ఈ స్కూల్ హాస్టల్‌లో ఏం జరిగింది? నరబలి నిజమేనా

- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
యూపీలోని హాథ్‌రస్‌లో రస్‌గవా గ్రామానికి అర కిలోమీటరు దూరంలో, పొలాల మధ్య ఉన్న డీఎల్ పబ్లిక్ స్కూల్ హాస్టల్‌లో ఉంటున్న 11 ఏళ్ల విద్యార్థిని బలి ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
సెప్టెంబర్ 22 అర్థరాత్రి పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న 11 ఏళ్ల కృతార్థ్ కుష్వాహా అనే రెండో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
మరుసటి రోజు, అంటే సెప్టెంబర్ 23 ఉదయం, కృతార్థ్ మృతదేహం మేనేజర్ దినేష్ బఘేల్ కారులో కనిపించింది. బాలుడి బ్యాగ్ కూడా కారులోనే ఉంది.
కృతార్థ్ మెడపై ఎర్రగా కమిలిన గుర్తులు కనిపించాయి. పోస్టుమార్టం నివేదిక ప్రకారం అతని మెడ ఎముక విరిగింది, అతన్ని గొంతు నులిమి చంపారు.
కృతార్థ్‌ను హత్య చేశారన్న ఆరోపణలపై స్కూల్ మేనేజర్ దినేష్ బఘేల్, ఆయన తండ్రి యశోదన్ బఘేల్, ప్రిన్సిపల్ లక్ష్మణ్ సింగ్, పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు సెప్టెంబర్ 26న అరెస్టు చేశారు.
65 ఏళ్ల యశోదన్ బఘేల్‌ను చుట్టుపక్కల గ్రామాల్లో 'భగత్ జీ' అని పిలుస్తారు, ఏడేళ్ల కిందట ఆయనకు పక్షవాతం వచ్చే వరకు భూతవైద్యం చేసేవారు.
హాథ్‌రస్ పోలీసులు దీనిని నరబలి కేసుగా నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

పోలీసులు ఏం చెప్తున్నారు
హాథ్‌రస్ పోలీసుల్లో పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం ఇది నరబలి కేసుగా కనిపిస్తోందని బీబీసీతో చెప్పారు.
తాంత్రిక పూజలు చేసే యశోదన్ బఘేల్ విద్యార్థిని బలి ఇచ్చినట్లు ఆధారాలు లభించాయని చెప్పారు.
ఈ విషయంపై బీబీసీ హాథ్‌రస్ ‘సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్’ నిపుణ్ అగర్వాల్‌ను సంప్రదించినప్పటికీ ఆయన దీనిపై స్పందించలేదు.
హాథ్‌రస్ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో విద్యార్థిని నరబలి ఇచ్చినట్లు ఎక్కడా లేదు.
“కేసు దర్యాప్తులో సాక్ష్యాలను సేకరిస్తున్నప్పుడు ఇతర నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. హత్య ఘటనను విచారించిన తర్వాత కేసుకు సంబంధించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు’’ అని మాత్రమే పత్రిక ప్రకటనలో ఉంది.
ఈ కేసులో ఇంకా పూర్తి వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉందని అందులో పేర్కొన్నారు.
అయితే పోలీసు సూపరింటెండెంట్ నిపుణ్ అగర్వాల్ విడుదల చేసిన కొన్ని మీడియా ప్రకటనలలో ప్రధాన నిందితుడు యశోదన్ బఘేల్‌ను ‘తాంత్రికుడు’ అని పేర్కొన్నారు.

బాలుడి తండ్రి ఏమంటున్నారు
మరణించిన బాలుడు కృతార్థ్ స్వగ్రామం తుర్సెన్.. రస్‌గవా నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
కృతార్థ్ ఇంటికి బీబీసీ వెళ్లినప్పుడు, ఇంటి బయట చాలామంది ఉన్నారు.
కృతార్థ్ తండ్రి కృష్ణ కుష్వాహా, ‘‘ ఈ కాలంలో ఎవరైనా ఇలా ఎలా నరబలి ఇస్తారు? నా బిడ్డ హత్య వెనుక ఏదో కుట్ర ఉంది, నిజాలు బయటకు రావాలి’’ అని అన్నారు.
ఉత్తరప్రదేశ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఛైర్మన్ దేవేంద్ర శర్మ, దిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బృందం, జిల్లా అధికారులతో కలిసి బాధితుల కుటుంబాన్ని శనివారం కలిశారు.
దేవేంద్ర శర్మ బీబీసీతో మాట్లాడుతూ.. “ఇది నరబలే కనుక అయితే, సమాజంలో ఇలాంటి ఘటనలను ఉపేక్షించలేం. పోలీసులు దీనిపై లోతుగా విచారిస్తున్నారు, దోషులను తప్పకుండా శిక్షిస్తారు’’ అన్నారు.
కృతార్థ్ తల్లి కమలేష్, “నేను ఎన్నో ఆశలతో నా కొడుకును హాస్టల్‌కు పంపాను. వాళ్లు అతన్ని చంపారు’’ అంటూ రోదించారు.
వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన కృష్ణ, నోయిడాలోని ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ప్రతి వారాంతంలో గ్రామానికి వచ్చే ఆయన సంఘటన జరిగిన రోజు గ్రామంలోనే ఉన్నారు.
సెప్టెంబరు 23 ఉదయం జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ కృష్ణ.. ‘‘ఉదయం ఐదు గంటలకు నేను నోయిడాకు బయలుదేరుతుంటే, స్కూల్ మేనేజర్ దినేష్ బఘేల్ ఫోన్ చేసి కృతార్థ్ అనారోగ్యంతో ఉన్నాడని చెప్పారు’’
‘‘నేను ఏదో కీడు శంకించి దినేష్ బఘేల్‌కు పదేపదే ఫోన్ చేశాను. కొన్నిసార్లు అతను పిల్లాడిని ఆగ్రా తీసుకెళుతున్నామని, కొన్నిసార్లు అలీగఢ్ తీసుకు వెళ్తున్నామని చెప్పాడు. ఈలోగా సాదాబాద్‌లో ఆయన కారు దొరికింది. నా కొడుకు మృతదేహం అందులోనే ఉంది’’ అని చెప్పారు.
తన కుమారుడిని బలి ఇచ్చినట్లు మీడియా కథనాల ద్వారానే తెలిసిందని కృష్ణ చెప్పారు.

