48 మంది ప్రయాణికులతో కూలిన రష్యా విమానం, శిథిలాలు లభ్యం

ఫొటో సోర్స్, Emercom
- రచయిత, పాల్ కిర్బీ
- హోదా, యూరప్ డిజిటల్ ఎడిటర్
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయి కనిపించకుండా పోయిన విమాన శకలాలను గమ్యస్థానానికి 16 కిలోమీటర్ల దూరంలో, తూర్పు రష్యాలోని అమూర్ ప్రాంతంలో రష్యన్ రెస్క్యూ బృందాలు గుర్తించాయి.
చైనా సరిహద్దులోని బ్లాగోవెష్‌చెన్స్క్ నుంచి టిండా ఎయిర్‌పోర్టుకి బయలుదేరిన అంగారా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఏఎన్ -24 విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని అత్యవసర విభాగ అధికారులు తెలిపారు. అందులో 42 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
విమానాన్ని గుర్తిచేందుకు అన్ని బృందాలనూ మోహరించామని అమూర్ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ తెలిపారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.


ఫొటో సోర్స్, Rodion Kuznetsov
విమానం శకలాల నుంచి మంటలు చెలరేగడాన్ని హెలికాప్టర్ గుర్తించిందని రష్యా ఎమర్జెన్సీస్ మినిస్ట్రీ తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని వార్తలొస్తున్నాయి.
టిండా నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో, కొండవాలులో విమానాన్ని గుర్తించినట్లు అమూర్ సివిల్ డిఫెన్స్ సెంటర్ చెప్పినట్లు వార్తా సంస్థ టాస్ రిపోర్ట్ చేసింది.
ఘటనా స్థలం నుంచి తీసిన ఫుటేజ్ దట్టమైన అడవుల్లో విమాన శిథిలాలు దగ్ధమవుతున్నట్టుగా చూపుతోంది. రక్షణ బృందాలు ఆ ప్రదేశానికి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుందని అత్యవసర సేవల విభాగం తెలిపింది.
అంగారా ఎయిర్‌లైన్స్ ఆంటోనోవ్ 24 విమానం దాదాపు 50 ఏళ్లనాటిదని, గతంలో కూడా దీనికి సమస్యలు ఎదురయ్యాయని సమాచారం.
విమానం ఇటీవల జరిగిన సాంకేతిక తనిఖీలో అంతా సవ్యంగా ఉన్నట్టు అధికారులు చెప్పినప్పటికీ, 2018 నుండి నాలుగు ప్రమాదాలు జరిగినట్టు పౌర విమానయాన అధికారులు వార్తా సంస్థలకు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














