పాడేరు: మేఘాలు తాకే వంజంగి కొండపైకి టూరిస్టులు రాకపోతేనే బావుండని స్థానికులు ఎందుకంటున్నారు?

అరకు

ఫొటో సోర్స్, Koti

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తరాంధ్రలోని అల్లూరి జిల్లా పాడేరుకు సమీపంలోని వంజంగి కొండపై మేఘాలన్నీ ఒకేచోట చేరినట్లు కనిపిస్తాయి.

ఈ దృశ్యమంతా సినిమాల్లో గ్రాఫిక్స్‌లో చూపించే పాలసముద్రంలా కనిపిస్తుంది.

ఆ మనోహర దృశ్యాలను చూసేందుకు 5 కిలోమీటర్ల ఎత్తైన కొండ ఎక్కాలి.

ఈ ట్రెక్కింగ్‌ను ఎంజాయ్ చేస్తూ, కొండలను తాకే మేఘాల అందాలను వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి పర్యాటకులు భారీగా వస్తుంటారు.

అరకు

ఫొటో సోర్స్, @Koti

ఏటా రెండు లక్షల మంది సందర్శకులు

సముద్రమట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉన్న వంజంగి కొండపై మేఘాలను చూసేందుకు ఏటా రెండు లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. అక్టోబర్ రెండో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

కానీ, ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఒక్క టూరిస్టూ రాలేదు. వంజంగి టూరిజానికి ఆ వారం రోజుల్లో ఏమైంది? టూరిస్టులు రాకపోతేనే బావుండని వంజంగి గ్రామస్థులు ఎందుకంటున్నారు?

అరకు

ఫొటో సోర్స్, Koti

నాలుగేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిన వంజంగి

వంజంగి కొండపై మేఘాలు పాలసముద్రంలా కనువిందు చేస్తాయనే విషయం నాలుగేళ్ల క్రితమే పర్యాటక లోకానికి తెలిసింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా లంబసింగిలో ఇదే తరహా మేఘాల పాలసముద్రం చూసే స్పాట్ ఉంది. దానితో పాటు సీత కొండ, జెండా కొండ, చెరువుల వేనం, డల్లాపల్లి ఇలా అనేక ప్రదేశాలు మన్యంలో ఉన్నాయి.

కానీ, వీటన్నింటి తర్వాత వెలుగులోకి వచ్చిన వంజంగి పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

సముద్రం నుంచి భూమి మీదకు వీచే తేమతో కూడిన గాలులు సాధారణంగా వేడిగా ఉంటాయి. ఈ గాలులు కొండ ప్రాంతాలను చేరుకున్నప్పుడు ఆ తేమ అంతా అతి సూక్ష్మనీటి బిందువుల్లా మారిపోతుంది. అప్పుడు వాటిలోని నీటి అణువులు ఒకదానినొకటి పట్టుకుని ఉండటం వల్ల కదలకుండా ఒకే చోట ఉంటూ మేఘాల వరుసలా కనిపిస్తాయి.

నిజానికి ఇది పొగమంచు. ఈ పొగమంచు సూర్యోదయం సమయంలో బాగా ఎక్కువ ఉండడంతో ఆ ప్రదేశమంతా పాలసముద్రంలా కనిపిస్తుంది.

అరకు
ఫొటో క్యాప్షన్, ‘‘మా ఊరి రోడ్లపై నేలరాలిన చెట్ల ఆకులు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు ఇంత ప్లాస్టిక్ చెత్త కనిపిస్తూంటే మాకు ఏడుపొస్తోంది’’ అని వంజంగి గ్రామస్థుడు భరత్ చెప్పారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు తిని పశువులు చనిపోయాయి: గ్రామస్థురాలు

వెయ్యి మంది ఉండే ఈ గ్రామానికి వారాంతాల్లో ఐదారు వేల మంది పర్యాటకులు వస్తుంటారు. వీరు తమతో పాటు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, బిర్యానీలు, బిస్కెట్ ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్ధాలను తీసుకుని వస్తారు.

