'అసహజ శృంగారం' కోసం భార్య పై ఒత్తిడి, భర్తకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష...ఈ తీర్పుపై ఎందుకు చర్చ జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, బీబీసీ కోసం, రాయ్‌పుర్ నుంచి
భార్యతో అసహజ సెక్స్‌కు ఒత్తిడి చేసిన భర్తకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలోని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు తొమ్మిదేళ్ల కఠిన జైలు శిక్షను విధించింది. రూ.10,000 జరిమానా కూడా వేసింది.
అంతేకాకుండా భార్యను కొట్టినందుకు మరో ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది.
వైవాహిక అత్యాచారం (మ్యారిటల్ రేప్), అసహజ లైంగిక చర్య సెక్షన్లపై దేశంలో చర్చ జరుగుతున్న తరుణంలో శనివారం ఈ తీర్పు రావడంతో అందరి దృష్టి దీనిమీద నిలిచింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం భారతీయ న్యాయ సంహిత (ఇండియన్ జ్యూడిషియల్ కోడ్)తో పాటు మూడు బిల్లులను ఆమోదించారు.
కొత్తగా రూపొందించిన భారతీయ న్యాయ సంహితలో అసహజ లైంగిక చర్యకు సంబంధించిన సెక్షన్ 377ను రద్దు చేశారు.
దుర్గ్ కోర్టు తీర్పుతో నిమిష్ అగర్వాల్ అనే వ్యక్తిని జైలుకు పంపారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
ఏం జరిగింది?
ఈ కేసులో బాధితురాలు, ఆమె భర్త ఇద్దరూ పెద్ద వ్యాపార కుటుంబాలకు చెందినవారు.
కోర్టు తీర్పు తర్వాత బాధితురాలు మాట్లాడుతూ, ‘‘నన్ను అనేక రకాలుగా హింసించారు. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికపరంగా హింసకు గురయ్యాను. సిగ్గు, భయం కారణంగా అసహజ శృంగారం గురించి మాట్లాడేందుకు సంకోచించే మహిళలంతా ముందుకు వచ్చి తమ గొంతును వినిపించాలని కోరుతున్నా’’ అని అన్నారు.
అసహజ సెక్స్, కొట్టడం, వరకట్న వేధింపులకు గురయ్యే మహిళలకు చట్టం రక్షణగా ఉంటుందని బాధితురాలు తెలిపారు. ఏ వర్గానికి చెందిన మహిళలకైనా చట్టం సహకరిస్తుందని అన్నారు.
‘‘మీ శరీరానికి గాయమైనా, లేదా మనస్సుకు బాధ కలిగినా మీరు మాట్లాడాలి. ఇప్పుడు సమాజం, చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
కూతురు పుట్టాక పెరిగిన వేధింపులు
గత కొన్నేళ్లలో తాను, తన కుటుంబం అనుభవించిన హింసను ఎవరూ ఊహించలేరని బాధితురాలి తండ్రి బీబీసీతో అన్నారు.
ఏళ్లుగా తాము అనుభవించిన వేదనతో పోలిస్తే కోర్టు వెలువరించిన తీర్పును శిక్షగా భావించలేమని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘కోర్టు తీర్పు మీద నేనేం చెప్పాలి? దాన్ని శిక్ష లేదా న్యాయం జరిగినట్లుగా కూడా చూడలేను. నాకు 70 ఏళ్లు దాటాయి. నా భార్యకు పక్షవాతం ఉంది. నా కుటుంబం అంతా ఇన్నేళ్లుగా అనుభవించిన బాధ ముందు ఈ తీర్పు నాకు శిక్షగా అనిపించడం లేదు’’ అని అన్నారు.
ఈ కేసులో బాధితురాలి అత్త, మామలకు 10 నెలలు, మరదలికి 6 నెలల జైలు శిక్ష పడినట్లు బాధితురాలి తరఫు న్యాయవాది నీరజ్ చౌబే చెప్పారు.
బాధితురాలిని చిత్రహింసలు పెట్టిన కేసులోనే వీరికి శిక్షపడినట్లు ఆయన తెలిపారు.
కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం, దుర్గ్ జిల్లాలో నిమిష్ అగర్వాల్ ఒక వ్యాపారవేత్త. 2007 జనవరి 16న దుర్గ్‌లోని మరో వ్యాపారవేత్త కుమార్తెను ఆయన పెళ్లి చేసుకున్నారు.
నిశ్చితార్థం తర్వాత నుంచే నిమిష్, ఆయన తండ్రి ఆర్థిక ఇబ్బందులున్నాయని చెబుతూ బాధితురాలిని డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించారని వారు ఆరోపించారు. పెళ్లి తర్వాత ఈ వేధింపులు మరింత పెరిగినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అసహజ సెక్స్
నిశ్చితార్థం తర్వాత నుంచి వివిధ సందర్భాల్లో తన తండ్రి రూ.3 కోట్ల 5 లక్షలు ఇచ్చారని బాధితురాలు పేర్కొన్నారు.
అయినప్పటికీ నిమిష్, ఆయన కుటుంబం వారు రూ.10 కోట్ల డబ్బుతో పాటు బీఎండబ్ల్యూ కారు ఇవ్వాలంటూ మొండిపట్టు పట్టారని ఆమె చెప్పారు. అప్పటి నుంచి బాధితురాలిని కొట్టడం, వేధించడం మొదలైంది. బాధితురాలిపై దాడి చేసిన వారిలో నిమిష్ అగర్వాల్‌తో పాటు ఆయన తండ్రి, తల్లి, సోదరి పాత్ర కూడా ఉన్నట్లు కోర్టులో పేర్కొన్నారు.
2011లో తాను గర్భవతి అయినప్పుడు కడుపులో బిడ్డ అమ్మాయి అని తేలడంతో అబార్షన్ చేసుకోవాలని తన భర్త కుటుంబీకులు చెప్పినట్లు బాధితురాలు ఆరోపించారు. కానీ, ఆమె అబార్షన్‌కు ఒప్పుకోలేదు.
తనకు కూతురు పుట్టిందనే కారణంతో కొట్టేవారని బాధితురాలు ఆరోపించారు.
ఆ తర్వాత నుంచి తనను వేధించడానికి అసహజ సెక్స్ ప్రక్రియలను మొదలుపెట్టినట్లు ఆమె తెలిపారు. ‘‘ఆ సమయంలో నా భర్త పోర్న్ సినిమాలు చూసేవాడు. వాటి తరహాలో నా వీడియోలు తీసేవాడు’’ అని ఆమె చెప్పారు.
నిమిష్ కుటుంబం ఏం చెబుతోంది?
భర్త, ఆయన సోదరి, అత్తమామలపై బాధితురాలు 2016 మే నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు, కోర్టు వద్దే కాకుండా పెద్దల సమక్షంలో కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
అత్తమామలను వేధించే ఉద్దేశంతో ఆమె ఆరోపణలు చేశారని, అవన్నీ కల్పిత ఆరోపణలని నిమిష్ అగర్వాల్ కుటుంబం తరఫు న్యాయవాది వాదించారు. వాటిలో నిజాలు లేనప్పటికీ కోర్టు ఆమె ఆరోపణలతో ఏకీభవించిందని అన్నారు.
ఈ వ్యవహారం మొదట స్థానిక కోర్టు, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టుకు చేరింది.
శనివారం దుర్గ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాక్ష్యాలు, ఆధారాల పరంగా ఈ కేసులో తీర్పు ఇచ్చింది.
నేర స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఐపీసీ 1860లోని సెక్షన్ 377 ప్రకారం, నిమిష్ అగర్వాల్‌కు తొమ్మిదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో కోర్టు పేర్కొంది.
వైవాహిక అత్యాచారం, అసహజ శృంగారం, ఇండియన్ జ్యుడీషియల్ కోడ్
ఈ తీర్పుకు చాలా ప్రాముఖ్యం ఉందని, దీంతో సమాజంలో ఇలాంటి అంశాలపై అవగాహన పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఈ కేసులో నిందితులకు ఇంకా కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయవాది దివేశ్ కుమార్ బీబీసీతో అన్నారు.
‘‘భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని (మ్యారిటల్ రేప్), నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ సమయంలో ఫాస్ట్ ట్రాస్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇలాంటి సమస్యల్ని సమాజంలో పెద్దగా చర్చించరు. వీటిని మాట్లాడకూడని అంశాలుగా భావిస్తారు’’ అని దినేశ్ కుమార్ చెప్పారు.
