హరి హర వీరమల్లు మూవీ రివ్యూ: పవన్ కల్యాణ్ యాక్షన్ డ్రామా ఎలా ఉంది, అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాడా?

ఫొటో సోర్స్, FB/Mega Surya Production
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
హరిహర వీరమల్లు థియేటర్లలోకి వచ్చేశాడు. ఎంతోకాలంగా పవన్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూశారు.
పలుమార్లు వాయిదా పడుతూ, చివరికి విడుదలైన సినిమా ఎలా ఉందంటే...
కథ 16వ శతాబ్దంలో మొదలవుతుంది. అమ్మవారిని ఆరాధించే కుటుంబానికి (సత్యరాజ్), వరదలో కొట్టుకు వచ్చిన ఒక పసిబిడ్డ దొరుకుతుంది. ఆ బిడ్డ హరిహర వీరమల్లుగా పెరుగుతాడు. ఒక వైపు ఔరంగజేబు ప్రజల్ని మతం మారమని పీడిస్తూ , మారని వాళ్లను హింసిస్తూ, పన్నులకు గురి చేస్తూ ఉంటాడు. ఇంకో వైపు బ్రిటిష్ దొరలు జనాల్ని దోచేస్తూ ఉంటారు.
మచిలీపట్నంలో ఒక బ్రిటిష్ దొర నుంచి వజ్రాలు దొంగిలించే యాక్షన్ ఎపిసోడ్‌లో హీరో ఎంట్రీ ఇస్తాడు.
కుతుబ్‌షాహీ దగ్గరున్న వజ్రాల్ని దొంగిలించే పనిని వజ్రాల దొంగ వీరమల్లుకు ఒక స్థానిక జమీందారు అప్పగిస్తాడు. అక్కడ హీరోయిన్ పంచమి (నిధి అగర్వాల్)తో వీరమల్లు ప్రేమలో పడతాడు. చార్మినార్ దగ్గర వజ్రాలు దొంగిలిస్తూ మల్లు దొరికిపోతాడు. అతన్ని శిక్షించకుండా కుతుబ్‌షాహీ ఒక పని అప్పగిస్తాడు.
దిల్లీలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని చెబుతాడు. మిత్ర బృందంతో దిల్లీ వెళ్లిన వీరమల్లు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి?
ఔరంగజేబుని ఎలా ఢీకొన్నాడు? అతనికి కోహినూర్ వజ్రానికి ఏమిటి సంబంధం? ఇది మిగతా కథ.


ఫొటో సోర్స్, FB/Mega Surya Production
ఈ సినిమా పవన్‌కల్యాణ్ వన్‌మ్యాన్ షో. అనేక పాత్రలున్నా వాళ్లెవరికీ ప్రాధాన్యత లేదు. విలన్ ఔరంగజేబు (బాబీ డియోల్) ఫస్టాఫ్‌లో గట్టిగా ఉన్నా, సెకండాఫ్‌లో తేలిపోయాడు. హీరోయిన్ ఉండాలి కాబట్టి లవ్ ట్రాక్, పాటలు. ఆమె లేకపోయినా సినిమాకి నష్టం లేదు.
నిజానికి కథ పెద్దగా లేదు. చాలా థిన్ లేయర్. సినిమాను యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపారు.
సినిమాలో వజ్రాల దొంగగా రెండు ఎపిసోడ్స్. హీరో రాబిన్‌హుడ్ తరహాలో పేద ప్రజల్ని కాపాడే ఎపిసోడ్. సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో రెండు యాక్షన్ సన్నివేశాలు. ఇవి కాకుండా సెకెండాఫ్‌లో ఒక యాక్షన్ అడ్వెంచర్. మెకన్నాస్ గోల్డ్ , రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ తరహా సన్నివేశాలు కనిపిస్తాయి.
ఎమోషన్, లవ్, సెంటిమెంట్, డ్రామా జోలికి వెళ్లకుండా అభిమానులకి గూస్‌బంప్స్ వచ్చే ఎలివేషన్స్ ఒకవైపు, మరోవైపు హీరో సనాతన ధర్మ పరిరక్షణ ఉంటాయి. పవన్‌కల్యాణ్ ఈ మధ్య పదేపదే మాట్లాడే బీజేపీ అనుకూల హిందుత్వ ఎజెండా సినిమా నిండా స్పష్టంగా కనిపిస్తుంది.
ఫస్టాఫ్ వరకూ గ్రిప్పింగ్‌గా ఉన్న సినిమా, సెకండాఫ్ స్లో నెరేషన్‌గా సాగింది. ముగింపు కూడా అసందర్భంగా ఉంది. రెండో భాగం చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుడిలో మిగల్చలేదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఫార్ములా ఇక్కడ వర్కవుట్ కాలేదు. అసలు రెండో భాగం వస్తుందో రాదో తెలియదు.

