చైనా-భారత్ యుద్ధం-1962: 'తవాంగ్‌పై దాడి ఓ పీడకల... శత్రువు తేనె మాటల్ని నమ్మకూడదని అప్పుడే తెలిసింది'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఘవేంద్ర రావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘అది తవాంగ్‌లో వరి కోతలు కోసే సమయం. అయితే, పగలురాత్రి తేడా లేకుండా అన్నివైపుల నుంచీ దాడి చేయడానికి వారు వచ్చేవారు. దీంతో ప్రాణ భయంతో ప్రజలు పరుగులుపెట్టేవారు.’’
థుతాన్ చెవాంగ్ వయసు అప్పడు 11 ఏళ్లు. అయితే, నాటి పరిస్థితులు ఇప్పటికీ ఆయనకు గుర్తున్నాయి. యుద్ధాన్ని ఆయన తన కళ్లతో ప్రత్యక్షంగా చూశారు.
అది 1962 అక్టోబరు నెల. ఈశాన్య భారత్‌లోని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (నేటి అరుణాచల్ ప్రదేశ్)పై ఒక్కసారిగా చైనా దాడి చేసింది. దాడి చాలా వేగంగా మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ, చైనా సైన్యం ముందు భారత్ సైన్యం నిలవలేకపోయింది.
సరిహద్దుకు కేవలం 35 కి.మీ. దూరంలో తవాంగ్ ఉంటుంది. దీంతో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. దాదాపు నెల రోజులపాటు ఇది చైనా సైన్యం నియంత్రణలోనే ఉంది.
నేటికి 60 ఏళ్లు గడిచాయి. ఇక్కడి యుద్ధ జ్ఞాపకాలు ప్రజల మనసుల్లో నుంచి చెరిగిపోయి ఉండొచ్చు. కానీ, ఆనాడు ఏం జరిగిందో ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది.
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల్లో పెరిగిన థుతాన్ చెవాంగ్ జవాన్‌గా మారారు. 28 ఏళ్లపాటు సాయుధ బలగాల్లో పనిచేసిన ఆయన పదవీ విరమణ పొందారు.
యుద్ధ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఆయన అన్నారు.


‘‘అదొక పీడకల లాంటిది’’
‘‘ఇక్కడ రోడ్లు లేవు. సురక్షితమైన ప్రాంతాలకు చేరుకునేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా అడవుల మధ్య నడుస్తూ ప్రజలు వెళ్లేవారు. తమకు అవసరమైన వస్తువులు, నిత్యావసరాలను తరలించేందుకు వారికి గాడిదలే ఆధారం. అదొక పీడకల లాంటిది’’అని చెవాంగ్ చెప్పారు.
1962నాటి యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసిన వారితో మాట్లాడి నవాంగ్ ఛోటా ఒక పుస్తకం రాశారు. నవాంగ్ కూడా ఇక్కడే జీవిస్తున్నారు.
‘‘అందరూ భయపడేవారు. కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని భావించేవారు. అప్పట్లో వాహనాలు కూడా లేవు. కాలి నడకన ఎంత దూరం వెళ్లగలరు?’’అని ఆయన ప్రశ్నించారు.
1962నాటికి లోబ్‌సాంగ్ త్సెరింగ్ వయసు 11 ఏళ్లు. చైనా సైనికుల దాడి మొదలైనప్పుడు, తల్లిదండ్రులు ఆయన్ను అస్సాంకు తీసుకెళ్లిపోయారు. యుద్ధం పూర్తయిన తరువాతే వీరు మళ్లీ వెనక్కి వచ్చారు.
నెల రోజుల తర్వాత, నవంబరులో కాల్పుల విరమణను చైనా ప్రకటించింది. తమ బలగాలను ఉపసంహరించుకుంది. కానీ, ప్రజలకు చైనా సైన్యం మీద నమ్మకం ఉండేది కాదు.
‘‘చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోయిందని మాకు చెప్పారు. కానీ, అది అబద్ధమని అందరూ భావించేవారు. ఎందుకంటే యుద్ధంలో చైనా గెలిచింది. అలాంటప్పుడు వారు ఎందుకు వెనక్కి వెళ్తారు? అని అందరూ అనుకునేవారు’’అని తవాంగ్‌లో జీవించే ల్హామ్ నోర్బూ చెప్పారు.
‘‘భారత సైన్యం మాకు అబద్ధాలు చెబుతోందని, వారు మమ్మల్ని చైనాకు అప్పగించేయాలని చూస్తున్నారని అంతా అనుకునేవారు. అయితే, నిజంగానే చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారని తెలిసిన తర్వాత, మళ్లీ తమ నివాసాలకు ప్రజలు తిరిగి వచ్చారు’’అని ఆయన వివరించారు.

