాలు పరీక్షలా మారాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు

ఎన్నికల నిర్వహణలో సవాళ్లు

కరోనా థర్డ్‌వేవ్ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ ప్రక్రియను నిర్వహించడం ఎన్నికల కమీషన్‌కు సవాలుగా మారినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించింది.

షెడ్యూలు విడుదలకు ముందే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి, హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ, నిపుణులు, రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య కార్యదర్శులతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సమావేశాలు నిర్వహించింది.

అన్ని భద్రతా చర్యలతో ఎన్నికలు నిర్వహించడంలో కరోనా ప్రభావం కనపించలేదు. కోవిడ్ జాగ్రత్తలు, పెద్ద సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు, సమస్యాత్మక ప్రాంతాల లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏడు దశల్లో ఎన్నికలను పూర్తి చేసింది ఎలక్షన్ కమీషన్.

అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఒకే దశలో, మణిపూర్‌లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)