ట్యాన్ లైన్స్: ఒంటి మీద చారల కోసం ప్రయత్నించే ఈ ట్రెండ్‌ ఏంటి?

ట్యాన్ లైన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రుత్ క్లెగ్
    • హోదా, హెల్త్, వెల్ బీయింగ్ రిపోర్టర్

''నేను నిజంగానే ఈ నకిలీ ట్యాన్‌ను నా శరీరానికి రాసుకోబోతున్నా'' అని చెప్పిన జెమ్మా, తాను అన్నట్లుగానే ఛాతీ, మెడ, హాల్టర్ నెక్ బికినీ భాగంలో చాక్లెట్ బ్రౌన్ ముస్సా‌ను రాసుకున్నారు. ఆ తర్వాత కాసేటికి దాన్ని కడిగేశారు.

తన ఒంటిపై త్రిభుజాకారంలో ఏర్పడిన రెండు తెల్లటి చారలను చూపించారు.

సన్ బాత్ చేయకుండానే ట్యాన్ లైన్స్ ఎలా పొందాలో చెబుతూ ఆమె టిక్‌టాక్‌లో ఈ వీడియో చేశారు. జెమ్మా ఒక బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్.

90లలో, ట్యాన్ లైన్స్ కనిపించడం అనేది ఎంత భయంకరమైన విషయమో నాకు గుర్తుంది. కానీ, ఇప్పుడు అవి ఫ్యాషన్‌గా మారాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జెమ్మా

ఫొటో సోర్స్, Jemma Violet

ఫొటో క్యాప్షన్, జెమ్మా

''సేఫ్‌గా ట్యాన్‌లైన్ ఎలా తెచ్చుకోవాలో నేను వీడియోల్లో చెబుతాను. ముఖ్యంగా ముదురు రంగు చర్మంపై తెల్లటి ట్యాన్ లైన్స్ చాలా బాగుంటాయి'' అని జెమ్మా అంటున్నారు.

జెమ్మాలాంటి వాళ్లు ఫేక్ ట్యాన్‌ను ఒంటిపై సృష్టించుకుంటుండగా, భగభగమండే ఎండలోకి వెళ్లి ఒళ్లు కాలినా, బాధాకరమైన పర్యవసనాలు ఎదురైనా తట్టుకుంటూ నిజమైన ట్యాన్ లైన్ల కోసం ప్రయత్నించే వాళ్లు కూడా చాలామందే ఉన్నారు.

చాలామంది యువతీ యువకులు పోస్ట్ చేసే వీడియోల్లో ఒళ్లంతా ఎర్రగా మారి, కందిపోయినట్లుగా కనిపిస్తున్నారు.

Sunbathers by a hotel swimming pool in Italy, 1974

ఫొటో సోర్స్, Slim Aarons/Getty Images

ఫొటో క్యాప్షన్, 1974లో ఒక హోటల్ స్విమ్మింగ్‌పూల్ వద్ద సన్ బాత్ చేస్తున్న ప్రజలు

కొన్ని సంవత్సరాల కిందట ఎవరైనా జాక్ హోవెల్స్‌ను సన్‌బర్న్ ప్రమాదాల గురించి హెచ్చరించి ఉంటే అసలు అవి ఆయన చెవులకు వినిపించి ఉండేవి కూడా కాదు.

''సన్‌బెడ్‌పై పడుకోవడానికి బానిస కావడం అనేది వింతగా అనిపించవచ్చు. కానీ, నేను అలా తయారయ్యాను'' అని స్వాన్సియాకు చెందిన 26 ఏళ్ల జాక్ చెప్పారు.

స్కూల్‌లోని కొందరు స్నేహితులతో కలిసి 15 ఏళ్ల వయస్సులో జాక్ ఇలా చేయడం మొదలుపెట్టారు. ఆయనకు 19 ఏళ్లు వచ్చేసరికి వారానికి అయిదుసార్లు 18-20 నిమిషాల పాటు సన్‌బెడ్‌పైనే గడిపేవారు.

''నా చర్మం కమిలిపోయింది. నా ముఖం ఒక బీట్‌రూట్‌లా తయారైంది. అయినా నేను మళ్లీ మళ్లీ వెళ్తుండేవాడిని. అతిగా వెళ్తే మంచిది కాదని నాకు తెలుసు. కానీ, దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు'' అని జాక్ చెప్పారు.

తన ఒంటిపై ఏర్పడిన ట్యాన్ గురించి ఎవరైనా పొగిడినప్పుడు తనకు ఎంతో సంతోషంగా అనిపించేదని జాక్ తెలిపారు.

కానీ, తన వీపుపై రక్తం కారుతున్న పుట్టుమచ్చను చూసి తన తల్లి భయపడినప్పుడు ఏదో జరిగిందని తాను గ్రహించినట్లు జాక్ అన్నారు.

జాక్ హోవెల్స్

ఫొటో సోర్స్, Jak Howells

2021 క్రిస్మస్‌కు ముందు జాక్‌కు మెలనోమా అనే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. అత్యంత ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్లలో మెలనోమా ఒకటి. ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.

ఆ తర్వాత రెండేళ్లు నరకం అనుభవించానని ఆయన చెప్పారు. జాక్‌కు ఒక క్లిష్టమైన ఆపరేషన్ జరిగింది. కానీ, మూడు నెలల తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది.