‘‘చేదు జ్ఞాపకాలు’’
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక్కడి నుంచి పారిపోయిన ప్రజలు మళ్లీ వెనక్కి వచ్చినప్పుడు ఇక్కడ దారుణమైన దృశ్యాలను చూశారు.
అప్పటి పరిస్థితులు రిన్‌చిన్ దోర్జేకు ఇప్పటికీ గుర్తున్నాయి. ‘‘మేం వెనక్కి వచ్చినప్పుడు, చైనా సైన్యం హతమార్చిన భారత సైనికుల మృతదేహాలు మాకు వీధుల్లో కనిపించాయి’’అని ఆయన చెప్పారు.
మరోవైపు అప్పటి పరిస్థితులు ల్హామ్ నోర్బుకు కూడా ఇంకా గుర్తున్నాయి. ‘‘మరణించిన తమ సైనికుల మృతదేహాలను చైనా సైన్యం తీసుకెళ్లిపోయింది. భారత సైనికుల మృతదేహాలను మాత్రం కావాలనే రోడ్డు మధ్యలో వదిలిపెట్టి వారు వెళ్లిపోయారు. అప్పుడు చాలా మంది చనిపోయారు’’అని ఆయన వివరించారు.
అయితే, స్థానికుల సాయం కోసం అప్పట్లో చైనా సైన్యం తీవ్రంగా ప్రయత్నించిందని నవాంగ్ ఛోటా చెప్పారు.
‘‘కానీ, ఇక్కడి ప్రజల విశ్వాసం, నమ్మకాన్ని చైనా సైన్యం ఎప్పటికీ గెలుచుకోలేదు. వారికి మా నుంచి ఎలాంటి సాయమూ అందలేదు’’అని ఆయన వివరించారు.

మళ్లీ వార్తల్లో తవాంగ్..
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో భాగమైన తవాంగ్ మళ్లీ నేడు తరచూ వార్తల్లో నిలుస్తోంది.
ప్రధాన ఆధ్యాత్మిక బౌద్ధ కేంద్రాల్లో ఒకటైన తవాంగ్‌తో 14వ దలై లామా తెంజిన్ గ్యాత్సోకు ప్రత్యేక అనుబంధముంది.
1959లో తిబ్బత్ (టిబెట్) నుంచి వచ్చేసిన ఆయన కొంతకాలపాటు తవాంగ్ బౌద్ధారామంలో జీవించారు.
1962 యుద్ధం తర్వాత ఈ ప్రాంతం నెల రోజులపాటు చైనా సైన్యం నియంత్రణలోకి వెళ్లింది. అప్పటి నుంచి నేటి వరకు రెండు దేశాల మధ్య ఇది వివాదాస్పద ప్రాంతంగానే ఉంది.
గత ఏడాది డిసెంబరులో తవాంగ్‌లోని యాంగ్సేలో రెండు దేశాల సైనికులు ఘర్షణకు కూడా దిగారు.
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్ ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చి చైనా సైన్యం యాథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోందని భారత్ చెబుతోంది.
దీనిపై పార్లమెంటు వేదికగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటన కూడా చేశారు. ‘‘భారత భూభాగంలోకి చొరబడకుండా చైనా సైన్యాన్ని భారత సైన్యం నిలువరించింది. వారి స్థానాల్లోకే మళ్లీ వారు వెళ్లిపోయేలా ప్రతిఘటించింది’’అని ఆయన చెప్పారు.
యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య ఇక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. 2021 అక్టోబరులోనూ రెండు దేశాల సైనికులు యాంగ్సేలో ఢీఅంటేఢీ అని ఎదురెదురుపడ్డారు.

