రేవంత్ రెడ్డి X కేసీఆర్: ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడొచ్చా? నేతల దిగజారుడు భాషను ఎలా చూడాలి?

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/TELANGANA CMO

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల కృష్ణా నీటి గురించి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తిడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాలుగుసార్లు ‘రండ’ అనే మాట వాడారు.

తెలంగాణలో అతిపెద్ద బూతు పదాల్లో రండ ఒకటి. హిందీలోని 'రండి' అనే పదం తెలంగాణ వ్యవహారికంలో రండ అయింది.

హిందీలో 'రండి' అనేది 'లకారంతో మహిళలను అసభ్యంగా తిట్టే పదం'. ఈ పదానికి వ్యభిచారి అనే అర్థం కూడా వస్తుంది.

‘‘కేసీఆర్‌ను రండ అంటావా? రండగాడా.. హౌలా.. పాగల్.. దేడ్ దిమాక్.. చెప్పుతో కొడతా’’ అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సీఎం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బూతుల వాడకం స్థాయికి ఇవి తాజా ఉదాహరణలు.

కేసీఆర్

ఫొటో సోర్స్, BRS PARTY/FACE BOOK

తిట్లు దాటి బూతులకు దిగజారిన భాష

తెలంగాణ రాజకీయాల్లో దుందుడుకు భాష కొత్త కాదు. అటు కేసీఆర్, ఇటు రేవంత్ ఇద్దరూ ఈ విషయంలో దిట్టలే. కాకపోతే సాధారణ తిట్లు దాటి బూతులకు దిగజారడం కూడా అప్పుడప్పుడూ కనిపిస్తోంది. బూతులు కూడా ఓవర్ డోస్‌లో మాట్లాడి కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది ఇప్పుడు.

కృష్ణా నీటి యాజమాన్యాన్ని, ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి ఇవ్వడంపై వస్తున్న విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో సచివాలయంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు.

‘‘ఈ సన్నాసి, రండ (కేసీఆర్), జగన్ వచ్చి, నాగార్జున సాగర్‌ను తుపాకీలు పెట్టుకుని ఆక్రమిస్తే నోట్లో నుంచి మాట రాలేదు. రండ పనులు చేసింది నువ్వు, చంద్రశేఖర్ రావూ! జగన్‌కి లొంగిపోయింది నువ్వు. సిగ్గుంటే సమాధానం చెప్పు. నువ్వు రండ గాడివి కాబట్టి జగన్ వచ్చాడు. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు రమ్మను, వచ్చి చూడమను సాగర్ జోలికి.. నువ్వు రండ గాడివి కాబట్టి జగన్‌కి ప్రాజెక్టును తాకట్టు పెట్టావు. తుపాకీలు పెట్టుకుని ప్రాజెక్టు ఆక్రమిస్తే పల్లెత్తు మాట అనలేదు. మా మీద మాట్లాడతావా’’ అంటూ రేవంత్ దుర్భాషలాడారు.

అయితే, ఈ రండ అనే పదాన్ని గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఒకసారి వాడారు. ఒక బీజేపీ నాయకుడిని విమర్శిస్తూ.. ‘‘ఈ రండ కేంద్ర మంత్రి కావాలా?’’ అన్నారాయన.

కేసీఆర్‌ని రేవంత్ తిట్టడాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రతిగా కేసీఆర్ అప్పట్లో అదే పదం వాడిన వీడియోలను విడుదల చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.

ఈ క్రమంలో బాల్క సుమన్ ఒక అడుగు ముందుకేశారు. మంచిర్యాల పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో, కేసీఆర్‌ను రేవంత్ తిట్టడం గురించి మాట్లాడారు. తాను కూడా ఒకడుగు ముందుకేసి రేవంత్‌‌పై అసభ్యకరమైన భాషలో విమర్శలు చేశారు.

