మాల్దీవులకు సైన్యానికి బదులు టెక్నికల్ టీమ్‌ను పంపించడం వెనుక భారత్ వ్యూహమేంటి?

మాల్దీవులు

ఫొటో సోర్స్, ANI

మాల్దీవులతో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య, భారత విదేశాంగ శాఖ అక్కడ ఉన్న భారత సైనికుల ఉపసంహరణకు సంబంధించిన కొత్త సమాచారాన్ని వెల్లడించింది.

మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత వారి స్థానంలో భారత సాంకేతిక బృందాన్ని (టెక్నికల్ టీమ్) అక్కడికి పంపిస్తామని గురువారం విలేఖరుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

మాల్దీవులతో ఏర్పడిన సమస్యలో మధ్యే మార్గాన్ని కనుగొనడంలో భారత్ విజయం సాధించిందని పలు ప్రపంచ దేశాల విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ భారతీయ సైనికులు ఉండకపోవచ్చు. కానీ, వారు చేసే పనిని భారత్ తమ టెక్నికల్ టీమ్‌తో కూడా చేయించగలదు.

మాల్దీవుల భౌగోళిక స్థానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అయ్యే చమురు మాల్దీవుల ద్వారా మాత్రమే వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు మాల్దీవులు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది.

సంబంధాలు పరిమితికి మించి క్షీణించకుండా ఉండాలంటే సైనికుల బదలాయింపుకు మాల్దీపులు ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని దిల్లీలోని జవహర్‌లల్ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ చైనీస్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరవింద్ యెల్లేరి అన్నారు.

భారత సైన్యం ఉపసంహరణ విషయంలో తొలుత మొండిగా ఉన్న మాల్దీవులు, ఇప్పుడు అక్కడ సైన్యంలో క్రియాశీలంగా లేని వ్యక్తుల మోహరింపునకు అంగీకరించడం చాలా పెద్ద విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.

మొహమ్మద్ ముయిజ్జూ

ఫొటో సోర్స్, Getty Images

‘‘సైన్యంలో పనిచేస్తున్నవారిని మోహరిస్తే ఆందోళన ఉండటం సహజమే. రిటైర్డ్ అధికారులు, కోస్ట్‌గార్డ్ లేదా ఇతర పారామిలిటరీ బలగాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే, ఇలాంటి ఏర్పాటుకు అంగీకరించడం మాల్దీవుల దృఢత్వానికి సంకేతం. ఇది ఒక విధంగా, ఈ క్షేత్రంలో భారత ప్రయోజనాలను పూర్తిగా తిరస్కరించలేమని మాల్దీవులు అంగీకరించినట్లు అర్థం’’ అని ఆయన చెప్పారు.

దీనికంటే ముందు, మార్చి 15 నాటికి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్‌ను మాల్దీవులు కోరింది.

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ సోమవారం తొలిసారిగా దేశ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ‘‘‘మేం మాల్దీవుల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్‌ను అధికారికంగా కోరాం. ఇప్పటివరకు జరిగిన చర్చల ప్రకారం, మూడు ఏవియేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకదాని నుంచి సైన్యాన్ని 2024 మార్చి 10 సరికి ఉపసంహరిస్తారు. మిగతా రెండు ప్లాట్‌ఫారమ్‌లలోని సైన్యాన్ని 2024 మే 10లోగా ఉపసంహరిస్తారు’’ అని చెప్పారు.

కానీ, ఇప్పుడు అక్కడ భారతీయ సైనికుల స్థానాన్ని టెక్నికల్ టీమ్ భర్తీ చేస్తుందని తాజాగా భారత ప్రభుత్వం చెప్పింది.

ప్రస్తుతం మాల్దీవుల్లో సుమారు 77 మంది భారతీయ సైనికులు ఉన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో నిఘా కోసం ఏర్పాటు చేసిన డానియర్ 228 విమానం, వైద్య సహాయం కోసం ఉన్న రెండు హెచ్‌ఏఎల్ ధ్రువ హెలికాప్టర్లలో విధుల కోసం వీరంతా అక్కడ ఉన్నారు.

2023లో మాల్దీవుల అధ్యక్షుడిగా మొహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్-మాల్దీవుల మధ్య సంబంధాల్లో మార్పులు వచ్చాయి. ముయిజ్జూ, చైనా వైపు మొగ్గుతున్నట్లుగా భావిస్తున్నారు.