వాస్తవాధీన రేఖ వెంబడి..
తవాంగ్ పట్టణానికి వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) కేవలం 35 కి.మీ. దూరంలో ఉంటుంది.
బుమ్-లా పాస్ మీదుగా మలుపులు తిరిగే రోడ్డు గుండా వెళ్తే ఎల్ఏసీ వస్తుంది.
సముద్ర మట్టానికి బుమ్-లా పాస్ దాదాపు 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఒక్కోసారి ఆక్సిజన్ అందడం కూడా కష్టమవుతుంది.
ఇక్కడ చుట్టుపక్కల ఎంతో అందమైన సరస్సులు కనిపిస్తాయి. అయితే, కనిష్ఠ ఉష్ణోగ్రతల నడుమ వీటిలో నీరు చాలా కాలంపాటు గడ్డకట్టే ఉంటుంది.
1962 యుద్ధ సమయంలో ఇక్కడ రెండు దేశాల సైనికులు భీకరంగా పోరాడారు. ఆనాటి యుద్ధానికి సంబంధించిన కొన్ని జాడలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి.
ఆనాడు యుద్ధంలో ఉపయోగించిన బంకర్లు ఇప్పటి రోడ్డు పక్కన మనకు కనిపిస్తాయి. వీటిలో నుంచే చైనా దాడిని భారత సైనికులు తిప్పికొట్టేవారు.
నేడు ఈ బంకర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే, వాస్తవాధీన రేఖ వెంబడి ఇప్పటికీ భారీగా సైనికులు కనిపిస్తున్నారు.
రెండు దేశాల సైనికుల మధ్య ఇక్కడ చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను చూసి స్థానికులేమీ ఆశ్చర్యపోవడం లేదు.
ఇక్కడ సైనికులు భారీగా మోహరించి ఉండేటప్పటికీ, తవాంగ్‌తోపాటు ఎల్ఏసీని చూసేందుకు పర్యటకులు వస్తూనే ఉన్నారు.
బుమ్-లా పాస్ మీదుగా ఎల్ఏసీకి పర్యటకులను తీసుకెళ్తూ ఇక్కడ చాలా మంది స్థానికులు ట్యాక్సీ డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు.

తవాంగ్ యుద్ధ స్మారకం..
యుద్ధంలో కామెంగ్ సెక్టార్‌లో 2,420 మంది భారత సైనికులు మరణించినట్లు భారత సైన్యం ప్రకటించింది. సైనికులకు నివాళులు అర్పించేందుకు తవాంగ్‌లో ఒక యుద్ధ స్మారకాన్ని కూడా నిర్మించారు.
ఈ స్మారకంలో టిబెట్ నుంచి ఇక్కడకు వచ్చిన తర్వాత, 1959లో 14వ దలైలామా తీసుకున్న కొన్ని అరుదైన ఫోటోలు కూడా ఉన్నాయి.
మరికొన్ని ఫోటోలు 1962 యుద్ధంనాటి పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. ఆయుధాలు, సైనిక సామగ్రి ఫోటోలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.
‘‘మేం ఎప్పటికీ ఆనాటి యుద్ధాన్ని మరచిపోలేం. ఎందుకంటే మేం దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. శత్రువుల తేనే మాటలు ఎప్పటికీ నమ్మకూడదని మేం తెలుసుకున్నాం. ఇదే మేం నేర్చుకున్న గొప్ప పాఠం’’అని నవాంగ్ ఛోటా చెప్పారు.

