ఆంధ్రప్రదేశ్: ‘‘ఖర్చులు భరించలేక నాటుమందు తీసుకుంటున్న’’ ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులు

వీడియో క్యాప్షన్, ఆ ప్రాంతంలో సగటున ప్రతి ఐదారుగురిలో ఒకరికి ఆ సమస్య పట్టి పీడిస్తోంది
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

కోనసీమను తలపించే ఉద్దానంలో ఎందుకు వస్తుందో కారణం తెలియని కిడ్నీ వ్యాధి వేలాది మందిని జీవచ్ఛవాలుగా మార్చేస్తుంది.

దశాబ్దాలు గడుస్తున్నా ఉద్దానం కిడ్నీ బాధితులకు వ్యాధి విషయంలో ఊరట లభించడం లేదు.

ఉద్దానంలో గత ఐదేళ్లుగా బీబీసీ బృందం, ఏటా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ, ఆ సమాచారాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వస్తోంది.

ఉద్దానం

‘వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గింది’

ఈ ఏడాది, వలస కూలీలు ఎక్కువగా ఉండే కవిటి మండలంలోని సహలాల పుట్టుగ గ్రామంలో బీబీసీ పర్యటించింది.

సుమారు 400 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 15 మంది కిడ్నీ వ్యాధి బాధితులున్నారు.

గత రెండేళ్లలో (2012, 2022) ఈ గ్రామం నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఒక్కరు కూడా వెళ్లలేదు.

ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధిత గ్రామాలున్న ప్రధాన ఏడు మండలాలైన పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, మందస, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురంలలో మండలాల్లోని 23 కేంద్రాలలో కిడ్నీ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తారు.

అయితే, కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య ఏటా తగ్గుతోంది. అలాగే ఖర్చులకు వెనుకాడి మందులు వాడటం మానేయడం, వలస కూలీల కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు పెరగడం వంటి ప్రతికూలాంశాలు కనిపించాయి.

మరో వైపు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దాదాపు పూర్తికావడం, డయాలసిస్ సెంటర్లు పెరగడం వంటి సానుకూలంశాలు కనిపించాయి.

2019లో గ్రామగ్రామానికి వైద్యశాఖ సిబ్బంది వెళ్లి పరీక్షలు చేశారని, దాంతో పాటు నిర్ధారణ పరీక్షలపై అవగాహన కల్పించామని వైద్యశాఖ అధికారులు చెప్పారు.

ఉద్దానం
ఫొటో క్యాప్షన్, ఉద్దానం

‘దాతలున్నప్పటికీ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా కష్టమే’

దశాబ్దాలు గడుస్తున్నా ఉద్దానం కిడ్నీ బాధితులకు వ్యాధి విషయంలో ఊరట లభించడం లేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ కిడ్నీ వ్యాధిగ్రస్థులున్న నికరాగువా, కోస్టారిక, శ్రీలంక తర్వాతి స్థానంలో ఉద్దానం ఉంది.

పైగా, ఇతర ప్రాంతాల కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు కూడా చాలా క్లిష్టంగా ఉంటాయని వైద్యులు అంటున్నారు.

“సాధారణంగా రక్తంలో సిరం క్రియాటినిన్ 1.2 mg/dL (మిల్లీ గ్రామ్/డెసీలీటర్ - వీటిని స్థానికులు పాయింట్లు అంటారు) కంటే ఎక్కువగా ఉంటే, మూత్రపిండాలు సరిగా పని చేయడం లేదని అర్థం.

ఉద్దానం

ఉద్దానం ప్రాంతంలో దాదాపు 15 వేల మందికి సీరం క్రియాటినిన్ 3 నుంచి 25 mg/dL ఉంది. 80 శాతం కంటే ఎక్కువ కిడ్నీలు పని చేయడం మానేస్తే, వారికి డయాలసిస్ అవసరమవుతుంది” అని శ్రీకాకుళానికి చెందిన నెప్రాలజిస్ట్, కిడ్నీ వ్యాధిగ్రస్థుల కోసం నిర్వహిస్తున్న సామాజిక ఆసుపత్రి వైద్యులు డాక్టర్ విద్యాసాగర్ బీబీసీకి తెలిపారు.

“ఇతర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి బాధితుల సంఖ్య అక్కడి జనాభాలో 4 నుంచి 6 శాతం ఉంటే ఉద్దానంలో 14 నుంచి 18 శాతం ఉంటుంది.

షుగర్, బీపీ ఉన్న వారికే కాకుండా ఉద్దానంలో అన్ నోన్ ఫ్యాక్టర్ వలన కిడ్నీ జబ్బులు వస్తున్నాయి.