దాదాపు ఇవన్నీ ప్లాస్టిక్ సంచులు, బాటిల్స్‌లోనే తీసుకుని వస్తారు. కొందరు మద్యం కూడా తీసుకుని వస్తారు. తర్వాత వాటిని అక్కడే కొండపై, రోడ్డుకు ఇరు వైపులా పడేస్తుంటారు. అవి అలా పేరుకుపోయి గ్రామస్థులకు, పర్యాటకులకు కూడా ఇబ్బంది కలుగుతోంది.

“ఐదారు ట్రాక్టర్ల ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు ఎత్తాం సర్, మా ఊరి రోడ్లపై నేలరాలిన చెట్ల ఆకులు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు ఇంత ప్లాస్టిక్ చెత్త చూస్తుంటే మాకు ఏడుపొస్తోంది. ఎక్కడో మారుమూల ఉన్న మా గ్రామానికి టూరిస్టులు వస్తున్నారు. సంతోషమే. కానీ, మా ఊరిని ఇంత చెత్త చేస్తారని అనుకోలేదు. వారం రోజులు శుభ్రం చేస్తే కానీ మా ఊరు, ఊరులా కనిపించలేదు” అని గ్రామానికి చెందిన భరత్ బీబీసీతో చెప్పారు.

పాల సముద్రమంటూ వంజంగి వస్తున్న టూరిస్టులు, ఊరిని ప్లాస్టిక్ సముద్రంలా మార్చేశారు, ఇలాగైతే ఏ టూరిస్ట్ స్పాట్‌కూ భవిష్యత్తు ఉండదని వంజంగి స్థానికుడైన రాజబాబు బీబీసీతో చెప్పారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఊళ్లో పశువులు కూడా చనిపోయాయని పశువులు కాసే భాగ్యలక్ష్మి తెలిపారు.

అరకు

టూరిస్ట్ స్పాటా, డంపింగ్ యార్డా?: వరంగల్ వాసి

తెల్లవారుజామున వంజంగి అందాలు చూడాలంటే ఉదయం ఐదున్నర గంటల కల్లా ఆ కొండపైకి చేరుకోవాలి. అందుకోసం ముందు రోజు రాత్రే వంజంగి గ్రామానికి చేరుకోవాలి. రాత్రి అక్కడ ఉండే టెంట్లలో బస చేసి తెల్లవారుజామున 3, 4 గంటల మధ్య బయలుదేరితే వంజంగి కొండపైకి ఐదు, ఐదున్నర గంటలకు చేరుకోగలుగుతాం.

వంజంగి కొండపైకి చేరుకునే క్రమంలో పర్యాటకులు తమతో పాటు వాటర్ బాటిల్స్, ఫుడ్ ఐటమ్స్ పట్టుకుని వెళ్తారు. అలాగే, దారిలో కూడా చాలా చోట్ల గిరిజనులు నిర్వహించే దుకాణాలు కూడా ఉంటాయి. గ్రామం నుంచి కొండపైకి చేరుకోవాలంటే మొత్తం 6 నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

ఈ దారి పొడవునా ప్లాస్టిక్ చెత్త కనిపిస్తూనే ఉంటుంది. పర్యాటక కేంద్రానికి వచ్చామా, డంపిగ్ యార్డుకు వచ్చామా అనే భావన కలుగుతుందని వరంగల్ నుంచి వచ్చిన వంశీ బీబీసీతో అన్నారు.

