నరేంద్రమోదీ-అమిత్ షా: అమృతపాల్ సింగ్‌ రెచ్చిపోవడం వల్ల బీజేపీకి రాజకీయంగా లాభమా, నష్టమా?

అమృతపాల్ సింగ్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అవతార్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''వాళ్లు (బీజేపీ) ముసుగు తొలగించారు. మేం హిందువులం అని చెప్పుకుంటున్నారు. హిందూ రాష్ట్రం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు'' 'వారిస్ పంజాబ్ దే' అధినేత అమృతపాల్ సింగ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాటలన్నారు.

అమృతపాల్ సింగ్ ఇటీవల పంజాబ్‌లో క్రియాశీలకంగా మారారు. సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఖలిస్తాన్‌ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

అమృతపాల్ సింగ్ హావభావాలు, మాట్లాడే విధానం చూసి ఆయన్ను జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేతో పోలుస్తున్నారు.

అమృతపాల్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే పంజాబ్ ప్రభుత్వం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది.

సిక్కులకు ప్రత్యేక గుర్తింపు కావాలని...

"భారత రాజ్యాంగం ప్రకారం, సిక్కులకు ప్రత్యేక గుర్తింపు లేదు. వారిని హిందువుల్లో భాగంగానే పరిగణిస్తారు" అన్నది అమృతపాల్ సింగ్‌ వాదన.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25లో సిక్కు, జైన, బౌద్ధ మతాలను హిందూమతంలో భాగంగానే ప్రస్తావించారని ఆయన అంటున్నారు.

"ఖలిస్తాన్‌లో ప్రతి వర్గానికి సమాన అధికారాలు ఉంటాయి" అని వాదిస్తున్నారు అమృత్ పాల్.

అమృతపాల్ సింగ్‌

ఫొటో సోర్స్, Getty Images

పంజాబ్‌లో మొదలైన ఉద్యమం...

పంజాబ్‌ 1980లలోనే ఖలిస్తాన్ ఉద్యమాన్ని చూసింది.

ప్రస్తుతం అమృతపాల్ సింగ్ పంజాబ్‌లో బలమైన సిక్కు నాయకుడిగా ఎదుగుతున్నారు.

ఫిబ్రవరి 23న ఆ రాష్ట్రంలో ఆయన సహచరులు చేతుల్లో కత్తులతో అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు.

అరెస్టైన తమ సహచరుడిని విడుదల చేయించుకోవడానికే తాము ఈ దాడికి దిగామని అమృత్‌పాల్ అనుచరులు చెప్పారు.

నిరసనల తరువాత పోలీసులు వాళ్ల సహచరుడిని విడుదల చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తి సంఘటన స్థలంలో లేరని అమృతపాల్ ఇచ్చిన సాక్ష్యాలతో ఆయన్ను విడుదల చేశారు.

తమ సహచరుడిపై తప్పుడు ఎఫ్ఐఆర్ బనాయించారని అమృతపాల్ ఆరోపించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, పంజాబ్ క్యాబినెట్ మంత్రి అమన్ అరోరా బీబీసీతో మాట్లాడుతూ పంజాబ్‌లో హిందువులను, సిక్కులను ఎవరూ విడదీయలేరని అన్నారు.

"వీళ్లు ఎంత ప్రయత్నించినా పంజాబ్‌లో హిందు-సిక్కు విభజన చేయలేరు. (తీవ్రవాదం) చీకటి కాలంలో కూడా హిందూ-సిక్కుల మధ్య విభజన రాలేదు. చాలాకాలంగా సంఘ వ్యతిరేక శక్తులు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. కానీ, దీని ప్రభావం పంజాబ్‌పై పడలేదు" అన్నారాయన.

ప్రస్తుత పరిస్థితులను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా పరిశీలిస్తున్నారని, దేశ రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకుంటారని అమన్ అరోరా అన్నారు.

ఏ పార్టీ అయినా రాష్ట్రానికి నిప్పు పెట్టి ప్రయోజనం పొందాలనుకుంటే అది కేవలం వారి భ్రమే అవుతుందని అన్నారు.

అమృతపాల్ సింగ్‌

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

హిందువుల్లో భయం మొదలైందా?

అమృతపాల్ సింగ్ పదునైన వేర్పాటువాద భావజాలం పంజాబ్ హిందువులలో భయాందోళనలు సృష్టిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ భయం వల్ల 'హిందుత్వ ' రాజకీయాలు చేస్తున్న బీజేపీకి మేలు జరుగుతుందని అంటున్నారు.

"అమృతపాల్ సింగ్, ఆయన సహచరులు చేస్తున్న పనులు హిందువులలో అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో హిందూ సమాజం స్వయంగా బీజేపీ పక్షాన చేరుతుంది" అని పాటియాలా పంజాబ్ యూనివర్శిటీలోని రాజనీతి శాస్త్ర విభాగం ప్రొఫెసర్ జతీందర్ సింగ్ అన్నారు.

