మాల్దీవులు: చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ముయిజ్జు, భారత్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే...

మాల్దీవులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాతో మిలటరీ సహకారంపై కీలక ఒప్పందం కుదుర్చుకున్న ముయిజ్జు

మే 10 తరువాత భారత్‌కు చెందిన ఒక్క సైనికుడు కూడా మాల్దీవుల్లో ఉండరని ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు ప్రకటించారు.

వారం క్రితమే, మాల్దీవుల్లోని మూడు ఏవియేషన్ ప్లాట్‌ఫాంలలో పనిచేయడానికి సాంకేతిక నిపుణుల బృందాన్ని మాల్దీవులకు పంపింది భారత్. ఆ సమయంలోనే ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు.

మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని మే 10వ తేదీలోగా ఉపసంహరించుకునేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా మార్చి10 నాటికి మొదటి దశ పూర్తికానుంది.

స్థానిక వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం, మంగళవారం ఐదాఫుషీ టౌన్‌లో అధ్యక్షులు ముయిజ్జు ప్రసంగిస్తున్న సమయంలో తమ ప్రభుత్వం భారత సైన్యాన్ని దేశం నుంచి బయటకు పంపడంలో విజయం సాధించిందని అన్నారు. దీనిపై కొందరు వదంతులు సృష్టిస్తున్నారని కూడా అన్నారు.

“దేశాన్ని వదిలివెళ్లే భారత సైనికులు వారి యూనిఫాం మార్చుకుని తిరిగి మాములు వ్యక్తుల్లా మళ్లీ రావడం లేదు. అలాంటి వదంతులు, అసత్యాలను మనం నమ్మాల్సిన పనిలేదు. యూనిఫాంలో లేదా సాధారణ దుస్తుల్లో..మే 10 తర్వాత దేశంలో ఒక్క భారత సైనికుడు కూడా ఉండరు. భారత ఆర్మీ మన దేశంలో ఉండదని నేను విశ్వాసంగా చెప్తున్నాను” అన్నారు ముయిజ్జు.

గతనెల మొదటి వారంలో ఇరుదేశాల ప్రతినిధులు ఉన్నతస్థాయి భేటీలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 2న జరిగిన ఈ భేటీ అనంతరం మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేస్తూ, భారత ప్రభుత్వం మే 10వ తేదీలోగా మాల్దీవుల్లో ఉన్న మూడు ఏవియేషన్ ఫ్లాట్‌ఫాంలలో మోహరించిన భారత సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందని, మార్చి 10వ తేదీ నాటికి మొదటిదశ పూర్తవుతుందని ప్రకటించింది.

మార్చి 10వ తేదీ కన్నా ముందే భారత్ నుంచి టెక్నికల్ టీం మాల్దీవులకు చేరుకుంది.

ముయిజ్జు ప్రకటన విడుదల చేసిన ముందురోజే మాల్దీవులు, చైనాల మధ్య మిలటరీ సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది.

మాల్దీవులు భారత్

ఫొటో సోర్స్, PRESIDENCYMV/X

ఫొటో క్యాప్షన్, మిలటరీ సహకారంపై చైనాతో మాల్దీవులు ఒప్పందం కుదుర్చుకుంది.

చైనాతో ఒప్పందం..

భారత సైన్యం ఉపసంహరణ, సాంకేతిక బృందాన్ని మాల్దీవులకు పంపడానికి సంబంధించి గడువు నిర్ణయించాక, చైనాతో మాల్దీవులు మిలటరీ ఒప్పందం కుదుర్చుకుంది.

“చైనా తరఫున మాల్దీవులకు ఉచిత మిలటరీ సహాయంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేదిశగా ప్రోత్సాహం అందించడం” కోసం ఇరుదేశాల ప్రతినిధులు ఎంఓయూపై సంతకం చేశారు.

మాల్దీవుల విదేశాంగ మంత్రి మహమ్మద్, చైనా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిలటరీ కోఆపరేషన్ మేజర్ జనరల్ చాంగ్‌లు సంతకాలు చేశారు.

ఈ మేరకు మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. దీని గురించి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటన చేసినప్పటికీ, ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ముయిజ్జు ఈ ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ, మాల్దీవులు, చైనాల మధ్య సైనిక సహకారం ఎల్లప్పుడూ ఉందని, ఈ ఒప్పందం మాల్దీవులకు సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కావడానికి సాయపడుతుందని అన్నారు.