బాల్క సుమన్

ఫొటో సోర్స్, Balka Suman / Facebook

బాల్క సుమన్‌పై కేసు

‘‘తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను రండ అంటావా? రండగాడా.. హౌలా.. పాగల్.. దేడ్ దిమాక్ గాడు.. ఈ చెత్త నాకొడుకును చెప్పుతీసుకుని కొడతా.. చెత్త నాకొడుకుని’’ అంటూ చేతిలోకి తన చెప్పును తీసుకుని చూపించారు సుమన్. మళ్లీ ఆ వెంటనే చెప్పు కింద పెట్టేసి, ‘‘మనకు సంస్కారం అడ్డొస్తుంది. నా కొడకా ఖబడ్దార్.. పండబెట్టి తొక్కుతాం. నువ్వు చిల్లర, పోకిరీ, ఆవారా మాటలు మాట్లాడకుండా ముఖ్యమంత్రి పదవిలో పద్ధతిగా మాట్లాడు’’ అన్నారు బాల్క సుమన్.

బాల్క సుమన్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ఎక్కడికక్కడ రకరకాల రూపాల్లో ఆందోళనలు చేశాయి. ‘‘బాల్క సుమన్, కేసీఆర్ కుటుంబం బూట్లు నాకుతాడు. నాలుక చీరేస్తాం’’ అంటూ తిట్టి సుమన్ ఫ్లెక్సీలు చించేసి, సుమన్ ఫోటోలను చెప్పులతో కొడుతూ కార్యకర్తలు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో బాల్క సుమన్ మీద ఫిర్యాదులు ఇచ్చారు.

మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు పూదరి తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు బాల్క సుమన్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 294 బీ, 504, 506ల కింద కేసులు పెట్టారు. అయితే, బీఆర్ఎస్ నాయకులు ఎవరూ ముఖ్యమంత్రిపై కేసులు పెట్టలేదు.

ఈ బూతుల గొడవపై బీజేపీ స్పందన ఎలా ఉంది?

చెప్పుతో కొడతా అని బాల్క సుమన్ అనడాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని సూచించారు.

దీనిపై బీఆర్ఎస్ మండిపడుతోంది.

‘‘చెప్పులు మోయాలి కానీ, చెప్పులతో కొట్టకూడదు బ్రో’’ అంటూ బండి సంజయ్ సూక్తులు చెప్పినట్టు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్టులు చేస్తోంది.

అటు కాంగ్రెస్ ఆందోళనలకు కౌంటర్‌గా మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకులూ ఆందోళనలకు దిగారు.

అయితే రేవంత్ దిష్టిబొమ్మ కాల్చకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK

రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి: కవిత

ఈ మొత్తం వ్యవహారంలో బూతులు తిట్టిన రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టకపోవడాన్ని బీఆర్ఎస్ తప్పు పడుతోంది. దీనిపై నేరుగా తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు ఆ పార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కె.కవిత.

‘‘బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్‌పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అవలంబించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న దిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంబించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.

సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిపై సీఎం రేవంత్ రెడ్డి గారు అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు ముందుగా రేవంత్ రెడ్డి గారిపై పోలీసులు కేసు నమోదు చేయాలి. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి మీ వైఖరిని ఎండగడతాం’’ అన్నారామె.

అయితే ఇదంతా బీఆర్ఎస్ వాళ్లే మొదలుపెట్టారని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.

‘‘ముఖ్యమంత్రి పరుష పదజాలం వాడాల్సి వచ్చింది బీఆర్ఎస్ నాయకుల వల్లే. తెలంగాణ రాజకీయాల్లో అటువంటి భాషను ప్రవేశపెట్టి ప్రోత్సహించింది కేసీఆరే. ఆయనకు ఆయన భాషలోనే సమాధానం చెప్పాలి. తప్పదు. ఒకవేళ విమర్శలు పద్ధతిగా ఉంటే, సమాధానాలూ పద్ధతిగా ఉండేవి. వారు బూతులతో చెలరేగి పోతూ మా ముఖ్యమంత్రి మాత్రం సమాధానం చెప్పకుండా ముడుచుకుని కూర్చోవాలంటే కుదరదు కదా..’’ అని బీబీసీతో అన్నారు కాంగ్రెస్ నాయకుడు బెల్లయ్య నాయక్.

ప్రస్తుతానికి సుమన్ పోలీసులకు దొరకలేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)