మొహమ్మద్ ముయిజ్జు: భారత్ గురించి మాల్దీవుల అధ్యక్షుడు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది, ఎందుకంటే..

ఫొటో సోర్స్, Getty Images
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. ముయిజ్జు పర్యటన తేదీలను ఖరారు చేసే పనిలో రెండు దేశాల అధికారులు బిజీగా ఉన్నారు.
తానెప్పుడూ ‘ఇండియా అవుట్’ అనే నినాదం చేయలేదని ముయిజ్జు చెప్పడం అందరినీ ఆశ్చర్య పరిచింది. తమ దేశం ఏనాడూ ఏ దేశం పట్లా వ్యతిరేక భావంతో లేదని ఆయన అన్నారు.
ఇటీవల అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముయిజ్జూ, తాను భారత్ వ్యతిరేకిననే వాదనను కొట్టి పారేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కొందరు అవహేళన చేయడాన్ని ఖండించి, వారిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు.
మాల్దీవులు భారత్ వ్యతిరేక ఎజెండాను అనుసరిస్తోందన్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు.
ముయిజ్జు తాజా ప్రకటన అందరినీ ఆశ్చరపరిచింది. ఎందుకంటే, గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ‘ఇండియా అవుట్’ అనే నినాదంతోనే గెలిచారు.
2023 నవంబర్‌లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని స్వదేశానికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
‘ఇండియా అవుట్’ గురించి ముయిజ్జు ఏమన్నారు?
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో పాల్గొనేందుకు ముయిజ్జు అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్కక్రమంలో పాల్గొన్న ఆయనను మాల్దీవుల విదేశాంగ విధానం గురించి ప్రశ్నలు అడిగారు.
గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌తో పోలిస్తే చైనా అనుకూల విధానాన్ని అనుసరించడంపైనా ఆయనను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆయన భారత్ గురించి ప్రస్తావించారు.
మాల్దీవులు చైనా వైపు ఎక్కువగా మొగ్గు చూపడం, ఆ దేశంతో 20 ఒప్పందాలపై సంతకం చేయడం గురించి ముయిజ్జును అడిగినప్పుడు, మాల్దీవుల విదేశాంగ విధానం సమగ్రంగా ఉందని చెప్పారు.
“నేను ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజు నుంచి సమగ్ర విదేశాంగ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించుకున్నాను. 'ఇండియా ఔట్' అని మేం ఎప్పుడూ అనలేదు. నిజానికి విదేశీ సైనికులు మా దేశంలో ఉండటం చాలా తీవ్రమైన సమస్య” అని ఆయన అన్నారు.
"మా దేశంలో ఒక్క విదేశీ సైనికుడు ఉన్నా మాల్దీవుల ప్రజలు అంగీకరించరు. ఆ సైనికులు భారత దేశానికి చెందినవారు కాబట్టి మేం భారత్‌కు వ్యతిరేకం అని సూచించడం తప్పు. ఈ సైనికులు వేరే దేశానికి చెందిన వారైనా, ఇదే సమస్య ఉండేది" అని ముయిజ్జు చెప్పారు.
"మేం ఈ సమస్యను దౌత్య పద్ధతిలో పరిష్కరించాం. భారత ప్రభుత్వ సంపూర్ణ సహకారం, దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్య పరిష్కారమైంది. మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ వెనక్కి పిలిచింది. ఇప్పుడు హెలికాప్టర్ కార్యకలాపాలు, ఇతర పనుల నిర్వహణకు సాధారణ పౌరుల్ని అక్కడ నియమించారు. ఇది చాలా సంక్లిష్టమైన సమస్య” అని ఒక ప్రశ్నకు సమాధానంగా ముయిజ్జు వివరణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, ANI
ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టిన ముయిజ్జు
భారత పర్యటనకు ముందు విదేశీ బలగాల ఉపసంహరణ వ్యవహారం, భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద మాల్దీవులకు చెందిన ఇద్దరు మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, తర్వాత వారిని మంత్రి వర్గం నుంచి తొలగించడం వంటి అంశాలు ఇబ్బందికరంగా మారతాయా? అని ముయిజ్జును ఆ కార్యక్రమంలో ప్రశ్నించారు.
“దౌత్యపరంగా దీనిపై వ్యాఖ్యానించడం కష్టం. అలాంటి మాటలు ఎవరూ అనకూడదు. ఆ వ్యాఖ్యలు చేసిన మంత్రుల మీద చర్యలు తీసుకున్నాను. నాయకులైనా, సామాన్యులైనా, ఎవరి గురించైనా సరే అలాంటి మాటలు మాట్లాడటానికి నేను వ్యతిరేకం. ప్రతి వ్యక్తికీ గౌరవం ఉంటుంది. కాబట్టి ఎవరి గురించైనా సరే అలాంటి వ్యాఖ్యల్ని సమర్థించకూడదు” అని చెప్పారు.
ముయిజ్జు మొదట భారత వ్యతిరేక వైఖరితో ఉండేవారు. ‘‘చిన్న దేశమైనా సరే దానికి తనదైన సార్వభౌమాధికారం ఉంటుంది. చిన్న దేశం కదా అని మరో పెద్ద దేశం దాన్ని బెదిరించకూడదు’’ అని ఆయన గతంలో వ్యాఖ్యానించారు.
అయితే, ఏడాది నుంచి బారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. ఈ దిశగా సాగిన ప్రయత్నాల్లో భాగంగానే ముయిజ్జు భారత పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆయన అక్టోబర్ రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని ఆంగ్ల వార్తాపత్రిక 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.
ముయిజ్జు భారత్‌కు వస్తారని స్పష్టమైనప్పటికీ ఆ పర్యటన తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