“ఈ ఒప్పందంలో భాగంగా మాల్దీవుల సైన్యానికి పలు శిక్షణలు లభిస్తాయి. నాన్ లెథల్ మిలటరీ సామగ్రి ఉచితంగా లభిస్తుంది. సైన్యం సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ ఒప్పందం సాయపడుతుంది. మన సైన్యం స్వతంత్రంగా, ఎవరి సహకారం లేకుండా మన దేశాన్ని రక్షించుకునే సామర్థ్యాన్ని పొందేందుకు ఈ ఒప్పందం వీలుకల్పించింది” అని మొయిజ్జు అన్నారు.

అదేకాక, చైనా నుంచి 12 అంబులెన్స్‌లు మాల్దీవుల ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయించారు.

ఈ ఏడాది జనవరిలో ముయిజ్జు ఐదురోజుల చైనా పర్యటనలో ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే అంశాలపై దృష్టి సారించారు.

ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే, భారత సైన్యాన్ని దేశం నుంచి పంపిస్తానని ముయిజ్జు ప్రకటించారు. ఇప్పుడు ఆ వాగ్ధానాన్ని నిలుపుకున్నట్లయింది.

జై శంకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ పొరుగుదేశాలపై పెత్తనం చెలాయిస్తోందా? అనే ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇచ్చారు.

భారత్ పెత్తనం చెలాయిస్తోందన్న ప్రశ్నకు జైశంకర్ సమాధానం..

దిల్లీలో ఈ వారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌కు ప్రశ్న ఎదురైంది.

పొరుగుదేశాలపై భారత్ పెత్తనం చేయాలని ప్రయత్నిస్తోందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, భారత్‌కు పెత్తనం చేసే ఉద్దేశమే ఉంటే పొరుగుదేశాలకు క్లిష్టసమయంలో 4.5 బిలియన్ డాలర్లు సాయంగా ఇవ్వదని అన్నారు. ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు సాయం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జైశంకర్ వ్యాఖ్యలపై మాల్దీవుల మీడియాలో విస్తృతంగా చర్చలు జరిగినట్లు ది హిందూ పత్రిక కథనం ప్రచురించింది.

చైనా పర్యటన అనంతరం ముయిజ్జు చేసిన ప్రకటనను, జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ చర్చలు జరిగాయి.

చైనా పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంలో ముయిజ్జు “మాల్దీవులు చిన్న దేశమే కావొచ్చు కానీ, ఏ దేశమైనా సరే, బెదిరింపులకు పాల్పడే హక్కునైతే ఇవ్వలేదు” అన్నారు.

భారత్, మాల్దీవుల ఒప్పందాలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు మద్దతుగా..

మాజీ అధ్యక్షులు మహ్మద్ నషీద్‌ మేనకోడలు, మాల్దీవుల ఎంపీ, ఎవా అబ్దుల్లా తనను తాను భారత్‌కు మద్దతు తెలిపే వ్యక్తిగా చెప్పుకుంటారు.

ఆమె న్యూయార్క్ టైమ్స్‌తో, “దేశ విదేశాంగ విధానమైతే అనుకూలంగా లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇది భద్రతాపరంగానే కాదు, అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా అనుకూలంగా లేదు” అన్నారు.

ఆమె భారత్‌తో భాగస్వామ్యానికి అనుకూలంగా తన వాదనలు వినిపించారు. దక్షిణాసియా దేశాల్లోనే భారత్, మాల్దీవుల మధ్య సాంస్కృతికపరంగా బలమైన సంబంధాలు ఉన్నాయని ఆమె అన్నారు.

మాల్దీవుల్లో భారత్ ఆసుపత్రులు, పాఠశాలలు, సాంస్కృతిక కేంద్రాలను నిర్మించింది. మాల్దీవులపై భారతీయ సంస్కృతి ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

భారత్ నుంచి వచ్చే ఒత్తిడిని మాల్దీవులు భరించలేవని ఎవా అబ్దుల్లా అన్నారు.

చైనా పర్యటన సమయంలో చైనీయులు పెద్ద సంఖ్యలో మాల్దీవులను సందర్శించాలని ముయిజ్జు కోరారు.

గతేడాది, మాల్దీవులకు భారత్‌ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లారు.

కానీ, ఈ ఏడాది జనవరిలో, మాల్దీవుల మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, భారత్‌లో ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ పేరిట ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత మాల్దీవుల పర్యాటకంలో భారత్ ఆరోస్థానానికి పడిపోయింది.

