కర్ణాటక: దుస్తులు లేని ఎంతోమంది మహిళలతో సహా 100కి పైగా శవాలను.. ఒకేచోట రహస్యంగా ఖననం చేశానంటున్న పారిశుద్ధ్య కార్మికుడు, అంతుచిక్కని ప్రశ్నలెన్నో..

ఫొటో సోర్స్, Anush Kottary
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేసేలా ఉండొచ్చు)
రెండు వారాల కిందట కర్ణాటకలోని తీరప్రాంత నగరమైన మంగళూరుకు చెందిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు, 1995 నుంచి 2014 మధ్య అత్యాచార బాధితులైన దాదాపు 100 మంది బాలికలు, మహిళలు, పురుషుల మృతదేహాలను వేర్వేరు ప్రదేశాలలో ఖననం చేసినట్లు పోలీసులతో చెప్పారు.
ధర్మస్థలలో ఉన్న ఒక ప్రసిద్ధ మతసంస్థలో పనిచేసినట్లుగా చెబుతున్న ఫిర్యాదుదారు, మేజిస్ట్రేట్ ముందు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 కింద తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
ఆ సమయంలో, ఉన్నతాధికారులు తనను చంపుతామని బెదిరించినందున చాలా ఏళ్లు మౌనంగా ఉన్నానని ఫిర్యాదులో ఆయన చెప్పారు. "ఆ అపరాధ భావంతో ఇక జీవించలేను" అని ఆయన అంటున్నారు.

ఈ వార్త వెలుగులోకి రావడంతో, రెండు దశాబ్దాల కిందట తన కుమార్తె తప్పిపోయినట్లు ఒక మహిళ ముందుకొచ్చారు. మృతదేహాలను గుర్తిస్తే, డీఎన్ఏ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
22 ఏళ్లకు ముందు జరిగిన ఈ కేసులో దర్యాప్తు ఎలా కొనసాగించాలో పోలీసులు ఇంకా నిర్ణయించలేదు. ఇదే సమయంలో, దర్యాప్తు తీరును సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల బృందం ప్రశ్నించింది.
"సామూహిక సమాధుల వెలికితీత జరగకూడదని, ఈ వాదనలు నిజమైతే ఎవరి పేర్లయితే బయటకు వస్తాయో.. వారిని రక్షించాలని ఒక వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది" అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కె.వి. ధనంజయ్ ఆరోపించారు.
ఇంతలో, కర్ణాటక ప్రభుత్వం ఆదివారం ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు డీజీపీ ర్యాంక్ అధికారి ప్రణబ్ మొహంతి నేతృత్వం వహిస్తున్నారు.
ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ డీజీపీ ప్రణబ్ మొహంతి, డీఐజీ (రిక్రూట్‌మెంట్) ఎం.ఎన్.అనుచేత్ (గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తులో పాల్గొన్నారు), బెంగళూరు సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సౌమ్యలత, ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ బెంగళూరు ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా ఉన్నారు.
అంతకుముందు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడతో సహా చాలామంది సీనియర్ న్యాయవాదులు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కేసుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ "ప్రభుత్వం ఎవరి ఒత్తిడికీ తలొగ్గదు. మేం చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో పోలీసులు సిట్‌ను సిఫార్సు చేస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిర్యాదుదారు ఆరోపణలు ఏమిటి?
భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి గుర్తింపును వెల్లడించలేదు.
ఆయన శ్రీ క్షేత్ర ధర్మస్థలలోని ఓ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశారు.
ఈ క్షేత్రాన్ని ఒక ప్రధాన మతపరమైన ప్రదేశంగా పరిగణిస్తుంటారు. దీన్ని దాదాపు 800 సంవత్సరాల కిందట స్థాపించారు. ఇది శైవ దేవాలయం, ఇక్కడ పూజారులు వైష్ణవ సంప్రదాయానికి చెందినవారు, దాని నిర్వహణ జైన వారసుల చేతుల్లో ఉంది.
పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు ప్రకారం..
1995, 2014 మధ్య నేత్రావతి నది ఒడ్డున క్రమం తప్పకుండా శుభ్రం చేసేవాడిని. కొంతకాలం తర్వాత, నా పని మారింది, "తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఆధారాలను దొరక్కుండా చేసే" బాధ్యత కూడా అప్పగించారు.
"దుస్తులు లేకుండా, లైంగిక హింస, దాడికి సంబంధించిన స్పష్టమైన గుర్తులున్న" అనేక మంది మహిళల శరీరాలను చూశాను.
ఈ విషయం గురించి పోలీసులకు చెబుదామని అంటే, సూపర్‌వైజర్లు వద్దనేవారు. వారి మాట వినకపోతే చంపేస్తామని బెదిరించారు.
"మేం నిన్ను ముక్కలుగా నరికేస్తాం, మిగతా వారి మాదిరిగానే నీ శవాన్ని కూడా పాతిపెడతాం. నీ కుటుంబ సభ్యులందరినీ చంపేస్తాం" అని వారు అన్నారని కార్మికుడు చెప్పారు.
పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం..
"2010లో కలైరిలోని ఒక పెట్రోల్ పంపు నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి గార్డులు నన్ను తీసుకెళ్లినప్పుడు చూసిన ఘటన ఇప్పటికీ నాకు వణకుపుట్టిస్తుంది. అక్కడ నేను ఒక టీనేజ్ అమ్మాయి మృతదేహాన్ని చూశాను, ఆమె వయస్సు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆమె శరీరంపై బట్టలు లేవు, లైంగిక హింసకు సంబంధించిన స్పష్టమైన గుర్తులున్నాయి. ఆమె మెడపై గొంతు కోసి చంపిన గుర్తులున్నాయి. ఒక గొయ్యి తవ్వి ఆమెను, తన స్కూల్ బ్యాగ్‌ను పాతిపెట్టమని నాకు చెప్పారు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లలో మెదులుతోంది" అని ఫిర్యాదుదారు తెలిపారు.
''నేను మరచిపోలేనిది మరోటి ఏమిటంటే, ముఖంపై యాసిడ్ పోసి కాల్చిన 20 ఏళ్ల మహిళ సంఘటన. ఇక, పురుషులను చంపిన పద్ధతి చాలా క్రూరంగా ఉంది. వారిని ఒక గదిలో కుర్చీలకు కట్టి, నోటిపై తువ్వాలతో ఊపిరాడకుండా చేశారు'' అని తెలిపారు.
ఈ సంఘటనలు తన ముందే జరిగాయని ఫిర్యాదుదారు చెప్పారు.
"నేను విధుల్లో ఉండగా ధర్మస్థల ప్రాంతంలోని అనేక ప్రదేశాలలో మృతదేహాలను పాతిపెట్టాను. కొన్నిసార్లు, మృతదేహాలపై డీజిల్ పోసి, ఎటువంటి ఆధారాలు మిగలకుండా కాల్చేయాలని ఆదేశాలు వచ్చేవి. ఈ విధంగా వందలాది మృతదేహాలను ఆధారాల్లేకుండా చేశారు" అని ఫిర్యాదుదారు చెప్పారు.
మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, కుటుంబంతో కలిసి మరో ప్రాంతానికి వెళ్లిపోయానని ఫిర్యాదుదారు చెప్పారు.
"నేను ప్రస్తావించిన వారిలో ధర్మస్థలలోని ఓ మందిరానికి చెందిన అడ్మినిస్ట్రేషన్ వ్యక్తులతో పాటు, ఇతర సిబ్బంది ఉన్నారు. కొంతమంది చాలా ప్రభావవంతమైనవారు, వారికి ఎదురుతిరిగిన వారిని లేకుండా చేయగలరు. అందుకే, ఇప్పుడే వారి పేర్లను వెల్లడించలేను. నాకు, నా కుటుంబానికి చట్టం ప్రకారం రక్షణ లభించిన తర్వాత, అందరి పేర్లను, వారి పాత్రను బహిరంగంగా వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాను" అని ఫిర్యాదుదారు చెప్పినట్లు ఎఫ్ఐఆర్‌లో రాసి ఉంది.
