సుషీ టెర్రర్: జపాన్‌లో రెస్టారెంట్ల వ్యాపారాన్ని ప్రమాదంలో పడేసిన ఆ వైరల్ వీడియోల్లో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షైమా ఖలీల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సుషీ టెర్రర్‌కు కారణమైన ముగ్గురిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. సుషీ కన్వేయర్ బెల్ట్ రెస్టారెంట్ల ప్రపంచ ప్రఖ్యాత వంటకాలను అపరిశుభ్రపరిచిన చిలిపి చేష్టలే ఈ సుషీ టెర్రర్.
గత నెలలో ఒక వ్యక్తి సుషీ కన్వేయర్‌పై సోయా సాస్ బాటిల్‌ను నాకుతూ తీసుకున్న ప్రాంక్ వీడియో వైరల్ అయింది. ఇది ఆగ్రహం రేకెత్తించింది.
వీడియోలో ఆ వ్యక్తి ఒక కురా సుషీ రెస్టారెంట్ బ్రాంచ్‌లో సుషీ వంటకాలను ఎంగిలి చేయడం కనిపిస్తుంది.
అప్పటి నుంచి అటువంటి డజన్ల కొద్దీ వీడియోలు వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన రేకెత్తింది.
ఈ ఘటనలు చాలా డైనింగ్ ప్రదేశాల్లో కూడా చిత్రీకరించారు. పలువురు పిల్లలు, యువకులు ప్రయాణిస్తున్న సుషీ వంటకాలను తాకుతూ ఇతరుల ఆర్డర్లను పాడు చేశారు.
గత నెలలో బయటికొచ్చిన ఓ వీడియోలో ఒక కస్టమర్ మరొకరి డిష్‌పై వాసబిని పెట్టడాన్ని చూపించగా, ఇంకో వ్యక్తి చాప్‌స్టిక్‌లను ఎంగిలిచేశారు.
ఒక సుషిరో రెస్టారెంట్‌లో చిత్రీకరించిన మరో వీడియోలో ఒక కస్టమర్ సుషీ ముక్కలపై లాలాజలాన్ని రుద్దడం కనిపిస్తుంది.
ఇది వైరల్ కావడంతో జపనీయులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా స్థానికంగా కైటెన్‌జుషి అని పిలిచే ఈ సుషీ ట్రైన్ పద్దతిపై ప్రభావం చూపించింది.

ఫొటో సోర్స్, Getty Images
సుషీ టెర్రర్‌పై జపనీయులు ఏమంటున్నారు?
"విదేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ సుషీ తినడానికి ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఒక జపనీస్ వ్యక్తిగా నేను అలాంటి చర్యలపై సిగ్గుపడుతున్నాను" అని యుకారీ తనకా అనే మహిళ బీబీసీతో తన భావన పంచుకున్నారు.
నానా కొజాకీ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ " జపాన్ సంస్కృతి అయిన కైటెంజుషిని చూసి మనం గర్వపడవచ్చు. కానీ అలాంటి వ్యక్తుల చర్యలు నిజంగా దానిని నాశనం చేస్తాయి" అని అభిప్రాయం వ్యక్తంచేశారు.
మరికొందరు ఈ ట్రెండ్‌ని చూసి "కొంచెం భయపడిపోయామని" చెప్పారు. రెస్టారెంట్‌లకు వెళ్లడానికి ఎక్కువ ఇష్టపడటం లేదని తెలిపారు.
జపాన్ ఖచ్చితమైన పరిశుభ్రత ప్రమాణాలు, ఆతిథ్య మర్యాదలకు ప్రసిద్ధి చెందింది.
అందుకే "సుషీ టెర్రరిజం" చిలిపి చేష్టలు దేశవ్యాప్తంగా మిలియన్ల మందిని దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా సుషిరో చైన్ వంటి కంపెనీల షేర్ల పతనానికి దారితీశాయి.
ఈ చర్యలను ఆపాలంటూ పలువురు బహిరంగ విజ్ఞప్తులు చేస్తూ కైటెన్‌జుషి గొలుసులను ప్రోత్సహిస్తున్నారు.
చాలావరకు రెస్టారెంట్లు తినుబండారాల వద్ద తమ 'ప్రధాన ఆకర్షణ' ప్రయోగాలను నిలిపివేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆందోళనలో రెస్టారెంట్ల యాజమాన్యాలు
తూర్పు జపాన్‌లో ఒక కస్టమర్ ఊరగాయ అల్లం జార్‌లో సిగరెట్ పీకను పెట్టడంతో ఆ కన్వేయర్ బెల్ట్‌లను ఉపయోగించడం పూర్తిగా నిలిపివేస్తామని చౌషిమారు చైన్ ప్రకటించింది.
