‘రూ.33 లక్షలు ఖర్చు పెట్టి డంకీ రూట్‌లో అమెరికా చేరుకున్నా.. అడుగు మోపగానే అరెస్టు చేసి, 22 నెలలు జైల్లో పెట్టారు’

ఫొటో సోర్స్, SHAHRUKH KHAN
- రచయిత, గగన్ దీప్ జస్వాల్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
‘‘అమెరికా వెళ్ళాలనే నా కల కోసం నేను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయాన్ని కోల్పోయాను. 33 లక్షల రూపాయల డబ్బుతోపాటు స్థలాన్నీ పోగొట్టుకున్నాను’’ - ఇవి కుల్‌దీప్ సింగ్ బొపారియా మాటలు.
ఆయన అమెరికా నుంచి తిరిగొచ్చి మళ్ళీ పంజాబ్‌లోనే స్థిరపడ్డారు. ఆయన పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా కోటక్‌పురాకు చెందినవారు.
ఆయన అమెరికాలోకి ప్రవేశించడానికి ‘డంకీ’ మార్గాన్ని ఎంచుకున్నారు.
బొపారియాతో బీబీసీ మాట్లాడింది. ‘డంకీ’ మార్గంలో అమెరికా వెళ్ళడంపై ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.
‘డంకీ’ అంటే ఏమిటి?
ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ సినిమా విడుదలయ్యాక మరోసారి ఈ ‘డంకీ’ చర్చల్లోకి వచ్చింది.
డంకీ అంటే పంజాబీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం అని అర్థం.
డంకీ చిత్ర కథ కూడా అక్రమంగా వేరే దేశానికి వలస వెళ్లడం అనే అంశంతోనే ముడిపడి ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అమెరికా, యూరప్ వెళ్లేందుకు ప్రమాదకర వలస మార్గం
అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, యూరప్‌కు వెళ్ళేందుకు చాలామంది ఈ ప్రమాదకరమైన వలస మార్గాన్ని ఎంచుకుంటారు.
గుజరాత్, హరియాణా, పంజాబ్‌లకు చెందిన చాలా మంది పశ్చిమ దేశాలు చేరుకునేందుకు ప్రత్యేకించి అమెరికా వెళ్ళేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటారు.
ఈ మార్గంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించి అంతర్జాతీయ నెట్‌వర్క్ పనిచేస్తుంటుంది.
చాలా దేశాలు ఈ వ్యవస్థను నిర్మూలించినట్లు ప్రకటించుకున్నాయి కానీ, ఈ నెట్‌వర్క్ కొనసాగుతూనే ఉంది.
గతంలో దీనికి సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
అనేక మంది యువకులు అమెరికాకు వెళ్ళాలనే ఆశతో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES/SPENCER PLATT
కుల్‌దీప్ సింగ్ బొపారియా కల ఎలా చెదిరిపోయింది?
అమెరికా వెళ్ళాలనేది కుల్‌దీప్ సింగ్ బొపారియా కల. 2010లో ఆయన సింగపూర్‌కు వెళ్ళారు.
అక్కడి నుంచి ఇరాక్‌లో డ్రైవర్‌గా పనిచేసేందుకు వెళ్ళారు.
అక్కడే ఆయన అమెరికా వెళ్ళేందుకు ఓ ఏజెంట్‌ను సంప్రదించారు.
‘‘ముందు మేము ఆఫ్రికాలోని కాంగోకు వెళ్ళాం. అక్కడ నేనేమీ తినలేకపోయాను’’ అని కుల్‌దీప్ చెప్పారు.
దీంతో ఇండియాకు తిరిగి పంపించాలని ఏజెంట్‌ను ఆయన అడిగారు.
కానీ ఏజెంట్ వారిని బ్రెజిల్‌కు వెళ్ళి అక్కడ పనిచేసుకోవాలని చెప్పారు.
బ్రెజిల్‌లో కుల్‌దీప్ అమెరికా వెళ్ళేందుకు మరో ఏజెంట్‌ను సంప్రదించారు.