తన ఫిర్యాదుకు బలం చేకూర్చేలా సాక్ష్యాలను అందించడానికి, పారిశుద్ధ్య కార్మికుడు స్వయంగా సమాధులలో ఒకదాన్ని తవ్వి, వాటికి సంబంధించిన ఫోటోలు, ఆధారాలను సమర్పిస్తూ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.
ఫిర్యాదుదారు తల నుంచి కాలు వరకు పూర్తిగా నల్లటి వస్త్రంతో మేజిస్ట్రేట్ ముందు హాజరైనట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందా?
దర్యాప్తు నత్తనడకన సాగడం ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కె.వి. ధనంజయ్ అభిప్రాయపడ్డారు.
"జూలై 4న ఫిర్యాదు అందింది. ఫిర్యాదుదారు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 183 కింద మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నప్పుడు, అతను ఖననం చేసిన మృతదేహం అవశేషాలను కూడా సమర్పించారు. 8 రోజులు దాటినా, పోలీసులు ఫిర్యాదుదారుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి దర్యాప్తు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు" అని అన్నారు.
"పోలీసులు ఫిర్యాదుదారుడిని నమ్మవచ్చు, అతను గుర్తించే ప్రదేశాలలో మరిన్ని మానవ అవశేషాలు ఉండవచ్చని అనుమానించవచ్చు'' అని కె.వి. ధనంజయ్ చెప్పారు.
" పెద్దవారిని రక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. లేదా అధికారిక దర్యాప్తు లేదా ఆ ప్రాంతాన్ని సీల్ చేయడానికి ముందు భౌతిక ఆధారాలను తొలగించడంలో.. లేదా తారుమారు చేయడానికి వారికి సమయం ఇస్తున్నారనుకోవడానికి ఇదొక సూచన" అని ఆయన ఆరోపించారు.
దక్షిణ కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. అరుణ్ బీబీసీతో మాట్లాడుతూ "సాధారణంగా, సంఘటన జరిగిన 10, 15 ఏళ్ల తర్వాత కేసులు నమోదుకావు. అయితే, కేసు తీవ్రతపై అది ఆధారపడి ఉంటుంది. దర్యాప్తు అధికారి దాని బాధ్యత తీసుకుంటారు. ఆ తర్వాత ఒక ప్రక్రియ ప్రకారం విచారణ సాగుతుంది. కేసు దర్యాప్తులో ఉన్నందున, ప్రస్తుతం మరింత సమాచారాన్ని చెప్పలేను" అని అన్నారు.
"ఫిర్యాదుదారుడు దర్యాప్తు అధికారి ముందు కూడా తన వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. మేజిస్ట్రేట్ ముందు అతను చెప్పడం వేరు. దర్యాప్తు అధికారి ముందుకు అతన్ని ఎప్పుడు పిలుస్తారనేది ప్రక్రియలో భాగం" అని ఆయన అన్నారు.
ఫిర్యాదుదారుడిని సమాధి నుంచి అవశేషాలను తవ్విన ప్రదేశానికి కూడా తీసుకెళ్లలేదనే విమర్శలపై ఎస్పీ అరుణ్ స్పందిస్తూ "మొదట, అతని ఫిర్యాదు వాస్తవికతను నిర్ధరించాలి. అతను స్వయంగా తవ్వడం గురించి చట్టపరమైన అంశాలను పరిశీలించాలి. ఆ ప్రదేశాన్ని పరిశీలించి విచారణ జరపడమనే వాదనతో ఏకీభవిస్తున్నాను. కానీ, ఫిర్యాదుదారుడు సమాధిని తవ్వడం నేరం అని కూడా మర్చిపోకూడదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. దర్యాప్తు చేసి నిర్ధరించడానికి మాకు సమయం కావాలి" అని అన్నారు.

