మలం తీపి వాసన, మూత్రం బూజు వాసన, శ్వాస నుంచి చేపల వాసన, శరీరం నుంచి కుళ్లిన పండ్ల వాసన వస్తుంటే ఈ వ్యాధులు ఉన్నట్లేనా?

శరీర వాసనను బట్టి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు

ఫొటో సోర్స్, Serenity Strull/BBC/Getty Images

    • రచయిత, జాస్మిన్ ఫాక్స్-స్కెల్లీ

శ్వాస విడిచేటప్పుడు ముక్కు నుంచి బయటకు వెలువడే దుర్వాసన గల రసాయనాల్లో కొన్ని మనం అనారోగ్యానికి గురవుతున్నామనే సంకేతాలను ఇస్తాయి. వ్యాధులను ముందుగానే గుర్తించడానికి ఇది సాయపడొచ్చు.

కానీ, ఎంతవరకు సాధ్యమనేది స్పష్టంగా చెప్పలేని విషయం... వాసన చూసి పార్కిన్సన్స్ వ్యాధిని పసిగట్టగలనని ఒక స్కాటిష్ మహిళ చెప్పినప్పుడు అనలిటికల్ కెమిస్ట్ పెర్డిటా బారన్ అలానే స్పందించారు.

''బహుశా ఆమె వృద్ధుల వాసన చూస్తున్నారు. పార్కిన్సన్స్ లక్షణాలను గుర్తించి దానికీ దీనికి లింక్ చేసుకుంటున్నారు' అని తాను అప్పుడు ఆలోచించినట్లు బారన్ గుర్తుచేసుకున్నారు.

బారన్ సహోద్యోగి, ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో న్యూరో సైంటిస్ట్ టిలో కునాథ్‌ 2012లో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా జాయ్ మిల్నే అనే 74 ఏళ్ల రిటైర్డ్ నర్స్ తనను సంప్రదించారు.

కొన్ని సంవత్సరాల క్రితం తన భర్త లెస్‌ శరీరం నుంచి వెలువడుతున్న వాసనను గమనించిన తర్వాత, వాసన చూసి పార్కిన్సన్‌ను గుర్తించే తన సామర్థ్యాన్ని తాను తెలుసుకున్నానంటూ మిల్నే అప్పుడు కునాథ్‌తో చెప్పారు.

మిల్నే గుర్తించినట్లే ఆమె భర్తకు పార్కిన్సన్ ఉన్నట్లు కొన్నాళ్ల తరువాత నిర్ధరణ అయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Body

ఫొటో సోర్స్, Serenity Strull/BBC/Getty Images

వాసన చూసి వ్యాధిని పసిగట్టారు

వణుకు, ఇతర లక్షణాలతో కూడిన న్యూరో డీజనరేటివ్ వ్యాధి పార్కిన్సన్. మిల్నే తన స్వస్థలమైన స్కాట్లాండ్‌లోని పెర్త్‌లో పార్కిన్సన్ రోగుల కోసం నిర్వహించిన సామూహిక సమావేశానికి హాజరైనప్పుడు ఆమె.. పార్కిన్సన్ వ్యాధిగ్రస్థులందరి నుంచి ఒకేలాంటి వాసన వస్తున్నట్లు గుర్తించారు.

ఆమె చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని తాము నిర్ణయించుకున్నట్లు బారన్ చెప్పారు. ఆ సమయంలో ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న బారన్, ప్రస్తుతం మాంచెస్టర్ యూనివర్సటీలో ఉన్నారు.

కునాథ్, బారన్, వారి సహచరులు మిల్నేకు 12 టి-షర్టులు వాసన చూడాలని ఇచ్చారు. వాటిలో ఆరు ఇటీవల పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు ధరించినవి కాగా, మిగతా ఆరు ఇతరులు ధరించినవి. ఆమె ఆ ఆరుగురు రోగులను గుర్తించారు. అలాగే, ఏడాదిలోగా పార్కిన్సన్స్ వ్యాధి బారినపడనున్న మరొకరి టీషర్ట్ నుంచి కూడా అలాంటి వాసన వస్తున్నట్లు గుర్తించారు.

''ఇదొక అద్భుతం. ఆమె తన భర్త విషయంలో చేసినట్లుగానే, ఈ పరిస్థితిని ముందుగానే నిర్ధరించారు'' అని బారన్ అన్నారు.

ఆశ్చర్యకరమైన సామర్థ్యంతో ఆమె 2015లోనే ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.

మిల్నే కథ ఊహించినంత సులువుగా ఏమీ జరగలేదు.

శరీరం నుంచి వాసన

ఫొటో సోర్స్, Serenity Strull/BBC/Getty Images

శరీర వాసనను బట్టి ఆరోగ్య సమస్య నిర్ధరణ...

