కన్న పిల్లలను చంపి, మారువేషంలో తిరుగుతున్న వ్యక్తిని ఒక్క ఫోన్ కాల్ ఎలా పట్టించిదంటే..

తనకు పుట్టలేదేమో అనే అనుమానంతో కన్నబిడ్డలను చంపిన తండ్రి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

హెచ్చరిక: ఈ కథనంలో కలిచివేసే అంశాలు ఉంటాయి.

ఎన్‌టీఆర్‌ జిల్లా మైలవరానికి చెందిన రవిశంకర్ ఇదివరకు నిత్యం గుబురుగడ్డంతో తిరిగేవారు. ఇటీవల సింహాచలం వెళ్లి అక్కడ గడ్డం తీసేశారు. ఒక హోటల్‌లో పనికి కుదిరారు.

కొన్ని రోజుల తర్వాత రవిశంకర్‌ విశాఖలో కొత్త సిమ్‌ తీసుకుని మైలవరంలోని తన స్నేహితునికి ఫోన్‌ చేశారు. ఆ ఫోన్‌ కాల్‌ రవిశంకర్‌ను పోలీసులకు పట్టించింది.

సింహాచలంలో ఉన్న రవిశంకర్‌ను రెండ్రోజుల కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రవిశంకర్ కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. సొంత కొడుకు, కూతురును హత్య చేసిన కేసులో రవిశంకరే నిందితుడని తేల్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నేరస్తుడు

ఫొటో సోర్స్, Getty Images

తన పుట్టిన రోజు నాడే..

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం

హాస్టల్‌ నుంచి పిల్లలను ఇంటికి తీసుకువచ్చిన రవిశంకర్, ఈ నెల 8వ తేదీన తన పుట్టిన రోజు నాడే వారిద్దరినీ చంపేశాడు.

పిల్లల మృతదేహాల పక్కన ఓ లేఖ కూడా ఉంచాడు. ఆ లేఖలో ఏముందంటే..

''నా పుట్టినరోజు నాడే – మా అందరికీ చివరి రోజు: మా చావుకు ఎవరూ బాధ్యులు కారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు. నా భార్యకు నేను, పిల్లలు తప్ప వేరు ఎవరూ లేరు. నా పిల్లలుగా పుట్టిన పాపానికి వాళ్లని బలిచ్చాను. మమ్మల్ని అనాథ శవాలుగానే ఖననం చేయండి. ఇదే నా చివరి కోరిక. 8.6.92 నా పుట్టినరోజు. 8.6.2025 నాకు, నా పిల్లలకు చావురోజు' అని రవిశంకర్‌ ఆ లేఖలో రాసి అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.

అనుమానం, హత్యలు

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులకు రవిశంకర్ తండ్రి ఫిర్యాదు

జగ్గయ్యపేటలోనే నివసిస్తున్న రవిశంకర్‌ తండ్రి లక్ష్మీపతి మూడు రోజులుగా కుమారుడు కనిపించకపోవడం, హాస్టల్‌లో మనుమడు, మనమరాలు లేకపోవడంతో రవిశంకర్‌ ఇంటికి వెళ్లారు. కానీ ఇంటికి తాళం వేసి కనిపించింది.

ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోపలికి వెళ్లి చూడగా, చిన్నారులు ఇద్దరూ మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. అక్కడ రవిశంకర్‌ రాసిన రెండు పేజీల లేఖ పోలీసులు గుర్తించారు.

రవిశంకర్‌ ఫోన్‌ చివరి సిగ్నల్‌ ఇబ్రహీంపట్నంలో కృష్ణా నది వద్ద రావడంతో నదిలో దూకి ఆత్మహత్యకి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానించారు.

కానీ, ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రెండు రోజుల పాటు కృష్ణానదిలో గాలించినా రవిశంకర్‌ ఆచూకీ దొరకలేదు. దీంతో అతను బతికే ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు సీరియస్‌గా ఈ కేసుపై దృష్టిసారించారు. అయితే ఎక్కడా అతను పాత ఫోన్‌ కానీ, ఆ సిమ్‌ కానీ వాడడం లేదని పోలీసులు గుర్తించారు.

