కర్ణాటక : హిందూ యువకుడితో కలిసి హోటల్ గదిలో ఉన్నందుకు గ్యాంగ్ రేప్ చేశారన్న ముస్లిం మహిళ, మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం

గ్యాంగ్ రేప్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటకలో వెలుగుచూసిన మోరల్ పోలీసింగ్ కేసు మరో మలుపు తిరిగింది.

నిందితులు తనపై గ్యాంగ్ రేప్ చేశారని మోరల్ పోలీసింగ్‌ కేసులో బాధితురాలిగా ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన మహిళ ఆరోపించింది.

ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు బాధిత మహిళ వాంగ్మూలం కూడా నమోదైంది.

హంగల్‌ పట్టణంలోని హోటల్‌లో తనపై ఏడుగురు వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారని, హోటల్‌లో వేరే మతానికి చెందిన వ్యక్తితో కలిసి ఉన్నందుకు తనను వేధించారని 28 ఏళ్ల బాధితురాలు చెప్పారు.

ఏడుగురు వ్యక్తులు కలిసి తనను హోటల్ నుంచి కిడ్నాప్ చేసి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారని, 24 గంటలపాటు పలుమార్లు తనపై అత్యాచారం చేశారని ఆమె చెప్పారు.

ఈ కేసులో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ గౌరవానికి భంగం కలిగించడం, నేరపూరిత కుట్ర, నేరపూరితంగా మహిళపై బలప్రయోగం చేయడం వంటి అభియోగాలు నమోదు చేశారు.

వాటితో పాటు హింసకు పాల్పడడం, నేరం చేయాలనే ఉద్దేశంతో ఒకచోట గుమికూడడం, ఒక ప్రదేశంలోని బలవంతంగా చొరబడి వేధింపులకు పాల్పడడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.

జనవరి 7న ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి కలిసి గది అద్దెకు తీసుకున్నారని స్టేట్‌మెంట్ ఇచ్చిన హోటల్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

లైంగిక హింస

ఫొటో సోర్స్, REUTERS

అసలేం జరిగింది?

వేర్వేరు మతాలకు చెందిన ఈ జంటపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. వీరిద్దరూ ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీకి చెందిన వారు.

వారు హోటల్ గదిలో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు హోటల్‌లో పైపుల మరమతుల గురించి మాట్లాడుకుంటూ బలవంతంగా గదిలోకి చొరబడ్డారు. ఆ తర్వాత ఆ ఇద్దరిపై వేధింపులకు పాల్పడ్డారు.

అనంతరం, మహిళను గది నుంచి బయటకు లాక్కెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళను కారులో ఎక్కించి పలు ప్రాంతాలు తిప్పుతూ, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

పొదల వెనక కొందరు వ్యక్తులు మహిళను వేధిస్తున్నట్లు మరో వీడియోలో కనిపించింది.

ఆ తర్వాత అదే ఘటనకు సంబంధించిన మూడో వీడియో బయటికొచ్చింది. అందులో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ ఆరోపించారు.

"నన్ను విడిచిపెట్టమని వేడుకున్నా, కానీ, అతను నా మాట వినలేదు. ఏమీ చేయొద్దని కాళ్లపై పడి బతిమాలుకున్నా'' అని ఆ వీడియోలో ఆమె చెప్పారు.

పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులు ఏమంటున్నారు?

''సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ఆమె మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఐపీసీ సెక్షన్ 376(డీ) గ్యాంగ్ రేప్ కింద ఏడుగురిపై కేసు నమోదు చేశాం'' అని హవేరి జిల్లా ఎస్పీ అన్షు కుమార్ బీబీసీతో చెప్పారు.

''ఆమె పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చినప్పుడు కిడ్నాప్, లైంగిక వేధింపుల గురించి చెప్పారు. గ్యాంగ్ రేప్ గురించి చెప్పలేదు.''

ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

వారిలో 24 ఏళ్ల అఫ్తాబ్ మక్బూల్ అహ్మద్ చందన్‌కట్టి, 23 ఏళ్ల మద్రాసబ్ మహ్మద్ ఇషాక్ మందక్కి, 23 ఏళ్ల సహీవుల్లా లాలన్‌వార్ ఉన్నారు.

ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేధింపుల ఘటన అనంతరం అతను రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో ఆమెతో ఉన్న ఇతర మతానికి చెందిన వ్యక్తి గురించి చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు.

''ఇది కేసు దర్యాప్తుకు సంబంధించిన అంశం'' అని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

లైంగిక హింస

ఫొటో సోర్స్, Getty Images

బెలగావిలో మరో ఘటన

హంగల్‌లో ఈ ఘటన జరిగిన రోజే, బెలగావిలోని ఫోర్ట్ లేక్‌సైడ్ సమీపంలో రెండు వేర్వేరు మతాలకు చెందిన జంటను తొమ్మిది మంది వేధింపులకు గురిచేసిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, వారిద్దరూ బంధువులు.

యువకుడి నుదుటిపై బొట్టు, యువతి హిజాబ్ ధరించి ఉన్నారు. తమను చిత్రహింసలకు గురిచేసిన నిందితులు, మొదట ఇక్కడ ఇద్దరూ ఎందుకు కలిసి ఉన్నారని అడిగారు.

వేధింపులకు గురైన యువతీ యువకుల్లో, ఆమె యువకుడికి అత్త కూతురు. యువకుడి అత్త ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది.

కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి పథకం 'యువ నిధి'కి దరఖాస్తు చేసుకునేందుకు వారిద్దరూ వచ్చారు. అయితే, సర్వర్లు పనిచేయకపోవడంతో ఆ ఇద్దరూ చెరువు వద్ద వేచివున్నారు.

హంగల్ కేసు తరహాలో, ఈ కేసులోనూ చిత్రహింసలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మందీ ముస్లిం వర్గానికి చెందిన వారే.

హంగల్ కేసును "మోరల్ పోలీసింగ్" అంటూ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై విమర్శలు చేయడంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఘటనకు పాల్పడిన వారందరినీ అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిడ్ చేస్తూ ఆయన పోస్టు చేశారు.

"అమ్మాయిని వేధించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనతో రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే భావన కలుగుతోంది'' అని ఆయన విమర్శించారు.

''మోరల్ పోలీసింగ్ గురించి నీతులు చెప్పే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై ఎందుకు నోరుమెదపడం లేదు. నిందితులు మైనారిటీ వర్గానికి చెందిన వారనేనా? ఈ ఘటనపై సిద్ధరామయ్య తన వైఖరిని స్పష్టం చేయాలి'' అని బొమ్మై డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)