ప్రజల శరీరాలు వివిధ రకాల వాసనలను వెదజల్లుతాయి. కొత్త వాసన శరీరంలో ఏదో మార్పు వచ్చిందని, లేదా ఏదో సమస్య ఉత్పన్నమైందని సూచిస్తుంది.

ఇప్పుడు, పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు, కేన్సర్లు వంటివి గుర్తించగలిగే విఫ్పీ బయోమార్కర్లను అభివృద్ధి చేసే ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు

వాసన ఆధారంగా వ్యాధులను నిర్ధరించడానికి రోబోటిక్ ముక్కును ‘రియల్ నోస్ ఏఐ’ సంస్థ అభివృద్ధి చేస్తోందని ఫిజిసిస్ట్, రియల్ నోస్ ఏఐ సహవ్యవస్థాపకుడు ఆండ్ర్యూస్ మెర్సిన్ చెప్పారు.

వ్యాధి ప్రారంభ దశలో ఉత్పన్నమయ్యే టెల్-టేల్ బయోకెమికల్స్‌ను గుర్తించేంత శక్తిమంతమైన ముక్కులు కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. ఆ కొద్దిమందిలో జాయ్ మిల్నే ఒకరని తేలింది.

ఆమెకు వంశపారంపర్యంగా హైపరోస్మియా అనే లక్షణం ఉంది. అంటే వాసన గ్రహించే సామర్థ్యం సగటు మానవుడి కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. 'సూపర్-స్మెల్లర్' అన్నమాట.

శరీరం నుంచి దుర్వాసన

ఫొటో సోర్స్, Serenity Strull/BBC/Getty Images

కొన్ని వ్యాధులతో ఘాటైన వాసన....

కొన్ని రకాల వ్యాధులు ఘాటైన వాసనను విడుదల చేస్తాయి. వాటిని చాలామంది వాసన చూడగలరు.

ఉదాహరణకు, హైపోగ్లైసీమిక్ ఎపిసోడ్‌ కలిగిన డయాబెటిస్ బాధితుల శ్వాస, శరీరం నుంచి వచ్చే వాసన 'కుళ్లిన యాపిల్' వాసనలా ఉంటుంది. పండ్ల వాసన కలిగిన ఆమ్ల రసాయనాలు రక్త ప్రవాహంలో పేరుకుపోవడమే దీనికి కారణం.

కాలేయ వ్యాధి ఉన్నవారి శ్వాస లేదా మూత్రం నుంచి బూజు లేదా సల్పర్ వాసన వస్తుంది.

మీ శ్వాస అమ్మోనియా వాసన లేదా చేపల వాసన లేదా మూత్రం లాంటి వాసన కలిగి ఉంటే అది మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావచ్చు.

కొన్ని అంటువ్యాధులు కూడా విలక్షణమైన వాసనలను వెదజల్లుతాయి.

మలం తీపివాసన వెదజల్లితే, అది డయేరియా లేదా విరోచనాలకు సాధారణంగా కారణమయ్యే క్లోస్ట్రిడియోయిడ్స్ డిఫిసిల్ బాక్టీరియా సంక్రమణకు సంకేతం కావచ్చు.

క్షయ వ్యాధి ఉన్న వ్యక్తి శ్వాస నుంచి నిల్వ ఉన్న బీరు వాసన వస్తుంది. చర్మం నుంచి తడి కార్డ్ బోర్డు, ఉప్పునీటి వాసన వస్తుంది.

అయితే, ఇతర వ్యాధులను గుర్తించడానికి ప్రత్యేక రకమైన ముక్కు అవసరం.

ఉదాహరణకు, కుక్కలకు వాసన చూసే సామర్థ్యం మనుషుల కంటే లక్ష రెట్లు అధికంగా ఉంటుందని నిరూపితమైంది.

ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

వ్యాధులను గుర్తించేలా కుక్కలకు శిక్షణ...

మానవుల్లో ఊపిరితిత్తులు, రొమ్ము, అండాశయం, మూత్రాశయం, ప్రొస్టేట్ కేన్సర్‌లను పసిగట్టడానికి శాస్త్రవేత్తలు కుక్కలకు శిక్షణ ఇచ్చారు.

ఉదాహరణకు, ప్రోస్టేట్ కేన్సర్‌పై జరిగిన ఒక అధ్యయనంలో కుక్కలు మానవుల మూత్ర నమూనాలతో వ్యాధిని గుర్తించడంలో 99 శాతం విజయవంతమయ్యాయి.

