ఆంధ్రప్రదేశ్: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్... గత సదస్సులో కుదిరిన ఒప్పందాలతో రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా?

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023... పారిశ్రామిక, సేవలు, ఐటీ, షిప్పింగ్, మెడికల్ తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఆహ్వానిస్తూ విశాఖలో మార్చి 3, 4 తేదీలలో ఈ సదస్సు జరగబోతోంది.

ఇలాంటి సదస్సులు అట్టహాసంగా నిర్వహిస్తారు. వీటిలో లక్షల కోట్లలో వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి. కానీ, ఇందులో కుదిరిన ఒప్పందాల్లో ఎన్ని నిజంగా పెట్టుబడుల రూపంలో రాష్ట్రాలకు వస్తాయో అనే ప్రశ్న ఎదురవుతోంది.

ఈ సదస్సు ద్వారా నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్ని పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంటుంది? అందులో ఎన్ని కార్యరూపం దాల్చుతాయనే దానిపై అందరి దృష్టీ నిలిచింది.

అలాగే, గతంలో జరిగిన సదస్సుల్లో కుదిరిన ఒప్పందాల్లో ఎన్ని పరిశ్రమలు, వ్యాపార సంస్థల రూపంలో ఏపీకి వచ్చాయి అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ఏపీ ఆర్థిక రాజధానిలో పెట్టుబడి ఒప్పందాల ప్రవాహం’

విభజన తర్వాత ఏపీకి విశాఖ ఆర్థిక రాజధానిగా మారిన పరిస్థితి ఏర్పడింది. దాంతో విభజన తర్వాత ఏపీలో జరిగిన మూడు ఇన్వెస్టర్ల సమ్మిట్లను కూడా విశాఖ వేదికగానే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది నాలుగో ఇన్వెస్టర్ల సమ్మిట్ ఇది.

పారిశ్రామిక రంగంలో విశేషమైన వృద్ధిని సాధించే లక్ష్యంతో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

“ఈ సమ్మిట్ ద్వారా ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అపార అవకాశాలు, అందుబాటులో ఉన్న వనరులను వివరించి పెట్టుబడులను ఆకర్షించడమే ముఖ్య ఉద్దేశం. ఈ సమ్మిట్‌లో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, వాటి కోసం కల్పించనున్న మౌలిక సదుపాయాలు, వ్యాపారాలకు అనుకూల వాతావరణం, ప్రతిభ, నైపుణ్యం కలిగిన మానవ వనరుల గురించి చెబుతాం. ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, హెల్త్‌కేర్, మెడికల్ ఎక్విప్‌మెంట్, లాజిస్టిక్స్, పెట్రోలియం, ఫార్మా, పునరుత్పాదక ఇంధనం, టెక్స్‌టైల్స్, టూరిజం, హాస్పిటాలిటీ వంటి దీర్ఘకాలిక వృద్ధికి అవకాశం ఉన్న వివిధ రంగాలలో పెట్టుబడులను ఆకర్షిస్తాం” అని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

విశాఖలో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా రూ. 2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అమర్నాథ్ అన్నారు. పెట్టుబడుల ఒప్పందాలే కాదు, అవి కార్యరూపం దాల్చేలా చర్యలూ తీసుకుంటామని వివరించారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ఏపీ విషయంలో ప్రభుత్వం లెక్క ఇది...’

ఏపీ పారిశ్రామికంగా వెనుకడుగు వేస్తోందని ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్నాయి. అయితే, ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చేస్తున్న విమర్శలని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అన్నారు.

దీనికి సంబంధించిన లెక్కలను ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ఆయన వివరించారు. ఆయన చెప్పిన లెక్కలు ఈ విధంగా ఉన్నాయి...