ఫొటో సోర్స్, Family of Student
గతంలోనూ పిల్లలను బలి ఇచ్చే ప్రయత్నం?
డీఎల్ పబ్లిక్ స్కూల్‌లో ఐదో తరగతి వరకు తరగతులు నిర్వహించడానికి అనుమతి ఉంది కానీ ఇక్కడ ఎనిమిదో తరగతి వరకు పాఠాలు చెబుతున్నారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం హాస్టల్ నిర్వహణకు అనుమతి లేదు.
కృతార్థ్ మరణం తరువాత, పాఠశాల గుర్తింపును రద్దు చేయడానికి విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.
ఈ పాఠశాలలో 600 మందికి పైగా పిల్లలు చదువుతుండగా వారిలో 25 మంది హాస్టల్‌లో ఉంటున్నారు.
హాస్టల్‌లో ఉంటున్న బహర్‌దోయ్ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలు.. తమ పిల్లలనూ ఇలా చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు..
ఈ ఇద్దరిలో ఒకరు రైతు కుటుంబానికి చెందిన 9 ఏళ్ల అబ్బాయి. హాస్టల్‌లో ఉంటూ చదువుకునేవాడు.

ఫొటో సోర్స్, DINESH BAGHEL FACEBOOK
హత్యాయత్నానికి గురైనట్లు చెప్తున్న ఈ హాస్టల్ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ... ‘సెప్టెంబర్ 6 రాత్రి నా కొడుకును గొంతునులిమి చంపడానికి ప్రయత్నించారు’ అని ఆరోపించారు.
ఈ ఘటన జరిగి మూడు వారాలు గడిచినా ఆ బాలుడి మెడపై ఇంకా గుర్తులు కనిపిస్తున్నాయి.
‘మరుసటి రోజు స్కూల్ యాజమాన్యం నా కొడుకుకు స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. నేను వెంటనే పాఠశాలకు వెళ్లగా నా కొడుకు గొంతు వాచిపోయి, గొంతుపై ఎర్రని గుర్తులు కనిపించాయి’ అని తండ్రి చెప్పారు.
‘ఆ రోజు రాత్రి భగత్ జీ(యశోదన్) నా గొంతు నులమడానికి ప్రయత్నించారు. నేను కళ్లు తెరిచి చూసేసరికి ఆయన నాపై కూర్చుని గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఆ అబ్బాయి కుటుంబీకులతో చెప్పాడు.
ఆ తర్వాత, కుటుంబ సభ్యులు అబ్బాయిని హాస్టల్ నుంచి ఇంటికి తెచ్చేశారు. పాఠశాలకు పంపించడం మానేశారు.
"డాక్టర్ నా కొడుకును పరీక్షించి, ఎవరో గొంతు నులిమే ప్రయత్నం చేశారని చెప్పారు’’ అని తండ్రి తెలిపారు.
అయితే కుటుంబీకులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