‘‘కేఫ్ 62’’
1962నాటి యుద్ధం వాతావరణాన్ని ప్రతిబింబించే పరిస్థితులు మరోచోట కూడా మాకు కనిపించాయి.
తవాంగ్‌కు 35 కి.మీ. దూరంలో జాంగ్ పట్టణం ఉంటుంది. భారత్ సైన్యంలో 21 ఏళ్లపాటు పనిచేసి పదవీ విరమణ పొందిన రిన్‌చిన్ డ్రెమా ఇక్కడ ‘‘కేఫ్ 62’’ పేరుతో ఒక కేఫ్‌ను మొదలుపెట్టారు.
‘‘ఆ యుద్ధంలో మా ఇంట్లోని పెద్దవారిని చాలా వేధించారు. వారు ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారు. వాటిని గుర్తుచేసేలా మా కేఫ్‌కు ‘కేఫ్ 62’అని పేరు పెట్టాం’’అని ఆయన చెప్పారు.
ఉద్రిక్తతలు కొత్తేమీ కాదు..

రెండు దేశాల సైనికుల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు తాము అలవాటు పడిపోయామని తవాంగ్‌లో జీవించే ప్రజలు చెబుతున్నారు.
డిసెంబరు ఘర్షణల వల్ల తమకు భయంగా అనిపించలేదని, కానీ, ఇక్కడి వ్యాపార లావాదేవీలపై చాలా ప్రభావం పడిందని వివరిస్తున్నారు.
తవాంగ్ మార్కెట్‌లో కర్మూ ఒక బట్టల దుకాణం నడిపిస్తున్నారు. ‘‘ఇక్కడి స్థానికులెవరూ ఘర్షణలకు భయపడరు. కొన్నిసార్లు వార్తల్లో వచ్చిన తర్వాతే, ఇలాంటి ఘటన జరిగిందని మాకు తెలుస్తుంది. కానీ, మీడియాలో అతిగా వార్తలు ఇవ్వడంతో ఇక్కడకు వచ్చే పర్యటకుల సంఖ్య తగ్గిపోతుంది’’అని ఆయన చెప్పారు.
మరోవైపు సరిహద్దుల్లో పరిస్థితుల వల్ల స్థానికుల్లో భయమేమీ ఉండదనే వార్తతో తెంజిన్ దార్గే కూడా ఏకీభవించారు.
‘‘ఇక్కడ పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మా జీవితాలేమీ తలకిందులు కావు. కానీ, మీడియాలో దీనికి భిన్నమైన వార్తలు వస్తుంటాయి’’అని ఆయన చెప్పారు.

1962 యుద్ధంతో పోలిస్తే, నేడు ఎలాంటి పరిస్థితులకైనా ఎదురు నిలిచేందుకు భారత సైన్యం మెరుగ్గా సిద్ధమైందని తవాంగ్‌లో చాలా మంది భావిస్తున్నారు. 1962నాటి భారత సైన్యానికి నేటి సైన్యానికి చాలా తేడా ఉందని వారు అంటున్నారు.
మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రోడ్లు కూడా చాలా మెరుగు పడ్డాయని, ఫలితంగా సైనికులు, సైనిక సామగ్రిని భారత సైన్యం వేగంగా తరలించగలుగుతోందని చెప్పారు.
‘‘మీరు ఇక్కడి స్థానికులు ఎవరితోనైనా మాట్లాడండి.. అవసరమైతే మేం కూడా భారత సైన్యానికి సాయం చేస్తామని చెబుతారు’’అని నవాంగ్ ఛోటా చెప్పారు.
అయితే, చైనా సైన్యంతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని కొందరు అంటున్నారు.
‘‘వారు మళ్లీమళ్లీ చొరబడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పగటి పూట చర్చలకు పిలుస్తారు.. రాత్రిపూట దాడులు చేస్తారు. అందుకే మనం అన్నివేళలా జాగ్రత్తగా ఉండాలి. వారిని కొంచెం కూడా నమ్మడానికి వీల్లేదు’’అని థూతన్ చెవాంగ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- బైరి నరేశ్ మీద పోలీస్ జీపులో ఉండగానే దాడి... దీనిపై పోలీసులు బీబీసీతో ఏమన్నారు?
- ఆంధ్రప్రదేశ్-అమ్మఒడి: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై వివాదం ఏమిటి?
- బంగ్లాదేశ్ నుంచి ఈ 500 మంది భారత్‌కు ఎందుకు వచ్చారు? వాళ్లు ఏం కోరుతున్నారు?
- ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