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)1860 సెక్షన్ 375 ప్రకారం, అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తారు. సెక్షన్ 376లో ఈ నేరానికి శిక్షను విధించే నిబంధన ఉంది. అలాగే అసహజ లైంగిక చర్య లేదా శృంగారం గురించి సెక్షన్ 377 వివరిస్తుంది.
కానీ, సెక్షన్ 375లోని 2వ మినహాయింపు ప్రకారం, ఒక వ్యక్తి 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న తన భార్యతో ఆమె అనుమతి లేకుండా శారీరక సంబంధంలో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించరు.
ఈ సెక్షన్‌లో 2017లో మహిళల వయస్సును 15 ఏళ్ల నుంచి 17 ఏళ్లకు పెంచింది సుప్రీంకోర్టు.
ఐపీసీ సెక్షన్ 375లోని ఈ 2వ మినహాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త చట్టంలో లేని సెక్షన్ 377 నిబంధనలు
ఐపీసీ స్థానంలో సోమవారం రాష్ట్రపతి ముర్ము ఆమోదించిన ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ (బీఎన్‌ఎస్) బిల్లులో ఐపీసీ సెక్షన్ 377లో ఉన్నటువంటి నిబంధన లేదని హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రియాంక శుక్లా అన్నారు.
ఐపీసీ సెక్షన్ 377లో, ఒక వ్యక్తి అసహజ సెక్స్‌కు పాల్పడితే జీవిత ఖైదు లేదా జరిమానాతో పాటు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించాలనే నిబంధన ఉంది.
సుప్రీం కోర్టు 2018లో ఈ సెక్షన్‌ను పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రియాంక శుక్లా చెప్పారు.
వ్యక్తుల మధ్య సమ్మతితో జరిగిన ఏ రకమైన లైంగిక చర్యను నేరంగా పరిగణించరాదని, ఇలా చేస్తే రాజ్యాంగం కల్పించిన సమానత్వం, ప్రాథమిక హక్కులు, వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘించినట్లు అవుతుందని కోర్టు వ్యాఖ్యానించినట్లు ఆమె వివరించారు.
భర్త మీద 377 సెక్షన్‌ను ఉపయోగించవచ్చా లేదా అనే అంశంపై దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో దుర్గ్ కోర్టు ఈ తీర్పు వెలువరించిందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
వైవాహిక సంబంధంలో ఎలాంటి అసహజ నేరాలు, సెక్షన్ 377కు చోటు లేదంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును ఇటీవలే అలహాబాద్ హైకోర్టులోని జస్టిస్ రామ్‌మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం సమర్థించింది.
భార్యాభర్తల మధ్య వైవాహిక సంబంధంలో ప్రేమ ఉంటుందని, ఇందులో సాన్నిహిత్యం, కరుణ, త్యాగం ఉంటాయని మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన ఒక కేసు తీర్పులో పేర్కొంది.
లైంగిక సుఖం అనేది భార్యభర్తల బంధంలో అంతర్భాగమని వ్యాఖ్యానించింది.
"భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేం. అందువల్ల వారిమధ్య సెక్షన్ 377లో చెప్పిన నేరాలకు ఆస్కారం ఉండే అవకాశం లేదని భావిస్తున్నాం’’ అని తీర్పులో పేర్కొంది.
‘‘వైవాహిక అత్యాచారం కేసు ఇంకా సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అలాగే ఐపీసీ సెక్షన్ 377కి సంబంధించి కూడా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతి ఆమోదించిన మూడు బిల్లుల్లోని భారతీయ న్యాయ సంహితలో అసహజ లైంగిక చర్యలకు సంబంధించి ఎలాంటి సెక్షన్లు లేవు. కాబట్టి ఈ సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి మనం కొంత కాలం వేచి ఉండాలి" అని ప్రియాంక అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
- 'ట్రాన్స్‌జెండర్ అయితే సెక్స్ వర్కర్‌గా మారాలా... లేదంటే అడుక్కోవాలా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా' - మదనపల్లె భాను కథ
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