ఫొటో సోర్స్, DINESH BAGHEL FACEBOOK
అదే గ్రామానికి చెందిన మరో పదేళ్ల విద్యార్థి గొంతును తాడుతో బిగించి చంపడానికి ప్రయత్నించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన సెప్టెంబర్ 18న జరిగినట్లు కుటుంబీకులు చెబుతున్నారు.
ఆ పిల్లవాడి తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం, హాస్టల్‌లో ఆ పిల్లవాడితో పాటు ఉంటున్న మరో పెద్ద కుర్రాడు ఈ పిల్లవాడి గొంతుకు తాడు బిగించి చంపడానికి ప్రయత్నించాడు.
తల్లిదండ్రులు దీనిపై స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా, వాళ్లు దానిని సీరియస్‌గా తీసుకోలేదు.
అంతే కాకుండా దీన్ని బయట ప్రచారం చేయద్దని ఆ తల్లిదండ్రులను అభ్యర్థించారు.
ఈ రెండు సంఘటనలలో బాధిత విద్యార్థుల ఫొటోలను బీబీసీ చూసింది, వాటిలో ఆ విద్యార్థుల మెడపై స్పష్టంగా గుర్తులు కనిపించాయి.
తాము సకాలంలో పోలీసులకు సమాచారం అందించి ఉంటే కృతార్థ్ ప్రాణాలు దక్కేవని ఇద్దరు పిల్లల బంధువులూ అంగీకరించారు.
ఈ ఇద్దరు చిన్నారులనూ గొంతు నులిమి హత్య చేసే ప్రయత్నం చేశారని హాథ్‌రస్ పోలీసులూ అంగీకరించారు.
సెప్టెంబరు 6, 18 మధ్య మరొక విద్యార్థి గొంతు నులిమినట్లు హాస్టల్ విద్యార్థులు చెప్తున్నా.. బీబీసీ దీనిని స్వయంగా ధ్రువీకరించుకోలేకపోయింది.

నిందితుడు ఎవరు?
రస్‌గవా గ్రామం మధ్యలో ఒక పెద్ద, రెండంతస్తుల ఇల్లు ఉంది.
సుమారు 95 ఏళ్ల వయసున్న డోరిలాల్ బఘేల్ ఆ ఇంటి ప్రాంగణంలో మంచం మీద పడుకుని ఉన్నారు. డీఎల్ పబ్లిక్ స్కూల్‌కు డోరీలాల్ పేరే పెట్టారు.
ఆయన కుటుంబీకుల కథనం ప్రకారం.. 65 ఏళ్ల యశోదన్ ఎక్కువ సమయం పాఠశాలలోనే ఉండేవారు.
యశోదన్ కుమార్తె వినీతా బఘేల్ తన తండ్రి ధార్మిక ప్రవృత్తి కలవారని.. ఆయన కర్మకాండలు చేస్తారు తప్ప, మంత్రతంత్రాలతో సంబంధం లేదని తెలిపారు.
కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. రూర్కీలో ఇంజినీరింగ్ చదివిన దినేష్ బఘేల్ మలేసియాలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కొన్నాళ్ల తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు.
2019లో దినేష్ తన గ్రామంలోని పూర్వీకుల భూమిలో పాఠశాల నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించారు.
పాఠశాలను ప్రారంభించే ముందు దినేష్ గ్రామంలోనే పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. దగ్గర్లో నివసిస్తున్న చాలా మంది విద్యార్థులు తమకు దినేష్ స్ఫూర్తి అని చెప్పారు.

తన కుమారునిపై వచ్చిన ఆరోపణలను దినేష్ తల్లి శకుంతల ఖండించారు.
‘ఎవరైనా ఇలాంటి పనులు చేసి స్వయంగా తమ భవిష్యత్తును తామే ఎందుకు నాశనం చేసుకుంటారు? ఒక పిల్లవాడు హత్యకు గురయ్యాడు. పోలీసులు విచారణ జరిపి నిజమేంటో తేల్చాలి’ అని డిమాండ్ చేశారు.
దినేష్ సోదరి వినీత బఘేల్, ‘‘మా నాన్న స్కూల్‌లో ఉంటూ, పిల్లలను చూసుకునేవారు. తమ స్కూల్‌లోని పిల్లవాడిని ఆయనే ఎందుకు చంపేస్తాడు?’’ అని ప్రశ్నించారు.
‘‘నరబలి జరిగి ఉంటే, దానిని పోలీసులు నిరూపించాలి లేదా ఈ సంఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలి’’ చుట్టుపక్కల మహిళలు డిమాండ్ చేశారు.
ఇక్కడి సమీప గ్రామాలలో డీఎల్ పబ్లిక్ స్కూల్‌లాంటి అనేక పాఠశాలలు ఉన్నాయి.
చాలా మంది తల్లిదండ్రులు బీబీసీతో మాట్లాడుతూ తమ పిల్లలకు మంచి విద్యను అందించడం చాలా పెద్ద సమస్యగా ఉందన్నారు.
రస్‌గవా గ్రామంలో 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా, గ్రామంలోని చాలా మంది పిల్లలు డీఎల్ పబ్లిక్ స్కూల్‌లోనే చదువుతున్నారు.
దినేష్ కుటుంబానికి చెందిన అమిత్ బఘేల్ మాట్లాడుతూ.. ‘‘నా ముగ్గురు పిల్లలూ డీఎల్ పబ్లిక్ స్కూల్‌లోనే చదువుతున్నారు, ఇప్పుడు వాళ్ల చదువులు ఆగిపోయాయి. నా పిల్లల చదువుల గురించి నేను ఆందోళన చెందుతున్నాను’’ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














