బాలుడిని హత్య చేసి, 'దృశ్యం సినిమా' తరహాలో పాతిపెట్టేశాడు, కానీ..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అల్పేష్ కర్కరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక కుటుంబంలో తప్పిపోయిన కొడుకుని వెతికి తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తికి, ఆ బిడ్డను హత్య చేశారని తెలిస్తే ఏమవుతుంది?
భివండీలోని ఓ కుటుంబంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఇందులో భయంకరమైన అంశం ఏంటంటే, బాలుడిని హత్య చేసిన వ్యక్తి, ఆ మృతదేహాన్ని 'దృశ్యం సినిమాలో మాదిరిగా' భూమిలో పాతిపెట్టి, దానిని మట్టితో కప్పేశాడు.
ఐదేళ్ల కిందట జరిగిన ఈ హత్య కేసులో నిందితుడైన మౌల్వీ గులాబ్, అలియాస్ రబ్బానీ గులాం షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు కింది కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు.
ఆయన అరెస్ట్ తర్వాత నిర్ఘాంత పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయాలను భివండీ పోలీసులు వివరించారు.

నిందితుడు మైనర్ల మీద అసహజ కార్యకలాపాలకు పాల్పడేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ మైనర్ బాలుడు ఆ మతబోధకుడి నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు.
తనను 'బ్లాక్ మెయిల్' చేస్తూ డబ్బులు గుంజుతుండడంతో విసిగిపోయిన నిందితుడు ఆ బాలుడిని హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.

అసలేం జరిగిందంటే..
2020 నవంబర్ 20న భివండీలోని నవీబస్తీ నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన సలీం (బాధితుడు మైనర్ కావడంతో పేరు మార్చాం) అనే 16 ఏళ్ల బాలుడు ఉన్నట్టుండి కనిపించకుండాపోయాడు.
దీంతో బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు వెతికినా బాలుడి ఆచూకీ దొరకలేదు.
బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు సాయం చేయాలని మతబోధకుడిని సాయం అడిగారు. స్థానిక మసీదులో మత బోధకుడిగా పని చేస్తున్న గులాం షేక్‌కు అక్కడే చిన్న దుకాణం కూడా ఉంది.
బాలుడి కుటుంబాన్ని సముదాయించిన గులాం షేక్ "మీ అబ్బాయి త్వరగా తిరిగి ఇంటికి రావాలని నేను ప్రార్థిస్తాను" అని చెప్పారు.
ఆయన సలహా మేరకు బాలుడి కుటుంబ సభ్యులు కొన్నిసార్లు మేకను బలిచ్చారు. మరి కొన్నిసార్లు చాదర్ సమర్పించారు. అజ్మేర్ దర్గాకు కూడా వెళ్లొచ్చారు.
అయితే, తాము ఎవరిపైన విశ్వాసం ఉంచి వెళ్తున్నామో, అతనే తమ బిడ్డను హత్య చేశాడని ఆ కుటుంబానికి తెలియదు. అతని దుకాణం కిందనే తమ బిడ్డను పాతి పెట్టాడనే విషయం కూడా వారికి తెలియదు.

బాలుడిని ఎందుకు చంపేశాడు?
గులాం షేక్ షాపులో ఓ మైనర్ బాలుడు పనిచేసేవాడు. ఆ బాలుడిపై గులాం షేక్ అసహజ కార్యకలాపాలకు పాల్పడేవాడు.
మరో బాలుడు సలీంకి ఈ విషయం తెలిసింది. దీని గురించి ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు సలీంకు గులాం షేక్ డబ్బులు ఇచ్చేవాడు. ఆ షాపులో తాను కొనుక్కున్న వస్తువులకు కూడా సలీం డబ్బులు ఇచ్చేవాడు కాదు.
రోజురోజుకీ సలీం డిమాండ్లు పెరిగాయి. సలీం వైఖరితో విసిగిపోయిన గులాం షేక్ ఒకరోజు అతన్ని దుకాణం వద్దకు పిలిచి గొంతుకోసి చంపేశాడు.
అనంతరం, సలీం మృతదేహాన్ని షాపు పక్కనే ఉన్న గుంతలో పూడ్చేసి, దానిని మట్టితో మందంగా కప్పేశాడు.
ఏడెనిమిది నెలల తర్వాత మృతదేహం కొద్దిగా బయటకు రావడంతో, అప్పటికే కుళ్లిపోయిన ఆ మృతదేహాన్ని గులాం షేక్ ముక్కలుముక్కలు చేశాడు. వాటిలో కొన్నింటిని దూరంగా పారేసి, మరికొన్ని భాగాలను తిరిగి పూడ్చి పెట్టినట్లు పోలీసులు చెప్పారు.

ఆవేశంలో నోరుజారడంతో బయటపడ్డ నిజం
2023లో మైనర్‌పై లైంగిక దాడి కేసులో గులాం షేక్ మీద అభియోగాలు నమోదయ్యాయి. ఆ సమయంలో తమ బిడ్డ కనిపించకుండా పోవడానికి, ఈ కేసుకు సంబంధం ఉండొచ్చని సలీం కుటుంబ సభ్యులు భావించారు.
గులాం షేక్ గురించి చుట్టుపక్కల వారు చెప్పిన విషయాలు విన్న తర్వాత, తమ బిడ్డను అతనే హత్య చేసి ఉండొచ్చన్న వారి అనుమానాలు బలపడ్డాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించడంతో గులాం షేక్ ఉత్తరాఖండ్ పారిపోయారు. రూర్కీ నగరంలోని ఓ మసీదులో మతబోధకుడిగా చేరారు.
అక్కడ ఓ వ్యక్తితో గులాంకు గొడవ జరగడంతో, ఆవేశంలో "నీలాంటోళ్లను నరికి పాతేశాను" అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
దీంతో ఆ వ్యక్తి గులాంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా పోలీసులు గులాబ్ షేక్ నేపథ్యం గురించి ఆరా తీయడంతో భివండీ పోలీసులు అతని కోసం వెతుకుతున్నట్లు తేలింది.
ఉత్తరాఖండ్ పోలీసులు గులాం షేక్‌ను అరెస్ట్ చేశారు. తాను హత్య చేసినట్లు ఆయన పోలీసుల విచారణలో అంగీకరించారు.
దీంతో పోలీసులు అతని షాపు వద్ద గాలింపు చర్యలు చేపట్టి, దుకాణం పక్కనే ఉన్న గుంతలో కొన్ని ఎముకలను గుర్తించారు. వాటిని తదుపరి పరీక్షల కోసం ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు.
తమ బిడ్డను హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష విధించాలని సలీం కుటుంబం డిమాండ్ చేసింది.
"మా అబ్బాయి అమాయకుడు. మా ఇంటి పక్కన ఉండే వ్యక్తే మా వాడిని హత్య చేసినట్లు మాకు తెలియదు. ఇప్పుడతను పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనికి కఠిన శిక్ష విధించాలి" అని సలీం తల్లి ఏడుస్తూ మీడియాతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














