చైనాతో సవాళ్లు: సరిహద్దుల్లో భారత్ ఎలా బలపడుతోంది?

రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ఫైజల్ మహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్, చైనా సరిహద్దు సమీపంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్‌లో 100 మీటర్ల పొడవైన 'క్లాస్-70' వంతెనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ప్రారంభించారు.

భారత భద్రతాసంసిద్ధతను పెంచే పనిలో భాగంగా ఇది ప్రారంభించినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.

సియాంగ్ జిల్లాలోని అలాంగ్-యింగ్‌కియాంగ్ రహదారిపై నిర్మించిన ఈ వంతెన 70 టన్నుల బరువును తట్టుకోగలదు. అంటే, ఆర్మీ యూనిట్లు, టీ90 వంటి భారీ తుపాకులు, ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగలిగే క్షిపణులు, ఇతర యుద్ధ సామగ్రిని ఈ వంతెన మీదుగా తరలించొచ్చు.

అవసరమైనప్పుడు దళాలను వీలైనంత వేగం సరిహద్దులకు చేర్చడం లక్ష్యంగా దీన్ని నిర్మించారని ఇండియన్ ఆర్మీ నార్తర్న్ కమాండ్ మాజీ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దీపేందర్ సింగ్ హుడా చెప్పారు.

కాగా గత నెలలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగి రెండు దేశాలకు చెందిన సైనికులూ గాయపడ్డారు.

చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించి సరిహద్దులను మార్చే ప్రయత్నాలు చేస్తుంటే భారత సైన్యం అడ్డుకుందని రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో వెల్లడించారు.

మరోవైపు చైనా అరుణాచల్‌ప్రదేశ్‌ను తమ దేశంలో భాగమని వాదిస్తోంది.

కాగా పియోమ్ వంతెనతో పాటు ఇటీవల కాలంలో దేశ ఈశాన్య సరిహద్దు నుంచి పశ్చిమ సరిహద్దు వరకు ఉన్న రాష్ట్రాలలో రోడ్లు, వంతెనలు, టన్నెల్స్ వంటి 27 రవాణా ప్రాజెక్టులను రక్షణ మంత్రి ప్రారంభించారు.

చైనా, భారత్ సైనికులు

ఫొటో సోర్స్, AFP

గత రెండేళ్లలో రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చుతో సరిహద్దు ప్రాంతాలలో 200కిపైగా ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి.

భారత్‌ 6 దేశాలతో సుమారు 15,106 కిలోమీటర్ల పొడవున సరిహద్దు పంచుకుంటోంది. ఈ ఆరు దేశాలలో పాకిస్తాన్, చైనాలతో భారత్‌కు దౌత్య సంబంధాలు సక్రమంగా లేవు. మరోవైపు నేపాల్‌తోనూ సరిహద్దు వివాదం ఉంది.

మియన్మార్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఇలాంటి సమస్యలు లేనప్పటికీ అక్కడ తీవ్రవాదం.. సరిహద్దుల మీదుగా మానవ అక్రమ రవాణా, ఇతర అక్రమ రవాణా కార్యకలాపాలు వంటి సమస్యలున్నాయి. పైగా మియన్మార్, బంగ్లాదేశ్‌లు చైనాకు దగ్గరవుతున్నాయి. మరోవైపు చైనా భూటాన్ మీదుగా కూడా ఇండియాను చుట్టుముట్టే ప్రయత్నాలు చేస్తోంది.

వీటన్నిటి నేపథ్యంలో భారత్ ఏళ్ల కిందటే పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఉన్న అంతర్జాతీయ సరిహద్దులో కంచె వేయడం ప్రారంభించింది. అంతర్జాతీయ సరిహద్దులోని 7,500 కిలోమీటర్లలో 2022 నాటికి ఎక్కడెక్కడైతే కంచె లేదో అదంతా పూర్తిచేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. కంచె లేని ప్రాంతాలు ఉగ్రవాదుల చొరబాట్లకు, మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా వంటి ఇంతర సరిహద్దు నేరాలకు అవకాశమిస్తున్నాయని అమిత్ షా అన్నారు.

రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, ani

కాగా కంచె వేసే పనులు పూర్తయ్యాయని రక్షణ రంగ నిపుణుడు మనోజ్ జోషీ చెప్తున్నారు.

ప్రస్తుతం భారత్ దృష్టంతా చైనాతో సరిహద్దు ఉన్న ఉత్తర ప్రాంతం, ఈశాన్య ప్రాంతంపైనే ఉందని దీపేందర్ సింగ్ హుడా, మనోజ్ జోషీలు చెప్పారు.

అయితే.. గత కొన్నేళ్లుగా.. ముఖ్యంగా 2013 నుంచి చైనా భారత్ విషయంలో దూకుడుగా ఉంది. 2013లో డేప్సాంగ్, 2014లో చుమర్, 2017లో ఢోక్లాం, 2020లో గల్వాన్, 2022లో తవాంగ్‌లో చైనా వ్యవహరించిన తీరే దీనికి ఉదాహరణ.

మంగళవారం ప్రారంభించిన ప్రాజెక్టులలో సిక్కింలోని కలేప్-గైగాంగ్ రహదారిపై 80 మీటర్ల పొడవైన థాంగు వంతెన కూడా ఉంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ఏడాది పొడవునా సరిహద్దులను చేరుకోవడం సులభమవుతుంది.

సరిహధ్దుల్లో సైనికులు

ఫొటో సోర్స్, ANI

2017లో ఢోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డోక్లాంకు ఉత్తరాన చైనా ఆక్రమిత టిబెట్‌లో చుంబా లోయ ఉండగా.. ఉత్తరాన భూటాన్, పశ్చిమాన సిక్కిం ఉన్నాయి.

చైనా ఈ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి యత్నిండచంతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యంపై భారత్ ఆందోళన చెందుతోంది. భారత ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్ అని పిలిచే కీలక ప్రాంతానికి సమీపంలో ఉందిఇది.

2020 నుంచి చైనా దూకుడు పెరిగినప్పటికీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలోని సుమ్దోరోంగో చు వద్ద 1986-87లో తలెత్తిన ఘర్షణలు భారత దౌత్యవేత్తలు, భద్రతానిపుణుల మనసులలో ఇంకా తాజాగానే ఉన్నాయి. అది జరిగిన తరువాత 1987లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చైనాలో పర్యటించారు.

రాజీవ్ గాంధీ, అప్పటి చైనా నేత డెంగ్ జియావోపింగ్ మధ్య భేటీ జరిగింది. ఆ భేటీలో జియావోపింగ్.. ‘‘ఇండియా, చైనాల మధ్య సంబంధాలు 1950లలో బాగుండేవి, ఇప్పుడలా లేవు’ అన్నారు.

గతం మరిచి భవిష్యత్‌ వైపు అడుగులు వేయాలంటూ ఆయన 1962 ఇండోచైనా యుద్ధాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు.

సరిహద్దు రహదారులు

ఫొటో సోర్స్, Getty Images

రహదారులు..

రెండు దేశాల మధ్య సరిహద్దులకు సంబంధించి ఒప్పందాలు ఉన్నప్పటికీ చైనా వీటిని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

2011-18 మధ్య చైనా నుంచి భారత్‌లోకి చొరబాట్ల సంఖ్య ఏటా 200 నుంచి 460 వరకు ఉంటున్నాయని... 2019లో అది ఏకంగా 663కి చేరిందని భద్రత వ్యవహారాలపై పనిచేసే సంస్థ హడ్సన్ చెప్తోంది.

భారత్ సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు చేపట్టడమూ పెరుగుతోంది.

చైనాతో సరిహద్దుల్లో రవాణా సదుపాయాలు, కమ్యూనికేషన్స్ మెరుగుపర్చుకోవడంపై భారత్ గతంలో ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ బృందం 73 చోట్ల రహదారులు నిర్మించాలని ప్రతిపాదించింది. వీటినే ఇండియా చైనా బోర్డర్ రోడ్స్ అంటారు.