రవిశంకర్‌ ఆచూకీని తాము ఎలా కనిపెట్టారో మైలవరం ఎస్‌ఐ కె.సుధాకర్‌ బీబీసీకి వివరించారు.

పట్టించిన ఫోన్ కాల్

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఈనెల 8వ తేదీన పిల్లలను చంపేసి ఇంటికి తాళం వేసి పరారైన రవిశంకర్‌, ఆ రాత్రికి ఇబ్రహీంపట్నం చేరుకుని, అక్కడే ఫోన్‌ సిమ్‌ పడేసి విశాఖపట్నం పారిపోయాడు.

మైలవరంలో ఉండగా నిత్యం గుబురుగడ్డంతో తిరిగిన ఆయన, విశాఖ సమీపంలోని సింహాచలం వెళ్లి అక్కడ గడ్డం తీసేశాడు. హోటల్‌లో పనిచేసిన అనుభవం ఉండడంతో అక్కడ పదిరోజులకి పైగా ఓ హోటల్‌లో పనిచేశాడు.

అక్కడ అంతా బాగానే ఉందనుకున్న రవిశంకర్‌, విశాఖలో కొత్త సిమ్‌ను తన పేరిటే తీసుకుని మైలవరంలోని ఓ స్నేహితునికి ఫోన్‌ చేశాడు.

''రవిశంకర్ విశాఖలో తన పేరు మీదే కొత్త సిమ్‌ తీసుకున్నట్లు మేం గుర్తించాం. కొత్త నెంబర్‌కు సంబంధించి సీడీఆర్‌ (కాల్‌ డీటెయిల్‌ రికార్డు), సెల్‌ టవర్‌ లొకేషన్‌ వివరాలను విశ్లేషించాం. వెంటనే ప్రత్యేక బృందం విశాఖ వెళ్లింది. సింహాచలంలో ఉన్న రవిశంకర్‌ను అదుపులోకి తీసుకుని మైలవరం తరలించాం'' అని మైలవరం ఎస్‌ఐ కె.సుధాకర్‌ బీబీసీకి తెలిపారు.

మైలవరం

ఫొటో సోర్స్, UGC

'భార్యపై అనుమానంతోనే... : పోలీసులు

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం పట్టణానికి చెందిన రవిశంకర్‌కు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన చంద్రికతో పదేళ్ల కిందట పెళ్లయింది. వీరికి కుమార్తె లక్ష్మీ హిరణ్య (9), కుమారుడు లీలాసాయి (7) ఉన్నారు.

రవిశంకర్‌ స్థానికంగా ఉన్న ఒక హోటల్‌లో పని చేసేవాడు.

కుటుంబ పోషణ, ఆర్థిక అవసరాల నిమిత్తం చంద్రిక బహ్రెయిన్‌ దేశానికి రెండు నెలల కిందట వెళ్లింది. దీంతో రవిశంకర్‌ తన పిల్లలను జి.కొండూరులోని హాస్టల్‌లో చేర్పించారు.

భార్యకి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ వచ్చిన రవిశంకర్ చివరికి ఇద్దరు పిల్లలు కూడా తనకు పుట్టలేదని భావించి వారిని చంపేయాలనుకున్నాడు.

తన కొడుకే పిల్లలను చంపేశాడని తెలిసిన తర్వాత రవిశంకర్ తండ్రి కూడా పరారయ్యారని మైలవరం సబ్ ఇన్‌స్పెక్టర్ కె.సుధాకర్‌ బీబీసీకి తెలిపారు.

రవిశంకర్ తండ్రి లక్ష్మీపతిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

కరడుగట్టిన నేరస్తుడిలా వ్యవహరించాడు: సీఐ

తప్పు చేసిన వాళ్లు ఎక్కడో ఒకచోట దొరికిపోవడం ఖాయం. రవిశంకర్‌ ఇక్కడ గుబురు గడ్డంతో తిరిగి, అక్కడ గడ్డం మొత్తం తీసేసి కొత్తగా కనిపిస్తున్నానని అనుకున్నాడు. అందుకే కొత్త సిమ్‌ తీసుకుని స్నేహితులకు ఫోన్‌ చేసి మాకు చిక్కాడు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత అరెస్టు చూపిస్తామని సీఐ చంద్రశేఖర్‌ బీబీసీకి వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)