ఫొటో సోర్స్, FB/Mega Surya Production
ఎవరెలా కనిపించారంటే...
ఇంత గ్యాప్ తర్వాత కూడా పవన్ ఎనర్జీ లెవెల్స్ ఏమీ తగ్గలేదు. షూటింగ్ ఐదేళ్లు జరిగినా ఫిజిక్‌లో తేడా లేదు.
నిధి అగర్వాల్ మాత్రం సెకెండాఫ్‌లో బొద్దుగా కనిపించింది. సునీల్, నాజర్, సబ్బరాజు ఇంకా చాలా మంది ఉన్నా , గుర్తు పెట్టుకునే సీన్స్ లేవు.
రఘుబాబు కామెడీ ప్రయత్నం కూడా వర్కౌట్ కాలేదు.

ఫొటో సోర్స్, FB/Mega Surya Production
ఎలివేషన్స్..
హీరో అపార శక్తి సంపన్నుడు. ప్రకృతి విపత్తును గుర్తించగలడు, ఎదుర్కోగలడు. క్రూర మృగాలతో మాట్లాడగలడు. ప్రాణాలకి తెగించి ధర్మాన్ని రక్షిస్తాడు. ఈ ఎలివేషన్స్ సినిమా మొత్తం ఉండడంతో హీరో ముందు విలన్‌తో సహా అందరూ తేలిపోయారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ హైప్ క్రియేషనే లక్ష్యం కావడంతో అదే సినిమాకి ప్లస్, మైనస్ కూడా. అభిమానులకి కాకుండా ఇతరులకి నచ్చే అంశాలు తగ్గిపోయాయి.
ఈ సినిమాకి కీలకం వీఎఫ్ఎక్స్. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా అనిపించి విఠలాచార్య సినిమాలో స్టూడియో గుర్రం మీద వెళుతున్న ఎన్టీఆర్ గుర్తొస్తే అది మన తప్పుకాదు.
కీరవాణి బీజీఎమ్, రెండు పాటలు బాగున్నాయి. పీరియాడికల్ సినిమాలకి కెమెరా, ప్రొడక్షన్, డిజైనింగ్ ప్రాణం. జ్ఞాన శేఖర్, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ బాగుంది.
తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ ప్రతిభ చాలా చోట్ల గ్రాండియర్‌గా కనిపిస్తుంది. ప్రవీణ్ షార్ప్ ఎడిటింగ్ చేసాడు. బుర్రా సాయిమాధవ్ డైలాగులు కొన్ని పేలాయి. ఉదాహరణకి జనం మెచ్చే సైనికుడు అవుతాడు, జనసైనికుడు అవుతాడు. పాలించే వారి పాదాలే కాదు, తలకూడా కనిపించాలి.
ప్లస్ పాయింట్స్
1.పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్
2.యాక్షన్ సన్నివేశాలు
3.ఫస్టాఫ్
మైనస్ పాయింట్
1.సెకెండాఫ్ స్లో నెరేషన్
2.అసందర్భ ముగింపు
3.పూర్ వీఎఫ్ఎక్స్
చివరగా, దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ ఇద్దరూ పనిచేసినా, ఈ సినిమా అసలు దర్శకుడు పవన్‌కల్యాణే అనిపిస్తుంది.
కథ హిస్టారికల్ కానీ, భావజాలం పొలిటికల్. హీరో వెతుకుతున్న కోహినూర్ వజ్రం సనాతన ధర్మమే.
లాస్ట్ లైన్: అభిమానులకు వింధు భోజనం, సాధారణ ప్రేక్షకుడికి మెస్ భోజనం
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














