అమృత్‌పాల్ సింగ్: పంజాబ్‌ను 80ల్లోకి తీసుకెళుతున్నారా? బీబీసీ ఇంటర్వ్యూ

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అరవింద్ ఛాబ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల ‘వారిస్ పంజాబ్ దే సంఘటన్’ అధ్యక్షుడు అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.
కత్తులు, తుపాకులు చేతపట్టిన వేలాది మంది అనుచరులతో ఆయన పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.
అమృత్‌పాల్ సింగ్‌ను 1984లో ఆపరేషన్ బ్లూస్టార్‌లో ప్రాణాలు కోల్పోయిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలెతో తరచూ పోలుస్తుంటారు.
కొందరైతే ఆయన్ను భింద్రన్‌వాలె 2.0 అంటుంటారు. ఖలిస్తాన్, అజ్నాలా హింస సహా వివిధ అంశాలపై అమృత్‌పాల్ సింగ్ బీబీసీతో మాట్లాడారు.
భారత రాజ్యాంగాన్ని నమ్ముతారా?
బ్రిటిష్‌వారు ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని తయారుచేశారు. 1947 తరువాత దానికి పెద్దగా మార్పులు చేయలేదు. ఈరోజుల్లో కూడా దేశద్రోహం వంటి చట్టాలు రాజ్యాంగంలో ఉన్నాయి.
నేను రాజ్యాంగాన్ని నమ్ముతానా నమ్మనా అనేది పాయింట్ కాదు. మేం హిందువులం కాదు, ముస్లింలమూ కాదని గుర్బానీ చెప్తున్నప్పటికీ సిక్కు మతం ప్రత్యేక మతమని రాజ్యాంగం చెప్పడం లేదు.
మా మతం పూర్తిగా స్వతంత్రమైనది. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 125(బీ)లో హిందూత్వ లేదా సనాతన అనే ఒక భారీ వృక్షానికి ఉన్న శాఖే సిక్కులని ఉంది. రాజ్యాంగంలోని ఇలాంటి ప్రస్తావనపై మాకు అభ్యంతరం ఉంది.
నేను భారతీయుడిని కాదు అని మీరు చెప్పినట్లు ఎక్కడో చదివాను..
ఇండియన్ ఐడెంటిటీ అనేది బ్రిటిష్‌వాళ్లకు మనకు ఇచ్చిన ఒక ‘అంబ్రెల్లా టెర్మ్’. వాళ్లు మనల్ని రెడ్ ఇండియన్ అని కూడా అనేవారు. వివక్షాపూరితంగా అలా అనేవారు.
భారతీయుడిగా ఉండడమనేది ఐడెంటిటీ కాదు. భారతీయత అనేది ఏ భాషా కాదు. ఇండియాకు ఏ భాషా లేదు. ఏ సంస్కృతీ లేదు.
ఉత్తర భారతం, దక్షిణ భారతం సంస్కృతి ఒకటే అని అంటే అది పూర్తిగా తప్పవుతుంది. రెండు ప్రాంతాల మధ్య తిండి, భాషల్లో ఎలాంటి పోలికా లేదు.
అందుకే ఇండియన్ అనేది అంబ్రెల్లా టర్మ్ అంటున్నాను. ఆ ఛత్రం కింద నా అస్తిత్వం భద్రంగా ఉంటే నేను భారతీయుడిననే చెప్పుకొంటాను. నా అస్తిత్వాన్ని నేను పంజాబీగా మాత్రమే చెప్పుకోవాలనుకుంటున్నాను.

ఫొటో సోర్స్, ANI
స్వతంత్ర ఖలిస్తాన్ కావాలంటున్నారు మీరు..మీపై దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు?
శాంతియుత మార్గంలో ఖలిస్తాన్ గురించి మాట్లాడడంలో తప్పేమీ లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రజాస్వామ్యంలో స్వీయ నిర్ణయమనేది గౌరవప్రదమైనది. కెనడా, మరికొన్ని దేశాల్లో ప్రజలందరికీ స్వీయ నిర్ణయం హక్కు ఉంది.
ప్రస్తుతం మనం జీవిస్తున్న యుగంలో వేర్పాటుపై మాట్లాడడం తప్పేమీ కాదు. దేశద్రోహం చట్టాలు వంటివి వలసపాలన నాటివి. ఇప్పటికీ అవి అమల్లో ఉండడం సరికాదు.
సుప్రీంకోర్టు 2006లో ఇచ్చిన తీర్పు అమలులో ఉన్నంత కాలం ఖలిస్తాన్ గురించి శాంతియుతంగా మాట్లాడడం, రాయడం, సమావేశాలు పెట్టుకోవడం వంటివన్నీ చట్టబద్ధమే.
‘ఖలిస్తాన్ జిందాబాద్’ అనడం కూడా చట్టబద్ధమే.
శాంతిపై మీకు నమ్మకం ఉందా?
ఎందుకులేదు? ప్రతి ఒక్కరూ శాంతిని ఇష్టపడతారు. హింసను మేమెప్పుడూ ఎంచుకోలేదు.
మరి అజ్నాలాలో జరిగిందేంటి? కత్తులు, తుపాకులు పట్టుకున్న వేల మంది అనుచరులతో పోలీస్ స్టేషన్ ముట్టడించారు మీరు..
ఏమైందో మీకు చెప్తాను. మేం అక్కడికి వెళ్లేటప్పటికే మూడంచెల బారికేడ్లను ప్రజలు తొలగించారు. నాలుగో అంచెలో ఉన్న బారికేడ్లు పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్నాయి.
పోలీసులతో శాంతియుతంగా చర్చించాలని కోరుకుంటున్నట్లు వారికి చెప్పాం. కానీ, పోలీసులు మాపై లాఠీ చార్జ్ చేశారు. వారు అలా చేసుండాల్సింది కాదు.
వారి లాఠీ చార్జ్‌ను ఎదుర్కోవడానికి కర్రలు ఉపయోగించాల్సి వచ్చింది. తుపాకులు ఎక్కడా ఉపయోగించలేదు.
నా వెంట వచ్చినవారి వద్ద ఉన్నవన్నీ లైసెన్స్‌డ్ తుపాకులే. డ్రగ్స్‌పై పోరాడుతున్నందున ఆత్మరక్షణ కోసం వాటిని ఎప్పుడూ తమ వెంట ఉంచుకుంటారు. .
మా అనుచరులు కర్రలు ఉపయోగించిన మాట వాస్తవమే కానీ, మొదట లాఠీలు ప్రయోగించింది పోలీసులే.