ఫొటో సోర్స్, NARENDRA MODI/ TWITTER
భారత్ – మాల్దీవుల సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయి?
2023లో మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ముయిజ్జు ‘ఇండియా అవుట్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఆయన చైనాతో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
దేశ పాలనా వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోవడం వల్ల ‘మాల్దీవుల సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం' బలహీనపడ్డాయని ముయిజ్జు ఆ ఎన్నికల ప్రచారంలో అప్పటి మాల్దీవుల ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఎన్నికల్లో గెలిచి ఆయన అధికారం చేపట్టిన వెంటనే భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి.
ఆయన అధ్యక్షుడైన వెంటనే భారత్ పట్ల దూకుడు వైఖరిని అవలంబించారు.
2023 నవంబర్ 27న అధ్యక్ష భాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి తుర్కియేను సందర్శించారు. ఆ తర్వాత తన భార్యతో కలిసి చైనా పర్యటనకు వెళ్లారు.
అంతకుముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్ష ద్వీప్‌లో పర్యటించారు. ఆ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. భారతీయులంతా లక్ష ద్వీప్‌ను సందర్శించాలని ఆ పోస్ట్‌లో రాశారు. దీంతో మాల్దీవులు వెళ్లాలనుకునే సందర్శకులు లక్ష ద్వీప్‌ను సందర్శించాలంటూ.. అప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ మొదలైంది.
ప్రధాని మోదీ లక్ష ద్వీప్ పర్యటన గురించి పోస్ట్ చేసిన చిత్రాలపై ముయిజ్జు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మరియం షియునా అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెతో పాటు అలాంటి వ్యాఖ్యలు చేసిన మరో మంత్రిని కూడా ముయిజ్జు సస్పెండ్ చేశారు.
పర్యటకం మీద ఆధారపడిన మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను ఈ పరిణామాలు కుదిపేశాయి.
మోదీ లక్ష ద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మాల్దీవుల పర్యటక శాఖ లెక్కల ప్రకారం, 2024 జనవరిలో సుమారు 13 వేల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. అయితే ఈ సంఖ్య 2023 జనవరిలో 17 వేలకు పైగా ఉంది.
మాల్దీవులకు వెళ్లే భారత పర్యటకుల సంఖ్య తగ్గినప్పటికీ, తమ దేశంలో ఉన్న భారతీయ సైనికుల్ని దశలవారిగా వారి స్వదేశానికి పంపే నిర్ణయాన్ని ముయిజ్జు ప్రభుత్వం అమలు చేసింది.
రెండు దేశాలు ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు
భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయనే దానికి సంకేతాలు కనిపిస్తున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలో నరేంద్ర మోదీ, తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడిని ఆహ్వానించారు.
దీని తర్వాత 2024 ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాల్దీవుల్లో పర్యటించారు.
ముయిజ్జు చైనా అనుకూల వైఖరి తీసుకున్న తర్వాత భారత్ నుంచి సీనియర్ మంత్రి ఒకరు మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి.
జైశంకర్ పర్యటనలో భాగంగా మాల్దీవుల్లో యూపీఐ చెల్లింపుల గురించి ఒక ఒప్పందంపై సంతకం చేశారు.
దీంతో పాటు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, మరికొన్ని అంశాలపైనా చర్చలు జరిగాయి.
జైశంకర్‌తో భేటీ గురించి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. భారత్ తమకు అత్యంత సన్నిహిత భాగస్వామి అని అందులో పేర్కొన్నారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా మాల్దీవులతో సంబంధాలు ప్రత్యేకమని వ్యాఖ్యానించారు.

భారత్, మాల్దీవుల సంబంధాలపై నిపుణులు ఏమంటున్నారు?
“నేపాల్, భూటాన్ మాదిరిగానే మాల్దీవులతోనూ భారత్ సంబంధాలు సంక్లిష్టంగా మారాయి. ఎందుకంటే దక్షిణాసియా మీద చైనా ప్రభావం పెరిగింది. ఇటీవలి పరిణామాలను గమనిస్తే బంగ్లాదేశ్ కూడా భారత్‌తో అంత సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు” అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ హ్యాపీమన్ జాకబ్ చెప్పారు.
భారత్, మాల్దీవుల సంబంధాల విషయంలో మరో కోణం కూడా ఉందంటున్నారు జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రొఫెసర్ మోహన్ కుమార్.
“మాల్దీవులతో సంబంధాలు కొన్నేళ్ల కిందట ఉన్నట్లుగా లేవు. అయితే ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. మళ్లీ రెండు దేశాల సంబంధాలు పట్టాలకెక్కాయి. ఇది మంచి సంకేతం” అని మోహన్ కుమార్ అన్నారు.
“భారత్‌తో సంబంధాలు దెబ్బ తినడం వల్ల తనకే నష్టం అని మాల్దీవ్స్ గుర్తించింది. దీని వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతున్న విషయాన్ని గ్రహించింది” అని ఆయన అన్నారు.
“ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే మాల్దీవులు తన వ్యూహాన్ని మార్చుకుంది. భారత్, చైనాతో సమానంగా సన్నిహిత సంబంధాలను నడిపేందుకు ఇప్పుడు ఆ దేశం ప్రయత్నిస్తోంది. విదేశాంగ విధానం వల్ల దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలగకూడదని, స్వప్రయోజనాలు దెబ్బ తినకూడదని భావిస్తోంది. భారత్‌తో సంబంధాలను తెంచుకోవడం వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆ దేశ ప్రభుత్వం తెలుసుకుంది” అని ప్రొఫెసర్ మోహన్ కుమార్ విశ్లేషించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














