కైలాస: ఇండియా నుంచి పారిపోయిన నిత్యానంద ‘దేశం’ మీద ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది

ఫొటో సోర్స్, KAILASA's SPH JGM Nithyananda Paramashivam/Facebook
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద తనదిగా చెప్పుకొంటున్న కల్పిత దేశం కైలాస ప్రతినిధులు చేసిన ప్రకటనలను తాము పట్టించుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ ప్రతినిధులు ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి కమిటీ సమావేశాలకు హాజరయ్యారు.
ఐక్యరాజ్య సమితికి చెందిన అధికారి ఒకరు దీనిపై మాట్లాడుతూ కమిటీ సమావేశాలలో చర్చించిన అంశాలకు ఈ ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలకు ‘సంబంధం’ లేదని చెప్పారు.
అత్యాచారం, హత్య సహా భారత్‌లో వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద కోసం పోలీసులు వెతుకుతున్నారు.
తాను 2019లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస(యూఎస్‌కే) దేశాన్ని స్థాపించినట్లుగా చెప్పుకొంటున్న నిత్యానంద ఈ ఆరోపణలన్నిటినీ ఖండిస్తున్నారు.
గత వారం ఐక్యరాజ్య సమితి సమావేశాలలో యూఎస్‌కే ప్రతినిధులు పాల్గొనడం భారత్‌లో చర్చనీయమైంది. అయితే, భారత ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి బహిరంగ ప్రకటనా చేయలేదు.
ఫిబ్రవరిలో జెనీవాలో నిర్వహించిన రెండు యూఎస్ పబ్లిక్ మీటింగ్స్‌కు యూఎస్‌కే ప్రతినిధులు హాజరయ్యారని ఐరాస అధికారి ఒకరు బీబీసీకి ఈమెయిల్‌లో తెలిపారు.
ఇందులో ఒకటి ‘‘మహిళలపై వివక్ష నిర్మూలన కమిటీ(సీఈడీఏడబ్ల్యూ)’’ ఫిబ్రవరి 22న నిర్వహించిన ‘‘నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలలో మహిళల ప్రాతినిధ్యం’’ అనే అంశంపై సమావేశం కాగా.. రెండోది ‘‘ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ(సీఈఎస్‌సీఆర్)’’ ఫిబ్రవరి 24న నిర్వహించిన ‘సుస్థిరాభివృద్ధి’ సమావేశం అని తెలిపారు.
ఇవి సాధారణ చర్చలని, వీటిలో ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చని ‘‘యూఎన్ హైకమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్’’ మీడియా ఆఫీసర్ వివియన్ క్వాక్ చెప్పారు. సీడీడీఏడబ్ల్యూ, సీఈఎస్‌సీఆర్‌ల మీడియా వ్యవహారాలు క్వాక్ చూస్తారు.
సీఈడీఏడబ్ల్యూకు యూఎస్‌కే రాతపూర్వకంగా సమర్పించిన అంశాలను ఆ కమిటీ నివేదికలో పొందుపరచబోరని క్వాక్ చెప్పారు. నిర్దేశిత అంశానికి సంబంధించినది కాకపోవడంతో దానికి నివేదికలో చోటు ఉండదని చెప్పారు.
‘‘ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ(సీఈఎస్‌సీఆర్)’’ చర్చలో కూడా యూఎస్‌కే ప్రతినిధుల ప్రకటనను పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
యూఎన్ వెబ్‌సైట్‌లో ‘‘ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ(సీఈఎస్‌సీఆర్)’’ చర్చకు సంబంధించిన వీడియో ఒకటి ఉంది. అందులో.. హాజరైనవారి నుంచి ప్రశ్నలను ఆహ్వానించగా తనను తాను ‘‘విజయప్రియ నిత్యానంద’’గా చెప్పుకొన్న ఓ మహిళ ఐరాసలో యూఎస్‌కే శాశ్వత రాయబారినని చెప్తూ హిందువుల కోసం ఏర్పాటుచేసిన తొట్టతొలి సార్వభౌమ దేశం యూఎస్‌కే అని ఆమె చెప్పారు. ‘‘హిందూత్వకు అత్యున్నత అధిపతి’’ అయిన నిత్యానంద ఈ దేశాన్ని ఏర్పాటుచేశారని ఆమె చెప్పారు.
యూఎస్‌కే పౌరులందరికీ ఆహారం, ఆశ్రయం, వైద్యం వంటి అవసరాలన్నీ కల్పిస్తున్నందున సుస్థిరాభివృద్ధిలో తమ దేశం విజయవంతమైనందని విజయప్రియ చెప్పారు. ‘‘నిత్యానంద, కైలాస ప్రజలపై పీడన’’ను ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
సీఈఎస్‌సీఆర్‌కు భారత మాజీ దౌత్యాధికారి ప్రీతి శరణ్ కూడా హాజరయ్యారు. దీనిపై మాట్లాడేందుకు బీబీసీ ఆమెకు ఈమెయిల్ చేసింది.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019లో భారత్ నుంచి పారిపోయారు. నిత్యానంద తనపై అత్యాచారం చేశారని ఆయన శిష్యురాలు ఒకరు 2010లో ఆరోపించారు. ఆ తరువాత ఆయన్ను అరెస్ట్ చేశారు, కొద్దిరోజులకే బెయిల్ వచ్చింది. 2018లో ఆయనపై అభియోగాలు నమోదు చేశారు.
భారత్ నుంచి వెళ్లిపోవడానికి ముందు కొద్దిరోజుల ముందు ఆయనపై మరో కేసు నమోదైంది. చిన్నారులను అపహరించి గుజరాత్‌లోని తన ఆశ్రమంలో నిర్బంధించారన్న ఆరోపణలతొ ఆయనపై కేసు పెట్టారు.
అయితే, నిత్యానంద ఎక్కడకు పారిపోయారనేది చాలాకాలం తెలియలేదు.
అనంతరం అదే ఏడాది నిత్యానంద ఈక్వడార్ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. హిమాలయాలలోని కైలాసం పేరిట ఈ దీవిలో తాను ఏర్పాటుచేసుకున్న సొంత దేశానికి కైలాస అని పేరు పెట్టినట్లు చెప్పారు.
అయితే, 2019 నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. కానీ, ఆయన కైలాసలో పాల్గొంటున్నట్లుగా చెప్తున్న కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో పెట్టేవారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో నిర్వహించిన దీపావళి సంబరాలలో నిత్యానంద బ్రిటన్ ప్రతినిధి పాల్గొన్నట్లు ‘ది గార్డియన్’ గత ఏడాది చెప్పింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యుల ఆహ్వానం మేరకు ఆ ప్రతినిధి వచ్చినట్లు గార్డియన్ రాసింది.
విజయప్రియ నిత్యానంద ఐరాస కమిటీ సమావేశంలో మాట్లాడిన వీడియోను నిత్యానంత తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో దానిపై భారత్‌లో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
కైలాసకు సంబంధించిన వెబ్‌సైట్‌లో అక్కడ 200 కోట్ల మంది హిందువులు ఉన్నట్లు పేర్కొన్నారు. కైలాస దేశానికి ప్రత్యేక జెండా, రాజ్యాంగం, సెంట్రల్ బ్యాంక్, పాస్‌పోర్ట్ వంటివన్నీ ఉన్నట్లు కైలాస వెబ్‌సైట్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















