రాముడు నడిచిన దారి ప్రాజెక్టు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లో రామమందిర నిర్మాణం అంశం అనేక ఏళ్లుపాటు రాజకీయ వివాదంగా కొనసాగింది.
దీని నిర్మాణం కోసం పాటుపడింది తామేనని చెప్పుకుంటూ యూపీ ఎన్నికల్లో గెలుపు సాధించింది బీజేపీ.
కానీ... మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉండగా... కాంగ్రెస్ పార్టీ రాముడి పేరుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ సాఫ్ట్-హిందుత్వ విధానాన్ని చేపట్టిందంటున్నారు.
అందులో భాగంగానే రామ్ వన్ గమన్ పథ్ పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టిందని విమర్శకులంటున్నారు.
రామ్ వన్ గమన్ పథ్... అరణ్యంలో రాముడు నడిచిన దారి.... హిందూ పురాణాల ప్రకారం, రాముడు, సీత, లక్ష్మణుడు తమ వనవాస కాలంలో విడిది చేసిన ప్రాంతాలను కలిపే దారి.
ఈ ప్రాంతాలను పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రామ్ వన్ గమన్ పథ్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది.
‘‘ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకూ విశాలమైన భూభాగం ఉంది. ఇది దాదాపు 2200 కిలోమీటర్ల పొడవుంటుంది. ఈ పొడవైన దారిలో దాదాపు 130 ప్రదేశాల్లో రాముడు, సీత, లక్ష్మణుడు విడిది చేశారని పురాణాలు చెబుతున్నాయి. మొదటి దశలో మేం వీటిలో 9 ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నాం’’ అని ఛత్తీస్‌గఢ్ పర్యటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సాహూ బీబీసీతో చెప్పారు.
రామ్ వన్ గమన్ పథ్ ప్రాజెక్టులో భాగంగా రాముడి తల్లి కౌశల్య మందిరాన్ని పునర్నిర్మించాలనే పథకం కూడా ఉంది.
‘‘దక్షిణ కౌశల రాజ్యంలో భానుమంతుడనే రాజు ఉండేవాడు. ఆయన కూతురే మాతా కౌశల్య. భానుమంతుడు అయోధ్య మహారాజు దశరథుడితో తన కూతురి వివాహం జరిపించారు. వివాహం తర్వాత మాతా కౌశల్య దశరథుడి ధామానికి వెళ్లిపోయింది. కాబట్టి శ్రీరాముణ్ని ఈ ప్రాంతవాసులు తమ మేనల్లుడిగా భావిస్తారు’’ అని చంద్‌ఖురీలోని మతా కౌశల్య మందిరం పూజారి పండిత్ అభిషేక్ శర్మ చెప్పారు.
రాముడు, లక్ష్మణుడు, సీతల వనవాస జీవితంలో ఎక్కువ సమయం ఛత్తీస్‌గఢ్‌లోనే గడిచిందని నమ్ముతారు. ఇక్కడి దండకారణ్యంలో గడిచిందని చెబుతారు. ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతాన్ని హరి కా చౌఖా, సీతామఢి అంటారు. ఇక్కడ రామలక్ష్మణులు, సీత అన్నం వండుకొని తిన్నారని చెబుతారు. ఇక్కడ కొన్ని గుహలున్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వ ఆహ్వానంపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఇక్కడి ఒక మందిరానికి రావడంతో ఈ ప్రాజెక్టుపై విమర్శలు మొదలయ్యాయి.
గత సెప్టెంబర్‌లో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆహ్వానంపై చంద్‌ఖురీ మాతా కౌశల్య మందిర దర్శనానికి రావడంతో ఈ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ హిందుత్వను వాడుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
‘‘సాఫ్ట్ లేదా హార్డ్ హిందుత్వ అంటూ ఏమీ ఉండదు. హిందుత్వ సనాతనమైంది. మోహన్ భాగవత్ హిందుత్వ జెండా పట్టుకొని ఇక్కడికొచ్చారు. మీరు ఎలాగూ ఇక్కడికి వచ్చారు కాబట్టి మాతా కౌశల్య మందిరాన్ని కూడా దర్శించుకొని వెళ్లండని ఆయనను కోరాం. ఇక్కడి గోశాలల్లో గోమాతను సేవించుకోండని చెప్పాం. ఆ తర్వాత ఆయన ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ తమకు లిఖితపూర్వక ఆహ్వానం కావాలన్నారు. మేం జిల్లా అధ్యక్షుడితో మాట్లాడాం. అరగంటలో ఆహ్వానం పంపించాం’’ అని ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌పీ సింగ్ చెప్పారు.
అయితే, ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది.
‘‘దీని అర్థం ఏంటంటే... ఈ దేశంలో మోహన్ భాగవత్ అల్టిమేట్ అని కాంగ్రెస్ కూడా ఒప్పుకున్నట్టే. సంఘ్ పరివార్ లేదా ఆర్ఎస్ఎస్ అల్టిమేట్ అని ఒప్పుకున్నట్టే’’ అని బీజేపీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కార్యదర్శి నరేశ్ చంద్ర గుప్తా అన్నారు.
రాష్ట్రంలోని కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానం అనుసరిస్తున్న విధానాల పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ హిందుత్వ మార్గంలో నడవాలనుకుంటే, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించవచ్చుగా అని వారంటున్నారు.
‘‘బీజేపీ అజెండానే మీరు కూడా చేపట్టారా? అదే నిజమైతే దాన్ని బాహాటంగా చెప్పండి’’ అని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అరవింద్ నేతామ్ అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ హిందుత్వ మార్గాన్ని చేపట్టినా పెద్దగా లబ్ధి చేకూరేదేమీ ఉండదని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
‘‘మతం, విశ్వాసం విషయంలో భూపేశ్ బఘేల్ అన్ని రకాల ఎత్తులూ వేస్తున్నారు. ఈ విషయంలో ఆయన బీజేపీకన్నా ఒక అడుగు ముందుండాలని చూస్తున్నారు. కానీ, అటూ దిల్లీలోనూ, ఇటు రాయపూర్‌లోనూ కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్‌కు ఈ విషయంలో పెద్దగా ఆశలేమీ లేవు. రాజకీయ పరిభాషలో హిందుత్వగా ప్రచారంలో ఉన్న మతం, విశ్వాసాల విషయానికొస్తే.. భూపేశ్ బఘేల్, మల్లికార్జున్ ఖర్గే లేదా ఆఖరుకు రాహుల్ గాంధీ అయినా సరే... నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి దిగ్గజాలకు సరితూగరు అనేది స్పష్టం’’ అని రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వయ్ అభిప్రాయపడ్డారు.
రామారం గ్రామం.. పురాణాల ప్రకారం, రామలక్ష్మణులు, సీత చివరిసారి ఇక్కడే విడిది చేశారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాతే సీత అపహరణ జరిగిందని చెబుతారు.
కానీ ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో మాత్రం ఇది చివరి మజిలీ ఏమీ కాదు. ఛత్తీస్‌గఢ్ రాజకీయాలు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి. రామ భగవానుడు బీజేపీకి చెందుతాడా, కాంగ్రెస్‌కు చెందుతాడా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన ఈ రెండు పార్టీల్లో ఎవరిని గెలిపిస్తాడో చూడాల్సిందే అంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢీ కొట్టగలరా
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- రోమన్ సామ్రాజ్య చరిత్రలో కల్పిత చక్రవర్తిని నిజం చేసిన బంగారు నాణేం
- 'ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ: సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని నిజాయితీగా చెప్పిన కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



