మహిళను ఇంట్లోంచి బయటకు లాగి నగ్నంగా ఊరేగించారు, తరువాత స్తంభానికి కట్టేసి కొట్టారు...

లైంగిక హింస

ఫొటో సోర్స్, ARUN SANKAR /AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా మణిపుర్‌లో ఆగస్టులో జరిగిన నిరసనలో పాల్గొన్న మహిళ
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.

అది డిసెంబర్ 11 అర్ధరాత్రి ఒంటి గంట సమయం. కొందరు వ్యక్తులు శశికళ (ఆమె అసలు పేరు కాదు) ఇంట్లోకి చొరబడ్డారు.

నలభై రెండేళ్ల ఆ మహిళను ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి, ఆమె బట్టలు ఊడదీసి, నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత కరెంటు స్తంభానికి కట్టేసి ఆమెను కొడుతూనే ఉన్నారు. గంటలపాటు జరిగిందీ దారుణం.

కర్ణాటకలోని బెళగావి జిల్లా హొస వంటమురి గ్రామంలో ఈ ఘటన జరిగింది. 24 ఏళ్ల ఆమె కొడుకు, 18 ఏళ్ల ప్రియురాలితో కలిసి ఊరొదిలి వెళ్లిపోయినందుకు ఆమెను ఇలా దారుణంగా హింసించారు.

ఆ యువతికి ఆమె కుటుంబ సభ్యులు మరొకరితో నిశ్చితార్థం జరిపించారు. ఆ మరుసటి రోజే వివాహం జరగాల్సి ఉంది. ఈలోగా వారిద్దరూ ఇంటి నుంచి పారిపోవడంతో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు వాళ్లు ఎక్కడున్నారో చెప్పాలంటూ ఈ దారుణానికి ఒడిగట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున 4 గంటల సమయంలో గ్రామానికి చేరుకుని శశికళను రక్షించి, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యులు, బంధువుల దాడిలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.

తమను పరామర్శించేందుకు గ్రామానికి వచ్చిన మంత్రితో మాట్లాడుతూ, ''వాళ్లిద్దరి ప్రేమ వ్యవహారం గురించి అసలు మాకేమీ తెలియదు'' అని బాధితురాలి భర్త అన్నారు.

ఈ దాడి ఘటనకు సంబంధించి డజన్ మందికి పైగా పోలీసులు అరెస్టు చేశారు. విధుల్లో అలసత్వం వహించినందుకు స్థానిక పోలీసు అధికారి సస్పెండ్ అయ్యారు.

లైంగిక హింస

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇటీవల కొన్నేళ్లుగా దేశంలో కర్ణాటక తరహా ఘటనలు వెలుగుచూస్తున్నాయి

విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు

ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో అధికారులకు నోటీసులు అందాయి. ఇదొక అమానవీయ చర్య అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం బాధితురాలికి వ్యవసాయ భూమి, నగదు పరిహారం అందించింది. అయితే, ఆమె ఎదుర్కొన్న అవమానానికి అది నష్టపరిహారం ఏమాత్రం కాబోదని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనను స్వయంగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు పోలీసులకు సమన్లు జారీ చేసింది. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న వరాలే, జస్టిస్ ఎంజీఎస్ కమల్ ఈ ఘటనపై విచారణ జరిపారు. ఆధునిక భారత్‌లో ఇలాంటి దారుణ ఘటన జరగడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

అయితే, బెళగావి జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశంలో ఎక్కడా జరగనిదేమీ కాదు. ఇటీవల కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

గత జూలైలో ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ప్రపంచ వ్యాప్తంగా అలజడి రేపింది. అల్లరిమూకల గుంపు ఇద్దరు యువతులను నగ్నంగా వీధుల్లో ఊరేగిస్తున్న వీడియో వైరల్ అయింది. వారిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.

ఈ దారుణ ఘటన వెనక రాజకీయ అంశాలు ఉన్నాయి. కుకీ, మెయితెయి తెగల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

లైంగిక హింస

ఫొటో సోర్స్, DAVID TALUKDAR/NURPHOTO VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మణిపుర్‌లో జరిగిన హింసకు వ్యతిరేకంగా దిల్లీలో నిరసన

ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని బాధితుల్లో భయం

అయితే, మహిళల శరీరాలను రోడ్డుపైకి ఈడ్చుకొస్తున్న ఇలాంటి దారుణ ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కులం, లేదా కుటుంబ ఘర్షణల నేపథ్యంలో జరుగుతున్నాయి.

