రాహుల్ గాంధీ: లండన్‌లో ప్రధాని మోదీ, అదానీల గురించి ఏమన్నారు

ఫొటో సోర్స్, @SRINIVASIYC
ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.
లండన్‌లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర, రష్యా, చైనాల విషయంలో భారత విదేశాంగ విధానం, బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం, ఆశ్రిత పక్షపాతం వంటి అంశాల మీద మాట్లాడారు.
'పాలిటిక్స్ అండ్ ద పీపుల్: ఫ్రం పర్సెప్షన్ టు పర్ఫార్మెన్స్' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డానిష్ ఖాన్ ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా వ్యవహరించారు. భారత్, బ్రిటన్‌లకు చెందిన పాత్రికేయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇంతకుముందు మార్చ్ 3న కూడా రాహుల్ గాంధీ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడడానికి ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు.
అయితే, బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ విమర్శలకు సమాధానం చెప్పారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాన్నమ్మ ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో అత్యయిక పరిస్థితి విధించారని.. అలాంటి వారసత్వం నుంచి వచ్చిన రాహుల్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్తున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ పుల్వామా దాడిని పాకిస్తాన్ ప్రేరేపిత దాడిగా అంగీకరించడం లేదని మరికొందరు బీజేపీ నేతలు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Ani
భారత్‌లో మీడియాపై అణచివేత
భారత్‌లో ప్రతిచోట గొంతులను అణచివేస్తున్నారని.. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడమే దీనికి ఉదాహరణ అని రాహుల్ గాంధీ అన్నారు.
బీబీసీ కనుక ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రిపోర్టింగ్ చేయడం ఆపేస్తే ఆ సంస్థపై కేసులు మాయమైపోతాయని అన్నారు.
భారత్‌లో బీబీసీ ఇప్పుడు అణచివేత ఎదుర్కొంటోంది కానీ మిగతా మీడియా గత 9 ఏళ్లుగా ఎదుర్కొంటోందన్నారు.
'జర్నలిస్టులను బెదిరిస్తున్నారు. వారిపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం గురించి మంచిగా మాట్లాడే జర్నలిస్టులకు మాత్రం రివార్డులు దక్కుతున్నాయి' అన్నారు రాహుల్ గాంధీ.

ఫొటో సోర్స్, @SRINIVASIYC
రాహుల్ గాంధీ విదేశాలలో భారత్ గురించి చెడుగా మాట్లాడుతూ పరువు తీస్తున్నారని బీజేపీ నేతలు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు.
ఇదే విషయం రాహుల్ గాంధీని అడిగినప్పుడు ఆయన నరేంద్ర మోదీ విదేశీ వేదికలపై చేసిన ప్రసంగాలను ప్రస్తావించారు.
తన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడానికి ముందు 60 ఏళ్లలో భారత్‌లో అవినీతి విపరీతంగా ఉండేదని.. ఎలాంటి అభివృద్ధి జరగలేదని మోదీ విదేశాలలో మాట్లాడారని రాహుల్ ఆరోపించారు.
ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడిన వారిని అవమానించారని ఆయన అన్నారు.
విదేశాలకు వెళ్లి భారత్‌ను అవమానించింది ప్రధాని మోదీ తప్ప వేరెవ్వరూ కాదని రాహుల్ అన్నారు.
'నేను నా దేశాన్ని ఏనాడూ అవమానించలేదు. అవమానించబోను' అన్నారు రాహుల్ గాంధీ.

ఫొటో సోర్స్, @SRINIVASIYC
ప్రతిపక్షం పోరాడుతోంది
భారత్‌లో ప్రతిపక్ష పార్టీలు కలసికట్టుగా పోరాడుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.
కొన్ని అంశాలపై ప్రతిపక్షాలలో అనైక్యత ఉన్నప్పటికీ వాటినీ త్వరలోనే పరిష్కరించుకుంటామన్నారు.
ప్రభుత్వ వ్యవస్థలను చెప్పుచేతల్లో పెట్టుకున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లతో విపక్షాలు పోరాడతున్నాయని రాహుల్ అన్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
అదానీ అంశంపై ఏమన్నారంటే..
జర్నలిస్టులతో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ అదానీ అంశాన్ని ప్రస్తావించారు. అదానీ గ్రూప్ విషయంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు.
ప్రధాని మోదీతో ఉన్న సత్సంబంధాల కారణంగానే అదానీ ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో 609వ స్థానం నుంచి మూడేళ్లలోనే రెండో స్థానానికి చేరారని రాహుల్ అన్నారు.
కశ్మీర్‌లో కనుగొన్న 50 లక్షల టన్నుల లిథియం నిక్షేపాల గురించి, దానికిసంబంధించిన వేలం గురించి ప్రస్తావించినప్పుడు ఆయన అదానీ గురించి మాట్లాడారు.
'అదానీ పాల్గొనే ప్రతి వేలాన్నీ ఆయనే గెలుచుకుంటారు. ఏదైనా వ్యాపారంలో అడుగుపెట్టడానికి ఆయనకు అనుభవం అవసరం లేదు. కశ్మీర్‌లో లిథియం తవ్వకం కూడా ఆయనకే దక్కుతుందని అనుకుంటున్నాను' అన్నారు రాహుల్ గాంధీ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాగా ఇండియన్ ఆర్మీని, అమరులను అవమానించడమే కాంగ్రెస్ అస్తిత్వమని.. పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఆ దాడిని కారు బాంబుగా చెప్పారని.. ఆ తరువాత రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పుల్వామా దాడిలో చనిపోయిన వారి కుటుంబాలను అవమానించిందని పూనావాలా విమర్శలు చేశారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ కూడా రాహుల్‌పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి ఏడ్చేపని పెట్టుకున్నారని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వృద్ధ జంట ప్రేమ కథ.. 75 ఏళ్ల బాబూరావు, 70 ఏళ్ల అనసూయ
- తెలంగాణ- కోతుల మూకుమ్మడి దాడి కారణంగా వృద్ధురాలు మృతి, అసలేం జరిగింది-
- ఏజ్ ఆఫ్ కన్సెంట్- సెక్స్-కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి-
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా- భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు-– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