“దారిలో చాలా చోట్ల డస్ట్ బిన్లు ఉన్నాయి. కానీ, వాటిలో కంటే బయటే చెత్త ఎక్కువగా కనిపిస్తుంది. కొండపైకి వెళ్లే దారిలో ఇరువైపులా ఇలా కనిపిస్తుంటే కొండ కిందకు విసిరేసిన బాటిల్స్, కవర్లు ఎన్ని ఉంటాయో కదా. మాతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులు అంతా వ్యర్థాలను కొండపై ఇష్టానుసారం విసరకుండా డస్ట్ బిన్లలో వేయాలి. లేదంటే ఇప్పుడు తాత్కలికంగా ఆపేసినట్లు, భవిష్యత్తులో శాశ్వతంగా ఈ టూరిజాన్ని ఆపేసే ప్రమాదం ఉంది” అని వంశీ అన్నారు.

అరకు

శుభ్రం చేయడానికి వారం పాటు ‘నో ఎంట్రీ’

అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అక్కడి సౌకర్యాలపై పర్యాటకుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఇటీవల వంజంగి పర్యాటక కేంద్రానికి వెళ్లారు. అక్కడ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని శుభ్రపరిచే వరకు టూరిస్టులకు నో ఎంట్రీ బోర్డు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జనవరి 2 నుంచి జనవరి 9 వరకు పర్యాటకులను వంజంగి కొండపైకి అనుమతించలేదు. ఈ వారం రోజులు క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు.

“ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వచ్చి ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, ఇతర ప్యాకెట్లు పడేసి వెళ్లిపోతుంటారు. దీంతో చెత్త ఎక్కువ పెరిగిపోయింది. ఇంచుమించు ఐదారు ట్రాక్టర్ల లోడ్లు వచ్చింది. క్లీనింగ్ అనంతరం మళ్లీ టూరిస్టులను అనుమతించాం, కానీ ఈ సీజన్ పూర్తయ్యేలోగా చెత్త పెరిగిపోయేటట్లే ఉంది. ఎవరూ పెద్దగా నిబంధనలు పాటించడం లేదు” అని వంజంగి వీఆర్వో రమేష్ బీబీసీతో అన్నారు.

వంజంగి గ్రామస్ధుడైన రాజబాబు మాట్లాడుతూ- “ఇటువంటి ప్రాంతం అంత సులభంగా వెలుగులోకి రాదు. దీనిని కాపాడుకుందాం, మా గ్రామాన్ని కాపాడుదాం. ఇలాంటి మరికొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం. అంతేకానీ మన తప్పిదాలతో వంజంగి ప్రాంతంతోపాటు ఇతర టూరిజం స్పాట్లు శాశ్వతంగా మూతపడే పరిస్థితి తీసుకుని రావొద్దు” అని పర్యాటకులను కోరారు.

అరకు
ఫొటో క్యాప్షన్, పొలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు మద్యం సీసా పెంకులు కూడా కనిపిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

మద్యం సీసాల పెంకుల వల్ల పొలాల్లో గాయాలు: గ్రామస్థుడు

ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు తమ పొలంలో మద్యం సీసా పెంకులు కూడా విపరీతంగా కనిపిస్తున్నాయని వంజంగి గ్రామానికి చెందిన ప్రభాకర్ అన్నారు. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు కొండపై నుంచి నీరు భారీగా కిందకు చేరుకునే క్రమంలో ఆ కొండపై ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, పగిలిపోయిన మద్యం సీసా పెంకులు తమ పొలాల్లోకి వచ్చి చేరాయని చెప్పారు.

“మా ఊరిలోకి టూరిస్టులు తీసుకొస్తున్న చెత్తను చూసి తట్టుకోలేక అసలు టూరిస్టులనే రాకుండా చేయాలనే ప్రయత్నం కూడా చేశాం. కానీ, అధికారులు నచ్చజెప్పడంతో ఒప్పుకున్నాం. తాగేసి ఆ బాటిల్స్ చితక్కొట్టడం, వాటిని ఊర్లో, దారి పొడవునా ఇష్టానుసారం చల్లడం చేస్తున్నారు. వర్షాలు వచ్చినప్పడు పై నుంచి అవన్నీ మా పొలాలకు వస్తున్నాయి. పొలం దున్నుకుందామంటే గాజు పెంకులు మాకు గాయాలు చేస్తున్నాయి” అని ప్రభాకర్ చెప్పారు.