పార్కిన్సన్స్, డయాబెటిస్, మూర్ఛ రోగాలు, మలేరియా ప్రారంభ సంకేతాలను వాసన ద్వారా ముందుగానే గుర్తించేలా కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

అయితే, 'డిసీజ్ డిటెక్టర్'గా తీర్చిదిద్దడానికి అన్ని కుక్కలూ పనికిరావు. అలాంటివాటికి శిక్షణ ఇవ్వాలంటే ఎక్కువ సమయం పడుతుంది.

బారన్.. పార్కిన్సన్స్ రోగుల నుంచి సెబమ్ (చర్మంపై ఉత్పత్తయ్యే జిడ్డు పదార్థం)ను విశ్లేషించడానికి గ్యాస్ క్రోమాటోగ్రఫీ – మాస్ స్పెక్ట్రోమెట్రీని ఉపయోగిస్తున్నారు.

సమ్మేళనాలను గ్యాస్ క్రోమాటోగ్రఫీ వేరుచేస్తుంది. వాటిని మాస్ స్పెక్ట్రోమెట్రీ తూకం వేస్తుంది. ఇది అణువుల కచ్చితమైన స్వభావాన్ని నిర్ణయించడానికి అనుమతిస్తుంది,

ఈ రకమైన వాసన విశ్లేషణను ఆహారం, పానీయాలు, పెర్ఫ్యూమ్ పరిశ్రమలు ఇప్పటికే నిత్యం ఉపయోగిస్తున్నాయి.

మానవ చర్మంపై సాధారణంగా కనిపించే 25వేలు లేదా అంతకంటే ఎక్కువ సమ్మేళనాలలో దాదాపు 3వేలు పార్కిన్సన్స్ ఉన్నవారిలో భిన్నంగా ఉంటాయని బారన్ చెప్పారు.

''మేం ఇప్పుడు వాటిని దాదాపు 30 కి తగ్గించే స్థితిలో ఉన్నాం. ఇవి పార్కిన్సన్స్ ఉన్నవారిలో నిజంగానే భిన్నంగా ఉంటాయి'' అని వెల్లడించారు.

ఈ సమ్మేళనాలలో చాలావరకూ లిపిడ్లు లేదా కొవ్వులు, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఉదాహరణకు, పార్కిన్సన్స్ వ్యాధి వల్ల కలిగే దుర్వాసనకు కారణమయ్యే మూడు లిపిడ్‌లాంటి అణువులు హిప్పురిక్ యాసిడ్, ఐకోసేన్, ఆక్టాడెకెనాల్‌లపై ఒక ప్రారంభ అధ్యయనం దృష్టిపెట్టింది.

పార్కిన్సన్స్ వ్యాధికి అబ్‌నార్మల్ లిపిడ్ మెటబాలిజమ్ ఒక ముఖ్య లక్షణమని సూచిస్తున్న మునుపటి అధ్యయనాలు ఈ విషయాన్ని తలపిస్తున్నాయి.

శరీర కణాలు

ఫొటో సోర్స్, Getty Images

పార్కిన్సన్స్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించేందుకు సులభమైన 'స్కిన్ స్వాబ్ టెస్ట్' ను ఈ బృందం అభివృద్ధి చేస్తోంది.

ప్రస్తుతం, జనరల్ ప్రాక్టీషనర్లు సాధారణంగా వణుకులాంటి లక్షణాలున్నవారిని న్యూరాలజిస్ట్ వద్దకు పంపుతారు. న్యూరాలజిస్ట్ రోగనిర్ధరణ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి సంవత్సరాలు పట్టవచ్చు.

''మీరు ఏదైనా ఇన్ఫెక్షన్, వ్యాధి, లేదా గాయంతో బాధపడుతుంటే ఆ ప్రభావం మీ జీవక్రియ (మెటబాలిజం)పై ఉంటుందనేది లాజిక్. ఈ మార్పు మీ శరీరంలోని వివిధ ప్రదేశాల్లో మెటబాలిటీల పంపిణీపై ఉంటుంది'' అని అమెరికా ఫిలడెల్ఫియాలోని మోనెల్ కెమికల్ సెన్సస్ సెంటర్ అనే పరిశోధనా సంస్థలో కెమికల్ ఎకాలోజిస్టు బ్రూస్ కింబాల్ చెప్పారు.

ఎవరికైనా మలేరియా ఉంటే శరీర దుర్వాసన దాన్ని వెల్లడిస్తుంది.

పశ్చిమ కెన్యాలో 2018లో శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో, మలేరియా సోకిన పిల్లల చర్మం ఒక ప్రత్యేక వాసన వెదజల్లుతుందని, ఇదే వారిని దోమలకు ఆకర్షణీయంగా మారుస్తుందని కనుగొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)