కుటుంబంలో ఎక్కువ మందికి కిడ్నీ వ్యాధి ఉండటంతో కిడ్నీ ఇచ్చేందుకు ఆ కుటుంబంలో ఎవరైనా ముందుకు వచ్చినా కూడా ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం కష్టం.

మరో వైపు ఇక్కడ డయాలసిస్ స్టేజ్‌కు వచ్చే వరకు బాధితుల్లో కిడ్నీవ్యాధి లక్షణాలు కనపడవు” అని డాక్టర్ విద్యాసాగర్ బీబీసీతో అన్నారు.

కిడ్నీ వ్యాధి ఎక్స్‌రే

‘వలస కూలీలం, ఇంటికే పరిమితమయ్యాం’

శ్రీకాకుళం జిల్లాలో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు. ఉద్దాన ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వలస కూలీలు అటు కోల్‌కతా, ఇటు హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు కూలీలుగా వెళ్లి నెలల తరబడి అక్కడే ఉండి, ఏడాదిలో ఒక నెల రోజుల పాటు సొంతూర్లకి వస్తుంటారు.

అటువంటి గ్రామమే సలాహల పట్టుగ కూడా. వ్యాధి బారిన పడి, కూలీ పనులకు వెళ్లలేక కుటుంబానికి భారం అవుతున్నామని, చివరకు మందులకు కూడా డబ్బులు ఉండట్లేదని కిడ్నీ వ్యాధి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“కిడ్నీ వ్యాధి వల్ల మేం కూలీ పనులకు వెళ్లలేకపోతున్నాం. దాంతో మా మీద ఆధారపడిన కుటుంబాలకు ఏం చేయలేకపోగా, వారికే భారంగా మారిపోయాం. మందులకే నెలకు రూ. 20 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొన్ని సార్లు ఖర్చు పెట్టలేక ముందులు అపేస్తున్నా” అని కిడ్నీ వ్యాధి బాధితుడొకరు బీబీసీతో చెప్పారు.

ఉద్దానం

‘త్వరలోనే ఏయూ పరిశోధనల రిపోర్ట్’

ఉద్దానంలోని దాదాపు ప్రతీ గడపలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానే కిడ్నీ వ్యాధి బాధితులుంటారు. ఎక్కువ గడపల్లో కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారి ఫోటోలు కనిపిస్తాయి.

ఉద్దాన ప్రాంతంలో గత పదేళ్లలో 5 వేల మందికి పైగా ఈ వ్యాధితో మరణించగా, ఈ ప్రాంతంలో ఇంకా 35 వేల మందికి పైగా కిడ్నీ వ్యాధి బాధితులున్నారని వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తోంది.

ఉద్దాన ప్రాంతంలోనే ఉండి ఏయూ హ్యుమన్ జెనెటిక్స్ విభాగం చేసిన పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయి.

“ఏపీలోని కిడ్నీ వ్యాధి బాధితుల్లో 70 శాతం మంది ఉద్దానం ప్రాంతానికి చెందిన వారే. ఐసీఎంఆర్, ఏయూ హ్యూమన్ జెనెటిక్ విభాగానికి ఉద్దానం మూత్ర పిండాల వ్యాధి కారణాలను పరిశోధించే ప్రాజెక్టుని అప్పగించింది.

ఒకే ఇంట్లో ఉన్నవారు ఒకే రకమైన ఆహారం తీసుకున్నా కొందరే మూత్రపిండల వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి కారణాలు అన్వేషిస్తు ప్రాజెక్టు చేశాం. అది దాదాపు పూర్తయింది. మరో ఆరు నెలల్లో రిపోర్టు వస్తుంది” అని రీసెర్చ్ స్కాలర్ ధనుంజయ్ బీబీసీకి చెప్పారు.

ఉద్దానం

‘ఖర్చు భరించలేక, వైద్యం మానుకుంటున్నారు’

కిడ్నీ వ్యాధి బాధితులకు వైస్సార్ భరోసా పేరుతో పెన్షన్ అందిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు అందుతుంది. అయితే అందరికి పెన్షన్ అందకపోవడంతో వైద్యం, మందులకు అయ్యే ఖర్చులు బాధితులు భరించలేకపోతున్నారని గత పదేళ్లుగా సోంపేట సామాజిక ఆసుపత్రిలో కిడ్నీ బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్ ఎం. జోగినాయుడు బీబీసీతో చెప్పారు.

“ప్రభుత్వం నుంచి నెలకు రూ. 5 వేలు సాయం అందుతుంది. కానీ అది ఏ మూలకు సరిపోవడం లేదు. దాంతో కొన్ని సార్లు మందులు మానేసి, నాటు మందులు తీసుకుంటున్నాను” అని ఇద్దివానిపాలెంకు చెందిన కిడ్నీ వ్యాధి బాధితురాలు చెప్పారు.