మూడు, నాలుగేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిన ఈ టూరిజం స్పాట్‌లో ఇంతలా చెత్త పేరుకుపోవడం, గ్రామస్థులు తమకు టూరిజమే వద్దనే స్థాయిలో ఆగ్రహించడం చూస్తుంటే అక్కడ ఎంత చెత్త వేశారో అర్థమవుతోందని పర్యావరణవేత్త, ఆంధ్రా యూనివర్శిటీ పర్యావరణ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి బీబీసీతో అన్నారు.

అరకు

ఆ పశువుల ఉత్పతులను వాడే వారికీ ప్రమాదమే: ఈయూబీ రెడ్డి

ఐకరాజ్య సమితి 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తులను 80 శాతం నియంత్రించాలని చూస్తోందని, కానీ వంజంగిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను చూస్తుంటే, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరేలా ఉన్నాయని అర్థమవుతోందని ఈయూబీ రెడ్డి వ్యాఖ్యానించారు.

“ఒక లెక్కప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిముషానికి ఒక మిలియన్ వాటర్ బాటిల్స్ అమ్ముడవుతున్నాయి. అవన్నీ కూడా యూజ్ అండ్ త్రో బాటిల్స్. అలాగే ఏటా 5 ట్రిలియన్ క్యారీ బ్యాగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి కూడా. ముఖ్యంగా ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ రీసైక్లింగ్‌కు అనువుగా ఉండదు. అందువల్ల దీనిని ఎక్కడ వదిలేస్తే, అక్కడే మన వాతావరణంలో ఉండిపోతుంది. దీంతో టూరిజం స్పాట్లు డస్ట్ బిన్లలా మారిపోయే ప్రమాదం ఉంది. దానికి ఉదాహరణే వంజంగి కొండ” అని ఈయూబీ రెడ్డి చెప్పారు.

“పర్యాటకులు తమతో పాటు తీసుకుని వెళ్లి, పడేసేది సింగిల్ యూజ్ ప్లాస్టికే. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను పశువులు తినేస్తాయి. అవి జీర్ణం కావు. వాటిని ఏ రసాయనం, జీవక్రియ కూడా విచ్ఛిన్నం చేయలేదు. దీంతో అవి ఆ పశువుల శరీరాల్లోనే ఉండిపోతాయి. దానివల్ల వాటికి, వాటి ఉత్పత్తులను వినియోగించే వారికి ప్రమాదమే” అని ఆయన గుర్తుచేశారు.

అరకు

నిబంధనల అమలు ఏదీ?

పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు 2022 జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. బ్యాగ్‌లు, ఫేస్ మాస్క్‌లు, కాఫీ కప్పులు, చెత్త బ్యాగ్‌లు, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి.

వీటితో పాటు తయారీ, ఎగుమతులు, నిల్వ, పంపిణీ, విక్రయాల కోసం వినియోగిస్తున్నక్యాండీ స్టిక్స్‌, థర్మోకోల్‌ షీట్లు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు వంటి 19 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై కేంద్రం నిషేధం విధించింది.

120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు తయారు చేసిన వారికి రూ.50 వేలు, అమ్మిన వారికి రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు, వాడిన వ్యక్తులకు రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధిస్తారు. ప్లాస్టిక్‌ చెత్తను కాల్చిన వ్యక్తులపై, సంస్థలపై రూ.5 నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తారు.

ఇలాంటి నిబంధనలు ఉన్నా వాటి అమలు సరిగా లేదు.

నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈయూబీ రెడ్డి సూచించారు.

మన్యంలోని అన్ని టూరిజం స్పాట్లలో పర్యావరణం విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో పాటు పాటించని వారిపై కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధించేలా చూస్తామని ఐటీడీఏ అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)