రణధీర్

ఫొటో సోర్స్, MEA

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

దిల్లీలో ఫిబ్రవరి 2న భారత్-మాల్దీవులకు చెందిన ఉన్నత స్థాయి కోర్ గ్రూప్ రెండో సమావేశం తర్వాత సైన్యం బదలాయింపు గురించి చెప్పామని గురువారం రణధీర్ జైస్వాల్ అన్నారు. రెండు దేశాల మధ్య మూడో సమావేశం త్వరలోనే జరుగుతుందని తెలిపారు.

మాల్దీవుల కోసం భారత్ బడ్జెట్‌ను తగ్గించిందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీని గురించి రణధీర్ మాట్లాడుతూ, నిజానికి ఈ మొత్తం పెరిగిందని అన్నారు. తుది గణాంకాలు వచ్చిన తర్వాత, ఈ సాయం ఎంత పెరిగిందనే అంశంపై స్పష్టత వస్తుందని చెప్పారు.

భారత్ 2023 బడ్జెట్‌లో ఈ చిన్న ద్వీప దేశం కోసం రూ. 400 కోట్లు కేటాయించింది. తర్వాత ఈ సహాయాన్ని రూ. 770 కోట్లకు పెంచింది. కానీ, ఈ ఏడాది ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ సాయాన్ని రూ. 600 కోట్లకు తగ్గించారు.

ఈ అంశంపై రణధీర్ మాట్లాడుతూ, ‘‘రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై స్పష్టత వస్తుంది. అప్పుడు కొత్త బడ్జెట్ కూడా మారొచ్చు. మాల్దీవులు మా మిత్రదేశం. దాని అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.

మాల్దీవులు

ఫొటో సోర్స్, MATT HUNT/ANADOLU VIA GETTY IMAGES

ఐఎంఎఫ్ హెచ్చరిక

చైనా నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని కోరతామని ముయిజ్జూ ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరికలు జారీ చేసింది. మాల్దీవులు తీవ్రమైన అప్పుల్లో పడే ప్రమాదంలో ఉందని బుధవారం ఐఎంఎఫ్‌ హెచ్చరించింది.

చైనా నుంచి మాల్దీవులు తీసుకునే రుణం గురించి ఐఎంఎఫ్ సవివరంగా చెప్పలేదు. కానీ, మాల్దీవుల ఆర్థిక వ్యవస్థసు సమీక్షించిన తర్వాత, ‘‘మాల్దీవులు త్వరలో దాని విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఐఎంఎఫ్ సూచించింది.

‘‘పెద్దగా విధాన మార్పులు లేకుండానే మాల్దీవుల ఆర్థిక లోటు, ప్రభుత్వ రుణాలు పెరిగిపోయే ప్రమాదంలో పడింది. ఆ దేశం తీవ్ర విదేశీ రుణాల్లో మునిగిపోయే ప్రమాదంలో ఉంది’’ అని ఐఎంఎఫ్ పేర్కొంది.

చైనా నుంచి రుణాలు తీసుకున్న చాలా దక్షిణాసియా దేశాలు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో ఐఎంఎఫ్ తాజా హెచ్చరికలు చేసింది.

వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా ఆసక్తి చూపుతోన్న దేశాల్లో మాల్దీవులు కూడా ఉంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన ఈస్ట్-వెస్ట్ సముద్ర జలమార్గం, మాల్దీవుల్లోని వెయ్యికి పైగా చిన్న దీవుల నుంచి వెళ్తుంది.

ముయిజ్జూకు ముందు ఆయన పార్టీ నాయకుడు అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు.

మాల్దీవులు

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

ముయిజ్జూ ముందు ఆర్థిక సవాళ్లు

మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఒక కార్యక్రమంలో ముయిజ్జూ అన్నారు.

మాల్దీవులు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను స్వీకరిస్తూ, నిలిచిపోయిన ప్రాజెక్టులన్నింటినీ ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా ఈ వారంలోనే ముయిజ్జూ వెల్లడించారు.

భారీ అప్పులతో దిగజారిన ఆర్థిక వ్యవస్థ తమ చేతికి వచ్చిందని ఆయన అన్నారు.

భారత్‌కు వ్యతిరేక వైఖరి కారణంగా ముయిజ్జూ రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జనవరిలో మాలే నగరంలో జరిగిన మేయర్ పదవి ఎన్నికల్లో ప్రతిపక్ష మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (MDP) అభ్యర్థి ఆదం అజీమ్ ఘన విజయం సాధించారు. ఎండీపీ నాయకత్వం భారత్‌ అనుకూల వ్యక్తిగా భావించే మొహమ్మద్ ఇబ్రహీం సోలిహ్ చేతిలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)