"ప్రస్తుతం పంజాబ్‌లో జరుగుతున్నది చూసి హిందువులు భయపడుతున్నారు" అని సీనియర్ జర్నలిస్ట్ జగ్తార్ సింగ్ అన్నారు.

అమృతపాల్ సింగ్‌

ఫొటో సోర్స్, Getty Images

సిక్కులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు

కేంద్ర ప్రభుత్వం సిక్కులకు వ్యతిరేకమని అమృతపాల్ సింగ్ ఆరోపిస్తున్నారు. కానీ, ఎన్నో ఏళ్లుగా సిక్కు సమాజాన్ని సంతృప్తిపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా గత కొన్నేళ్లుగా సిక్కు మతానికి సంబంధించిన ప్రధాన కార్యక్రమాలకు తరచూ హాజరవుతున్నారు.

మొఘల్ సామ్రాజ్యంలో సిక్కులపై జరిగిన వేధింపులను సందర్భం వచ్చినప్పుడల్లా ఉదహరిస్తూ, హిందువులను రక్షించడానికి సిక్కు గురువులు చేసిన త్యాగాలను ఉటంకిస్తూనే ఉన్నారు.

2019 నవంబర్ 9న కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ఇటు నుంచి మోదీ, అటు నుంచి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు.

అప్పటి నుంచి ప్రజలు కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించడానికి వెళ్తున్నారు.

సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారత ప్రభుత్వం 2022 డిసెంబర్ 26న దిల్లీలోనూ, విదేశాల్లోనూ 'వీర్ బాల్ దివస్'ని జరిపింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ఈ ఏడాది జనవరిలో దీర్ఘకాలంగా జైలులో ఉన్న సిక్కు ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జతేదార్ అకాల్ తఖ్త్ హర్‌ప్రీత్ సింగ్ సమక్షంలో కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గజేంద్ర సింగ్ షెకావత్ ఒక విజ్జాపనను రూపొందించారు.

ఇది కాకుండా బీజేపీకి చెందిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తమ రాష్ట్రంలో సిక్కుల చారిత్రక కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటున్నారు.

1984లో జరిగిన సిక్కు మారణహోమం కేసులో నిందితుడైన కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్ డిసెంబర్ 31, 2018న లొంగిపోయారు. ఇది జరిగింది బీజేపీ హయాంలోనే.

"శిరోమణి అకాలీదళ్, బీజేపీల కూటమి విచ్ఛిన్నమైనప్పటి నుంచి సిక్కుల విషయంలో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది" అని సీనియర్ జర్నలిస్ట్ జగ్తార్ సింగ్ అన్నారు.

2020లో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన సందర్భంగా, అకాలీదళ్ బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకుంది.

అమృతపాల్ సింగ్‌

ఫొటో సోర్స్, Getty Images

గురుద్వారా రాజకీయాల్లో బీజేపీ నేతల జోక్యం

సిక్కు మతపరమైన కార్యక్రమాలలో బీజేపీ నాయకుల ఉనికి పెరగడంతో పాటు, సిక్కు సంస్థలలో 'ప్రత్యక్ష, పరోక్ష జోక్యం' కూడా పెరుగుతోంది.

శిరోమణి అకాలీదళ్ ఆక్రమించిన సంస్థలపై శిరోమణి అకాలీదళ్ వ్యతిరేక వర్గాలు ఏర్పాటవుతున్నాయి.

హరియాణా సిక్కు గురుద్వారా (నిర్వహణ) చట్టం, 2014ను సుప్రీంకోర్టు సమర్థించిన తర్వాత, ఆ రాష్ట్రంలో ఇప్పుడు ప్రత్యేకంగా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీని శిరోమణి అకాలీదళ్, ఎస్‌జీపీసీలు వ్యతిరేకిస్తున్నాయి.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సెప్టెంబరు 2022లో బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ బీజేపీ సూచనలను పాటిస్తున్నారని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది.

2021లో దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజీందర్ సింగ్ సిర్సా కూడా బీజేపీలో చేరారు.

అమృతపాల్ సింగ్‌

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యేక గురుద్వారా నిర్వహణ కమిటీ

ఒత్తిళ్లు, జైలు భయంతోనే సిర్సా బీజేపీలో చేరారని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, అకాల్ తఖ్త్ జతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్ అన్నారు.

దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కాల్కా కూడా బీజేపీకి సన్నిహితుడిగా చెబుతారు.

2022 దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని మీడియా సమావేశం ద్వారా కాల్కా విజ్ఞప్తి చేశారు.