తనను వదిలేసి వేరొకరితో వెళ్లిపోయిందనే కోపంతో భర్త, అతని కుటుంబ సభ్యులు 20 ఏళ్ల గర్భిణిని నగ్నంగా ఊరేగించిన ఘటన గత ఆగస్టు నెలలో రాజస్థాన్‌లో జరిగింది. 2021 జులైలో గుజరాత్‌లో 23 ఏళ్ల గిరిజన మహిళకు కూడా ఇలాంటి దారుణ అనుభవమే ఎదురైంది.

తమ వర్గానికి చెందిన యువతి దళిత యువకుడితో వెళ్లిపోయిందని అగ్రకులాలకు చెందిన కొందరు వ్యక్తులు ఐదుగురు దళిత మహిళలను వివస్త్రలను చేసి, కర్రలతో కొడుతూ వీధుల్లో తిప్పిన ఘటన 2015 మేలో ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. 2014లో రాజస్థాన్‌లో మేనల్లుడిని చంపేసిందని ఆరోపిస్తూ 45 మహిళను బట్టలిప్పేసి గాడిదపై ఊరేగించారు.

ఇవి మీడియాలో ప్రముఖంగా వచ్చిన కొన్ని ఘటనలు మాత్రమే. ఇక లెక్కలోకి రాని ఘటనలు మరెన్నో. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు వాటిని లేవనెత్తుతుండడంతో కొన్ని రాజకీయ అంశాలుగా మారుతున్నాయి.

అయితే, పోలీస్ స్టేషన్లలో.. న్యాయస్థానాల్లో ఎలాంటి దారుణమైన ప్రశ్నలు అడుగుతారోనన్న భయంతో చాలా మంది మహిళలు తమపై జరిగిన అకృత్యాలను చెప్పుకునేందుకు ఇష్టపడడం లేదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

''అవమాన భారం కారణంగా చాలా ఘటనలపై కేసులు నమోదు కావడం లేదు. అది గౌరవానికి సంబంధించిన వ్యవహారంగా చూస్తుండడంతో చాలా కుటుంబాలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. అలా అకృత్యాలకు బలైపోయిన వారికి ఈ సమాజం నుంచి కనీస మద్దతు కూడా లభించదు'' అని న్యాయవాది, హక్కుల కార్యకర్త సుకృతి చౌహాన్ అన్నారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా బేస్‌లో మహిళలను వివస్త్రను చేయడమనేది స్త్రీ గౌరవానికి భంగం కలిగించడమనే విస్తృత అర్థంలో వాడారు. మహిళలపై వేధింపులు, లైంగిక వేధింపులు, వెంటపడి వేధించడం వంటి నేరాల కింద దీన్ని పరిగణిస్తారు. గతేడాది ఇలాంటి నేరాలు దేశంలో 83,344 ఘటనలు నమోదు కాగా, వాటిలో 85,300 మంది మహిళలు బాధితులుగా ఉన్నారు.

లైంగిక హింస

ఫొటో సోర్స్, DAVID TALUKDAR/NURPHOTO VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మణిపుర్ అకృత్యాన్ని వ్యతిరేకిస్తూ గువాహటిలో నిరసన ప్రదర్శన

చూస్తూ నిల్చున్న వారిని కూడా బాధ్యులను చేయాల్సిందే..

ఇలాంటి కేసులను ఇండియన్ పీనల్ కోడ్‌ (భారతీయ శిక్షా స్మృతి)లోని ఆర్టికల్ 354 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం ప్రకారం నిందితులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని, కానీ ఇది ఏమాత్రం సరిపోదని చౌహాన్ అన్నారు.

''ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే. ఇలాంటి వాటిని అడ్డుకున్నప్పుడే చట్టం పనిచేసినట్లు. ప్రస్తుతానికి ఈ చట్టం అలాంటి వారికి అడ్డంకి ఏమీ కాదు. శిక్షను పెంచేలా ఈ చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉంది'' అని ఆమె అన్నారు.

బెళగావిలో మహిళపై అకృత్యానికి పాల్పడుతున్నప్పుడు దాదాపు 50 నుంచి 60 మంది గ్రామస్తులు చూస్తూ ఉండడం, ఆ దారుణాన్ని ఎదిరించే ప్రయత్నం చేసిన ఒకరిపై దాడి చేయడాన్ని కూడా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు గుర్తించారు.