ఫొటో సోర్స్, THEWARISPANJABDEINSTAGRAM
కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కదా..
చాలాకాలంగా చర్చలు జరుపుతున్నాం. ఆ తరువాత కోర్టుకు వెళ్లాం. కానీ, వ్యవస్థ ఎలా ఉందో మీకు తెలుసు. ఏమీ చేయకుండా కూర్చుంటే నిరసన కూడా తెలపలేని పరిస్థితులున్నాయి.
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోర్టులో పోరాడొచ్చు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయొచ్చు.
కానీ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు ఎందుకు జరిగాయి? కోర్టులు ఎప్పుడూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో నిరసనల అర్థమేంటి? నిరసన తెలిపే హక్కు ఉంది.
ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నారు.. సిక్కులు బానిసలుగా బతుకుతున్నారంటున్నారు. మీకు ఎవరివైనా రాజకీయ అండదండలున్నాయా?
సొంతంగానే అక్కడికి వెళ్లాను. ఏ రాజకీయ అండదండలూ లేవు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి ప్రజలకు పిలుపునిచ్చాను. వేలమంది వచ్చారు. దార్లోనే వారిని ఆపేశారు.
నా పిలుపుతో కదలివచ్చిన ప్రజల్లో 10 నుంచి 20 శాతం మంది మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు రాగలిగారు. మిగతావారిని దారిలోనే పోలీసులు ఆపేశారు.

ఫొటో సోర్స్, ANI
భారత ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వంపై మీకు నమ్మకం లేదా? ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కదా..
మాకు నమ్మకం లేదు. భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియ కూడా ఒక జడత్వ చట్రంలో ఇరుక్కుంది. ఎన్నికలలో భాగం కావాలన్నా, విజయం సాధించాలన్నా ఎన్నో విషయాలలో రాజీ పడాలి.
పంజాబ్ ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు లేవు. పంజాబ్‌లో కేంద్ర ప్రభుత్వం జోక్యం మితిమీరుతోంది. రాష్ట్రం నీళ్లు, హక్కుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు.
పంజాబ్‌లో కొత్త ప్రభుత్వం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయినా, ఏమీ చేయడం లేదా?
ఆప్ ప్రభుత్వం ఏర్పాటైంది. భగవంత్ మాన్ ఖాళీ చేసిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఖలిస్తాన్ ఎంపీ గెలిచారు.
మెజారిటీ సాధించిన పార్టీకి ప్రజాదరణ లేదు. దీనర్థం అన్ని పార్టీలనూ ప్రజలు తిరస్కరించినట్లే. రెండు మూడు నెలల్లోనే భగవంత్‌మాన్ తన ప్రభావాన్ని పోగొట్టుకున్నారు.
ఇప్పుడున్న పరిస్థితులు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. మీకేమీ అనిపించడం లేదా?
దీనికి పరిష్కారం కోసం చూస్తున్నాను. సమాజంలో భయం ఎందుకు కలిగింది? హింస కారణంగా కలిగింది. కాదంటారా?
ప్రభుత్వ హింస కారణంగానే ఇలాంటి భయం కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం , సార్వభౌమత్వం, స్వీయపాలన గురించి మాట్లాడితే భయం ఎందుకుంటుంది?
ప్రభుత్వమే ఇలాంటి పరిస్థితి కలిగించింది. పోలీసులను చూసి ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు మానవ హక్కులను అస్సలు పట్టించుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.
శిక్షలు పూర్తయిన తరువాత కూడా సిక్కులు బయటపడలేకపోతున్నారు. అదే సమయంలో కొత్తగా మరింతమంది సిక్కులను జైళ్లలో పెడుతున్నారు.

ఫొటో సోర్స్, ANI
పంజాబ్ 1980ల నాటి రోజుల్లోకి వెళ్తుందని ప్రజలు భయపడుతున్నారు..
దీనికి బాధ్యులెవరు? అజ్నాలా కేసు సంగతే చూడండి. మొదట తప్పుడు ఎఫ్ఐఆర్ రాశారు. నేను మొదటే వెళ్లాల్సింది. కానీ, వారం రోజులు ఆగాను. అక్కడ జరిగింది ఇంకొంచెం ముందే జరగాల్సింది.
కేంద్రం కూడా తాము సిక్కుల మంచి కోరుకునేవాళ్లమని చెప్పుకొంటోంది.
దీనంతటికీ ఎవరు కారణం. సిక్కుల విషయంలో ప్రభుత్వ విధానాలే దీనంతటికీ కారణం. మార్పు అక్కడ రావాలి.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