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ లెక్కల ప్రకారం, రాష్ట్రంలో గత మూడేళ్లలో 37,956గా ఉన్న ఎంఎస్ఎంఈ (Ministry of Micro, Small & Medium Enterprises) యూనిట్లు 60,800కు పెరిగాయి. ఇందులో ఉద్యోగులు 4,04,939 నుంచి 5,61,235 మందికి పెరిగారు. అలాగే గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ నిలకడగా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు విడుదల చేసిన లెక్కల ప్రకారం, 2021-22లో దేశంలో అత్యధికంగా రెండంకెల జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43 శాతంగా ఉంది. 974 కి.మీ.తో దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం ఏపీ సొంతం. దేశంలోని 11 పారిశ్రామిక కారిడార్లలో మూడింటిని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్నారు.

‘‘గత మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఏపీలో పెట్టుబడిదారులకు వేగవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్‌లు, వివిధ రకాల ఓడరేవుల నిర్మాణం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

మొత్తం రూ. 2.2 లక్షల కోట్ల పెట్టుబడితో 20,000 ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో 89 భారీ ప్రాజెక్టులు క్రియాశీలంగా రాష్ట్రంలో అమలులో ఉన్నాయి. ఇప్పుడు జరగబోయే సమ్మిట్ ద్వారా మరిన్ని పరిశ్రమలు, ఉద్యోగాలు రాష్ట్రానికి వస్తాయి. ఈ సమ్మిట్‌కు 25 నుంచి 40 దేశాల నుంచి 7,500 మంది వ్యాపార, పరిపాలన ప్రతినిధులు హాజరవుతున్నారు’’అని అమర్‌నాథ్ చెప్పారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ఆహ్వానితుల్లో జెఫ్ బెజోస్, అంబానీ, అదానీ....’

విశాఖలో జరగనున్న సమ్మిట్‌ ఆహ్వానితుల జాబితాలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్, సామ్‌సంగ్ చైర్మన్, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ కూడా ఉన్నారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రేజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్. చంద్రశేఖరన్ వంటి భారతీయ పరిశ్రమ దిగ్గజాలను కూడా ఆహ్వానించారు.

ఈ సమ్మిట్ ద్వారా వివిధ రంగాల్లోకి రూ. 5-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ అధికారులు చెప్పారు.

అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, పరిశ్రమ సంఘాలు, వాణిజ్య సంస్థలను దీర్ఘకాలిక భాగస్వామ్యం చేసేందుకు ఈ సమ్మిట్ వేదిక కానుందన్నారు.

వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, టూరిజం వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారించినట్లు చెప్పారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వంతో పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటిలో ఎన్ని ఇప్పటీ వరకు కార్యరూపం దాల్చయనే విషయంపై ఏపీ పరిశ్రమలశాఖ అధికారులను బీబీసీ ప్రశ్నించింది.

ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ పనుల్లో బీజీగా ఉన్నామని, తమ వద్ద రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, వాటి ద్వారా ఉపాధి పొందుతున్న వారి వివరాలే తప్ప, ఒప్పందాలు ఎన్ని అమలయ్యాయనే వివరాలు లేవని వారు చెప్పారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

గత సదస్సుల్లో ఎన్ని ఒప్పందాలు కుదిరాయి?

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజనచట్టంలో ఉండటంతో పారిశ్రామికవేత్తల దృష్టి రాష్ట్రంపై పడింది. కొత్త రాష్ట్రం, పైగా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉండటంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు వరుస కట్టారు. ఆ నేపథ్యంలో జరిగిన పెట్టుబడులు సదస్సులు విజయవంతమయ్యాయి.

2016, 2017,2018 సంవత్సరాలలో విశాఖలో వరుసగా సీఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగాయి. 2016 సదస్సుకి 41 విదేశాలతో పాటు దేశం నుంచి 1600 మంది వ్యాపార ప్రతినిధులు వచ్చారు. పరిశ్రమలు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఉందంటూ వేదిక ఎక్కిన వ్యాపారవేత్తలు, పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నవారు అన్నారు. ఇవే కాకుండా మరిన్ని పెట్టుబడులు సైతం పెట్టేందుకు సిద్ధమని అన్నారు.

పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, ఈ ఒప్పందాల్లో 60-70 శాతం అమలయ్యేలా చూస్తామని అప్పటి ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. 'పార్టనర్‌షిప్‌ ఫర్‌ ఎ షేర్డ్‌ అండ్‌ సస్టయినబుల్‌ వరల్డ్‌ ఎకానమీ టు ప్రమోట్‌ సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌' స్లోగన్‌తో ఏర్పాటైన ఈ సదస్సు ద్వారా రూ. 4.7 లక్షల కోట్లు పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి.

ప్రధానంగా టూరిజం, పెట్రోలియం, ఐటీ, సీఆర్డీఏలలో భారీ ఒప్పందాలు కుదిరాయి. అదే ఉత్సహంతో 2017 సీఐఐ సదస్సుని కూడా విశాఖలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

2017 జనవరిలో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సుకి కూడా పెట్టుబ‌డుల ఒప్పందాలు పోటెత్తాయి. ఇందులో మొత్తం 665 ఎంవోయిల ద్వారా 10.54 లక్షల కోట్ల ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం చేసుకుంది.

వీటి ద్వారా 22 ల‌క్షల ఉద్యోగాలు రాష్ట్రానికి వస్తాయని అప్పటి సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సులో ఏనర్జీ రంగంలో 47, సీఆర్డీఏ 62, మైనింగ్ 50, ఫుడ్ ప్రాసెసింగ్ 177 , టూరిజం 69, ఐటీ 67, రోడ్లు, భ‌వ‌నాలు 1, యానిమ‌ల్ హ‌జ్బెండ‌రీ 1, ఏపీటీఐడీసీఓ 14, స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ 3, టెక్స్ టైల్స్ 8, ఉన్నత విద్య 9, ఎక‌నామిక్ డెవ‌ల‌ప్మెంట్ బోర్డు 66.. మొత్తం 665 ఒప్పందాలను రాష్ర్ట ప్రభుత్వం దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో కుదుర్చుకుంది. వీటి వల్ల రాష్ర్టానికి 22 ల‌క్షల ఉద్యోగాలు వ‌స్తాయ‌ని అంచనా వేశారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘10 శాతం ఒప్పందాలు అమలైతే... అభివృద్ధి జెట్ స్పీడే’

2016 జనవరిలో జరిగిన సీఐఐ సదస్సులో రూ. 4.7 లక్షల కోట్ల ఒప్పందాలు, 2017 జనవరిలో జరిగిన సమ్మిట్ లో రూ. 10.5 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ రెండు సదస్సుల ద్వారా కనీసం 5 నుంచి 10 శాతం ఒప్పందాలు కూడా కార్యరూపం దాల్చలేదని పారిశ్రామికవేత్తలు అంటున్నారు.

“2016, 2017 ఒప్పందాల్లో కనీసం పది శాతం కూడా పెట్టుబడుల రూపంలో రాలేదు. కనీసం సదస్సుకు పెట్టిన ఖర్చంతైనా పెట్టుబడి రూపంలో వచ్చిందా అనేది అనుమానమే. ఎందుకంటే ఒక్కొ సదస్సుకు రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు ఖర్చు చేశారు. మధురవాడ ఐటీ సెజ్‌లో నేను ఒక కంపెనీ పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాను. కానీ ఆ తర్వాత రెండు, మూడు సార్లు తిరిగినా ప్రభుత్వ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో నేను పెద్దగా పట్టించుకోలేదు” అని విశాఖకు చెందిన ఒక ఐటీ రంగ పారిశ్రామికవేత్త బీబీసీతో అన్నారు.

‘‘సదస్సుల ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాలు పెట్టుబడుల రూపంలో కార్యరూపం దాల్చితే ఆ రాష్ట్రం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. కానీ ఈ ఒప్పందాలు కార్యరూపంలోకి తీసుకురావడమే పెద్ద పని. ఆ పని రాష్ట్ర ప్రభుత్వానిదే’’అని ఆయన అన్నారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ప్రత్యేక హోదా అంశం కూడా ఒక కారణమే...’

ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకంతో సదస్సులు జరిగే సమయంలో అన్ని కంపెనీలూ హాజరై తమ పేరుతో కర్చీఫ్ వేశాయని...అయితే ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపకపోవడం, కేంద్రం ఏకంగా ప్రత్యేక హోదాపై మాటే మార్చేయడంతో పెట్టుబడిదారులు ఏపీ వైపు చూడటం మానేశారని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మేల్సీ స్వతంత్ర్య అభ్యర్థి ఇల్లిపిల్లి అప్పలరాజు బీబీసీతో అన్నారు.

“గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ సదస్సులతోనూ, ఈవెంట్లతోనూ ప్రజలను మభ్య పెట్టడం తప్పితే...రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే పనులు చేయడం లేదు. సీఐఐ సమ్మిట్‌లో జరిగిన ఒప్పందాలు... అమలైనవి... ఇంకా రావాలసినవి... పైప్ లైన్‌లో ఉన్నవి వంటి వివరాలతో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి.

అంతేకానీ, ప్రతి ఏడాది ఈవెంట్ చేసినట్లు సమ్మిట్లు జరిపి ప్రజల సొమ్ము వృథా చేయడం వలన ప్రయోజనం లేదు. అలాగే, ఆర్థిక నిపుణులు ఇలాంటి సదస్సుల్లోని ఒప్పందాలు పది శాతం నిజమైతే గొప్పేనని అంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఏ ప్రతిపాదికన ఇటువంటి సదస్సులతో ప్రజాధనం దుబారాగా ఖర్చు పెడుతోంది?” అని అప్పలరాజు ప్రశ్నించారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘పెట్టుబడుల సదస్సులు పెళ్లి చూపులు లాంటివి’

‘‘విశాఖలో గతంలో జరిగిన సమ్మిట్లలో ఇక పెట్టుబడుల ప్రవాహమే అన్నట్లు ప్రసంగాలు, కరతాళ ధ్వనుల మధ్య వ్యాపార ఒప్పందాలు కనిపించాయి. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు ఒప్పంద పత్రాలు చకచకా ఇచ్చిపుచ్చుకున్నాయి. అయితే అలా జరిగిన ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాల్చి పరిశ్రమలు, ఇతర వ్యాపార సంస్థలుగా రాష్ట్రానికి వచ్చాయి? అంటే లెక్కలు చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి’’అని ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. ప్రసాదరావు అన్నారు.

“పెళ్లి చేసుకునే ముందు అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూసుకుంటారు. అన్ని బాగుంటే ముందుకు వెళ్తారు. లేదంటే అక్కడితో ఆగిపోతారు. సదస్సుల్లో జరిగే ఒప్పందాలు కూడా పెళ్లి చూపులు వంటివే. కంపెనీలు, పెట్టుబడిదారులు ఆ రాష్ట్ర పరిస్థితిని, అక్కడి వాతావరణాన్ని అంచనా వేసేందుకు సదస్సులకు హాజరవుతారు. వచ్చి తమ ఆలోచనలను ఒప్పందాల రూపంలో ప్రభుత్వం ముందు ఉంచుతారు. అనుకూలంగా జరిగితే అవి కార్యరూపం దాల్చుతాయి. లేదంటే అక్కడితే వాటిని మర్చిపోవడమే.. అందుకే బిజినెస్ సమ్మిట్లలో జరిగే ఒప్పందాల్లో 5 నుంచి 10 శాతం కూడా కార్యరూపం దాల్చవు. గుజరాత్ వంటి రాష్ట్రాలు మాత్రం ఇందుకు మినహాయింపు” అని ప్రొఫెసర్ ప్రసాదరావు బీబీసీతో అన్నారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘విశాఖలో రెండు కంపెనీలు...’

‘‘ఒక పారిశ్రామికవేత్త లేదా పెట్టుబడిదారు ఒక రాష్ట్రానికి వచ్చి పెట్టుడి పెట్టాలంటే అక్కడ నిలకడైన అభివృద్ధి (సస్టైనబుల్ గ్రోత్) ఉండాలి. అది పెరుగుతూ ఉండాలి. తలసరి ఆదాయం బాగుండాలి, ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉండాలి. అలాగే రాజకీయంగా కాస్త స్థిరత్వం ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ కూడా ఉండాలి. ఇలాంటి అంశాలన్నింటి చూసి ఎవరైనా పెట్టుబడిదారులు ముందుకు వస్తారు’’అని ప్రొఫెసర్ ఎం. ప్రసాదరావు అన్నారు.

“ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకంతో గతంలో జరిగిన సదస్సుల్లో భారీగా పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. కానీ తర్వాత కాలంలో ప్రత్యేక హోదా అంశం క్రమంగా కనుమరుగవవ్వడంతో చాలా మంది పెట్టుబడిదారులు వెనుకడుగువేశారు. రాజకీయంగా రాష్ట్రంలో సుస్థిరత ఉంది. ఇప్పుడు గ్లోబర్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారానైనా రాష్ట్ర ప్రభుత్వం తమ వనరులు, సౌకర్యాలను బలంగా ప్రజెంట్ చేసి, చిత్తశుద్ధి కనబరిస్తే.. కనీసం 10 శాతం ఒప్పందాలైనా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. గత సమ్మిట్లలో జరిగిన ఒప్పందాల్లో మధురవాడ ఐటీ సెజ్‌లో ఒక ఐటీ కంపెనీ, పరవాడ ఫార్మా సిటీలో ఒక మెడికల్ యూనిట్ వచ్చినట్లు గుర్తుంది” అని ఎం. ప్రసాదరావు అన్నారు.

వీడియో క్యాప్షన్, నందమూరి తారకరత్న: మరో మూడు రోజుల్లో పుట్టినరోజు, ఇంతలోనే...

‘ఒప్పందం చేసుకున్న 6 నెలల్లో పరిశ్రమ పెడితే...’

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొడవైన సముద్ర తీరాన్ని పూర్తిగా వినియోగించుకుని మారీటైం బోర్డు ద్వారా 15 వేల కోట్ల రూపాయలతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనున్నామని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

ఇప్పుడున్న పోర్టులకు అదనంగా నాలుగు కొత్త పోర్టులు అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి పోర్టుకు ఆనుకుని ఐదు నుంచి పదివేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయిస్తున్నామని చెప్పారు.

‘‘పునరుత్పాదక ఇంధన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ. 1,44,000 కోట్ల ఎగుమతులు చేశాం. హ్యాండ్లూమ్స్ టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ప్రాంతాలను మేజర్ కాన్సెప్ట్ సిటీలుగా రూపుదిద్దుతున్నాం. భోగాపురం ఎయిర్‌పోర్టును ఆనుకుని 100 ఎకరాలలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం’’అని ఆయన చెప్పారు.

విశాఖలో జరగనున్న సమ్మిట్‌లో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఆరు నెలల్లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి మరింత మద్దతు అందిస్తామని అమర్నాథ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, జీవీఎంసీ: వివాదంగా మారిన రూ.15 వేలు గిఫ్టు కార్డులు

‘ఒప్పందాలు కాదు, పరిశ్రమలు రావాలి’

‘‘2016, 2017లలో విశాఖలో జరిగిన సీఐఐ పెట్టుబడుల సదస్సుల్లో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభుత్వం విజయవంతమైంది. కానీ, ఆ అవగాహన ఒప్పందాల్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో విఫలమైంది. మరి ఇప్పుడు జరగబోతున్న సీఐఐ సదస్సు మళ్లీ ఒక ఈవెంట్‌గా మిగిలిపోతుందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పందాలకే పరిమితమవుతుందా లేక వాటిని విజయవంతంగా కార్యరూపంలోకి తీసుకువస్తుందా అన్నది చూడాలి. ఒప్పందాలు ఆచరణలో కనిపించకపోతే సదస్సుల వల్ల ఉపయోగం ఉండదని మరోసారి రుజువవుతుంది’’అని విశాఖకు చెందిన ఐటీ రంగ వ్యాపారవేత్త ఆర్ మెహన్ రావు బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: సీఎం వస్తున్నారని చెట్లు కొట్టేశారు, ఇప్పుడు మొక్కలు నాటుతున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)