ఇలాంటి దురాగతాలను అరికట్టేందుకు "సమష్టి బాధ్యత" ఆవశ్యకతను ఎత్తిచూపుతూ, 1830ల నాటి ఒక కేసును న్యాయమూర్తులు ఉదహరించారు. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు జరిగిన ఒక నేర ఘటనలో గ్రామం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

"గ్రామస్తులందరినీ బాధ్యులను చేయాలి. వాళ్లలో ఎవరైనా ఈ దురాగతాన్ని ఆపేందుకు ప్రయత్నించి ఉండొచ్చు" అని వారు అభిప్రాయపడ్డారు.

చీఫ్ జస్టిస్ ప్రసన్న మహాభారతంలో ద్రౌపదిని ప్రస్తావించారు. ఆమెను వివస్త్రను చేస్తున్నప్పుడు కాపాడేందుకు శ్రీకృ‌ష్ణుడు వచ్చాడని, ''ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఏ దేవుడూ రాడని, అలాంటి సమయంలో ఆయుధం పట్టక తప్పదు'' అన్నారు.

అయితే, అది ప్రాక్టికల్‌గా సాధ్యం అయ్యే పనికాదని చౌహాన్ అభిప్రాయపడ్డారు.

లైంగిక హింస

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అవమానాలకు గురికావాల్సి వస్తుందన్న భయంతో చాలా ఘటనలపై కేసులు నమోదు కావడం లేదని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు

'మా శరీరం మీ యుద్ధభూమి కాదు'

''మేము ద్రౌపదులం కాదు. చేతబట్టేందుకు ఆయుధాలూ లేవు. అది మహిళల బాధ్యత కాదు. తప్పు చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టం ఉండాలి. కానీ, ఇప్పటికీ తమను తాము రక్షించుకోవడానికి మహిళలు సిద్ధంగా ఉండమని చెబుతోంది'' అని ఆమె అన్నారు.

''అందరికీ తెలియాల్సింది ఏమిటంటే, మీ జాతి, కుల పోరాటాలు, కుటుంబాల ఘర్షణలు మా శరీరాలపై కాదు. స్త్రీ శరీరం యుద్ధభూమి కాదు'' అని చౌహాన్ అన్నారు.

మహిళ శరీరం ఆమెకు, ఆమె కుటుంబానికి, కులానికి, తెగకు సంబంధించిన గౌరవ సూచకంగా మారిపోయిందని, అందుకే మహిళ శరీరాన్ని యుద్ధభూమిగా మార్చేస్తున్నారని లింగ సమానత్వం కోసం యువతతో కలిసి పనిచేస్తున్న పరిశోధకురాలు మౌమిల్ మెహ్రాజ్ అన్నారు.

''అందుకే వివాదాలు, ఘర్షణల సమయంలో మహిళలు దురాగతాలను ఎదుర్కోవాల్సి వస్తోంది'' అని ఆమె అన్నారు.

ఇలాంటి ఘటనల్లో మహిళల శరీరాలను వివస్త్రలుగా చూసి పైశాచికానందం పొందే ధోరణి కూడా ఉంటుందని, అందుకే వాళ్లను నగ్నంగా చేయడం, ఫోటోలు, వీడియోలు తీయడం చేస్తుంటారని ఆమె అన్నారు.

బెళగావి ఘటనలో అరెస్టయిన వారిలో ఒకరు మైనర్ ఉన్నాడని, సమాజంలో సాధారణంగా మారిపోతున్న ఇలాంటి ఘటనల వల్ల తరువాతి తరం కూడా మహిళలపై అదే ఆలోచనలతో పెరిగినట్లు ఇది సూచిస్తోందని ఆమె అన్నారు.

''ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి చట్టం ఒక్కటే సరిపోదు. సత్ప్రవర్తన కలిగి ఉండేలా అబ్బాయిలను పెంచడమే దీనికి ఏకైక పరిష్కారమని నేను అనుకుంటున్నా. స్త్రీ శరీరాన్ని ఆమె గౌరవంతో ముడిపెట్టడం తప్పని వాళ్లకి నేర్పించాల్సిన అవసరం ఉంది'' అని ఆమె అన్నారు.

''ఇది చాలా కష్టమైన పని. కానీ, త్వరగా మొదలుపెట్టాలి. లేకుంటే మహిళలపై ఈ నీచమైన హింస కొనసాగుతూనే ఉంటుంది.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)