బ్రిటన్ నుంచి 1965లో సాతంత్య్రం పొందినప్పటికీ మాల్దీవుల్లో రాచరికం కొనసాగింది. నవంబర్ 1968లో రిపబ్లిక్‌గా ప్రకటించారు.

భారతదేశానికి మాల్దీవులు నైరుతి దిశలో ఉన్నాయి. కోచి నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈ మాల్దీవులు ఉన్నాయి.

12వందలకు పైగా దీవులతో మాల్దీవులు 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

మాల్దీవుల జనాభా నాలుగు లక్షలు. తిరువనంతపురానికి మాలే సమీపంలో ఉంది. ఏటా వేలమంది పౌరులు మాల్దీవుల నుంచి భారత్‌కు వస్తుంటారు. చికిత్స కోసం భారత్‌‌కు ఎక్కువమంది వస్తుంటారు.

ఈ చిన్న దీవికి భద్రత కల్పించడంలో భారత్ కీలకపాత్ర పోషించింది.

1998లో రాజీవ్ గాంధీ భారత్‌ నుంచి సైన్యాన్ని పంపి, మౌమూన్ అబ్దుల్ గయూమ్ ప్రభుత్వాన్ని రక్షించారు.

2018లో మాల్దీవులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రధాని మోదీ భారత్ నుంచి నీటిని పంపారు.

మాల్దీవులు ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు భారత్ చాలాసార్లు రుణాలు మంజూరు చేసింది.

చైనా, భారత్ ఒప్పందాలు

ఫొటో సోర్స్, Getty Images

మాల్దీవులు భారత్‌, చైనాలకు ఎందుకంత ముఖ్యం?

నాలుగు లక్షల జనాభా ఉన్న చిన్నదేశమే మాల్దీవులు. పర్యాటకంపైనే అక్కడి ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది.

దక్షిణాసియాలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు భారత్, చైనాలకు ముఖ్యమైన మాల్దీవుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇరుదేశాలు సునిశితంగా గమనిస్తుంటాయి.

దీర్ఘకాంలగా భారత్ సైనిక, ఆర్థికపరంగా మాల్దీవులకు దన్నుగా ఉంది. ఇబ్రహీం సోలిహ్ హయాంలో ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడ్డాయి.

అయితే, కొన్నేళ్లుగా చైనా కూడా మాల్దీవులకు భారీగా ఆర్థిక వనరులను సమకూరుస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒప్పందాలు, దేశవ్యాప్తంగా పోర్టుల లీజు ఒప్పందాలతో తన ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ వస్తోంది.

కోవిడ్ సమయంలో, మాల్దీవుల్లో పర్యాటకరంగంలో చాలా దేశాలు తన కార్యకలాపాలను నిలిపివేయగా, చైనా మాత్రం పెట్టుబడులు పెట్టింది.

అయితే, ఆ డబ్బును చైనా సంస్థలు మార్కెట్ నుంచి సేకరించలేదు. చైనా ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బు అది. మరోవిధంగా చెప్పాలంటే ఆ పెట్టుబడులు చైనా ప్రభుత్వానివే.

ఇబ్రహీం సోలిహ్ ప్రభుత్వ హయాంలో భారత్ 45 కన్నా ఎక్కువ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలలో పాల్గొంది.

ఆగస్టు 2021లో ఇరు దేశాలు గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం సంతకాలు చేశాయి. అందులో భాగంగా మాల్దీవులకు భారత్ 500 మిలియన్ డాలర్ల సాయం అందించేందుకు అంగీకరించింది.

మార్చి 2022లో మాల్దీవుల్లో పది కోస్టల్ రాడార్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది భారత్. అంతేకాకుండా అడ్డూ ఐలాండ్‌లో పోలీస్ అకాడెమీ ఏర్పాటులో సహకారం అందించింది.

ముయిజ్జు అధికారం చేపట్టాక చైనాతో సంబంధాలు పెరిగాయి. అధ్యక్షులుగా పదవి చేపట్టాక అధికారికంగా తొలి పర్యటన కోసం చైనాకే వెళ్లారు ముయిజ్జు.

ఈ వారం జైశంకర్ ఓ ఇంటర్వ్యూలో మాల్దీవుల గురించి ప్రస్తావిస్తూ, “ఈ ప్రపంచం కృతజ్ఞతతో కాదు, దౌత్యంతో నడుస్తుంది. చర్చలతో సమస్యలను పరిష్కరిస్తాం” అని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)