“5 పాయింట్లు ఉంటే కిడ్నీ వ్యాధి బాధిత పెన్షన్ ఇస్తామని అన్నారు. కిడ్నీ వ్యాధి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. 6 పాయింట్లు దాటిపోయింది. కానీ పెన్షన్ నాకు రాలేదు” అని సహలాల పుట్టుగ గ్రామానికి చెందిన కిడ్నీ వ్యాధి బాధితుడొకరు బీబీసీతో చెప్పారు.

“పెన్షన్ అందాలంటే కేవలం పాయింట్లే కాదు, కిడ్నీ శుద్ధి సామర్థ్యం, కిడ్నీ పరిమాణం, కిడ్నీ పని చేయని శాతం, క్రియాటినిన్ స్థాయి 3 నెలల వ్యవధిలో రెండు సార్లు వైద్య పరీక్షల్లో 5 కంటే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ కావడం వంటి లెక్కలు ఈ ఆర్థిక సాయం పొందే అర్హతను నిర్ణయిస్తాయి” అని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బీ. మీనాక్షి తెలిపారు.

ఆసుపత్రి

‘ఆసుపత్రి, వాటర్ ప్రాజెక్ట్ పనులు జోరుగా సాగుతున్నాయి’

ఉద్దాన ప్రాంతంలో తాగే నీటిలోని కొన్ని రకాలైన రసాయనాలు కిడ్నీ వ్యాధులకు కారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి. దాంతో ఐదేళ్ల క్రితమే ప్రభుత్వం బాధిత గ్రామాల్లో మినరల్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం రూ. 700 కోట్లతో ఉద్దానంలోని బాధిత గ్రామాలకు నీటిని తరలించే ప్రాజెక్టుని చేపట్టింది. దానికి సంబంధించిన ట్యాంకుల నిర్మాణం, పైపు లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఉద్దానంలో దాదాపు 805 నివాసిత ప్రాంతాల్లో 6 లక్షల మందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు.

"ఉద్దానానికి హీర మండలం రిజర్వాయర్ నుంచి భూగర్భ పైపులైను ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టుని చేపట్టాం. రూ. 700 కోట్ల ఈ పథకం ద్వారా ఉద్దానం ప్రాంత వాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది.

మరో వైపు రూ. 50 కోట్ల ఖర్చుతో 200 పడకలతో పలాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ దాదాపు పూర్తయింది. పలాసలో రీసెర్చ్ సెంటర్ పెట్టడం వల్ల పేషెంట్స్‌కి డయాలసిస్ ట్రీట్మెంట్‌తో పాటు దూర ప్రాంతాలకు వెళ్లకుండా బయాప్సీ, ఎర్లీ బయోమార్కర్స్ ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించే అవకాశం ఉంటుంది” అని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్పారు.

ఉద్దానం

‘కొన్ని సానుకూలం, మరికొన్ని ప్రతికూలం’

2023 ఫిబ్రవరి చివరి వారంలో ఉద్దాన ప్రాంతంలో పర్యటించిన బీబీసీ పరిశీలనలో కనిపించిన సానుకూలంశాలు:

  • పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం దాదాపు పూర్తయింది.
  • బాధిత గ్రామాల్లో చురుగ్గా సాగుతున్న వాటర్ ప్రాజెక్టు పనులు
  • ఆర్థిక స్థోమత కలిగిన కుటుంబాల్లో మందుల వాడకంపై కలిగిన అవగాహన
  • జిల్లాలోనే అందుబాటులోకి వచ్చిన డయాలసిస్ సెంటర్లు
  • ఉద్దాన ప్రాంతంలోనే ఉండి వ్యాధి మూలాలు, వ్యాధి ప్రభావం, బాధిత కుటుంబాలపై చూపుతున్న ప్రభావం వంటి అంశాలపై ఏయూ పరిశోధనలు
ఉద్దానం

బీబీసీ పరిశీలనలో కనిపించిన ప్రతికూల అంశాలు:

  • ఖర్చుకు వెనుకాడి మందులు వాడటం మానేస్తున్న కొందరు కిడ్నీ వ్యాధి బాధితులు
  • పెరిగిన సోషల్ మీడియా వైద్యం
  • కిడ్నీ వ్యాధి ఉన్న కుటుంబాల వారితో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోకపోవడం, సంబంధాలు రద్దు చేసుకోవడం
  • వ్యాధి నిర్ధారణ పరీక్షలకు వస్తున్న వారి సంఖ్య తగ్గడం
  • మందులు వాడుతున్న వ్యాధి నయం కాకపోడంతో నాటు మందులను నమ్మతున్న కొందరు బాధితులు
  • పనులకు వెళ్లలేక ఇళ్లకే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీ కుటుంబాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)