ఈ ప్రతిపాదిత ప్రాంతాల్లో కొన్నిచోట్ల రోడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ కొన్నిచోట్ల మాత్రం ఆలస్యమయ్యాయి. 2005 నుంచి 2009 మధ్య ఈ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా సాగిందని మనోజ్ జోషీ చెప్పారు.

సరిహద్దుల్లో నిర్మాణ పనులు అనేక కారణాల వల్ల వేగంగా సాగలేదు. భూసేకరణ సమస్యలు, వాతావరణం, భౌగోళిక ఇబ్బందులు వంటివి ఉన్నాయని సైన్యం చెప్తోంది. అయితే, ఢోక్లాం ఘటన తరువాత ఈ రోడ్ల పనులు మళ్లీ ముమ్మరమయ్యాయి.

అటల్ టన్నెల్

ఫొటో సోర్స్, Getty Images

జమ్ముకశ్మీర్‌లో 55 మీటర్ల పొడవైన బస్తీ వంతెన, ఉత్తరాఖండ్-టిబెట్ సరిహద్దుల్లో 24 కిలోమీటర్ల పొడవైన భైరాన్ వ్యాలీ-నెలాంగ్ రోడ్ ఇటీవల పూర్తయ్యాయి.

9 కిలోమీటర్ల పొడవైన అటల్ టన్నెల్, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జోజిలా టన్నెల్ కూడా సరిహద్దుల్లో భద్రత బలోపేతం చేసే లక్ష్యంగా ఏర్పాటుచేస్తున్న రవాణా సదుపాయాలే. ప్రస్తుతం 20కి పైగా సొరంగమార్గాలు నిర్మాణంలో ఉన్నాయి.

లెఫ్టినెంట్ జనరల్ దీపేందర్ హుడా మాట్లాడుతూ.. దేశంలోని అనేక సరిహద్దు ప్రాంతాలు ఏడాదిలో నాలుగైదు నెలల పాటు అసలు చేరడానికి వీల్లేకుండా ఉంటాయని అన్నారు.

గత ఐదుపదేళ్లలో సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర నిర్మాణ ప్రాజెక్టులకు నిధులు భారీగా కేటాయించారని మనోజ్ జోషీ చెప్పారు.

2020 తరువాత చైనాతో ఉద్రికత్తలు పెరిగిన నేపథ్యంలో ఇండియా తన సరిహద్దుల్లో 60 వేల మందికిపైగా సైనికులను కొత్తగా మోహరించిందని.. వారికి వసతి ఏర్పాటుచేసే పనులు కొనసాగుతున్నాయని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు.

సరిహద్దులు

అయితే సరిహద్దుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇండియా కంటే చైనా ముందుందని మనోజ్ జోషీ చెప్పారు. భారత్ తన హిమాలయ ప్రాంత సరిహధ్దుల్లో 10 రైల్వే ప్రాజెక్టుల గురించి ఆలోచించినా ఇంకా ఒక రూపమివ్వలేకపోయింది.. అదేసమయంలో చైనా టిబెట్‌లోని లాసా వరకు రైలు మార్గం నిర్మించేసింది.

మరోవైపు మియన్మార్ సరిహద్దుల్లోనూ భారత్‌కు ఆందోళనకర పరిణామాలున్నాయి. ‘పశ్చిమ మియన్మార్‌లోని చిన్ రాష్ట్రం వరకు ఆ దేశం చైనా సహాయంతో రోడ్డు వేసుకుంది. కానీ, ఇండియాలో సరిహధ్దు వరకు వేయాల్సిన రోడ్డు పని పెండింగులో ఉంది’ అని మిజోరం ఎంపీ కేకే వన్‌లాల్వేనా అన్నారు.

మియన్మార్‌లో ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారం చేపట్టిన తరువాత 25 వేలమందికిపైగా శరణార్థులు భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు వచ్చారు.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)