"హరియాణాలో ప్రత్యేక గురుద్వారా ప్రబంధక్ కమిటీని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో కూడా గొడవలు జరుగుతున్నాయి. సిక్కులలోని ఒక వర్గం తమవైపు చేరాలని బీజేపీ కోరుకుంటోంది'' అని ప్రొఫెసర్ జతీందర్ సింగ్ అన్నారు.

''ప్రస్తుత బీజేపీ నాయకులలో చాలా మందికి హిందూ ముద్ర ఉంది. పంజాబ్‌లో సిక్కులు మెజారిటీగా ఉన్నప్పుడు, వారికి సిక్కు ఫేస్ కూడా కావాలి. పైగా వారు నమ్మదగినవారై ఉండాలి. అమరీందర్ సింగ్ రాకతో చాలామంది కాకపోయినా, ఓట్లు పెద్ద ఎత్తున ప్రభావితం కాకపోయినా, కొంత బలాన్నయితే ఇస్తుంది'' అని ప్రొఫెసర్ సింగ్ అన్నారు.

అమృతపాల్ సింగ్‌

ఫొటో సోర్స్, Getty Images

'సిక్కులు హిందూ సమాజంలో భాగం'

2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పాటు, కాంగ్రెస్‌కు చెందిన పలువురు సిక్కు నాయకులు బీజేపీలో చేరారు.

"నా అభిప్రాయం ప్రకారం, ఇది ఆర్యసమాజ్ (1870) కాలం నుండి కొనసాగుతున్న బీజేపీ పాత ఎజెండా. వారు సిక్కులను భిన్నమతంగా భావించరు. సిక్కులు కూడా హిందూ సమాజంలో భాగమని వారు ప్రచారం చేస్తుంటారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీల వ్యూహం" అని సీనియర్ జర్నలిస్ట్ జగ్తార్ సింగ్ అన్నారు.

"సిక్కులను ఏకతాటిపైకి తీసుకురావడం వల్ల బీజేపీపై ఉన్న మైనారిటీ వ్యతిరేక ఇమేజ్ పోతుంది. తాము మైనారిటీలకు వ్యతిరేకం కాదని చెప్పడానికి బీజేపీ నేతలు తరచూ వివిధ రాష్ట్రాల్లోని గురుద్వారాలకు వెళ్లాలనుకుంటున్నారు" అని ఆయన అన్నారు.

అమృతపాల్ సింగ్‌

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీకి లాభమా?

అమృతపాల్ సింగ్‌తో పెరుగుతున్న 'వేర్పాటువాద' కార్యకలాపాలు, సిక్కులను బుజ్జగించాలన్న బీజేపీ విధానాలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి లాభం చేకూరుస్తాయా అన్న ప్రశ్న వినిపిస్తుంది.

''బీజేపీని ఇప్పటికీ హిందూ పార్టీగానే చూస్తారు. సిక్కుల సమస్యలను ప్రస్తావించడం ద్వారా అది తన పునాదులను బలంగా మార్చుకోగలదు. కానీ, సిక్కుల సమస్యలను సరైన వేదికల మీద మాత్రం ప్రస్తావించదు'' అని జగ్తార్ సింగ్ అభిప్రాయపడ్డారు.

పంజాబ్‌లో బీజేపీ సొంత కాళ్లమీద నిలబడడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఎప్పుడూ హిందువులకు మద్ధతుగా ఉండే విధానాలే ఉపయోగిస్తోంది. హిందువులు కాంగ్రెస్‌ పక్షాన ఉన్నారు కాబట్టి, బీజేపీ అక్కడ అడుగుపెట్టలేకపోతోంది. అకాలీలతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు సాధించే అవకాశం ఉంటుంది.

''అమృతపాల్ సింగ్ మున్ముందు కూడా ఇలాగే వ్యవహరిస్తే, అది బీజేపీకి లాభదాయకంగా ఉంటుంది. ఈ ప్రయోజనం అనేక వైపుల నుండి ఉంటుంది. బీజేపీ ఒక శక్తిగా స్థిరపడగలదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించగలదు. కేంద్రం జోక్యాన్ని పెంచేందుకు దీన్ని సాకుగా చూపించగలదు'' అని ప్రొఫెసర్ జతిందర్ సింగ్ అన్నారు.

'' రాష్ట్రంలో జరుగుతున్నది పరిణామాలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో సహజంగానే బీజేపీకి లాభిస్తాయి. బీజేపీ లక్ష్యం రాబోయే లోక్‌సభ ఎన్నికలే" అని జర్నలిస్ట్ జస్పాల్ సింగ్ సిద్ధూ అన్నారు.

''పంజాబ్ ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితులను చూసింది. కాకపోతే ఇందులో ఎక్కువగా ఇబ్బందులు పడేది సామాన్యులే'' అని జస్పాల్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)