అయితే అమెరికా పంపాలంటే 3,000 డాలర్లు ఖర్చువుతుందని ఏజెంట్ చెప్పారు.
ఇంత పెద్దమొత్తం ఖర్చు చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటే, విమానం ద్వారా కాకుండా రోడ్డు మార్గం గుండా తీసుకువెళతానని, 1,500 డాలర్లు ఇస్తే చాలని ఏజెంట్ చెప్పారు.
కుల్‌దీప్ ఇందుకు ఒప్పుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పనామా అడవిలో ఏం జరిగింది?
కుల్‌దీప్ సింగ్ ముందు మూడు వేల డాలర్లు చెల్లించారు. దీంతో ఆయనతోపాటు ఆయన స్నేహితుడు కూడా పెరూ వెళ్ళే బస్సులో సీటు సంపాదించారు.
‘‘దీని తరువాత మమ్మల్ని తీసుకువెళ్ళడానికి మనుషులను కానీ, ట్యాక్సీని కానీ ఏర్పాటు చేస్తానని ఏజెంట్ చెప్పాడు. మేం కేవలం ఫోన్‌లో ఆయన ఏం చెబితే అది చేసేవారం’’.
ఎలాగోలా వారు ఈక్వెడార్ చేరుకోగలిగారు. అక్కడి నుంచి తరువాత చోటుకు వారు బస్సులో బయల్దేరారు. తరువాత వారు కొలంబియాకు చేరుకున్నారు. అక్కడ వీరిని ఓ వ్యక్తి ఇంట్లో ఉంచారు.
‘‘కొలంబియా నుంచి సముద్రం గుండా గ్వాటెమాలా చేరుకున్నాం. నా జీవితంలో ఇది అత్యంత చెత్త ప్రయాణం. మేం గ్వాటెమాలాలో కనీసం ఫ్యాన్ కూడా లేకుండా ఆరు రోజులు గడిపాం’’ అని కుల్‌దీప్ గుర్తు చేసుకున్నారు.
పనామా వెళ్లేందుకు అడవిలో రెండు రోజులపాటు నడిచినట్టు ఆయన తెలిపారు. అడవిలో ప్రయాణించేటప్పుడు మధ్యలో పీకల్లోతు ఉన్న ఓ నదిని కూడా దాటాల్సి వచ్చినట్టు చెప్పారు.
ఈ ప్రయాణంలో ఆయనకు 8 లీటర్ల నీరు, ఇతర పానీయాలు ఇచ్చారు. ఈ నీరంతా చుక్క కూడా మిగల్లకుండా వాడాక, మరికొంత నీరుకావాలని తమతోపాటు వచ్చిన వ్యక్తిని అడిగితే ఆయన కొంత నీరే ఇవ్వగలిగారు.
‘‘ఆ సమయంలో జీవితంలో నీరు ఎంత ముఖ్యమైనదో నాకు అర్థమైంది. రెండు రోజుల తరువాత మేం పనామాకు చేరుకున్నాం, మేం నేపాల్ నుంచి వచ్చామని, అమెరికాకు వెళుతున్నామని స్థానిక అధికారులకు చెప్పాం. ఎక్కడా ఏ దేశం నుంచి వస్తున్నామనే విషయం చెప్పొద్దని, అలా చెబితే బహిష్కరించే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు’’ అని కుల్‌దీప్ తెలిపారు.
ఎట్టకేలకు గ్వాటెమాలాకు అక్కడి నుంచి ఎల్ సాల్వెడర్, మెక్సికోకు చేరుకోగలిగామని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మెక్సికో నుంచి అమెరికాకు ఎలా వెళ్లారు?
మెక్సికో చేరుకున్నాక, ఏజెంట్లలో ఒకరు ఒక కారు తీసుకువచ్చి వెనుక భాగంలో కూర్చోవాలని చెప్పినట్టు కుల్‌దీప్ తెలిపారు.
ఆ తరువాత వారిని ఓ చోట దింపేశారు. అక్కడి నుంచి రెండు కొండలు కాలినడకన ఎక్కి దిగాలని చెప్పారు.