సిబ్బంది ఇప్పుడు నేరుగా కస్టమర్‌లకు వంటకాలను తీసుకువస్తారు. వారు తమ సీట్లలో కూర్చున్నప్పుడు మాత్రమే మసాలాలు, సాస్‌లను అందజేస్తారు.
అలాంటి వైరల్ వీడియోలు అత్యంత ప్రమాదకరమైనవని, కన్వేయర్-బెల్ట్ రెస్టారెంట్ మోడళ్ల పునాదికి అది పెనుముప్పు కలిగిస్తుందని కురా సుషీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.
"కన్వేయర్ బెల్ట్ సుషీ అనేది జపనీస్ సంస్కృతిలో భాగం, మనం గర్వించదగ్గ విషయం. మా కస్టమర్‌లు బెల్ట్‌పై డెలివరీ అయిన సుషీని సురక్షితంగా, సౌకర్యవంతంగా తినేలా చూడాలని మేం కోరుకుంటున్నాం" అని ఆయన చెప్పారు.
అనేక సుషీ విభాగాలు ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
సెంట్రల్ జపాన్ నగరమైన నగోయాలో ఫిబ్రవరి 3న కురా సుషీ కన్వేయర్-బెల్ట్ సుషీ రెస్టారెంట్‌లో 21 ఏళ్ల ర్యోగా యోషినో సోయా సాస్ బాటిల్‌ను నాలుకతో నాకి అక్కడే పెట్టేశారని పోలీసులు చెప్పారు.
15, 19 ఏళ్ల వయస్సు గల మరో ఇద్దరు మైనర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. వారి చర్యలు జపాన్ శిక్షాస్మృతి ప్రకారం వ్యాపారాన్ని అడ్డుకునే చర్యగా పోలీసులు వెల్లడించారు.
వాళ్లందరూ తప్పు చేశామని ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తి తన చర్యలపై క్షమాపణలు కూడా చెప్పారు.
ఇప్పటికే కష్టాల్లో ఉండగా సుషీ టెర్రర్‌తో మరో పిడుగు
కరోనా, యుక్రెయిన్ రష్యా యుద్ధం, జపాన్ దేశ కరెన్సీ పతనంతో ఇప్పటికే ఆ దేశంలోని రెస్టారెంట్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
గతేడాది తమ చౌకైన వస్తువులపై కూడా చాలామంది ధరలను పెంచవలసి వచ్చింది. ఈ అపరిశుభ్రమైన చిలిపి చేష్టలతో ఇప్పుడు వారు మరో పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు.
కస్టమర్‌లకు పరిశుభ్రత ప్రమాణాలపై భరోసా కల్పించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్‌లు ఇబ్బందులు పడుతున్నాయి.
సుషిరో గత నెలలో తన నిబంధనలను మార్చింది. సుషి టెర్రర్‌లను నియంత్రించడానికి కస్టమర్లు తమ పాత్రలు, మసాలా దినుసులను సిబ్బంది నుంచి సేకరించవలసి ఉంటుంది.
కురా సుషీ మరో కొత్త విధానం తీసుకొచ్చింది. దాని కన్వేయర్ బెల్ట్‌లను సెన్సార్లు, కెమెరాలతో అమర్చింది.
ట్యాంపర్ చేసిన (అపరిశుభ్రమైన) ప్లేట్‌ను ఎవరైనా తిరిగి పెడితే టోక్యో, ఒసాకా సమీపంలోని సైతామా ప్రిఫెక్చర్‌లోని చైన్ కార్యాలయాలకు హెచ్చరిక పంపిస్తుంది.
సంబంధిత రెస్టారెంట్‌కు కూడా సమాచారం అందించనున్నారు. కొత్త సెన్సార్‌లు నిర్దిష్ట ప్లేట్, సీట్ నంబర్‌ను కూడా గుర్తించగలవని కంపెనీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
- మహిళా సైంటిస్టులకు నెలకు రూ.55 వేలు ఇచ్చే పథకం గురించి తెలుసా?
- హెచ్3ఎన్2 వైరస్ ఏమిటి? డాక్టర్లు ఏమంటున్నారు?
- సింగిల్ స్క్రీన్ థియేటర్స్: శిథిలాలుగా మారుతున్న ఒకనాటి భారతదేశ సినిమా వైభవ ప్రతీకలు
- నరేంద్రమోదీ-అమిత్ షా: అమృతపాల్ సింగ్ రెచ్చిపోవడం వల్ల బీజేపీకి రాజకీయంగా లాభమా, నష్టమా?
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల వాటా పెరుగుతోందా, తగ్గుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