ఆ తర్వాత జాక్‌కు ఇమ్యునోథెరపీ చికిత్స జరిగింది. ఒకవేళ ఇది విజయవంతం కాకపోతే, జాక్ ఏడాది మాత్రమే జీవించగలరని వైద్యులు చెప్పారు.

''ఆ అనారోగ్యం చాలా భయంకరంగా ఉండేది. రోజంతా నేను పడుకునే ఉండేవాడిని. బస్సు ఢీకొడితే శరీరం ఎలా దెబ్బతింటుందో అలా ఉండేది. నా శరీరం పెళుసుగా మారింది'' అని ఆయన వివరించారు.

జాక్ హోవెల్స్

ఫొటో సోర్స్, Jak Howells

ఫొటో క్యాప్షన్, మెలనోమా క్యాన్సర్

పదేళ్లలో మూడొంతులు పెరిగిన చర్మ క్యాన్సర్ కేసులు

యూకేలో గత దశాబ్దంలో మెలనోమా చర్మ క్యాన్సర్ కేసులు దాదాపు మూడొంతులు పెరిగాయి. సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాల వల్ల కలిగే ప్రమాదాలు, చర్మ క్యాన్సర్‌ రాకకు గల కారణాల గురించి బాగా తెలిసినప్పటికీ, ఇప్పుడు ఎందుకిలా ఈ కేసులు పెరుగుతున్నాయని యూకేలోని క్యాన్సర్ రీసెర్చ్‌కు చెందిన మేఘన్ ఫిషర్‌ను నేను అడిగాను.

''ఇది కొన్ని దశాబ్దాల కిందట సన్‌బర్న్‌కు గురైన వ్యక్తుల వల్ల పాక్షికంగా ప్రభావితమై ఉండొచ్చు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మీరు సన్‌బర్న్‌కు గురైనా మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడురెట్లు పెరుగుతుంది'' అని ఆమె వివరించారు.

అలాగే జనాభాలో ఎక్కువ మంది వృద్ధులవుతున్న కారణంగా క్యాన్సర్ల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు.

''సూర్యరశ్మి చాలా మంచిది. సన్‌స్క్రీన్ వల్ల క్యాన్సర్ వస్తుందనేది పూర్తిగా తప్పుడు సందేశం'' అని ప్రివెంటివ్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ కేట్ మెకాన్ అన్నారు.

ట్యాన్ లైన్స్

ఫొటో సోర్స్, Wiktor Szymanowicz/Future Publishing via Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్ ఫ్యాషన్ వీక్‌లో ఫేక్ సన్‌బర్న్ గుర్తులు

''సన్ బర్న్ ద్వారా ట్యాన్ తెచ్చుకునే ఈ ప్రస్తుత ట్రెండ్ వల్ల, సన్‌ట్యాన్ లోషన్లతో క్యాన్సర్ వస్తుందనే తప్పుడు వాదనలను నమ్మడం వల్ల చాలా ప్రమాదమని ఆమె అన్నారు.

''ఇప్పుడు సన్‌బర్న్‌తో ఉన్న ఒక పిల్లాడిని లేదా ఒక వ్యక్తిని చూస్తే వారికి వచ్చే 20-30 ఏళ్లలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నేను గుర్తించగలను'' అని ఆమె చెప్పారు.

సన్‌ట్యాన్ లోషన్లలో ఉండే ఆక్సీబెంజోన్ వంటి పదార్థాలు కోరల్ రీవ్స్‌కు నష్టాన్ని కలిగించవచ్చు. కానీ, వాటివల్ల మానవులకు ప్రమాదం కలుగుతుందని సూచించే ఆధారాల్లేవని డాక్టర్ మెకాన్ అన్నారు.

''రసాయనాలున్న లోషన్లు వాడొద్దనుకుంటే, మార్కెట్‌లో జింక్, మినరల్స్‌తో కూడిన సహజ లోషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేగానీ మీరు సన్‌స్క్రీన్ వాడటం మానేయకూడదు'' అని చెప్పారు.

జాక్ హోవెల్స్

ఫొటో సోర్స్, Jak Howells

మొదట్లో జాక్ తన ట్యాన్ లైన్స్‌ను ఆస్వాదించారు. కానీ, ఇప్పుడు ఎండలోకి వెళ్లడానికి ఆయన భయపడుతున్నారు. బయటకు వెళ్లాలంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్(ఎస్‌పీఎఫ్) రాసుకుంటానని అంటున్నారు.

2022 డిసెంబర్‌లో ఆయన క్యాన్సర్ బారి నుంచి పూర్తిగా బయటపడ్డారు. అప్పటినుంచి తన అనుభవాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంచే కంటెంట్‌ను తయారు చేస్తున్నారు.

వెనక్కి తిరిగి చూసుకుంటే, జరిగిందంతా తన స్వయంకృతమే అని గ్రహించినట్లు ఆయన చెప్పారు.

బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్, ఫేక్ ట్యానర్ జెమ్మా కూడా, జాక్ అనుభవించిన కష్టాల బారిన పడకుండా ప్రజలను నిరోధించేందుకు తనదైన పద్ధతిలో టిక్‌టాక్ ద్వారా ప్రయత్నిస్తున్నారు.

''చర్మం నాశనం అవుతుందనేది నిజం. కానీ, నేను అలా చేయట్లేదు'' అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)