మెక్సికోలో తన ఇల్లు వదిలి బయటకు రావద్దని, స్థానిక మాఫియాల బెదిరింపులు ఎక్కువగా ఉంటాయని ఏజెంట్ వీళ్ళకు చెప్పినట్టు కుల్‌దీప్ తెలిపారు.
ఎట్టకేలకు ఓ నదిని దాటిన తరువాత కుల్‌దీప్ అమెరికాలో కాలుపెట్టి, తన కల నెరవేర్చుకున్నారు.
అమెరికా సరిహద్దులో ఏం జరిగింది?
అమెరికాలో అడుగు పెట్టిన తర్వాత సరిహద్దు వద్ద పోలీసులు కుల్‌దీప్‌ను, ఇతరులను అరెస్ట్ చేశారు.
తరువాత చల్లని వాతావరణంలో ఉండే జైలులో పెట్టారు.
అక్కడి నుంచి నిర్భంధ కేంద్రానికి పంపారు.
‘‘పోలీసులు, అధికారులు నన్ను ప్రశ్నించారు. వారికి నాపై అనుమానం వచ్చింది’’ అని కుల్‌దీప్ చెప్పారు.
‘‘ఇండియాలో నా వల్ల ఎలాంటి ముప్పూ లేదని వారికి అర్థమైంది. నన్ను త్వరలోనే బహిష్కరిస్తారని నాకు కూడా అప్పుడే అర్థమైంది’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘కుటుంబానికి మంచి జీవితాన్ని ఇద్దాం అనుకున్నా, కానీ...’
మమ్మల్ని తిప్పి పంపేస్తారని తెలియగానే మిన్ను విరిగి మీదపడినంత విచారం కలిగిందని కుల్‌దీప్ చెప్పారు.
‘‘అమెరికా కల నెరవేర్చుకోవడం కోసం నేను నా 33 లక్షల రూపాయలు ఖర్చు చేశాను. స్థలం అమ్మేశాను’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
అమెరికా అధికారుల చర్యను సవాలు చేస్తూ కుల్‌దీప్ కోర్టులో అప్పీల్ చేసుకున్నా ఉపయోగం లేకపోయింది. కోర్టు ఆయన అభ్యర్థనను కొట్టివేసింది.
రెండోసారి కూడా కుల్‌దీప్ అప్పీల్ చేసుకున్నా తిరస్కరణే ఎదురైంది.
డిటెన్షన్ సెంటర్‌లో 22 నెలలు గడిపిన తరువాత కుల్‌దీప్‌ను విడుదల చేశారు.
ఐదు నెలల తరువాత కుల్‌దీప్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆయన తన పాస్‌పోర్టును జప్తు చేశారని తెలుసుకున్నారు.
‘‘ఆ రోజే అమెరికాలో నా చివరి రోజని తెలిసిపోయింది. అమెరికా వెళ్ళి డబ్బు సంపాదించి, నా కుటుంబానికి మంచి జీవితాన్ని ఇద్దామని అనుకున్నాను కానీ అవేవీ జరగలేదు. ఇక నా పనైపోయిందని భావించాను.
అమెరికా నుంచి బహిష్కరణకు గురై 2016లో ఇండియాకు తిరిగొచ్చాను. దీని తరువాత నేను టాక్సీ వ్యాపారం మొదలుపెట్టాను. ఇకపై ఎప్పటికీ ఇండియాలోనే జీవించాలనుకుంటున్నాను’’ అని కుల్‌దీప్ బీబీసీకి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఎర్ర సముద్రం: సూయజ్ కెనాల్ ఎక్కడ ఉంది? ఈ రూట్‌లో నౌకలపై దాడులు జరిగితే ప్రపంచం అంతా టెన్షన్ ఎందుకు?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- మెర్తిర్ టిడ్‌ఫిల్: ‘వయగ్రా’ కు జన్మనిచ్చిన ఊరు ఇదే, ఆ మగవాళ్లే లేకుంటే ఏం జరిగేది?
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