ఫొటో సోర్స్, Anush Kottary
పాత కేసులు మళ్లీ..
పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు వెలుగులోకి వచ్చిన తర్వాత, సుజాత భట్ అనే మహిళ 22 సంవత్సరాల కిందట అదృశ్యమైన తన కుమార్తె వివరాలను పంచుకున్నారు.
సుజాత కూతురు అనన్య భట్ మణిపాల్‌లోని మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థిని. అనన్య చివరిసారిగా ఈ మందిరంలో కనిపించారని సుజాత చెబుతున్నారు.
"సుజాత ఎవరినీ నిందించడంలేదు. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు మేరకు మృతదేహాలను తవ్వి తీస్తే, వాటి డీఎన్‌ఎ పరీక్ష జరగాలని ఆమె కోరుకుంటున్నారు. అనన్య మరణాన్ని అంగీకరించి, అంత్యక్రియలు నిర్వహించడమే ఆమె ఏకైక లక్ష్యం" అని సుజాత న్యాయవాది మంజునాథ్ ఎన్ బీబీసీతో అన్నారు.
ఎస్పీ అరుణ్‌కు పిటిషన్‌ను అందజేసిన తర్వాత సుజాత విలేఖరులతో మాట్లాడారు.
2003లో అనన్య అదృశ్యమైన సమయంలో, తాను కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్నట్లు సుజాత చెప్పారు.
"నేను సదరు మతపరమైన ప్రదేశానికి వెళ్లాను. అక్కడి వారితో మాట్లాడటానికి ప్రయత్నించాను, కానీ నన్ను అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను, అక్కడ కూడా నన్ను తిప్పిపంపారు" అని అన్నారు.
సుజాత భట్ పిటిషన్‌ను ప్రత్యేక కేసుగా పరిశీలిస్తున్నామని అరుణ్ బీబీసీతో చెప్పారు.
"మేం దాన్ని ఆ కేసుతో ముడిపెట్టలేం. కానీ, దానిపై కూడా దర్యాప్తు జరుగుతోంది" అని ఆయన అన్నారు.
గతంలో కమిటీ
తాను 100కి పైగా మృతదేహాలను పూడ్చిపెట్టానని పారిశుద్ధ్య కార్మికుడు చెప్పారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా మారింది.
2012లో 17 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య రాష్ట్రంలో చర్చకు దారితీసింది. ఆ సమయంలో మహిళలపై అత్యాచారం, దాడి, హత్య సంఘటనలపై దర్యాప్తు చేసేందుకు వి.ఎస్. ఉగ్రప్ప నేతృత్వంలో ఎమ్మెల్యేల కమిటీని ఏర్పాటు చేశారు.
" దక్షిణ కన్నడ జిల్లాలో ప్రతి సంవత్సరం 100 మంది మహిళల అసహజ మరణాలు నమోదవుతున్నాయని 2017 జనవరి 23న కమిటీ ముందు అదనపు ఎస్పీ చెప్పారు. అదే జిల్లాలో 402 మంది మహిళలు అదృశ్యమైన కేసులు, 106 అత్యాచార కేసులు నమోదయ్యాయి" అని వి.ఎస్. ఉగ్రప్ప బీబీసీతో చెప్పారు.
ఈ రిపోర్టును కొన్నివారాల కిందటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 1983లో ధర్మస్థలలో నలుగురు మహిళల అదృశ్యం విషయాన్ని బెల్తంగడి ఎమ్మెల్యే కె. వసంత బంగెడ కర్ణాటక శాసన సభలో లేవనెత్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














